Eenadu Sunday Stories

Eenadu Sunday Stories This is Unofficial Eenadu Sunday magazine page. I love the Stories which are coming from our life's..��

నిర్ణయం- సాయి గౌతమ్‌ #18 18/5/2025‘‘చిన్నీ, నాన్న ఇంటికి వచ్చేశారే. బాగానే ఉన్నారు. నువ్వేం కంగారు పడకు. సెలవు చూసుకుని ...
21/05/2025

నిర్ణయం
- సాయి గౌతమ్‌
#18 18/5/2025

‘‘చిన్నీ, నాన్న ఇంటికి వచ్చేశారే. బాగానే ఉన్నారు. నువ్వేం కంగారు పడకు. సెలవు చూసుకుని ఒకరోజు మీ ఆయనతో కలిసి రా’’ సుగుణ పిన్ని ఫోన్‌లో చెప్తున్న మాట వింటూనే నేను గాలిలో తేలిపోయాను.
‘‘నిజంగానా? ఏదీ ఒకసారి ఫోన్‌ ఇవ్వు, మాట్లాడతాను’’ ఆతృతగా అడిగాను.
‘‘ఇప్పుడే టాబ్లెట్‌ వేసుకుని పడుకున్నారు. బాగా అలిసిపోయారే, లేచాక చేయిస్తాలే’’ అని ఫోన్‌ పెట్టేసింది.
ఈ లోకంలో నాకంటూ అత్యంత ప్రియమైన వ్యక్తి నాన్నే. ఆయన తర్వాతే మావారైనా, నా కొడుకు అయినా. వారంక్రితం వద్దన్నా వినకుండా ఎవరో తెలిసిన ట్రావెల్స్‌ వారని చెప్పి ఒంటరిగా కేదారనాథ్‌ యాత్రకి వెళ్ళారు. మొదటి రెండు రోజులు ఫోన్‌లో మాట్లాడి క్షేమమే అని చెప్పారు.
ఏమైందో తెలియదు, ఆ తర్వాత నుండి ఫోనే లేదు. కంగారుపడి ఆ ట్రావెల్స్‌ వాళ్ళని కనుక్కుంటే- వాళ్ళు వెళ్తున్న బస్సు ఏదో లోయలో పడిపోయిందనీ ఎవరి జాడా తెలియలేదనీ చెప్పారు.
నేను పడిన టెన్షన్, బాధా వర్ణనాతీతం. స్వయంగా వెళ్ళి- నాన్నకి ఏమైందో ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నించాను. కానీ అంత దూరం ఒక్కదానివే ఎలా వెళ్తావని మావారూ అత్తగారూ ఆపేశారు.
నేను ఒక్కదాన్నీ వెళ్ళలేననుకుంటే ఆయన నాతో రావొచ్చుగా. ‘వెతుకుతూనే ఉన్నారుగా... దొరుకుతారు లే. వెళ్ళి మటుకు చేసేదేంటీ?’ అన్నారు తప్ప కదల్లేదు. అప్పటి నుండీ నా మనసు అక్కడే ఉంది. ఆఫీసుకి వెళ్తున్నా, పని చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా అదే ఆలోచన. నిద్ర కూడా లేదు.
ఇదిగో, మళ్ళీ ఈరోజు పక్కింటి సుగుణ పిన్ని ఫోన్‌ చేసి ‘నాన్న వచ్చారు’ అని చెప్పాకే నా మనసుకి సాంత్వన దొరికింది.

అర్జెంట్‌గా ఈ వార్త మావారికీ అత్తగారికీ కూడా చెప్పేశాను. ఊహించినంత మార్పు ఏమీ వాళ్ళ మొహాల్లో కనపడలేదు. ‘ఆయన కనపడినా లేకపోయినా మాకు వచ్చే తేడా పెద్దగా ఏం లేదు’ అని వాళ్ళ హావభావాలు చెప్తున్నాయి. ఇవాళ సోమవారం. సెలవంటే శనివారం వరకూ ఆగాలి. పోనీ లీవ్‌ తీసుకుందామంటే ఇంకో ఇద్దరు సెలవులో ఉన్నారు. దాంతో తప్పనిసరై నా మనసుని అప్పటి వరకూ ఆపి, ఊరు వెళ్ళడానికి వారాంతం కోసం ఎదురు చూశాను. శుక్రవారమే చెప్పాను ‘రేపు ఊరు వెళ్ళి నాన్నని చూడాలి’ అని. ఆయన ఏదో ఆలోచిస్తూ ‘సరే’ అన్నా, వెళ్ళే టైమ్‌కి మటుకు, ‘మా ఫ్రెండ్‌ అమెరికా నుండి వచ్చాడు, నువ్వు వెళ్ళి చూసి వచ్చేయ్‌’ అన్నారు. అసలు మా నాన్న అంటే లెక్కే లేదు ఈయనకి. పెద్దాయన- అంత పెద్ద ప్రమాదం తప్పించుకుని వస్తే కనీసం చూడటానికి రావడం కూడా కష్టమైపోతోంది. అదేమంత దూరం... బస్సు ఎక్కి కూర్చుంటే, నాలుగు గంటల్లో నాన్న దగ్గర ఉంటాం.
ఈయనతో వాదించి లాభం లేదని నేనే పిల్లాడిని తీసుకుని బయలుదేరి వెళ్ళాను. దారంతా నాన్న గురించి ఆలోచనలే.
అమ్మ లేకపోయినా... ఎంతో చక్కగా ఇంటినీ నన్నూ చూసుకున్నారు. మరో పెళ్ళి చేసుకొమ్మని ఎంతమంది చెప్పినా వినకుండా ఒంటరిగా ఉండిపోయారు. నన్ను అల్లారుముద్దుగా పెంచారు. చక్కగా చదివించారు. ఇంత బాగా చూసుకున్న నాన్న అంటే ప్రేమ ఉండదా మరి?
నా పెళ్ళి కోసం చెప్పులు అరిగేలా తిరిగారు. తెలిసిన వాళ్ళ సంబంధం అని తెచ్చి పెళ్ళి చేశారు. పెళ్ళి ఖర్చులకి ఇల్లు తాకట్టు పెట్టమనీ అమ్మేయమనీ అందరూ సలహాలు ఇచ్చారు. కానీ ఆ ఇంటిని ముట్టుకునేదే లేదని చెప్పేశారు నాన్న.
అమ్మా నాన్నా ఎన్నో రాత్రుళ్ళు తిండి కూడా తినకుండా, కష్టాలకి ఓర్చి, ఒక్కో ఇటుకా పేర్చి కట్టిన ఇల్లు అది. దాన్ని ఎప్పుడూ నాన్న ఇల్లులా చూడలేదు. అది తన ఆరో ప్రాణం అనే అనుకునేవారు. అమ్మ గాజుల చప్పుడూ పట్టీల అలికిడీ ఇంకా ఆ ఇంట్లో ఆయనకి వినిపిస్తూనే ఉంటాయి.
అందుకే పెళ్ళికి ఓ పాత స్థలం అమ్మేశారు... అది అలాగే ఉంచితే ఫ్యూచర్‌లో మంచి ధర వస్తుందని తెలిసినా కూడా.

⚛ ⚛ ⚛

ఇంటికి వెళ్ళేసరికి ఒంటి గంట అయ్యింది. గేట్‌ తీస్తూనే పరుగెత్తుకుని వెళ్ళి గభాలున నాన్నని పట్టుకుని ఏడ్చేశాను. నాకు ఫోన్‌లో చెప్పలేదుగానీ, చేతికీ కాలికీ దెబ్బలు బాగానే తగిలాయి. కట్లు కట్టారు.
‘‘ఊరుకో తల్లీ, బాగానే ఉన్నా కదా’’ అని సముదాయించారు కానీ, ఆయనకీ నన్ను చూస్తే ఏడుపు వచ్చేస్తోంది.
‘‘ఇంకెప్పుడూ ఒక్కరే వెళ్ళకండి నాన్నా. నాకు చాలా కంగారుగా ఉంటుంది.’’
‘‘పిచ్చితల్లీ, పోవాలని రాసిపెట్టి ఉంటే ఎవరూ ఆపలేరు’’ అని వేదాంతం చెప్తున్నారు.
మా రెండేళ్ళ అబ్బాయికి ఏం అర్థంకాక బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు.
ఆ పూట సుగుణ పిన్ని పంపించిన కూరా పులుసూ కలుపుకుని అన్నం తిన్నాక, మా బాబుని పడుకోబెట్టి, వాలు కుర్చీలో నాన్న కూర్చుంటే, నేను నేల మీద కూర్చుని ఆయన ఒళ్ళో తల పెట్టుకున్నా. ఇదెప్పటి నుండో నాకు అలవాటు.

