29/10/2024
గుండె, గ్యాస్ నొప్పికి మధ్య వ్యత్యాసాన్ని గమనించాలిఆధ్వర్యంలో వైద్య అవగాహన సదస్సు
డాక్టర్ అనూప్ వెలగ ఏమన్నారంటే..
ఛాతి భాగంలో నొప్పి వస్తే దాన్ని గుండె నొప్పిగానే భావించాల్సి ఉంటుంది. గ్యాస్ నొప్పి అనేది కడుపులో వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఛాతీలో వచ్చే మంటను గ్యాస్ నొప్పిగా చెప్పవచ్చు. గుండె బరువుగా అనిపించినా, ఛాతీలో నొప్పి వచ్చినా వీలైనంత త్వరగా రోగిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాలి. గుండె నొప్పి వచ్చిన గంటన్నరలోపే రోగిని ఆసుపత్రికి తీసుకెళ్తే ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు అవకాశం ఉంటుంది. చిన్నవయసులో గుండె నొప్పి రావడానికి వారి ఆహారపు అలవాట్లు, చెడు వ్యసనాలే కారణం. 50 ఏళ్లకు పైబడిన వారిలో సహజంగానే గుండెకు సంబంధించిన ధమనులు, సిరలు కొంతమేర శక్తిని కోల్పోతుంటాయి. అటువంటి వారిలో ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులొచ్చే అవకాశం ఉంటుంది. కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులు సంక్రమిస్తున్నాయనడానికి శాస్త్రీయంగా ఎటువంటి నిర్ధారణ కాలేదు. ఇది అపోహ మాత్రమే. ఎవరికైనా ఛాతీలో తట్టుకోలేనంత నొప్పి వచ్చి ఎక్కువగా చెమటలు పట్టి కళ్లు తిరుగున్నట్లనిపిస్తే అది కచ్చితంగా గుండె పోటు కావచ్చు. ఆ వ్యక్తిని వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి.
డాక్టర్ భాను శైలజ ఏమన్నారంటే..
గర్భిణులకు మొదటి మూడు వారాలు ఎంతో కీలకం. క్రమం తప్పకుండా వైద్యుని సంప్రదించి రక్త, ఇతర పరీక్షలు చేయించుకోవాలి. గర్భం దాల్చిన వారికి వారాలు గడుస్తున్న కొద్దీ రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది. వీటిని అదుపులో ఉంచుకోవడం ఎంతో అవసరం. ప్రతిరోజు నిర్ణీత వేళకు ఆహారం తీసుకోవడం, తగినంత నిద్ర చాలా ముఖ్యం. గర్భిణుల్లో జన్యుపరమైన సమస్యలు, వారాల ప్రకారం బిడ్డ ఎదుగుదలను తెలుసుకోవడానికి స్కానింగ్ చేయించుకోవాలి. గర్భం దాల్చిన నాటి నుంచి బిడ్డ పుట్టేలోగా మహిళ బరువు 8 నుంచి 10 కిలోల వరకు పెరుగుతుంది. నెలలు దగ్గర పడుతున్న కొద్దీ శ్వాస సంబంధిత సమస్యలూ ఉత్పన్నం కావచ్చు. థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం అవసరం. నెలలు నిండక ముందే ప్రసవం జరగకుండా ఉండాలంటే వైద్యుల సూచనలు పాటించాలి. గర్భం దాల్చిన నాలుగో నెల నుంచి ఐరన్, కాల్షియం మాత్రలు వేసుకోవాలి. ప్రొటీన్, కార్బొహైడ్రేట్లు ఉండే ఆహార పదార్థాలు తినాలి. రక్తహీనత నివారణకు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలి. కొందరు మహిళలు అవసరం లేకపోయినా గర్భ సంచిని తొలగింపజేయించుకోవాలని చూస్తుంటారు. ఇది మంచిది కాదు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే వైద్యుల సలహాతో గర్భ సంచిని తొలగింపజేయించుకోవాలి. అనవసరంగా తొలగిస్తే హార్మోన్ల సంఖ్య తగ్గి వ్యాధులు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. నెలసరి ముందుగా వచ్చినా లేదా ఆలస్యంగా వచ్చినా వైద్యులను సంప్రదించాలి.
