08/07/2025
దాచినా దాగని ఎమర్జెన్సీ వాస్తవాలు
---
ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీకి యాభయ్యేళ్లు నిండాయి. అయిదు దశాబ్దాల అనంతరం కూడా ఈ అత్యవసర పరిస్థితి దారుణాలు ప్రజల మనసుల్లో నుంచి చెరగకపోవడమే కాదు, ఆ అగ్నిని రాజేస్తూనే ఉన్నాయి. ఎమర్జెన్సీకి సంబంధించి అనేక కొత్త విషయాలు, దాచినా దాగని వాస్తవాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎమర్జెన్సీతో ముడిపడిన అకృత్యాలు, అమానుషాలు, దారుణాలను పాత జ్ఞాపకాల కింద పక్కన పెట్టేసే అవకాశం లేదు.
ఎందుకంటే ఇది వ్యక్తిగత వ్యవహారం కాదు. ఇది ఒక దేశాన్ని, ఒక జాతిని, ఒక సంస్కృతిని తీవ్రంగా దెబ్బతీసిన పరిణామం. దీన్ని భారతదేశ చరిత్ర ఏనాటికీ మరచిపోయే అవకాశం లేదు. ఎమర్జెన్సీని ఎత్తేసిన తర్వాత గానీ, ప్రజల భావోద్వేగాలు బయటపడలేదు. ఎవరు హీరోలు, ఎవరు విలనన్నది అవగతం కాలేదు. ఎమర్జెన్సీ సమయంలో దేశమంతా కటకటాల పాలయినప్పటికీ, ఇందిరాగాంధీకి, ఎమర్జెన్సీకి సంబంధించిన వివరాలను, వికృతాలను ప్రపంచ ప్రజలకు కరపత్రాల పంపిణీ ద్వారా తెలియజేసి, ప్రపంచ దేశాల దృష్టిని ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఎప్పటికీ మరచిపోలేనివి. ఈ కరపత్రాల గురించి దేశ ప్రజలకు పూర్తి వివరాలు తెలియకపోవడంతో వీటి వెనుక ఉన్న పోరాట యోధుల గురించి తెలిసే అవకాశం లేకుండా పోయింది. ఈ ఎమర్జెన్సీ కాలంలో కరపత్రాలు పోషించిన పాత్ర అమోఘమైనది. వీటి ద్వారానే ఇందిరా గాంధీ నిరంకుశ విధానాలు, నెహ్రూ-గాంధీ కుటుంబ స్వార్థపూరిత ఆశలు, ఆకాంక్షలు దేశ ప్రజలకే కాక, ప్రపంచ ప్రజలకు కూడా తెలియడం జరిగింది. ఈ కరపత్రాల్లో కొన్ని సంతకాలతో ముద్రితం కాగా, మరికొన్ని అనామకంగా విడుదలయ్యాయి. అయితే, అవన్నీ సమకాలీన భారతదేశ చరిత్రకు అద్దం పట్టాయనడంలో సందేహం లేదు.
చరిత్ర సృష్టించిన కరపత్రం
ఇందులో ఎమర్జెన్సీకి సంబంధించి మొట్ట మొదటగా విడుదలయి, ఆ తర్వాతి కరపత్రాలకు మార్గదర్శకంగా, స్ఫూర్తిదాయకంగా నిలిచిన కరపత్రం ఆ సమయంలో అంతర్జాతీయంగానూ, ఎమర్జెన్సీ తర్వాత జాతీయంగానూ తీవ్రస్థాయి సంచలనం సృష్టించింది. అనేక కష్టనష్టాలను, ఆటంకాలను, అవరోధాలను ఎదుర్కొని ఎట్టకేలకు లండన్ చేరిన ఈ కరపత్రం కొద్ది రోజుల్లోనే ప్రపంచమంతా వ్యాపించిపోయింది. చివరికి అమెరికాలోని ఇండియన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థకు ఈ కరపత్రం చిక్కి, పునర్ముద్రితమై మారుమూల దేశాలకు సైతం చేరింది.
కరపత్రమంతా ఇందిరా గాంధీపై విమర్శలు, ఆరోపణలతో నిండిపోయింది. ఇందిరా గాంధీ మీద రెచ్చగొట్టే విధంగా, ఇందిర వారసత్వాన్ని ప్రశ్నార్థకం చేసే విధంగా ఈ కరపత్రం తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలను వెళ్లగక్కింది. ఈ కరపత్రాన్ని రాసిన తీరును బట్టి దీన్ని తయారు చేసినవారి సిద్ధాంతా లేమిటో తేలికగా అర్థమై పోతుంది. ఇందులో ఇందిరా గాంధీని అంతర్జాతీయ స్థాయి నియంతలతో పోల్చారు. హిట్లర్, ముస్సోలిని, స్టాలిన్ వంటి నియంతల ముందు ఇందిరా గాంధీ బలాదూర్ అని కూడా ఇందులో దృష్టాంతాలతో సహా పేర్కొనడం జరిగింది. ఇందిరా గాంధీ హయాంలో ప్రస్తుతం నాజీ జర్మనీ నాటి పరిస్థితులు నెలకొని ఉన్నాయని ఈ కరపత్రంలో ఉదాహరణలతో సహా వెల్లడించిన ప్పుడు ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అజ్ఞాతంలోనే ఉంటూ ఒక పోరాటాన్ని ఎలా జరపవచ్చన్నది ఇది తేటతెల్లం చేసింది.
కరపత్రంలోని ప్రతి పేరాలోనూ ఇందిరా గాంధీని ఒక నియంతగా, ఒక ఫాసిస్టుగా అభివర్ణించారు. సుమారు అయిదు వేల పదాలతో సాగిన ఈ కరపత్రంలో ఇందిరా గాంధీని ‘ఇందిరా నెహ్రూ గాంధీ’ అనే సంబోధించడం గమనించాల్సిన విశేషం. నియంతృత్వం, అధికార దాహం అనేవి ఆమె రక్తంలోనే ఉన్నట్టు ఈ కరపత్రం చెప్పకనే చెప్పింది. మొఘలుల కాలంలోనే కాదు, బ్రిటిష్ వారి కాలంలో కూడా ఇంతటి దమనకాండ, అణచివేతలు, ఊచకోతలు, నిరంకుశ ధోరణులు జరిగిన దాఖలాలు లేవని అది స్పష్టం చేసింది. మహాత్మా గాంధీ అమలుచేసిన అహింసా విధానం కాలంలో బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణవాదులు కూడా ఇంతగా అణచివేత చర్యలకు పాల్పడలేదని, ప్రజలు మౌనంగా ఉండి పోవడంతో ఇందిరా గాంధీ మరింతగా చెలరేగి పోతున్నారని ఆ కరపత్రం ప్రత్యేకంగా పేర్కొంది. ‘‘బ్రిటిష్ పాలకులకైనా అంతరాత్మ ఉందేమో కానీ కాంగ్రెస్ పార్టీకి, దాని పాలకులకు ఎక్కడా అంతరాత్మ, దయాదాక్షిణ్యాలు ఉన్న దాఖలాలు కనిపించలేదు. చరిత్ర పుటల్లో ఇందిరా గాంధీ ఒక నియంతగా నిలిచిపోవడం ఖాయం’’ అని ఆ కరపత్రం పేర్కొంది.
పాంప్లెట్ యోధుడు
ఇంతకూ ఆ కరపత్రాన్ని రూపొందించింది మరెవరో కాదు. సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు నాయకుడు జార్జ్ ఫెర్నాండెజ్. గోపాల్పురా నుంచి ఆయన 1975 జూన్ 26న ఆ చారిత్రాత్మక కరపత్రాన్ని, విదేశాలకు పంపించారు. గోపాల్పురాలో ఆయన తన భార్య లీలా కబీర్ కుటుంబ సభ్యులకు చెందిన ఒక బంగళాలో తలదాచుకున్నారు. దేశంలోని రాజకీయ నాయకులందరినీ ఇందిరా గాంధీ అరెస్టు చేయిస్తున్న సమయంలో ఆయన తప్పించుకుని గోపాల్పురా వెళ్లిపోయి, అజ్ఞాతంలో ఉండిపోయారు. అమెరికాలోని ఇండియన్స్ ఫర్ డెము క్రసీ అనే సంస్థ ఆ కరపత్రాన్ని 1975 జూలై 1 తిరిగి ముద్రించారు. అంటే, అది భారత దేశం నుంచి బయటపడి, లండన్ చేరుకుని, అక్కడి నుంచి అమెరికా వెళ్లడానికి వారం రోజులకు పైగా పట్టింది. ఈ కరపత్రానికి ఒక ఉపోద్ఘాతం కూడా ఉంది.