‘‘అవును నాన్నా, అసలేమయింది?
బస్సు లోయలో పడిపోయిందా?’’ నెమ్మదిగా అడిగాను.
‘‘అవునమ్మా. నాతోపాటు ఓ ఇరవై మంది ఉన్నారు ఆ బస్సులో. హరిద్వార్‌లో బాగానే మొదలైంది. కానీ మధ్యలోనే ఈ ప్రమాదం. లోయలో పడ్డ మాకు ఏం అర్థం కాలేదు. కొంతమంది- ఆ దెబ్బలకి అక్కడే ప్రాణం విడిచారు.
నా పరిస్థితీ అదేననిపించి ఆశలన్నీ వదిలేసుకున్నా. సరిగ్గా అప్పుడే ఒక చేయి నాకు ఆసరా ఇచ్చి పైకి లాగింది.
తర్వాత ఏమైందో తెలియదు. కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్‌లో ఉన్నా.
మాతోపాటు వచ్చిన ఒక అబ్బాయి నన్ను కాపాడాడు అని ఎవరో చెప్పారు. కానీ కృతజ్ఞతలు చెప్పుకోడానికి అతని గురించి ఏం తెలియదు- స్పృహ తప్పే ముందు అతని చేతి మీద చూసిన శివుడి పచ్చబొట్టు తప్ప. ఆ శివుడే నన్ను కాపాడాడు అని ఆ క్షణం నాకు తోచింది’’ అంటూ ఆయన అనుభవం చెప్తుంటే ఒళ్ళు గగుర్పొడిచింది.
నాన్న అంత పెద్ద ప్రమాదాన్ని తప్పించుకుని రావడం నిజంగా దేవుడి వరం. ఆ శివుడికి శతకోటి ప్రణామాలు చేసుకున్నా.
ఆ రోజు ఉండి, మర్నాడు సాయంత్రం బస్సు ఎక్కి ఇంటికి తిరిగి వచ్చేశాను.
మళ్ళీ యథావిధిగా పనులన్నీ అయిపోతున్నాయి. ఈ హడావుడిలో- నాన్నకి ఫోన్‌ చేయడం కూడా కుదరట్లేదు. రెండు నెలలు పోయాక ఒక రోజు నాన్న ఫోన్‌ చేశారు.
‘‘అమ్మలూ, ఓసారి ఇంటికి వస్తావా ఈ ఆదివారం. కొంచెం మాట్లాడాలి’’ అన్నారు.
నాన్న ఊరికే రమ్మనరు. పైగా కాస్త ఉదాసీనంగా వినపడింది ఆయన మాట. ‘‘వస్తాను’’ అని చెప్పి పెట్టేశాను.
ఈసారైనా నాన్నని పలకరించడానికి రమ్మని ఆయన్ని అడిగాను.
‘‘వారమంతా కష్టపడితే దొరికేదే ఒక్క ఆదివారం. ఆ రోజు కూడా ఇలా ఊర్లు తిరగలేను. నువ్వెళ్ళిరా’’ అని చెప్పేశారు.
అవును, ఫ్రెండ్స్‌తో తిరగడానికి ఎక్కడి నుండైనా ఓపిక వచ్చేస్తుంది.
ఓ ముసలాయన్ని చూడాలంటే ఆ శక్తి ఎవరిస్తారు పాపం. అడగడం వేస్ట్‌- అనుకుని నేనే బయల్దేరి వెళ్ళాను.
ఈసారి ఇల్లూ, నాన్న కళ్ళూ కాస్త ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. నాన్నే కాకుండా మరో అబ్బాయి కూడా ఉన్నాడు. పాతికేళ్ళు ఉంటాయి. ఎవరని అడగకముందే నాన్న చెప్పేశారు.
‘‘అమ్మలూ, నేను చెప్పలేదా నన్ను ప్రమాదం నుండి కాపాడాడు అని. అది ఈ అబ్బాయే. మొన్న చెకప్‌ కోసం సిటీకి వెళ్తే, హాస్పిటల్లో కనిపించాడు. తనే గుర్తుపట్టి చెప్పాడు సంగతి, ఆ చేతి మీద పచ్చబొట్టు చూసి మళ్ళీ ఆ శివుడే మా ఇద్దరినీ కలిపాడు అనిపించింది.’’
నాన్న కళ్ళలో వెలుగు. నేను ఆ అబ్బాయిని పలకరించాను. పేరు శివరాం అట. బాగా పేద కుటుంబం. చదువుకున్నా సరైన పని దొరక్క ఓ ముసలాయనకి కేర్‌టేకర్‌గా ఉంటున్నాడు. ఆయనతోపాటు కేదారనాథ్‌ వెళ్ళినప్పుడే నాన్నని కాపాడాడు. పాపం ఆ ముసలాయన చనిపోయారట. ఇక అక్కడ కూడా పని లేకపోయింది.
నేను అతడిని గమనిస్తున్నా. ఆ కళ్ళల్లో నిజాయతీ, బాధ్యతలూ భవిష్యత్తు గురించిన భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఊరిలో ఉన్న తల్లికీ చెల్లికీ నెలనెలా డబ్బులు ఎలా పంపాలో అన్న దిగులేమో అనిపించింది.
ఇది ఇలా ఉండగా, నాన్న ఆ రాత్రే తన నిర్ణయం నాతో చెప్పారు.
‘‘అమ్మలూ, ఇంటిని అమ్మేయాలి అనుకుంటున్నా.’’
ఆ వార్త ఒక పిడుగులా నా చెవిన పడింది.
‘‘ఏంటి నాన్నా మీరు అంటున్నది?
ఇల్లు అమ్మేస్తారా? ఇప్పుడు అంత కష్టం ఏమొచ్చింది? నెలనెలా పెన్షన్‌ వస్తూనే ఉంది కదా’’ తెలియకుండానే నా నోటి నుండి ఆ మాటలు వచ్చేశాయి.
‘‘నా కోసం కాదమ్మా... శివరాం కోసం. ఇవాళ నేను ఇలా కూర్చుని మాట్లాడుతున్నానంటే దానికి కారణం అతనేగా. అతని పరిస్థితి ఏం బాలేదు. ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బు తనకి ఇస్తే ఏదో చిన్న వ్యాపారం పెట్టుకుంటాడు. అతడి కుటుంబమూ బాగుంటుంది’’ నాన్న
ఆయన ఆలోచన చెప్పారు.
నేనేం మాట్లాడలేకపోయాను.
ఇంటికి వచ్చాక కూడా అదే ఆలోచించాను. మావారికి చెప్తే అంతెత్తున లేచారు. మా అత్తగారి సంగతి సరేసరి. ‘‘మీ నాన్నకి ఏమైనా పిచ్చా? ఎవడో ముక్కూమొహం తెలియని వాడి కోసం ఇల్లు అమ్మేస్తారా? అంతగా కావాలంటే ఎంతో కొంత డబ్బు ఇవ్వాలిగానీ’’ అన్నారు మా అత్తగారు కోపంగా.
‘‘మీ నాన్న పోతే తలకొరివి పెట్టేది అల్లుడిగా నేను. వాడెవడో కాదు.
అది గుర్తుపెట్టుకుని మసలుకొమ్మను మీ నాన్నని’’ విసురుగా అనేసి వెళ్ళిపోయారు ఆయన.
అసలు ఈ మనుషులు ఎంత స్వార్థంగా మాట్లాడుతున్నారు? చచ్చిపోయాక చేయాల్సిన కర్మకాండ కోసం ఇతను చెప్పేది మా నాన్న జీవితాంతం వినాలా? మా నాన్న స్వార్జితాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలన్నది మా అత్తగారు శాసించడమా? ఇదెక్కడి న్యాయం? నాన్న అంత ప్రమాదం నుండి బయటపడితే కనీసం చూడటానికి కూడా సుముఖత చూపని వీళ్ళు- మా నాన్న ఆస్తి మీద మటుకు హక్కు చూపిస్తున్నారు.
ఈ విషయంలో- నాన్నతో నేను మావాళ్ళ అభిప్రాయాలు చెప్పదల్చుకోలేదు. నేను సంపాదించినదాని మీద మాత్రమే నాకు హక్కు ఉంటుంది. ఆ ఇల్లు ఆయన స్వార్జితం. ఆయన ఎలాగైనా ఖర్చు పెట్టుకోవచ్చు- ఇదే నా అభిప్రాయం.
కొద్ది రోజుల్లోనే నాన్న అనుకున్నట్టుగానే ఆ ఇంటిని మంచి ధరకే అమ్మేశారు. అందులో సగం శివరాం వ్యాపారానికి పెట్టుబడిగా ఇచ్చారు. మిగిలినది మా బాబు పేరున ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. ఆ బ్యాంక్‌ కాగితాలు ఇవ్వడానికి మా ఇంటికి వచ్చినప్పుడు మావాళ్ళు ముభావంగా మాట్లాడటం ఆయన దృష్టిని దాటిపోలేదు.
ఇంతా చేసిన నాన్న ఆయనకంటూ ఏం ఉంచుకోలేదు. ఆ పెన్షన్‌ డబ్బులతోనే ఓల్డేజ్‌ హోమ్‌లో చేరిపోయారు. నాకు నాన్నని దగ్గరుండి చూసుకోవాలనిపించినా అటు నాన్నగానీ ఇటు మా వాళ్ళుగానీ అందుకు ఒప్పుకోలేదు.
కానీ తరచూ నేను నాన్నని చూడటానికి బాబును తీసుకుని వెళ్తుండేదాన్ని. తనకి అక్కడ ఏ లోటూ లేదని నాతో చెప్పడం ఇప్పటికీ గుర్తే. అదే వయసున్నవాళ్ళు ఎందరితోనో ఆయన ఆప్యాయంగా కలిసిపోయి నవ్వుతూ ఉండటం నాకూ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. శివరాం గురించి మటుకు లీలగానైనా చెప్పడం నాకు గుర్తులేదు.

ఐదేళ్ళ తర్వాత- ఒక రోజు నేను ఆఫీసులో పనిచేసుకుంటుండగా ఫోన్‌ వచ్చింది- మధ్యాహ్నం భోజనం అయ్యాక నడుం వాల్చిన నాన్న నిద్రలోనే పోయారని. వెంటనే అక్కడికి వెళ్ళాం.
నాన్న- చివరి క్షణం వరకూ తృప్తిగా బ్రతికి, ఏ అనారోగ్యం లేకుండా కన్ను మూయడం నాకు కాస్త మనశ్శాంతిని ఇచ్చింది. మావారు కూడా మొండి చేయకుండా, పాత సంగతులు మరచి కర్మకాండలన్నీ జరిపించారు.
ఇంత జరిగినా, ఆ శివరాం జాడ లేదు. అతి మంచితనం ఇంత చెడ్డదా? ఇంట్లో వాళ్ళని కూడా కాదని ఆ అబ్బాయిని నమ్మి అంత డబ్బు ఇస్తే కనీసం చూడటానికైనా రాలేదని అతడిని తిట్టుకున్నా.

⚛ ⚛ ⚛

కాలం గిర్రున తిరిగింది. మా అబ్బాయి చదువు పూర్తయ్యి, క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చినా, అది కాదని ఉన్న డబ్బు పెట్టీ, అప్పు తెచ్చీ ఫ్రెండ్‌తో కలిసి ఒక స్టార్టప్‌ పెట్టాడు. ఒక్కడే అబ్బాయి కావడంతో మేము కూడా కాదనలేకపోయాం.
ఏదో చేయాలని ఆరాటమేగానీ మా వాడికి ఓపిక ఉండదు, బద్ధకం ఎక్కువ. అందుకే ఏడాదికే ఆ ఫ్రెండ్‌ మోసం చేసి ఉన్న వ్యాపారాన్ని మూయించేశాడు.
ఆ అప్పుల ఊబిలో నుండి బయటకి రావడానికి వాడు ఒక ఉద్యోగంలో చేరాడు. ఎంత చూసినా అప్పులు తీర్చడం తలకి మించిన భారమై కూర్చుంది.
ఆ రోజు ఆదివారం. అందరం ఇంట్లోనే ఉన్నాం. అప్పుడే మా ఇంటికి ఒకతను వచ్చాడు. సాత్వికమైన ఆ రూపం- ఎక్కడో చూసినట్టే అనిపించింది. అతను అనుమతి అడిగి లోపలికి వచ్చాడు.
‘‘నమస్తే అండీ. నా పేరు శివరాం. ఇరవై ఏళ్ళక్రితం మీ నాన్నగారు నా వ్యాపారానికి ధన సహాయం చేశారు’’ అని చెప్పడంతో జ్ఞాపకం వచ్చింది.

నాన్న చనిపోయినప్పుడు రాలేదన్న విషయమూ గుర్తుంది.
అయినా మర్యాద కొద్దీ కూర్చుని మాట్లాడాను.
‘‘నన్ను ముందుగా మీరు క్షమించాలి... ఇన్నేళ్ళల్లో ఒక్కసారి కూడా మీకు కనిపించకుండా, హఠాత్తుగా ఈ రోజు వచ్చినందుకు. మీ నాన్నగారు ఇచ్చిన డబ్బుతో నేను కుటుంబాన్ని తీసుకుని రాజస్థాన్‌ వెళ్ళిపోయాను. అక్కడే ఒక చిన్న హోటల్‌ పెట్టి బాగా నడిపించాను. మూడేళ్ళ తర్వాత బాగా లాభాలు ఉన్న టైమ్‌లో అది అమ్మేసి యూరోప్‌ వలస వెళ్ళిపోయాం. అక్కడ దినదినాభివృద్ధి చెందుతూ మా వ్యాపారం పోయిన ఏడాదికి- లాభాల్లో వందకోట్ల మార్కును అందుకుంది. అది ఎంతో పెద్ద విజయం. అంతా మీ నాన్న గారి చలవే.
మా హోటల్స్‌ అన్నిటికీ ఆయన పేరే పెట్టుకున్నాం. ఇంత మేలు చేసిన వ్యక్తి చనిపోయినప్పుడు రాకపోవడానికి కారణం ఆయన తీసుకున్న మాటే. నాకు డబ్బులిచ్చి పంపేసినప్పుడు ఆయన నాతో అన్నారు- ‘మళ్ళీ ఎప్పుడూ తిరిగి మా జీవితాల్లోకి రావొద్దు బాబూ. నువ్వు ఎదిగాక ఎప్పుడైనా వచ్చి కనిపించినా నువ్వు సంపాదించే దాని మీద మావాళ్ళు ఆశపడే అవకాశం ఉంది. నువ్వు నా ప్రాణాలకి పెట్టిన భిక్షకి బదులుగా నా వంతు సాయం నేను చేశాను. మళ్ళీ దాని నుండి వచ్చే ఫలాన్ని నేనుగానీ నా బిడ్డగానీ అందుకోవడానికి అర్హత లేదు. నువ్వు బాగుంటే అంతే చాలు’ అని.
అది ఎంతో కఠినమైన నిర్ణయమే అయినా, ఆయన పట్టుదల మేరకు సరేనన్నా. అందుకే ఇన్నాళ్ళూ మీ దరిదాపుల్లోకి కూడా రాలేదు. అయినా మీరు ఎలా ఉన్నారని నిత్యం వాకబు చేస్తూనే ఉన్నాను. ఈమధ్యే నాకు తెల్సింది... మీ అబ్బాయి పెట్టిన వ్యాపారం నష్టాల్లోకి వెళ్ళి, అప్పుల్లో ఉన్నారని. ఇప్పుడు కూడా మీకు సాయం చేయడానికి ముందుకి రాకపోతే నమ్మకద్రోహమే అవుతుంది.
నేను పెంచి పోషించిన ఈ వ్యాపార వృక్షంలో సగభాగాన్ని దీనికి బీజం వేసిన మీ నాన్నగారి వారసురాలిగా మీకు ఇవ్వాలని నిర్ణయించుకున్నా’’ అని చెప్పడం పూర్తి చేశారు.
మావారి కళ్ళల్లో ఆశ్చర్యం, మా అబ్బాయి మొహంలో ఆశ స్పష్టంగా కనిపించాయి. నేను ‘ఊఁ’ అంటే చాలు. అతను ఇదంతా నా పేరున రాస్తాడు.
కానీ అలా దానికి ఒప్పుకుంటే ఇక నేను నాన్న కూతురిని ఎందుకు అవుతాను?
‘‘మీ ఉదార స్వభావానికి కృతజ్ఞురాలిని. కానీ మీ ఈ ఆస్తిలో వాటా తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను’’ నా నోటి నుండి యధాలాపంగా వచ్చిన ఆ మాటలకి మా వాళ్ళతోపాటు, శివరాం కూడా ఆశ్చర్యపోయాడు.
‘‘మా నాన్నగారు ఏది అయితే జరగకూడదని మిమ్మల్ని మాకు దూరం ఉంచారో తెలిశాక కూడా నేను ఈ డబ్బుకి ఆశపడితే, ఆయన సాయాన్నీ మంచితనాన్నీ హీనం చేసినట్టే. అందుకే దయచేసి మీరు ఈ ప్రతిపాదనని వెనక్కి తీసుకోండి.’’
ఇదే నా స్థానంలో మరొకరు ఉంటే ఏం చేసేవారో నాకు తెలియదు. నాన్న నేర్పిన విలువల ఆధారంగానే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. మావారూ అబ్బాయీ ఎంతగానో చెప్పి చూశారు.
కానీ నేను నా నిర్ణయం మార్చుకోలేదు.
ఇందులో నా స్వార్థం కూడా ఉంది. ఇన్నాళ్ళూ లేని డబ్బు ఒక్కసారిగా వస్తే బాధ్యత తెలియకుండా మావాడు చెడు సావాసాలకి బానిస కావొచ్చు. మరింత నిర్లక్ష్యంగా తయారు అవ్వొచ్చు. వాడికి జీవితం అంటే ఏంటో తెలియాలి.
డబ్బు విలువ తెలియాలి. ఊరికే వచ్చే దానికీ కష్టపడి సంపాదించే దానికీ తేడా తెలియాలి. అవేవీ తెల్సుకోకుండా, జీవితం అంటే అర్థం కాకుండా ఎంత డబ్బు వచ్చినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.
కానీ, నాకు సాయం చేయకుండా శివరాం వెళ్ళనన్నాడు. నేను దీర్ఘంగా నిట్టూర్చి- ‘‘మా అబ్బాయికి- మీరు సంపాదించిన డబ్బు ఇవ్వకండి, దాన్ని సంపాదించే క్రమంలో మీరు నేర్చుకున్న పాఠాల్ని ఇవ్వండి. మీలా, ఎంత ఎదిగినా మూలాలు మర్చిపోని విలువల్ని నేర్పండి... అదే మీరు మాకు ప్రతిగా చేసే ఉపకారం’’ అని మా అబ్బాయిని అతడి చేతుల్లో పెట్టాను.
ఈసారి మావారి కళ్ళు గర్వంతో మెరిశాయి. పెళ్ళయిన ఇన్నాళ్ళల్లో అదే ఆయన నన్ను అంత అపురూపంగా చూడటం. మనుషుల్లో నాన్నలాంటి గొప్పవాళ్ళూ ఆ గొప్పతనాన్ని గుర్తుంచుకునే శివరాం లాంటి వాళ్ళూ ఉన్నంత కాలం మానవత్వం తప్పక నిలిచి ఉంటుంది.

