18/06/2025
రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్‌బుక్ రాజ్యాంగం
:శ్రీ వైయస్ జగన్ ధ్వజం
ఎన్నికల ఫలితాల నాటి నుంచే రెడ్‌బుక్ రాజ్యాంగం
దాని ఫలితంగానే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య
ఏడాది కాలంగా శోక సముద్రంలో కుటుంబం
దీనికి సీఎం చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు?
:సూటిగా ప్రశ్నించిన శ్రీ వైయస్ జగన్
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో గత ఏడాది ఎన్నికల ఫలితాల తర్వాత, దారుణ వేధింపునకు గురై ఆత్మహత్య చేసుకున్న ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన శ్రీ వైయస్ జగన్.
అలాగే గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత మీడియాతో మాట్లాడిన శ్రీ వైయస్ జగన్.
మా పార్టీలో మీ వర్గానికి చెందిన వారుండకూడదా?
వైయస్సార్సీపీలో కమ్మ కులస్తులు ఉండడం తప్పా?
ఏం పాపం చేశారని వారందరినీ వరసగా వేధిస్తున్నారు
వేధింపులకు గురవుతున్న వారందరి పేర్ల ప్రస్తావన
కమ్మ వాళ్లు పుట్టింది కేవలం మీకు ఊడిగం చేయడానికేనా?
:గట్టిగా నిలదీసిన శ్రీ వైయస్ జగన్
అన్ని రంగాల్లో విఫలమైన కూటమి ప్రభుత్వం
ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేనే లేదు
అందరినీ మోసం చేసి, వెన్నుపోటు పొడిచారు
ప్రజలు, దేవుడు తప్పక మొట్టికాయలు వేస్తారు
:శ్రీ వైయస్ జగన్ చురక
ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండబోదు. ఇది వాస్తవం
ఇప్పుడు తప్పు చేస్తున్న అధికారులకు చెబుతున్నా
ముఖ్యంగా కొందరు పోలీసు అధికారుల తీరు హేయం
మళ్లీ మా ప్రభుత్వం వస్తుంది. వారికి సినిమా చూపిస్తాం
తప్పు చేస్తున్న వారందరినీ బోనులో నిలబెడతాం
:రెంటపాళ్లలో మీడియా మీట్లో శ్రీ వైయస్ జగన్
రెంటపాళ్ల. పల్నాడు జిల్లా:
రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచే యథేచ్ఛగా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని, దాని ఫలితమే రెంటపాళ్లలో ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య అని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీలోని కమ్మ వర్గానికి చెందిన నాయకులను దారుణంగా వేధిస్తున్నారన్న శ్రీ వైయస్ జగన్, వారందరినీ ప్రస్తావించారు. అసలు ఏం పాపం చేశారని వారిని వేధిస్తున్నారని సీఎం చంద్రబాబును నిలదీశారు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండబోదని, ఇప్పుడు తప్పు చేస్తున్న అధికారులందరికీ తమ ప్రభుత్వం వచ్చాక సినిమా చూపిస్తామని పల్నాడు జిల్లా రెంటపాళ్లలో మీడియాతో మాట్లాడిన శ్రీ వైయస్ జగన్ తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్ ఏమన్నారంటే..:
అందుకు నిదర్శనం ఇవే:
ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం అన్నది పూర్తిగా పక్కకు పోయి, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న నిదర్శనం ఈరోజు నా పక్కనే ఉన్న వెంకటేశ్వర్లు (కొర్లకుంట వెంకటేశ్వరరావు) అన్న. ఈ అన్న కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్. ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు ఈ అన్న ఇక్కడ నిల్చొని ఉన్నాడు? ఎలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయనడానికి నిదర్శనం ఈరోజు ఈ కార్యక్రమం.
సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో వెంకటేశ్వర్లు అన్న మా పార్టీకి సంబంధించిన నాయకుడు. తన కొడుకు నాగమల్లేశ్వరరావు ఈ గ్రామానికి ఉప సర్పంచ్. పోలింగ్ రోజు నుంచే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో తెలుగుదేశం పార్టీ ఏ రకంగా ప్రవర్తించింది అన్నదానికి నిదర్శనం ఈరోజు ఈ గ్రామంలో కనిపిస్తుంది.
పోలింగ్‌కు ముందు వారికి అనుకూలమైన అధికారులందరికీ పోస్టింగులు ఇప్పించుకున్నారు. పోలింగ్ సమయంలో ఈ ప్రాంత ఐజీ, ఎస్పీ, సీఐలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని, కూటమిని గెలిపించడం కోసం ఎలాంటి అన్యాయాలు చేశారన్న సంగతి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కూడా తెలుసు.
అప్పుడు ఏం జరిగింది?:
ఆవాళ్టి నుంచి పరిస్థితి గమనిస్తే, 2024 జూన్ 4న, అంటే కౌంటింగ్ రోజునే అల్లర్లు చేస్తాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడంతో, నాగమల్లేశ్వరరావును పోలీసులు స్టేషన్‌కు తీసుకుని పోయారు. ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చిన మరుక్షణమే ఆయనను సెల్లో వేశారు. మరోవైపు ఎన్నికల ఫలితాలు టీడీపీకి అనుకూలంగా ఫలితాలు రావడం మొదలు కాగానే, ఈ గ్రామంలో నాగమల్లేశ్వరరావు ఇంటిపై తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు రాళ్లు విసిరారు.
అక్కడ పోలీస్ స్టేషన్లో నాగమల్లేశ్వరరావును బెదిరించిన సీఐ రాజేష్, ఆయన ఊళ్లోకి పోవద్దని, ఊరు విడిచిపెట్టాలని, లేకపోతే రౌడీషీట్ ఓపెన్ చేయడమే కాకుండా, కాల్చి చంపుతామని హెచ్చరించాడు. జూన్ 4న కౌంటింగ్ పూరై్తనా, మర్నాడు 5వ తేదీ రాత్రి వరకు నాగమల్లేశ్వరరావును స్టేషన్లోనే ఉంచి అవమానించి, బెదిరించారు. ఇంకా ఆయన మీద చెయ్యకూడని నేరాలన్నీ కూడా చేశారు.
నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య:
జూన్ 5వ తేదీ రాత్రి పోలీసులు విడిచిపెట్టిన తర్వాత గ్రామానికి వెళ్లని నాగమల్లేశ్వరరావు గుంటూరులోని తన సోదరుడి ఇంటికి చేరాడు. ఆ తర్వాత తన తండ్రి వెంకటేశ్వర్లుకు ఫోన్ చేసి, స్టేషన్లో పోలీసుల బెదిరింపు, అవమానించిన తీరుతో పాటు, ఏ రకంగా కొట్టి హింసించారనేది చెప్పి, విలపించి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. దీంతో హుటాహుటిన గుంటూరు వెళ్లిన వెంకటేశ్వర్లు, కొడుకును ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ జూన్ 9న నాగమల్లేశ్వరరావు చనిపోయాడు.
దీనికి బాధ్యులెవరు?:
నాగమల్లేశ్వరరావుకు భార్య, చిన్న పాప ఉంది. వారికి ఏం సమాధానం చెబుతారని చంద్రబాబును అడుగుతున్నా. మీ పార్టీకి అనుకూలంగా లేరన్న అన్న ఒకే ఒక్క కారణంతో కుల ప్రస్తావన తీసుకొచ్చి అవమానించి, బెదిరించి, తిట్టి, కొట్టి ఒక మనిషి చావుకు కారణం అయ్యారు. ఏడాది గడిచింది. ఈ మొత్తం కుటుంబం ఇవాళ్టికి కూడా శోకంలోనే ఉంది. మరి దీనికి బాధ్యులెవరు?