సందేహాల నివృత్తి
సమస్య: సమయానికి తినకపోతే గ్యాస్ ఇబ్బంది వస్తుందా? గ్యాస్ నొప్పికి, గుండె నొప్పికి తేడా ఎలా తెలుస్తుంది?
పి.సాంబశివరావు, ప్రైవేటు ఉద్యోగి
సమాధానం: దైనందిన జీవితంలో సమయానికి ఆహారం తీసుకోకపోతే గ్యాస్ ఉత్పన్నం అవుతుంది. దాన్ని తగ్గించడానికి మందు లేదు. గ్యాస్‌ను తగ్గించేందుకు పరగడుపున వేసుకునే మాత్రలు కడుపులో మంట రాకుండా ఉండేందుకే ఉపయోగపడతాయి. తల నొప్పి, మోకాళ్ల నొప్పి, ఇతర శరీర భాగాల్లో నొప్పి వస్తే గ్యాస్ నొప్పిగా భావించరు గానీ.. ఛాతీలో నొప్పి వస్తే చాలామంది గ్యాస్ నొప్పి అని సరిపెట్టుకుంటారు. పదే పదే గుండెల్లో మంట, నొప్పి వస్తే వెంటనే గుండె వైద్యులను సంప్రదించాలి. లేదంటే అది ముదిరి గుండె పోటుకు దారి తీయవచ్చు. ఆదిలోనే మేల్కొంటే మంచిది.
గుండెపోటుకు గురవకుండా ఉండాలంటే ఏం చేయాలి? గుండె పోటు వచ్చిందనే దానికి సంకేతాలేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. గుండె వాల్వులు మూసుకుపోతే ఆయుర్వేద, యునానీ, ప్రకృతి సిద్ధమైన మందులు వినియోగిస్తే నయమవుతాయా?
బాలకృష్ణారావు, సీనియర్ సిటిజన్
గుండెపోటుకు గురవకుండా ఉండాలంటే చక్కని ఆహారపు అలవాట్లు పాటించాలి. మానసిక ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా నడక, ఇతర వ్యాయామాలు చేయాలి. కొంతమందికి జన్యుపరంగా గుండె సంబంధిత ఇబ్బందులు వస్తాయి. ఒళ్లంతా చెమటలు పట్టడం, ఛాతీలో భరించరాని నొప్పి, కళ్లు తిరగడం వంటివి గుండెపోటుకు సంకేతాలుగా భావించాలి. గుండె పోటు వస్తే 2 గంటల్లోగా వైద్య సేవలు పొందాలి. ఆలస్యమైతే గుండెకు నష్టం ఎక్కువగా జరుగుతుంది. గుండె బలహీన పడుతుంది. మొదటి గంట చాలా కీలకం.
ఇటీవల మహిళలు, బాలికలు ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బయట మార్కెట్లో ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవడం, ఆరోగ్యంపై సరైన అవగాహన లేక పోవడం వల్లే ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయా?. మహిళల్లో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి ఎందుకని? నివారణ చర్యలు ఏమిటి?
షేక్ రెహమతుల్లా
కాలానుగుణంగా ఆహారపు అలవాట్లు మార్చుకుంటే చాలా వరకు అనారోగ్య సమస్యలు తగ్గించవచ్చు. జంక్ ఫుడ్ తీసుకోవడం మంచిది కాదు. చిన్న సమస్య ఉన్నప్పుడే తగ్గించుకోవాలి. పెద్దది చేసుకోకూడదు. ఆలస్యం చేయకుండా వైద్యుడి సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.
మహిళలు ఎక్కువగా క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ మహమ్మారిని ఏ విధంగా గుర్తించాలి. ?
జిల్లెళ్లమూడి వరప్రసాద్, న్యాయవాది
గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన అవసరం. ఇది మహిళలకు ఎక్కువగా వచ్చే వ్యాధి. దీనికి సంబంధించి స్క్రీనింగ్, ముందస్తు రోగనిర్ధారణ చేయించుకోవాలి. కొన్ని రక్త పరీక్షల్లో క్యాన్సర్ కారకాలు బయటపడతాయి. మగవాళ్లు ధూమపానానికి దూరంగా ఉండాలి. పాన్‌పరాగ్‌లు, కిళ్లీలు కూడా ప్రమాదకరం. చక్కని ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మెరుగైన జీవన శైలిని అలవర్చుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు.