
13/06/2025
అంబానీకి కాసుల వర్షం కురిపించిన ; ఏషియన్ పెయింట్స్ షేర్లు :
ఒకప్పుడు రూ. 500 కోట్ల పెట్టుబడి పెట్టి, ఇప్పుడు రూ. 7,700 కోట్లు ఆర్జించారు.
ఆయన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) ఏషియన్ పెయింట్స్‌లో వాటాను విక్రయించి మల్టీబ్యాగర్ రిటర్నులు పొందింది.
3.5 కోట్ల షేర్లను రూ. 7,703.5 కోట్లకు బ్లాక్ డీల్‌లో విక్రయించి భారీ లాభాలు ఆర్జించింది.
ఈ ఒప్పందం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ వద్ద 87 లక్షల ఏషియన్ పెయింట్స్ షేర్లు మాత్రమే మిగిలాయి.
రిలయన్స్ తన అనుబంధ సంస్థ సిద్ధాంత్ కమర్షియల్స్ లిమిటెడ్ ద్వారా ఈ షేర్లను ఒక్కో షేరు రూ. 2,201 ధరకు విక్రయించిందని స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో తెలిపింది.
ఈ షేర్లను ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కొనుగోలు చేసింది. ఈ బ్లాక్ డీల్ తర్వాత ఏషియన్ పెయింట్స్ షేర్లు బీఎస్ఈలో 2 శాతం పెరిగినప్పటికీ, మార్కెట్ ముగిసే సరికి కి 0.43 శాతం లాభంతో రూ. 2,218 వద్ద స్థిరపడ్డాయి..
2008లో రూ. 500 కోట్లకు కొని, 2008 జనవరిలో ప్రపంచ ఆర్థిక సంక్షోభం, లెహ్మన్ బ్రదర్స్ కుప్పకూలిన సమయంలో రిలయన్స్ తన సబ్సిడియరీ ద్వారా ఏషియన్ పెయింట్స్‌లో 4.9 శాతం వాటాను రూ.500 కోట్లకు కొనుగోలు చేసింది.
ఈ రోజు వీటిని రూ. 7,703 కోట్లకు అమ్మి భారీ లాభాలను ఆర్జించింది. ఇది రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలియజేస్తుంది.
కాగా, గత రెండేళ్లలో ఏషియన్ పెయింట్స్ షేర్లు 30 శాతం కంటే ఎక్కువ క్షీణించాయి.
ఇది నిఫ్టీ బ్లూచిప్ షేర్లలో అత్యధిక క్షీణత నమోదు చేసిన వాటిలో ఒకటిగా నిలిచింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన బిర్లా ఓపస్ పెయింట్స్ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది.
ఎలారా సెక్యూరిటీస్ ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో ఏషియన్ పెయింట్స్ మార్కెట్ వాటా 59 శాతం నుంచి 52 శాతానికి పడిపోయింది.
వరుసగా నాలుగు త్రైమాసికాలుగా ఆదాయ వృద్ధి బలహీనంగా ఉంది. నగర ప్రాంతాల్లో డిమాండ్ తగ్గడం, దీపావళి ముందస్తుగా రావడం వంటి కారణాలతో ఈ పరిస్థితి నెలకొంది.
ముడి సరుకుల ధరలు తగ్గినప్పటికీ, రిబేట్లు, పోటీ కారణంగా లాభాల మార్జిన్లు పడిపోయాయి.
బ్రోకరేజ్ అంచనా :
నువామా సెక్యూరిటీస్ 2026-27 ఆర్థిక సంవత్సరం కోసం ఏషియన్ పెయింట్స్ ఆదాయ అంచనాలను 6-8 శాతం తగ్గించింది.
2028 ఆర్థిక సంవత్సరం వరకు కేవలం 7.2 శాతం EPS CAGR (సంవత్సరానికి లాభం వృద్ధి రేటు) ఉంటుందని అంచనా వేసింది. షేరు టార్గెట్ ధరను రూ. 2,200కి తగ్గించి. న్యూట్రల్ రేటింగ్‌ను కొనసాగించింది.