22/08/2025
విమర్శనాత్మక వ్యాస సంపుటి
ఘట్టమరాజు అశ్వత్థ నారాయణ విమర్శకులు, నిరంతర అధ్యయనశీలి. వారు వందలాది సమీక్షలు, విమర్శనాత్మక వ్యాసాలు వ్రాసియున్నారు. అవన్నీ పక్కనపెట్టి 'మూసి' పత్రికలో రాసిన పరిశోధనాత్మక వ్యాసాలతో "గ్రంథాంతరంగం" పేరుతో ఒక పుస్తకాన్ని వెలువరించారు.ఈ " గ్రంథాంతరంగం" లో తెలుగు సాహిత్యానికి సంబంధించిన 30 పుస్తకాల పరిచయాత్మక, విశ్లేషణాత్మక వ్యాసాలు ఉన్నాయి. ఇందులో వివిధ విభాగాలకు చెందిన సాహిత్య చరిత్రలు, విశేష గ్రంథాలు, ప్రత్యేక సంచికల మీద విశ్లేషణా వ్యాసాలు ఉన్నాయి. వీటిలో ఒకటి రెండు తప్ప మిగతా వ్యాసాలన్నీ శతాబ్దం, అర్థ శతాబ్దం నాటికి సంబంధించినవి. కనుమరుగైపోయిన ఈ అమూల్య గ్రంథాలన్నింటిని వెతికి, వాటిని లోతుగా పరిశీలించి అందులోని కొత్తదనాన్ని , గొప్పదనాన్ని ఈనాటి పాఠకులకు తెలియజేయడం కోసమే ఈ వ్యాసాలను రచయిత రాశారు. ముందుగావంగూరి సుబ్బారావు పంతులుగారు తన 32వ ఏట మొట్టమొదటి తెలుగు సాహిత్య చరిత్ర "ఆంధ్ర వాఙ్మయ చరిత్రము" ను 1920లో రచించి చరిత్ర కెక్కారు. సుబ్బారావు గారు బౌద్ధ జైన బ్రాహ్మణ మతాల స్థితిగతుల నేపద్యాన్ని, తెలుగు కావ్య రచనపై వాటి ప్రభావాన్ని చర్చించడం ఈ ఆంధ్ర వాంగ్మయ చరిత్రలోని ప్రత్యేకత . తిక్కన భారత భాగము తెలుగు తేనెలో నూరవేసి సంస్కృత భారతమును తెలుగు భారతముగా చేసివేసినాడు అంటూనే శ్రీనాధుని కావ్యాల్ని ఇలా అంచనా వేశారు.' ఇతడు స్వతంత్ర కావ్యములు వ్రాయగల బుద్ధి సూక్ష్మత కలవాడయ్యు, పండితుడై నూతన సృష్టి నొనర్చలేకపోయెను. ప్రబంధ సృష్టికి బీజములు మాత్రం నాటగలిగెను.' అంటారు. గ్రంథకర్త 'ఆంధ్ర వాంగ్మయ చరిత్ర' లో కేవలం 9 పేజీలే కేటాయించినా 1920 నాటికి 500కు పైగా శతకాలు ఉన్నాయని గుర్తించగలిగారు. తెలుగు సాహిత్యకారులు ఎవ్వరూ చూపని, చూపలేని విధంగా తమ అభిప్రాయాన్ని ధైర్య సాహసాలతో ప్రకటించారు. వీరి భావజాలం, అభిప్రాయ ప్రకటనలపై కట్టమంచి రామలింగారెడ్డి గారి "కవిత్వ తత్వ విచారం" ప్రభావం కొట్టవచ్చినట్లు కనబడుతుంది. బసవరాజు అప్పారావు గారి "ఆంధ్ర కవిత్వ చరిత్రము "1921 తెలుగు కవిత్వ తత్వాన్ని పరిశీలించిన లాక్షణిక గ్రంథం.భావ కవిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న బసవరాజు అప్పారావు గారు కవిత్వతత్వ విచారాన్ని ఇంత లోతుగా చేయడం, అందులోనూ గ్రాంథిక భాషలో ఈ గ్రంథాన్ని వెలువరించడం ఆశ్చర్యకరమే. అక్కిరాజు ఉమాకాంతం గారు తన "నేటి కాలపు కవిత్వం" లో భావ కవిత్వం పై విరుచుకుపడ్డారు. అయోమయత్వాధికరణం, పులుముడు, ఘటనాదికరణం, శబ్ద వాచ్యతాధికరణం అన్న చోట్ల భావ కవిత్వ దోషాల్ని చించి చెండాడారు. ఉమాకాంతం గారు భావ కవిత్వం లోనూ, ఎంకిపాటల్లోనూ, నారాయణమ్మ- నాయుడు బావ పాటల్లోనూ ,ఇతరత్రా వ్యక్తమైన శృంగారాన్ని మెచ్చుకోకపోగా నిరసించారు కూడా. కరుణాది భావవ్యంజనకు ఉత్తమ నాయకుల ఆవశ్యకత లేదని, సాధారణ ప్రజల భావాలు కూడా ఆర్ద్రత కలిగించగలవని పంతులుగారు భావించి గౌరవించడం ఆశ్చర్యకరమే. 1924లో ప్రచురితమైన భోగరాజు నారాయణమూర్తి గారి " ఆంధ్ర కవిత్వ చరిత్రము" లో ఆంగ్ల సాహిత్య అధ్యయన ప్రభావం వల్ల కవిత్వ నిర్వచన, లక్షణ ప్రయోజనాల్ని సంస్కృతాంధ్ర లాక్షణికుల అభిప్రాయాలతో మేళవించి తన అభిమతాన్ని వ్యక్తం చేశారు. కవిత్వ తత్వ విచారం చేస్తూ, సమాంతరంగా తెలుగు ప్రాచీన కవుల రచనల్ని కూడా పరిశీలించారు. నారాయణమూర్తి గారు తెలుగు కవిత్వ రచన యుగధర్మాన్ని ప్రతిబింబించిందనీ, కాలపరివర్తనంతో పాటు తన స్వరూప స్వభావాన్ని కూడా మార్పు చేసుకుంటూ నడిచిందని నూరేళ్ళ కిందటనే గుర్తించడం విశేషం. కల్లూరు వెంకటనారాయణ రావు గారు తమ "ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహము"ను 5 ఖండాలుగా విభజించి, ఒక్కో ఖండాన్ని కొన్ని యుగాలుగా భావించి, ఆ యుగ కాలావధిని పేర్కొని సంఘ చరిత్ర, వాన్మయ చరిత్ర, కావ్య విమర్శ ,యుగలక్షణ సమన్వయము అనే అంశాల వారీగా పరిశీలించారు. మునుపటి, తర్వాతి తెలుగు సాహిత్య చరిత్రకారులు ఎవరూ ఈ దృష్టితో తెలుగు సాహిత్య చరిత్రను పరామర్శించిన వైఖరి లేదు. కల్లూరు వారు ఒక్కో యుగం కాల పరిమితిలోని దేశ సాంఘిక, రాజకీయ, మత పరిస్థితుల్ని సమీక్షించి - ఆ కాలంలో వెలువడ్డ కవిత్వానికి ప్రేరకమైన స్థితిగతుల్ని నిరూపించారు.
