15/09/2025
స్వరూపాలను ముట్టుకోకూడదా ?
అభివృద్ధి చెందిన దేశాల్లోనూ, కతోలిక శ్రీసభ అనాదిగా ఉన్న దేశాల్లోనూ స్వరూపాలను ముట్టుకునే ఆచారం పెద్దగా లేదు. అయితే మన భారత దేశంలో ఈ ఆచారం విరివిగా కనిపిస్తుంది. దీనిపై ప్రొటెస్టెంట్ సోదరులు విరుచుకు పడుతూ ఉంటారు. కొంతమంది పాస్టర్లైతే గౌరీ పట్నం, వెలాంకని పేర్లు ఎత్తుతూ అవమానిస్తూ కూడా ఉంటారు.
కతోలికుల్లో అధికశాతం మంది దళితులు. కొన్ని వందల సంవత్సరాల పాటు ఊరికి, గుడికి దూరంగా ఉంచిన పరిస్థితులను ఎదుర్కొన్న గుంపు ఇది. దేవుడ్ని తాకకూడదు, తాకితే దేవుడే మైల పడిపోతాడు అనే సమాజం నుంచి తెల్ల మిషనరీల ద్వారా క్రీస్తు వైపు వచ్చారు.
వారు తెచ్చిన స్వరూపాల్లో యేసు రూపం ఉంది. దేవుణ్ణి తాకవచ్చు, ఆయనకేమీ కాదు అనే విషయం వారికి తెలిసినప్పుడు, ఆ తొలి తర దళిత క్రైస్తవ విశ్వాసులు చవిచూసిన ఆనందం వెలకట్టలేనిది. అక్కడ నుంచి మరియ తల్లి, పునీతులు, యేసు స్వరూపాలను తాకే ఆచారం విరివిగా మొదలైంది. దేవుణ్ణి తాకకూడదు అనే నేపథ్యం నుంచి దేవుణ్ణి తాకవచ్చు అనే అవకాశం వచ్చినపుడు ఆనందంతో స్వరూపాలను తడిమినప్పుడు దేవుడు కూడా సంతోషించి ఉంటాడు. ఎందుకంటే అది మూఢ నమ్మకం నుంచి ఒక విడుదల.
ఈ నేపథ్యం వదిలేసి, సూటు బూటు తొడిగి, నాలుగు వాక్యాలు బట్టీ పట్టి, చరిత్రపై అవగాహన లేకుండా కొందరు అజ్ఞాన బోధకులు అజ్ఞాన వ్యాఖ్యలు చేస్తుంటారు. స్వరూపంలో దేవుడు ఉంటాడని ఎవరూ ఇక్కడ నమ్మడం లేదు. అవి భౌతిక రూపాలే అయినప్పటికీ, ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఆ స్పర్శకు ప్రత్యేకమైన స్థానం ఉంది.
స్వరూపాలు పెట్టకూడదు అనే దమ్మున్న ప్రొటెస్టెంటులు ఎవరైనా ఉంటే.. మీ చర్చిలు, ఇల్లు, మొబైల్స్, పుస్తకాలు ఇలా అన్ని చోట్లా యేసు క్రీస్తు సహా శిలువ చిత్రాలను కూడా తీసేసి సువార్త చెప్పి, ప్రజలకు అర్థమయ్యేలా వివరించి అప్పుడు మాట్లాడండి. అలా మాట్లాడిన వాడు ఎవ్వడూ లేడు. లోగో దగ్గర నుంచి మొబైల్లో పాటల వరకూ అన్ని చోట్లా యేసు బొమ్మలు, శిలువ బొమ్మలు వాడతారు. బయటకొచ్చి మీరు బొమ్మలు పెట్టకూడదు అండీ అంటూ కథలు చెబుతారు.
వాగే వారు వాగండి.. మొరిగే వారు మొరగండి. ఆల్ ది బెస్ట్.
✍️ సృజన్ సెగెవ్