09/10/2025
తెలుగుబాషలో "తెలంగాణా తల్లి" లొల్లి!
— శ్రీనివాస్ గౌడ్ ముద్దం రాసిన వ్యాసం
తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయ సరిహద్దుల కోసం జరగలేదు. అది ఒక భావోద్వేగ, సాంస్కృతిక, ఆత్మగౌరవ ఉద్యమం. ఈ ఉద్యమంలో తెలంగాణ తల్లి అనే ప్రతీక తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తూ అవతరించింది. ఆ ప్రతీక తెలంగాణ ప్రజల చరిత్ర, భూభాగం, సంస్కృతి, యాసలకు ప్రతీకగా నిలిచింది. అయితే, ఈ సాంస్కృతిక నిర్మాణంలో ఒక గందరగోళం కూడా రూపుదిద్దుకుంది — అదే తెలుగు తల్లి, తెలంగాణ తల్లి అనే రెండు భావనల మధ్య ఉన్న అస్పష్టత. ఇటీవల హైదరాబాద్‌లో తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా మారుస్తూ తీసుకున్న నిర్ణయం ఈ చర్చను మరింత ఉధృతం చేసింది. ఒక వర్గం దీన్ని తెలంగాణ గౌరవానికి ప్రతీకగా స్వాగతిస్తే, మరొక వర్గం దీన్ని తెలుగు భాషా ఐక్యతకు విరుద్ధమని అభిప్రాయపడింది. ఈ సందర్భంలో, తెలుగు భాషకు, తెలంగాణ భౌగోళిక అస్తిత్వానికి మధ్య స్పష్టమైన గీత గీయడం అత్యవసరం. లేదంటే మన ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం చరిత్ర గర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది.
తెలుగు భాష కేవలం ఒక మాటల వ్యవహారమేమీ కాదు; అది శతాబ్దాల సాంస్కృతిక ప్రవాహం. నన్నయ, తిక్కన, పోతన, శ్రీనాథుడు, అన్నమయ్య, త్యాగయ్య, దాశరథి వంటి మహానుభావులు ఈ భాషకు దిశా నిర్దేశం చేశారు. ఈ భాష కేవలం ఆంధ్రప్రదేశ్‌ది కాదు, తెలంగాణదీ కాదు — రెండింటికీ సమానంగా సొంతం. కాకతీయుల గర్వం, శాతవాహనుల శక్తి, భద్రాచలం రామదాసు, బసర సారస్వతీ, కూచిపూడి, పేరిణి నృత్యాలు — ఇవన్నీ రెండు ప్రాంతాల సంస్కృతికి అంతర్భాగాలు. భౌగోళిక సరిహద్దులు మారినా ఈ వారసత్వం విడిపోదు. కానీ రాజకీయ అవసరాలు ఈ ఉమ్మడి సంస్కృతిని విభజించాలనే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ యాస తెలుగు భాషలోని ఒక విలువైన వర్ణం మాత్రమే; అది స్వతంత్ర భాష కాదు. దానిని వేరుచూపించడం భాషా ఐక్యతకు బీటలు వేయడమే.
ప్రపంచీకరణ యుగంలో స్థానిక భాషలు తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నాయి. ఇంగ్లీష్, హిందీ ఆధిపత్యం పెరుగుతున్న వేళ తెలుగు భాష మనకోసం కాకుండా, మనమే దాని కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది. రాజకీయ ప్రతీకల కోసం పేర్ల మార్పులు చేయడం, ఉత్సవాల్లో మాత్రమే తెలుగు మాట్లాడడం సరిపోదు. సాహిత్యం, సినిమా, విద్య, సాంకేతికత, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుగు భాషను ఆధునికతతో మేళవించి యువతకు చేరువ చేయాలి. తెలంగాణ తల్లి రాష్ట్ర గౌరవానికి చిహ్నం కావొచ్చు, కానీ అది తెలుగు తల్లి స్థానాన్ని ఆక్రమించకూడదు. రెండు ప్రతీకలు సహజీవనం చేయాలి — ఒకటి రాష్ట్రానికి గుర్తు, మరొకటి భాషకు గుర్తు. ఈ స్పష్టత లేకుంటే మన సంస్కృతి దారి తప్పుతుంది.
భాషను కాపాడేది ప్రభుత్వాలు కాదు, ప్రజలు. తెలుగు పట్ల గౌరవం మనలో ప్రతి ఒక్కరిలో ఉండాలి. పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదు, కానీ తెలుగు మర్చిపోవడం తప్పు. తెలుగు పాఠ్యపుస్తకాలు, పత్రికలు, డిజిటల్ మీడియా, పాడ్‌కాస్ట్‌లు, సినిమాలు — ఇవన్నీ భాషా సంరక్షణకు సాధనాలుగా మారాలి. తెలంగాణ, ఆంధ్రా అనే పేర్ల కింద విభజించుకోవడం కంటే "మన తెలుగు" అనే భావనను బలపరచాలి. తెలుగు భాషలోని విభిన్న యాసలు, పదాలు, పాటలు అన్నీ కలిపి ఒక మహా ప్రవాహాన్ని సృష్టిస్తాయి. ఆ ప్రవాహాన్ని మళ్లీ రెండు భాగాలుగా విభజించాలనుకోవడం, సాహిత్యాన్ని రెండు నదులుగా చేయాలనుకోవడం లాంటిదే.
తెలుగు తల్లి, తెలంగాణ తల్లి అనే రెండు భావనలను విభేదాల గీతలతో కాకుండా, అనుబంధాల సేతలతో చూడాల్సిన సమయం ఇది. ఒకటి భాషకు ప్రాణం ఇస్తే, మరొకటి భూభాగానికి ఆత్మను ఇస్తుంది. ఇవి రెండు పరస్పర విరుద్ధాలు కావు; పరస్పరం పూర్తి చేసుకునేవి. తెలుగు భాష రెండు రాష్ట్రాల ఆత్మ. దాన్ని విడదీయడం చరిత్రను చీల్చడమే. పాలకులు, ప్రజలు, పండితులు – అందరూ కలసి ఈ భాషా వారసత్వాన్ని కొత్త తరాలకు అందించే కర్తవ్యాన్ని స్వీకరించాలి. భాష మనల్ని కలుపుతుంది – విభజించదు. తెలుగు తల్లి మన సాహిత్యానికి చిహ్నం, తెలంగాణ తల్లి మన సంస్కృతికి చిహ్నం. ఈ రెండు కలిస్తేనే మన తెలుగు సంపూర్ణ రూపం.
(వ్యాస రచయిత వ్యాపారవేత్త, ఫిన్ నౌ సంస్థకు ఓనర్)