" ఆంధ్ర గద్య వాన్మయ చరిత్ర" కర్త గొబ్బూరు వెంకటానంద రాఘవరావు తమ గ్రంధంలో నన్నయ భారతంలోని గద్యాన్ని లక్ష్యంగా స్వీకరించి సంస్కృతం, ఆంగ్ల సాహిత్య లక్షణ పుస్తకాల ఆధారంగా తమ విమర్శన ప్రారంభించారు. ఇందులో నన్నయ్య వచన రచనా వైశిష్యంతో పాటు నన్నెచోడుడు, తిక్కన, ఎర్రన, శ్రీనాధుడు, పోతన మొదలైన పద్య కవుల గద్యాన్ని, దక్షిణాంధ్ర యుగ కవుల వచన రచనలను, చిన్నయ సూరి, వీరేశలింగం పంతులు గార్ల గద్యరచనలు ,దేశ చరిత్రలు, స్వీయ చరిత్రలు, నవలలు, శాస్త్ర గ్రంథాల్లోని గద్యరీతుల్ని విమర్శనాత్మకంగా పరిశీలించారు." ప్రాకృత గ్రంథకర్తలు- ప్రజా సేవానూ" అనే గ్రంథం రాసిన పంచాజ్ఞుల ఆదినారాయణ శాస్త్రి గారు దీని ద్వారా తెలుగు వాళ్లకు పరిచయం లేని ప్రాకృత కావ్యాల విశేషాలను తెలియజేయడం మొదటి కారణం కాగా, ఆ కావ్యాల విశిష్టతను వ్యవాహారిక భాషలో తేటతెల్లం చేసి, వాడుక భాష శక్తి సామర్థ్యాన్ని ప్రదర్శించడం రెండవ కారణం. ఈ రచన జరిగిన కాలానికి అంటే 1933 నాటికి ఇంత ఘనమైన విషయాన్ని ఇంత తేట తెలుగులో వెల్లడించడం అపూర్వం, అద్భుతం. కురుగంటి సీతారామయ్య విద్యార్థి దశలోనే " అలంకార తత్వ విచారము" అన్న 97 పేజీల విమర్శనాకృతిని వెలయించడం ఆశ్చర్యం. కురుగంటి వారు భారతీయ కావ్య సంప్రదాయాన్ని అనుసరించిన విమర్శకులే. సందర్భానుసారంగా పాశ్చాత్య కావ్య సంప్రదాయాన్ని కూడా గౌరవించి తమ విమర్శను కొనసాగించారు. సీతారామయ్య గారు కవిత్వ లక్షణాల గురించి, కవి స్వాతంత్ర్యం గురించి, విమర్శకుని లక్షణాలు -కర్తవ్యం గురించి, కావ్య పఠన ఉద్దేశం గురించి పాశ్చాత్య విమర్శకుల అభిప్రాయాలతో ఏకీభవించారు. సాహిత్య అభివృద్ధికి విమర్శ అవసరమని విశ్వసించారు. కురుగంటి సీతారామయ్య గారి" అలంకార తత్వ విచారం"( 1915) అప్పుడప్పుడే తల ఎత్తుతున్న తెలుగు సాహిత్య విమర్శకు తార్కాణం.
పాటిబండ మాధవ శర్మ" ఆధునికాంధ్ర భావ కవిత్వం" అనే లఘు సిద్ధాంత వ్యాసాన్ని పింగళి లక్ష్మీకాంతం గారి పర్యవేక్షణలో రాశారు. విశ్వవిద్యాలయాల్లో తెలుగు సాహిత్య పరిశోధన పురిటి నొప్పులు పడుతున్న రోజులవి. ఆ దినాల్లో పాతికేళ్ల పాటిబండ వారు ఎంతో శ్రమకోర్చి పత్రికల్లో చెల్లాచెదరుగా పడి ఉన్న కవితల్ని పోగు చేసి, శ్రద్ధతో పరిశీలించి ఆత్మవిశ్వాసంతో సంతరించి పెట్టిన ఆత్మ మూల్య పరిశోధనా గ్రంథం ఇది. పాటిబండ వారు పుస్తకం చివరి పేజీల్లో భావ కవిత్వ వికాసాన్ని సమీక్షిస్తూ, భావకవుల కవిత్వంలోని వైశిష్యాన్ని తైపారువేసిన విధానం గమనించదగ్గది. దక్షిణాంధ్ర యుగ నాయక రాజుల చరిత్ర, సాహిత్య పోషణల గురించి పరిశోధన చేసి దానికి ఇనాలోక యోగం కల్పించిన పరిశోధకులలో ప్రథమగణ్యులు