👉 Collected by :
👉 Credits: Eenadu Sunday magazine
👉 This is an unofficial page of Eenadu magazine

అమ్మ మనసు- అశోక్‌ కూనపరెడ్డి #17 10/5/2025విజయవాడ శివార్లలో ఉన్న ఆ పెంకుటింటి వసారాలో వాలుకుర్చీలో కూర్చుని ఆలోచిస్తోంది...
21/05/2025

అమ్మ మనసు
- అశోక్‌ కూనపరెడ్డి
#17 10/5/2025

విజయవాడ శివార్లలో ఉన్న ఆ పెంకుటింటి వసారాలో వాలుకుర్చీలో కూర్చుని ఆలోచిస్తోంది, డెబ్భైఏళ్ళు పైబడ్డ అన్నపూర్ణ. ఎండాకాలమైనా సాయం సమయం కావటంతో ఇంటిముందున్న బాదంచెట్టు గాలికి ఊగుతుంటే వస్తున్న చల్లటి గాలికి ఆమె మనసు కొంచెం తేలికపడింది. ‘ఇక ఈ రహస్యం నేను దాచుకోలే’ననుకుంది అన్నపూర్ణ- ఆరోజు పదోసారి. ఇవాళ కొడుకు శంకరానికి ఆ విషయం చెప్పేసి, మనవరాలు ఆమని పెళ్ళి ఖాయం చేసేయాలనుకుంది. సరిగ్గా అదే సమయానికి మిల్లు నుంచి వచ్చిన శంకరం వసారాలో చెప్పులు విప్పి తల్లివంక అభావంగా చూశాడు. ఒక్కగానొక్క కొడుకైన శంకరం దగ్గర్లో ఉన్న ఒక రైస్‌మిల్లులో పద్దులు రాస్తాడు. అతని చాలీచాలని జీతంతో కోడలు శారద ఎంతో నేర్పుగా ఓర్పుగా ఆ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది.

‘‘నిన్న వచ్చిన సంబంధంవాళ్ళు ఫోన్‌ చేశారా, ఏమన్నారు?’’ అంది అన్నపూర్ణ- శంకరం వైపు ఆదుర్దాగా చూస్తూ.

‘‘అమ్మాయి నచ్చిందట. కట్నం కూడా వద్దన్నారు. కానీ, పెళ్ళి ఖర్చులకని రెండు లక్షలు అడుగుతున్నారు. నావల్ల కాదని చెప్పేశాను. యాభైవేలో లక్షో అయితే అప్పోసొప్పో చేసి తెస్తాను. రెండు లక్షలు నేనెక్కడ నుంచి తెచ్చేది?’’ అన్నాడు శంకరం తల్లివంక చూడకుండా ఎటో చూస్తూ.

ఆమనికి పెళ్ళీడు వచ్చింది. సంబంధాలు చూడమని కొద్ది నెలలుగా శంకరాన్ని పోరుతోంది అన్నపూర్ణ. ఇంతకుముందు వచ్చిన ఒకట్రెండు సంబంధాలు- అమ్మాయికి డిగ్రీ లేదు, ఉద్యోగాలు రావని తిరస్కరించారు. అయితే, ఎవరి ద్వారానో తెలుసుకుని నిన్న వచ్చిన సంబంధం- అన్నివిధాలా బాగుంది. బంగారుబొమ్మలా ఉండే ఆమని వాళ్ళకి నచ్చింది. అబ్బాయి బాగున్నాడు. బుద్ధిమంతుడు. ఈ సంబంధం ఎలాగైనా ఖాయం చెయ్యాలనుకుంది అన్నపూర్ణ. భర్త శేషయ్య బతికినన్నాళ్ళూ తాగుడికి బానిసై, ఉన్న కొద్దిపాటి ఆస్తినీ ఆమె ఒంటిమీదున్న నగలతో సహా ఆ వ్యసనానికి తగలేశాడు.

‘‘మరేం పర్లేదు. రేపు వాళ్ళకి ఫోన్‌ చేసి సంబంధం ఖాయం చేసుకుందామని చెప్పు. రెండ్రోజుల్లో వచ్చి ముహూర్తాలు పెట్టుకోమను’’ అంది అన్నపూర్ణ కొడుకు కళ్ళల్లోకి చూస్తూ. శంకరం కొంచెం ఆశ్చర్యంగానూ మరికొంచెం కోపంగానూ తల్లివంక చూశాడు. అంతలోనే తోకతొక్కిన తాచులా ఆమె మీదకు లేచాడు.

‘‘నీకేమన్నా పిచ్చిపట్టిందా? నువ్వు సంపాదించిన లక్షలేమైనా మిగిల్చావా వాళ్ళకివ్వటానికి? నీ దగ్గర ఏముంది- మెడలో ఓ నూలుతాడు తప్ప. అసలు నామీద నీకేం ప్రేమ ఉంది, నాకేం మిగిల్చావ్‌?’’ అన్నాడు అసహనంగా.