ప్రజాస్వామ్యం గురించి, నిరంకుశత్వం గురించి మహాత్మా గాంధీ, జయప్రకాశ్ నారాయణ్, రాం మనోహర్ లోహియా వంటి వారు చెప్పిన అక్షర సత్యాలను ఆ ఉపోద్ఘాతంలో పేర్కొన్నారు. ఇందిరా గాంధీ ఇటువంటి నిరంకుశ ధోరణులను ప్రదర్శించడంలో వింతేమీ లేదని, ఆమె 1966 నుంచి ఈ విధమైన ధోరణులను ప్రదర్శిస్తూనే ఉన్నారని అంటూ, ఆమె పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత నుంచి పార్టీని అవకాశవాదులు, ఫిరాయింపు దార్లు, కాలక్షేపరాయుళ్లు, భజనపరులు, సంఘ వ్యతిరేక శక్తులతో నింపేయడం ప్రారంభించారని ఆ కరపత్రం వివరంగా పేర్కొంది. ఎమర్జెన్సీని ఒక చీకటి యుగంగా, ఇందిరాగాంధీని ఒక దుష్ట శక్తిగా కూడా ఫెర్నాండెజ్ ఈ కరపత్రంలో అభివర్ణించారు. అసత్యాలు చెప్పడంలో, వాటిని ప్రచారం చేయడంలో ఆమె గ్లోబెల్‌ను మించి పోయారని, ఆమె సాగించిన దమనకాండ, ఊచకోతలను చూస్తే ఉగాండా నాయకుడు ఇడీ అమీన్ కూడా నిర్ఘాంతపోతాడని ఆయన పేర్కొన్నాడు.
ఇక 1971 నాటి ఎన్నికల సమయంలోనే ఆమెలోని నిరంకుశ ధోరణులు బయటపడ్డాయని, ఆమె ఒక మీసాలు లేని హిట్లర్‌గా వ్యవహరించారని, అనేక రాష్ట్రాల్లోకమ్యూనిస్టు, సోషలిస్టు నాయకులను అరెస్టు చేయించారని, కార్మిక సంఘాలను మూసే యించారని ఆయన పేర్కొన్నారు. అప్పటి రైల్వే మంత్రి ఎల్.ఎన్. మిశ్రాను హత్య చేయించడం, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కారు మీద బాంబులు విసరడం వంటి సంఘటనలను ఆయన ఉదహరిస్తూ, ప్రతిపక్షాలు గనుక అధికారంలోకి వచ్చే పక్షంలో తన బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, ఊచకోతలు, అవినీతి వ్యవహా రాలన్నీ వెలుగులోకి వస్తాయని, తనను జైలుపాలు చేయడం ఖాయమని భయపడి ఆమె దేశంలో ఎమర్జెన్సీని విధించి ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయించారని ఫెర్నాండెజ్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి మౌనంగా ఉన్న ప్రజలు ఆమెకు తగిన గుణపాఠం చెప్పే రోజు వస్తుందని, ప్రస్తుతం గుసగుసలుగా సాగుతున్న ఇందిర వ్యతిరేక ప్రచారం త్వరలో ప్రభంజనంగా మారడం ఖాయమని ఫెర్నాండెజ్ చివరిలో హెచ్చరించారు.
- జి.రాజశుక, సీనియర్ జర్నలిస్ట్
- జాగృతి సౌజన్యంతో ..