వేటూరి ప్రభాకరశాస్త్రి గారు. ఆ మహనీయుడు మద్రాసు ప్రాచ్య పరిశోధనా వ్రాతప్రతుల గ్రంథాలయంలోని మెకంజీ కైఫియత్తులు, ఇతర లిఖిత తాళపత్ర గ్రంథాలని అధ్యయనం చేసి తంజావూరులోని సరస్వతీ మహలు గ్రంథాలయంలోని ప్రాచీన సంస్కృతాంధ్ర కావ్య నాటకాదుల్ని గాలించి 1914లో "తంజావూర్ ఆంధ్ర నాయక చరిత్ర"ను రచించి పాఠక లోకానికి అర్పించారు. దక్షిణాంధ్ర యుగ చరిత్ర సాహిత్యాన్ని అంచనా వేసిన తొలి విమర్శనా గ్రంథం ఇదే. 1940 లో ముద్రింపబడ్డ "సమీక్ష" అనే వ్యాస సంకలనం విద్వాన్ విశ్వం గారి సాహితీ వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని, భంగిమను ,సరళ సుందర రీతిలో వ్యక్తం చేస్తుందని భావించారు. వంగూరి సుబ్బారావు గారి వేమన ( 1922) తర్వాతి పరిశోధకులకు విమర్శకులకు కైదివ్వే లాంటిది. ఈ మహానుభావుడు అంతకుముందు వెలువడ్డ వేమనను గురించిన గ్రంథాల్ని లోతుగా చదివి, కొందరి అభిప్రాయాన్ని అంగీకరిస్తూ, మరికొందరితో విభేదించిన వంగూరి వారి "వేమన"ను విశ్వవిద్యాలయ పరిశోధకులు ఒకరిద్దరు గమనించారు. కానీ రాళ్లపల్లి వారు మాత్రం లోతుగా చదివారని చెప్పవచ్చు. రాళ్లపల్లి వారి వేమన విషయసూచిక, వంగూరి వారి వేమన విషయ సూచిక క్లుప్త రూపమనే తోస్తుంది. సుబ్బారావు గారు వేమన గురించి సమృద్ధమైన విశేష సేకరణ చేస్తే, అనంత కృష్ణుల వారు ఆ సమృద్ధితకు లోతుపాతుల్ని ,కళాత్మకతను సంతరించి పెట్టారని చెప్పవచ్చు. అంగీకారాన్ని గాని ,అభిప్రాయ భేదాల్ని కానీ తెలియజేయడంలో నయము, నాజూకు, స్పష్టతలు ఎలా ప్రదర్శించాలో నేటితరం విమర్శకులకు ఈ రెండు సద్గ్రంథాలు, సత్ఫథాన్ని చూపుతాయి.
అనంతపంతుల రామలింగ స్వామి' కృష్ణపక్షం' ను గురి చేసుకుని "శుక్లపక్షము"ను అధిక్షేపకావ్యంగా తీర్చిదిద్దారే కానీ వైఫల్యమే మూట కట్టుకోగలిగారు. ఈ కావ్యం లో వ్యక్తమైన భావనాశక్తి, వస్తు చిత్రణాయుక్తి, రచనా శిల్పానురక్తులు గమనిస్తే, మౌలిక కావ్యాలు రచించి ఉంటే ఆయనకు సాఫల్య సిద్ధి లభించి ఉండేది. నిడదవోలు వెంకటరావు గారి" ఆంధ్ర కర్ణాటక సారస్వ్రతములు- పరస్పర ప్రభావము" తెలుగు కన్నడ ప్రాచీన కావ్యాల తులనాత్మక పరిశీలనకు ప్రేరణ కలిగించింది. లోతైన అధ్యయన, అనుశీలనకు దారితీసింది." శేషాద్రి రమణ కవుల పరిశోధన వ్యాసమంజరి" ఈ పండిత పరిశోధకులు తెలంగాణ చరిత్ర సాహిత్య చరిత్రలోని ఎన్నో చీకటి కోణాలపై వెలుగు ప్రసరింపజేసిన వ్యాస సంపుటి ఇది.