నిజానికి శంకరానికి తల్లంటే అమితమైన ప్రేమా గౌరవం ఉన్నాయి. కానీ పేదరికం, భవిష్యత్తు మీద భయం మనిషిలోని విచక్షణను చంపేస్తాయి. ఉన్న కొద్దిపాటి ఆస్తినీ ఒంటిమీదున్న బంగారంతో సహా- అడ్డుచెప్పకుండా తాగుబోతు తండ్రి చేతిలోపెట్టి తనకేమీ మిగల్చలేదన్న అసంతృప్తి శంకరానికి తెలియకుండానే అతనిలో జీర్ణించుకుపోయింది. ఆఖరికి ఆమె కష్టపడి కుట్లూ అల్లికల ద్వారా సంపాదించిన డబ్బుని కూడా భర్త వ్యసనానికి తగలేసిందన్న బాధ తరచూ వేధిస్తుండేది. డబ్బుకి కొంచెం కష్టం వచ్చినప్పుడల్లా ఆ అసహనం ఇంకా పెరిగిపోయేది శంకరానికి. అది గుర్తొచ్చినప్పుడల్లా ‘నాకేం మిగిల్చావ్‌’ అంటూ పదేపదే తల్లిని దెప్పిపొడుస్తుంటాడు.

‘‘ఒరే శంకరం, అలా అనకురా. నీ మీద ప్రేమ లేదనీ నీకేమీ మిగల్చలేదనీ అనుకోవద్దురా. ప్రతి క్షణం నువ్వు పీల్చే గాలి- నిన్ను బతికించే గాలి- నీకు కనపడదురా! మనం నమ్ముకున్న కనకదుర్గమ్మ మనకు ఏనాడూ కనపడలేదురా. కానీ, ఆ తల్లి చూపిన కరుణ వల్ల మనం బాగానే ఉన్నాం. అటువంటిదేరా తల్లిప్రేమ. నా దగ్గరున్నదీ నీకు కనపడనిదీ...’’ అంటున్న అన్నపూర్ణకి దగ్గు తెర వచ్చి ఇక మాట్లాడలేకపోయింది.

‘‘ఆఁ... నామీద ప్రేమ... ఒకసారి సంబంధం కుదిరితే ఎలాగోలా డబ్బులు తెస్తాళ్ళే, అనుకుంటున్నావేమో... అది జరిగే పనికాదు. ఈ సంబంధం చేయటం నావల్ల కాదు’’ అని అరుస్తూ విసురుగా ఇంట్లోకి వెళ్ళి ముసుగుతన్ని పడుకుండిపోయాడు శంకరం.

కొడుకు మాటలు విన్న అన్నపూర్ణ మనసు బాధగా మూలిగింది. ‘కొడుకుని ప్రేమించలేని తల్లి ఈ లోకంలో ఉంటుందా? కొడుకు కోసం తను జీవితాంతం ఎంత కష్టపడింది! వ్యసనపరుడైన భర్త కుటుంబాన్ని వదిలేస్తే, ఆ కుటుంబానికి తానే పెద్దదిక్కయ్యింది. తల్లి నేర్పిన అల్లికలూ కుట్టుపనులతో రాత్రింబవళ్ళూ కష్టపడి, అవసరమైతే పస్తులుండి కొడుకు పరీక్ష ఫీజులు కట్టింది. ఒక యజ్ఞంలా భావించి వాడిని డిగ్రీ చదివించి, వాడినొక ఇంటివాడిని చేసింది. నిజమే. భర్త వ్యసనానికి బానిసై డబ్బు అడిగినప్పుడల్లా కాదనలేకపోయింది. అది ప్రేమా భయమా నిరాసక్తతా లేక చేతకానితనమా? ఏమో, తనకే తెలియదు. అయినా కొడుకు అలా అంటాడేగానీ తనంటే వాడికెంతో ప్రేమ. తనకి ఒంట్లో చిన్న నలత చేస్తే విలవిలలాడిపోతాడే! తను తినకపోతే వాడు మెతుకు ముట్టడే’ అనుకున్న అన్నపూర్ణకి అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

ఆ కన్నీటి పొరల్లో పేదరికంలో కుంగిపోయిన కొడుకూ కోడలూ, నైరాశ్యం నిండిపోయిన మనవరాలూ లీలగా స్ఫురించి, ఆమె గుండెలు ఎవరో పిండుతున్నట్లు అనిపించింది. ‘తెల్లారి శంకరం మిల్లుకెళ్ళేటప్పుడు ఆ విషయం చెప్పేస్తాను’ అనుకుంది అన్నపూర్ణ. అసలు సంవత్సరం క్రితం భర్త శేషయ్య పోయినప్పటి నుంచీ ఆ విషయం కొడుక్కి చెప్పి, శంకరాన్ని కొంచెం సమాధానపరుద్దామని చూస్తూనే ఉంది. కానీ, ఆమని పెళ్ళి సమయానికి చెబితే బాగుంటుందని అలా వదిలేసింది. ‘ఇప్పుడు ఆ సమయం వచ్చింది. పొద్దున్నే ఆ విషయం వాడికి చెప్పేసి నా బరువు దించేసుకుంటాను’ అనుకుంది అన్నపూర్ణ మళ్ళీ.

* * * * *

మర్నాడు పొద్దున శంకరం మిల్లుకెళ్తూ వసారాలో చెప్పులు తొడుక్కుని తల్లివైపు చూస్తూ ‘వెళ్ళొస్తానమ్మా’ అన్నాడు ఎప్పటిలానే.

‘‘వెళ్ళేటప్పుడు దుర్గమ్మకి నమస్కరించి వెళ్ళు బాబూ... నువ్వు అనుకున్నది జరుగుతుంది. అలాగే వాళ్ళకి ఫోన్‌ చేసి సంబంధం ఖాయం చేసుకుంటున్నామని చెప్పు. ఇక కట్నం సంగతంటావా... ఆ.. విషయం.. నా.. కొదిలె..’’ అంటుండగానే దగ్గు తెర వచ్చి ఆమె మాటలు మింగేసింది. కొంచెం సర్దుకుని అన్నపూర్ణమ్మ మళ్ళీ ఏదో చెప్పబోయేంతలోనే శంకరం అందుకున్నాడు.

‘‘పుట్టి బుద్ధెరిగిన దగ్గర్నుంచీ ఆ తల్లికి దండం పెట్టుకుంటూనే ఉన్నాను. ఆ తల్లి మాత్రం నాకేమిచ్చింది... సరే, అలాగే పెట్టుకుంటాలే. కానీ, ఆ సంబంధం మాత్రం ఖాయం చేయటం కుదరదు’’ అంటూ చిరాకుగా మొహం పెట్టుకుని పెద్దపెద్ద అంగలేసుకుంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు.

‘‘అదికాదురా శంకరం... ఇలా రా... నీకో మాట చెప్పాలి...’’ అని నీరసంగా ఆయాసపడుతూ అంటున్న అన్నపూర్ణమ్మ మాటలు గాలిలో కలిసిపోయాయి. బతుకు భారంతో, వంగిపోయిన చెట్టులా దూరంగా వెళ్తున్న శంకరాన్ని చూసి అన్నపూర్ణమ్మ గుండె తరుక్కుపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్ళు ధారలు కట్టాయి. అంతలోనే సర్దుకుని ‘అయినా ఇంకెంతసేపు, సాయంత్రం వాడు రాగానే ఆ విషయం కాస్తా చెప్పేస్తే, వాడి కష్టాలు తీరిపోతాయి. డబ్బుకి కష్టం వచ్చినప్పుడు అలా మాట్లాడుతాడుగానీ, వాడి మనసు వెన్న... పిచ్చి నాగన్న...’ అనుకుంది. అంతలోనే గుండెల్లో కొంచెం మంటగా అనిపిస్తే గుండెమీద చేత్తో రాసుకుంటూ, అలసిపోయిన శరీరానికీ మనసుకీ కొంచెం విశ్రాంతి కోసం వాలుకుర్చీలో బాగా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది అన్నపూర్ణమ్మ.

* * * * *

సాయంకాలం మిల్లు నుంచి ఇంటికి వస్తూ దూరం నుంచి ఇంటిముందు గుంపుగా ఉన్న జనాన్ని చూసిన శంకరం మనస్సు ఏదో కీడు శంకించింది. ఆత్రుతగా ఇంటి వాకిట్లోకి వచ్చాడు. వసారాలో వేసిన నులకమంచం మీద అన్నపూర్ణమ్మ నిర్జీవంగా పడి ఉంది. పక్కన కూర్చుని భార్య శారదా, కూతురు ఆమనీ భోరుమని విలపిస్తున్నారు. రోజూ తనకోసం గుమ్మంలో వాలుకుర్చీలో కూర్చుని ఎదురుచూస్తూ తను రాగానే ఆప్యాయంగా పలకరించే అమ్మ అలా నిర్జీవంగా ఉండటం చూసిన శంకరం గుండె ముక్కలయ్యింది. ‘‘నన్నొంటరిని చేసి వెళ్ళిపోయావా అమ్మా. నీ మనవరాలి పెళ్ళి గురించి అంత తాపత్రయపడ్డావు... దాని పెళ్ళి చూడకుండానే వెళ్ళిపోయావా అమ్మా...’’ అంటూ తల్లి శవం మీద పడి గుండెలు పగిలేలా ఏడ్వసాగాడు శంకరం.

ఇంతలో అదే వీధిలో ఉండే శాస్త్రిగారు వచ్చి శంకరం భుజం మీద చెయ్యి వేశారు. ‘‘ఈ ఎండలకీ గాలులకీ తట్టుకోలేకపోయింది బాబూ పెద్ద ప్రాణం. గంటక్రితం గుండె ఆగి చనిపోయింది. బాధపడవద్దు, జరగవలసింది చూడు’’ అన్నారు బాధ్యతను గుర్తుచేస్తూ.

స్నేహితులూ శాస్త్రిగారి సాయంతో ఆరోజు తల్లి అంత్యక్రియలు ముగించి ఇల్లు చేరిన శంకరానికి, వసారాలో ఖాళీగా ఉన్న వాలుకుర్చీ చూసేసరికి తల్లి గుర్తుకువచ్చి గుండె చెరువయ్యింది. అలా ఏడుస్తూనే, తెల్లవారుజామున ఎప్పుడో మగత నిద్రలోకి జారాడు శంకరం.

* * * * *

శంకరానికి మెలకువ వచ్చేసరికి రెండోరోజు కార్యక్రమం చేయటానికి వచ్చిన సిద్ధాంతిగారు వసారాలో కూర్చుని ఉన్నారు. శంకరం స్నానం చేసి, సిద్ధాంతిగారితో కలిసి కృష్ణానదీ తీరాన తల్లిని దహనం చేసిన ప్రదేశానికి చేరుకున్నాడు. ఎండల వేడికి తల్లికి పెట్టిన చితి పూర్తిగా ఒక్క కర్రపుల్ల కూడా మిగలకుండా కాలిపోయి, బల్లపరుపుగా ఒక అంగుళం మందమైన చితాభస్మంగా మారిపోయింది. ముందుగా సిద్ధాంతిగారు శంకరాన్ని చితికి ఒకపక్క కూర్చోబెట్టి పూజ చేయించారు. ఆ తరవాత ఆయన ఇంకొకపక్క కూర్చుని, ఒక చిన్న కర్రపుల్ల శంకరం చేతికిచ్చి, తల్లిని చితిమీద ఏ విధంగా పడుకోబెట్టారో అలాగే ఆ చితాభస్మం మీద తలా, కంఠం, కడుపూ చేతులూ కాళ్ళూ భాగాలుగా వచ్చేలా బొమ్మ గీయమన్నారు. తనతో తెచ్చిన అయిదు మట్టికుండల్ని శంకరానికిచ్చి, ఆ బొమ్మలోని ఒక్కొక్క భాగం నుంచి అస్థికల్ని ఏరి కొంచెం కొంచెం ఒక్కో కుండలో వేయమన్నారు. శంకరం అలాగే చేస్తూ- సరిగ్గా కంఠ భాగంలో అస్థికలు ఏరుతుండగా తళతళలాడుతూ లావుపాటి గొలుసొకటి బయటపడింది. సిద్ధాంతిగారు దాన్ని చూస్తూ ‘లక్షలు ఖరీదు చేసే బంగారు గొలుసు బాబూ. నూలు అల్లిక తాడే కదా అని ఆమె నుంచి నిన్న దాన్ని వేరుచేయలేదు. ఆ గొలుసు ఎవ్వరికీ కనపడకుండా, మరెవ్వరికీ దక్కకుండా నీకు మాత్రం అందేట్లు చేసినట్టుంది ఆ తల్లి. ‘అమ్మ మనసు’ అంటే అదే బాబూ. మంచులా తాను కరిగిపోతూ అన్నీ తానై పిల్లల అవసరాల్ని తీరుస్తుంది. అందుకే జన్మజన్మలకీ ఆ రుణం తీర్చుకోలేనిది...’’ అంటున్నాడు వేదాంత ధోరణిలో.

శంకరానికి సిద్ధాంతిగారి మాటలు లీలగా మాత్రమే వినిపిస్తున్నాయి. తల గిర్రున తిరుగుతోంది. సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించి, తండ్రికి తెలియకుండా దాచిన డబ్బుతో చేయించిన గొలుసు అది. ఎప్పుడూ మత్తులో జోగుతుండే భర్త కంటపడకుండా, ఆ బంగారు గొలుసుకి ఎంతో చాకచక్యంగా, కవచంలా దారంతో అల్లిక చేసింది అన్నపూర్ణమ్మ. సంవత్సరాల తరబడి ఆ బంగారు గొలుసుని అల్లిక తాడులా ధరించి తండ్రి దగ్గర నుంచి దాన్ని కాపాడి, తనకు అందించటానికి ఆ తల్లిపడ్డ తపనా ఆవేదనా అర్థమైన శంకరానికి భూమి తలకిందులవుతున్నట్లు అనిపించింది. అటువంటి దేవతనా, ‘నామీద నీకేమి ప్రేమ ఉంద’ని ఈసడించాను. అటువంటి అమృతమూర్తినా ‘నాకేం మిగిల్చావు?’ అంటూ కర్కశంగా పదేపదే దెప్పిపొడిచాను. అంతటి ప్రేమని నీ గుండెల మీద గుంభనంగా దాచుకున్నందుకేనా అమ్మా ‘ఆమని పెళ్ళి ఖాయం చేయమని అంత ధైర్యంగా చెప్పావు’ అనుకుంటుంటే, శంకరం కళ్ళల్లో నీళ్ళు ధారలు కట్టాయి. భూమి రెండుగా చీలి తను పాతాళ లోకానికి వెళ్ళిపోతున్నట్లనిపించింది. ‘చనిపోయి నీ మనవరాలి పెళ్ళి జరిపిస్తున్నావు కదమ్మా. నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనమ్మా. నేనోడిపోయానమ్మా. నిజానికి ప్రతి కొడుకూ ‘అమ్మ మనసు’ అర్థం చేసుకోలేక జీవితాంతం ఓడిపోతూనే ఉంటాడమ్మా’ అనుకుంటూ కుమిలి కుమిలి ఏడ్చాడు శంకరం. ఇంతలో సిద్ధాంతిగారి పిలుపు విని ఉలిక్కిపడి ధారగా కారుతున్న కన్నీళ్ళు తుడుచుకున్నాడు. ‘రేపే వాళ్ళకి ఫోన్‌ చేసి ఆ సంబంధం ఖాయం చేస్తానమ్మా’ అనుకుంటూ, తల్లికి మనస్సులోనే నమస్కరించుకుని, ఆ మందపాటి బంగారు గొలుసుని చేతిలో గట్టిగా అదిమి పట్టుకుని, తల్లి అస్థికలతో కృష్ణా ప్రవాహం వైపు నడవసాగాడు శంకరం.

👉 Collected by :
👉 Credits: Eenadu Sunday magazine
👉 This is an unofficial page of Eenadu magazine

స్నేహ జీవనం- శ్రీపతి లలిత #16 27/4/2025‘‘మాధవీ!’’ హడావిడిగా అరిచినట్లే పిలుస్తూ లోపలికి వచ్చాడు శ్రీనాథ్‌.ఫోన్లో మాట్లాడ...
21/05/2025

స్నేహ జీవనం
- శ్రీపతి లలిత
#16 27/4/2025

‘‘మాధవీ!’’ హడావిడిగా అరిచినట్లే పిలుస్తూ లోపలికి వచ్చాడు శ్రీనాథ్‌.
ఫోన్లో మాట్లాడుతున్న మాధవి ఆగమన్నట్లుగా చెయ్యి చూపించి ‘‘సరే నాన్నా రాజా, జాగ్రత్త. ఏ అవసరం ఉన్నా ఫోన్‌ చెయ్యి, ఏం కావాలన్నా కొరియర్‌ చేస్తాం. మరీ ఇబ్బందిగా ఉంటే రష్మి దగ్గరకి వెళ్ళండి. రమ్య జాగ్రత్త, సహించకపోయినా ఏదో ఒకటి తింటూ ఉండమను. ఇక్కడ మీ నాన్న కాళ్ళు నేలమీద లేవు. ఒకటే గంతులు. ఓకే బై’’ అని ఫోన్‌ పెట్టేసింది.
‘‘రాజా నాకూ ఫోన్‌ చేశాడు. నువ్వు తాతవు కాబోతున్నావు శ్రీనూ. కంగ్రాట్స్, నా శ్రీ వచ్చేస్తోంది’’ కళ్ళనిండా నీళ్ళతో అంది మాధవి.
‘‘అవును మధూ! శ్రీలత ఉంటేనా... ఎంత సంతోషించేదో, ఇప్పటికిప్పుడు అమెరికా వెళ్దాం అనేది’’ గుక్క తిప్పుకోకుండా చెప్తున్న శ్రీనాథ్‌ని చూసి ‘‘నువ్వు ముందు స్థిమితంగా కూర్చో. కాఫీ ఇస్తా, తాగుతూ కబుర్లు చెప్పు... నేను వంట చేసేస్తా’’ అంటూ వంటింట్లోకి వెళ్ళింది మాధవి.
తన వెనకే వెళ్ళి కుర్చీ లాక్కుని కూర్చున్నాడు శ్రీనాథ్‌. కంట్లోంచి వస్తున్న నీళ్ళు కూడా తుడుచుకోకుండా ఉద్వేగంగా కబుర్లు చెప్తున్న శ్రీనాథ్‌ని చూస్తూ పక్కకి తిరిగి కళ్ళు తుడుచుకుంది మాధవి.

మాధవి, ఆమె భర్త రాధాకృష్ణ- శ్రీనాథ్, అతని భార్య శ్రీలత... అందరూ ఒకే బ్యాంకులో ఉద్యోగులు.అందరూ ఇంచుమించు ఒకేసారి ఉద్యోగాల్లో చేరారేమో, నలుగురికీ బాగా స్నేహం ఏర్పడింది.పెళ్ళి అయ్యాక పక్కపక్కనే ఇళ్ళు కొనుక్కుని స్నేహం ఇంకా బలపర్చుకున్నారు.
పేరుకు రెండు ఇళ్ళు అయినా అందరూ ఎప్పుడూ ఒక ఇంట్లోనే ఉండేవారు. మాధవి కూతురు రష్మి, శ్రీనాథ్‌ కొడుకు రాజీవ్‌ కూడా మంచి ఫ్రెండ్స్‌. ఇద్దరూ కలిసి పెరిగారు.
రాజీవ్‌- రష్మి స్నేహితురాలు రమ్యని పెళ్ళి చేసుకుంటే... రష్మీకి- రాజీవ్, తనతో పనిచేసే విశ్వా గురించి చెప్పి పెళ్ళి కుదిర్చాడు. వాళ్ళు నలుగురు కూడా బాగా కలిసిపోయారు.
ఉద్యోగరీత్యా అమెరికా వెళ్ళిన పిల్లలు నలుగురూ అక్కడే ఉండిపోయారు. అందరూ శాన్‌ ఫ్రాన్సిస్కోలోనే ఉండటంతో, నెలకు రెండుసార్లు కలుస్తూనే ఉంటారు.
పిల్లలు అమెరికా రమ్మని గొడవ చేస్తే, పెద్దవాళ్ళు నలుగురూ కలిసి అమెరికా వెళ్ళి అక్కడ పిల్లలతో అన్నీ చూసి, సరదాగా నాలుగు నెలలు ఉండి వచ్చారు.
పిల్లల సంసారాలు చూసి సంతోషంగా వెనక్కి వచ్చిన వీళ్ళకి ‘కరోనా’ స్వాగతం పలికింది.
వీళ్ళ ఫ్లాట్స్‌లో చాలామటుకు కరోనా బారినపడ్డారు.
ఇంట్లోనే ఉంటూ ఎంత జాగ్రత్తగా ఉన్నా నలుగురికీ కరోనా వచ్చింది.
పిల్లలు అమెరికా నుంచి రోజూ ఫోన్లు చేసి, ఆన్‌లైన్‌లో డాక్టర్స్‌తో మాట్లాడి, మందులు పంపినా, అందరూ ఆసుపత్రిపాలు కాక తప్పలేదు. కలిసి వెళ్ళిన నలుగురిలో ఇద్దరు మాత్రమే తిరిగి వచ్చారు. ఇంటికి ఒక్కళ్ళు అన్నట్టు శ్రీలత, రాధాకృష్ణ దక్కకుండా పోయారు.
కరోనాలో జీవిత భాగస్వాముల్ని పోగొట్టుకోవడం ఒక ఎత్తు అయితే, వాళ్ళకి అంతిమసంస్కారాలు జరపడం ఇంకో ఎత్తు అయింది. దిక్కులేని వాళ్ళలా మున్సిపల్‌ వాళ్ళతో జరిపించడం, శ్మశానం వరకు కూడా వెళ్ళలేకపోవడం, అటువంటి సమయంలో కనీసం పిల్లలూ దగ్గర లేకపోవడం పెద్ద శాపాలుగా తోచాయి మాధవి, శ్రీనాథ్‌లకి.
ఆ సమయంలో వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు అన్నివిధాలుగా తోడు అయ్యారు.
మాధవి వంట చేస్తుంటే, శ్రీనాథ్‌ బయట పనులు చేసేవాడు.
పగలంతా ఇద్దరూ ఒకచోట గడిపినా, రాత్రికి ఎవరి ఇంట్లో వాళ్ళు పడుకునేవారు.
ఫ్లాట్స్‌లో అందరికీ, ఈ రెండు కుటుంబాల స్నేహం గురించి తెలుసు కనక, ఎవరూ ఏమీ మాట్లాడేవారు కాదు. ఒకవేళ ఎవరన్నా ఏమైనా అన్నా, పట్టించుకునే స్థితిలో మాధవి కానీ
శ్రీనాథ్‌ కానీ లేరు.
ఇప్పుడు- కోడలు రమ్య తల్లి కాబోతోందని తెలిసి శ్రీనాథ్‌ ఆనందానికి హద్దులు లేవు. పుట్టబోయేది పాప అని తెలియడంతో అందరూ శ్రీలతే మళ్ళీ వస్తోందని సంతోషపడ్డారు.
సరిగ్గా రమ్య డెలివరీ కోసం బయలుదేరే టైమ్‌కి- రమ్య తల్లికి కాలు ఫ్రాక్చర్‌ అయ్యి కదలలేని పరిస్థితి వచ్చింది. ఆవిడ మాధవికి ఫోన్‌ చేసి ఒకటే ఏడుపు.
అది భరించలేని మాధవి ‘‘మీరు కంగారు పడద్దు. నేను వెళతాను. రమ్య నాకు కొత్త కాదు. రష్మి ఎంతో రమ్యా అంతే. కాన్పు అయ్యాక, మీరు వచ్చేవరకూ నేను ఉంటాను సరేనా!’’ అని ఓదార్చింది.
అనుకోని ప్రయాణం, అందులో ఎక్కువ టైమ్‌ కూడా లేకపోవడంతో, శ్రీనాథ్‌ వెంటనే ఇద్దరికీ టికెట్లు బుక్‌ చేశాడు. రమ్య వాళ్ళ అమ్మ ఇచ్చిన చీరలూ స్వీట్స్‌ కాక... మాధవి తనవైపు నుంచీ శ్రీనాథ్‌ తరఫు నుంచీ రమ్యకీ రాజీవ్‌కీ మాత్రమే కాక రష్మీకీ విశ్వకీ మంచి డ్రెస్సులు తీసుకుంది.
అమెరికాలో అంతా సవ్యంగా అయ్యి, పండంటి పాపాయిని చూసిన అందరికీ శ్రీలత గుర్తుకొచ్చింది. ఆ రోజంతా శ్రీనాథ్‌ అన్యమనస్కంగానే ఉన్నాడు. రాజీవ్‌ కూడా తల్లిని తల్చుకుని బాధపడ్డాడు కానీ, పాపాయిని చూసి అన్నీ మరిచిపోయాడు.
నాలుగు నెలలు ఇట్టే గడిచిపోయాయి. రమ్య వాళ్ళ అమ్మగారు, ‘ఒక పది రోజుల్లో వస్తాను’ అని ఫోన్‌ చేశారు. ఇక వీళ్ళు తిరుగు ప్రయాణానికి సిద్ధమై సామానులు సర్దుకుంటున్నారు.
రష్మి, రాజీవ్‌ సాయం చేస్తామని వచ్చి ఒకరిని చూసి ఒకరు సంజ్ఞలు చేసుకుంటున్నారు. అది చూసిన మాధవి ‘‘ఏమిటర్రా, ఆ మూగ సైగలు, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి’’ అంది.
చివరికి రష్మి నోరు విప్పింది. ‘‘అమ్మా, నేను చెప్పేది విని తిట్టొద్దు, నెమ్మదిగా ఆలోచించు. ఇది నా ఒక్కదాని ఆలోచన కాదు, మా నలుగురిదీ. మేము ఉద్యోగాలలో ఇక్కడే స్థిరపడ్డాం. మన ఇద్దరి కుటుంబాలలో జరిగిన నష్టం తలుచుకుంటే మాకు ఎప్పుడూ బాధగానే ఉంటుంది. మీరిద్దరూ ఎలా ఉన్నారో అని ఎప్పుడూ ఆందోళనగానే ఉంటుంది.
మీరిద్దరూ పక్కపక్క ఇళ్ళలో బదులు, ఒకే ఇంట్లో జీవిత భాగస్వాములుగా ఉంటే బాగుంటుంది అని మా ఆలోచన’’ అని చెప్పి, తల్లి ముఖంలో మారుతున్న రంగులు చూస్తూ ఉండిపోయింది రష్మి.
శ్రీనాథ్‌ తెల్లబోయాడు. మాధవి ఏమీ మాట్లాడకుండా రూమ్‌లోకి వెళ్ళిపోయింది. శ్రీనాథ్‌ కూడా తన రూమ్‌లోకి వెళ్ళాడు.
ఆరోజు రాత్రి ఎవరికీ నిద్రపట్టలేదు. తెల్లారి లేచాక మాధవి, శ్రీనాథ్‌ రోజూలానే అందరినీ పలకరించేసరికి ‘హమ్మయ్య’ కోపం పోయింది అనుకున్నారు పిల్లలు.
ముందు మాధవి నెమ్మదిగా మాట్లాడింది. ‘‘చూడండి పిల్లలూ, మీరు ఇలా ఎందుకు అన్నారో నేను ఊహించగలను. మీ తల్లిదండ్రుల గురించి, నలుగురూ నాలుగు రకాలుగా మాట్లాడటం మీకు నచ్చట్లేదు. మీ ఉద్దేశంలో ఇదే మంచి పరిష్కారం.
కానీ మా పెంపకంలో పెరిగిన మీరు ఇలా మాట్లాడటం నాకూ శ్రీనాథ్‌కీ కూడా బాధ కలిగించింది.

నేనూ-రాధాకృష్ణ, శ్రీలత-శ్రీనాథ్‌...మా స్నేహం వయస్సు సుమారు నలభై సంవత్సరాలు. మేము ఎప్పుడూ స్నేహితులమే. ‘అన్న, అక్క’ అంటూ వరసలు కలపలేదు. మిమ్మల్ని కూడా మేము అలానే పెంచాం. మీకు కూడా వరసలు నేర్పలేదు. ఆడపిల్లలు లేని లోటు శ్రీలత, శ్రీనాథ్‌- రష్మి ద్వారా తీర్చుకుంటే, మగపిల్లాడి సరదాలు రాజీవ్‌ ద్వారా మేము తీర్చుకున్నాం. మన ఇరువైపు బంధువులూ స్నేహితులూ మీరిద్దరూ పెళ్ళి చేసుకుంటారు అనుకున్నారు. వాళ్ళ ఆలోచన తప్పు అని నిరూపిస్తూ మీరు మీకు నచ్చిన వాళ్ళని చేసుకున్నారు. నలుగురూ ఈ రోజుకీ స్నేహంగా ఉన్నారు.
ఏ వయసు వారైనా సరే, ఒక ఆడా మగా మధ్య పరిచయం ఉంటే అది తప్పనిసరిగా ‘లైంగికమైన ప్రేమే’ అనే ఆలోచనలు ఇప్పుడిప్పుడే కొద్దిగా మారుతున్నాయి. వయసులో ఉన్న మీరే ఆడా మగా అనే తేడా లేకుండా స్నేహంగా ఉన్నారు. వయసు మళ్ళిన మేము స్నేహంగా ఉండకూడదా?
నా భర్త స్థానం నేను ఎవ్వరికీ ఎలా ఇవ్వలేనో, తన భార్య స్థానం శ్రీనాథ్‌ కూడా ఎవరికీ ఇవ్వలేడు. మేమిద్దరం మంచి స్నేహితులం, చివరిదాకా అలానే ఉంటాం. లోకం కోసం ‘అన్నయ్య’ అనో ‘చెల్లెమ్మ’ అనో పిల్చుకోవడం మాకు ఇష్టం లేదు. మా స్నేహానికి ఎవరు ఏ పేరు పెట్టినా మాకు ఫరవాలేదు. మీరు మాత్రం అది అర్థం చేసుకుంటే చాలు.
నేను రష్మికి అమ్మని. రాజీవ్‌కి అత్త, పిన్ని ఏమైనా అవచ్చు కానీ అమ్మని కాను. అలానే శ్రీనాథ్‌ కూడా రష్మికి తండ్రి కాలేడు. మాకు ఈ వయసులో కావాల్సింది స్నేహబంధం, మా కష్టసుఖాలు చెప్పుకునేందుకు తోడు...అంతే, దానికి ఒక పేరూ వరసా కాదు.’’
స్పష్టంగా స్థిరంగా చెప్పిన మాధవిని చూస్తూ శ్రీనాథ్‌ అన్నాడు ‘‘మాధవి చెప్పిందే నా మాట కూడా. మాది స్వచ్ఛమైన స్నేహం, దానికి వేరే పేరు, రూపం ఇవ్వం. మీరు మమ్మల్ని ‘సహజీవనం’ చెయ్యమన్నారు కానీ మేము ‘స్నేహ జీవనం’ చేస్తాం’’ అన్నాడు.
రష్మీ, రాజీవ్‌ ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.
రష్మి, మాధవిని పట్టుకుని ‘‘సారీ అమ్మా, మమ్మల్ని క్షమించు. మాకు మీ సంగతి తెలుసు కానీ, నువ్వు అన్నట్టు- కొంతమంది అనే మాటలు విని మీకు
వేరే బంధం ఏర్పడితే ఎవరూ అనవసరంగా మీ గురించి మాట్లాడరు కదా అనుకున్నాం. మాకు మీరూ మీ సంతోషమే ముఖ్యం’’ అంది.
రాజీవ్‌ కూడా శ్రీనాథ్‌తో ‘‘నాన్నా, నీకు అమ్మ అంటే ఎంతిష్టమో తనని ఎంతగా ప్రేమించావో తెలుసు. ఒకవేళ మీ మనసులో ఈ అభిప్రాయం ఉన్నా, మాకోసం మీరు వెనక్కి తగ్గుతున్నారా అనిపించింది. నన్ను క్షమించు. మీరు ‘సహజీవనం’ చేస్తారా ‘స్నేహజీవనం’ చేస్తారా అన్నది మాకు అనవసరం. మీ ఇద్దరి అభిమానమూ ఆప్యాయతా మా నలుగురికీ ఎప్పటికీ కావాలి’’ అన్నాడు కళ్ళు చెమర్చుతుండగా.
‘‘ఇదిగో బంగారాలూ, మేము ఉండేది ఇంక కొద్ది రోజులే, మా జీవనాలు మేము జీవిస్తాం కానీ, ఉన్న ఈ నాల్రోజులూ మమ్మల్ని మా శ్రీతో ఆడుకోనివ్వండి’’ అంటూ మాధవి పాపాయిని ఎత్తుకుని ‘‘రాజా, నువ్వు ఏ పేరు పెట్టినా సరే, నాకు మాత్రం ఇది నా ‘శ్రీ’నే’’ అంటుంటే, పాపాయి మాధవిని చూసి ‘ఔను’ అన్నట్టుగా గలగలా నవ్వింది.

👉 Collected by :
👉 Credits: Eenadu Sunday magazine
👉 This is an unofficial page of Eenadu magazine

Address

Guntur

Website

Alerts

Be the first to know and let us send you an email when Eenadu Sunday Stories posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category