కోలా శేషాచల కవి 'నీలగిరి యాత్ర'ను వినోదయాత్ర కథనంగా రూపొందిస్తే ,బేతపూడి సుందర రాయుడు 'నీలగిరి చరిత్ర'ను అటు ఉల్లాస యాత్ర గాను, ఇటు విజ్ఞాన యాత్రగా తీర్చిదిద్దారు. "జానకమ్మ ఇంగ్లాండ్ యాత్ర" ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ కాలం రీత్యానే కాదు, ఈ కాలం దృష్టితో చూసినా ఇది బహుళార్థ సాధక పర్యటనమే. ఆమె కొత్త ప్రదేశాల్ని చూసే చూపు, సుఖసంతోషాల్ని అనుభవించే రీతి, అక్కడి ప్రజల ఆచార వ్యవహారాలని, పండుగ పబ్బాల్ని పరిశీలించి, పులకరించే విధానం ఆ ప్రాంతపు నాగరికత- సంస్కృతిని ఆకళించుకునే వైనం విశేషమైనవి, విలక్షణమైనవినూ. సి పి బ్రౌన్ "తాతాచారి కథలు" కు ముందు మాటలు రాస్తూ బంగోరే ఇలా అంటారు." బ్రౌన్ ఈ కథలను ఎందుకు సేకరించినట్లు? వీటిలోని భాషా సారళ్యం, సూటిదనం ఒకటే కారణమా? లేక ఇతివృత్తం కూడానా. చారిత్రిక అంశాలు ఉన్నాయనే స్పృహ కూడా ఒక కారణమా? స్పెక్యులేట్ చేయడం కష్టం. బ్రౌన్ వ్యక్తిత్వం ఒక మూసలో ఇమిడేది కాదు. ఒక కొలమానానికి అందేది కాదు. ఆయన పాండితి, ప్రజ్ఞ, సేవ బహుముఖమైనవి. గుడిపూడి సుబ్బారావు రాసిన" మునగాల పరగణా : కథలు- గాథలు" లో మనకు జమీందారుల భోగ విలాసాలు, డాబు దర్పాలు, పీడన తాడనలు, ప్రజల ఆక్రందనలు- అర్ధనాదాలు కనబడతాయి, వినిపిస్తాయి. పదేపదే ప్రతిధ్వనిస్తాయి కూడా. జానపద బాల గీతాలు సేకరించడంతోపాటు వాటి విమర్శకు భద్రమైన పునాదివేసిన ప్రాతః స్మరణీయులు బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. జూలూరి అప్పయ్య గారి' పసుచరిత్ర' టీకను తెలుగు కావ్య ప్రియులు కళ్ళకు అద్దుకున్నారు. జూలూరి వారి టీకా సారళ్యం,స్పష్టత, విశదతలు తరతరాల తెలుగు విద్వాంసుల, విద్యార్థుల మననల్ని మూట కట్టుకున్నాయి. ఆదిరాజు వీరభద్ర రావు గారు రచించిన "షితాబుఖాన్ అను సీతాపతి రాజు" పరిశోధన గ్రంథం కాకతీయుల తర్వాతి కాలం నాటి ఒక వీరుని శౌర్య చరిత్ర, తెలంగాణ చరిత్రలోని ఒక స్మరణీయ అధ్యాయం. తెలంగాణలోని ఒక నిరుపేద వీరోచిత విద్యలు నేర్చి ఓరుగల్లు గద్దినెక్కి అల్పకాలంలోనే అనల్ప కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన అసమాన సూర్యుని పరాక్రమ గాధ ఈ పుస్తకం.
" జనం మంచి శేషాద్రి శర్మ గారి షష్టి పూర్తి ఉత్సవ సన్మాన సంపుటము" కొండంత కవిని అద్దంలో కొంచంగా చూపించే అభినందన గ్రంథం. గ్రంథకర్త బసవరాజు అప్పారావు తన ప్రియ మిత్రులైన ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వ్యక్తిత్వంలోని కాంతుల్ని ఎంతో ఆత్మీయంగా వర్ణించారు." శ్రీ ఆంధ్రరత్న జ్యోతులు" దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జీవిత చరిత్ర కంటే జీవిత కథగా రూపొందిందనడం సూక్తం. తెలంగాణ నిజాం పరిపాలనలో నిద్రాణమై ఉండింది. అవిద్య ,ఆకలి దప్పులు, నిరాశా నిస్పృహలు, నాయకత్వ లోపం మొదలైన నిద్రాణావస్థల నుండి మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి లాంటి వైతాళికుల సారథ్యంలో తెలంగాణ ప్రజలు పోరాడి అస్తిత్వ అస్మితలను నిరూపించిన నేపథ్యంలో దేవులపల్లి రామానుజ రావు గారి "50 సంవత్సరాల జ్ఞాపకాలు" రచింపబడింది. అయ్యంకి వెంకట రమణయ్య గారు ఆంధ్ర దేశంలోనే కాక భారతదేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో గ్రంథాలయాల స్థాపనకు ప్రేరక శక్తిగా నిలిచారు వారు సుమారు 60 ఏళ్ల పాటు ఆవాల గోపాలానికి గ్రంధాలయ ప్రాముఖ్యత వివరిస్తూ ఊరువాడల్లో పుస్తకాలయాలు నిర్మింపజేస్తూ భారతదేశంలో గ్రంథాలయ జ్యోతిని వెలిగించారు ఈ సందర్భంగా ఆయన గ్రంథాలయాల ఆవశ్యకతను పుస్తకాల ఎన్నిక ,సేకరణ, వర్గీకరణ పాఠకుల అభిరుచులు పల్లెల్లో పట్టణాల్లో స్థాపించవలసిన గ్రంథాలయాల స్వరూప స్వభావాల గురించి చేసిన ఉపన్యాసాలు రాసిన వ్యాసాన్ని వెలగా వెంకటప్పయ్య గారు ఎంతో శ్రమించి చక్కగా కూర్చి గ్రంథాలయ జ్యోతి అనే గ్రంధాన్ని సిద్ధపరిచారు. ఇంకొక వ్యాసంలో బ్రౌన్ 1854 లో ప్రచురించిన బ్రౌన్య మిశ్ర భాష నిఘంటు ప్రత్యేకతలను, విశిష్టతలను తెలియజేశారు. ప్రేమతో పలకరించే వ్యక్తులు దరిదాపుల్లో లేక, స్నేహ హస్తాలకు చేతులు చాస్తూ విలవిలలాడిన వేదం వెంకటరాయ శాస్త్రి గారి కడపటి దినాల్ని కరుణార్ధంగా చిత్రించిన పుస్తకం గుర్రం సుబ్బరామయ్య గారు రచించిన" గురు సంస్కృతి"." బ్రహ్మశ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి షష్టిపూర్తి సంచిక "లో మల్లాది వారి జీవిత సాహిత్య వ్యాకరణ శాస్త్ర వైదుశ్యాల సంక్షిప్త పరిచయం ఉంది. సంస్కృతాంధ్ర సాహిత్యాల గురించి విధ్వాన్సుల విశ్లేషణాత్మక వ్యాసాలు ఉన్నాయి. మల్లాది వారి విధ్వత్ పూర్ణ వ్యాసాలు ఉన్నాయి. ఒక మహా పండితుడి ప్రతిభా విశేషాలు తెలపడంతో పాటు, ఈ సంచిక పండితాగ్రణుల సునీశిత ఆలోచనల్ని నమోదు చేసే రచనలు ఉన్నాయి.
అలభ్య గ్రంథాలను సేకరించడం ఒక ఎత్తు. వాటిని క్షుణ్ణంగా చదివి అందులోని ప్రత్యేకతలను, గొప్పదనాన్ని విశ్లేషించి వివరించడం మరో ఎత్తు. ఈ పనిని ఘట్టమరాజు అశ్వత్థ నారాయణ సమర్థవంతంగా చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ పుస్తకాలు వెలువడిన కాలానికి ఇప్పటికీ ఎన్నో నూతన పరిశోధనలు జరిగి, మరెన్నో కొత్త విషయాలు బయటపడటంతో, వాటి ఆధారంగా కొత్త పుస్తకాలు వస్తూనే ఉన్నాయి. వాటితో పోల్చుకొని చూస్తే ఈ పుస్తకాలు కాలదోషం పట్టినవిగా, అవుట్ డేటెడ్ అని పరిగణించే అవకాశం ఉన్నది. అయినప్పటికీ పాత తరం వారి పాండిత్యం, పరిశోధనా పటిమ ఈతరం పాఠకులు తెలుసుకోవడానికి ఇలాంటి పుస్తకాలు ఉపయోగపడతాయి. సాహిత్య రంగంలోని అధ్యాపకులు, పరిశోధకులకు మాత్రమే కాదు. సాహిత్యాభిమానులకు కూడా ఈ పుస్తకం సమాచారాత్మకంగా ఉండి ఆసక్తికరంగా చదివింపజేస్తుంది.
కె.పి అశోక్ కుమార్
(" గ్రంథాంతరంగం"( విమర్శనాత్మక వ్యాస సంపుటి) ఘట్టమరాజు అశ్వత్థ నారాయణ. ముద్రణ మరియు ప్రతులకు: ఏమెస్కో .వెల రెండు వందల రూపాయలు. పేజీలు 256)
11.8.2025 నాటి ప్రజాశక్తి "అక్షరం" లో ప్రచురితం