ఎవరెవరిపై చర్య తీసుకున్నారు?:
వీరి ఇంటిపై రాళ్లు విసిరి, దాడి చేసిన వారి మీద ఎంత మందిని అరెస్టు చేశారు? ఎంత మంది మీద కేసులు పెట్టారు? ఎంత మందికి శిక్ష విధించారు అని అడుగుతున్నా. కనీసం ఇంతగా వేధించి చంపిన ఆ సీఐ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారని చంద్రబాబును గట్టిగా ప్రశ్నిస్తూ.. నిలదీస్తున్నా.
ఇక్కడ యథేచ్ఛగా రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. చివరికి వెంకటేశ్వర్లు అన్న ప్రైవేటు కంప్లయింట్ ఇచ్చినా కూడా పట్టించుకునే పరిస్థితి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎక్కడా లేదు.
చావు బతుకుల్లో గుత్తా లక్ష్మీనారాయణ:
ఇదే సత్తెనపల్లి నియోజకవర్గంలోనే ఈ మధ్య కాలంలోనే రాజుపాలెం మండలం పెదనెమలిపురికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ అనే ఆయన హాస్పిటల్లో తన ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. రెండు నెలల క్రితం ఆయనపై తప్పుడు అభియోగాలు మోపి స్టేషన్‌కు పిల్చిన సీఐ, ఎస్ఐ ఇద్దరూ భయపెట్టే ప్రయత్నం చేశారు. అయితే వాటన్నింటికీ ఆయన గట్టిగా సమాధానం ఇవ్వడం, తమ అభియోగాలకు ఏ ఆధారం లేకపోవడంతో లక్ష్మీనారాయణను విడిచిపెట్టారు.
మళ్లీ రెండు నెలల తర్వాత డీఎస్పీ హనుమంతరావు మళ్లీ లక్మీనారాయణను స్టేషన్‌కు పిల్చి బెదిరించారు. ఆ డీఎస్పీ ఒక కల ఉన్మాది. నేను ఆ డీఎస్పీని అడుగుతున్నా.
‘అసలు మీరు పోలీసు బట్టలు వేసుకున్నారా? న్యాయం, ధర్మం కోసం నిలబడి ఉన్నారా? లేక న్యాయం, ధర్మాన్ని చంపేయడం కోసం ఉన్నారా?’.
గుత్తా లక్ష్మీనారాయణను స్టేషన్‌కు పిల్చిన డీఎస్పీ హనుమంతరావు తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. ‘కమ్మ కులంలో పుట్టి వైయస్సార్సీపీలో ఎలా ఉన్నావ్? ఎందుకు ఉన్నావ్?’ అంటూ కించపరుస్తూ మాట్లాడాడు. అంతే కాదు, తప్పుడు సాక్ష్యాలతో జైలుకు కూడా పంపుతానని బెదిరించి, లెంపకాయలు వేసి కొట్టి అవమానించాడు.
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన గుత్తా లక్ష్మీనారాయణ, పురుగుల మందు తాగి, ఆత్మహత్యకు ప్రయత్నిస్తూ.. అన్ని వివరాలు చెబుతూ వీడియో తీశారు. ఎలాంటి పరిస్థితుల మధ్య తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నాననేది పూర్తిగా వివరించారు. ఏ రకమైన కుల ఉన్మాదంతో పోలీసు శాఖలో కొందరు పని చేస్తున్నారు? వారిని చంద్రబాబు, లోకేష్ లాంటి వ్యక్తులు ఎలా నడిపిస్తున్నారు? అని సూసైడ్ అటెమ్ట్ వీడియోలో చెప్పిన లక్ష్మీనారాయణ, ఈరోజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి.
కమ్మ వారు మా పార్టీలో ఉండకూడదా?:
వెంకటేశ్వర్లు, ఆయన కొడుకు నాగమల్లేశ్వరరావు విషయమైతేనేమి. లేదా లక్ష్మీనారాయణ విషయం అయితే ఏమి.. నేను చంద్రబాబుగారిని సూటిగా ఒక విషయం అడుగుతున్నాను. ‘ఏమయ్యా చంద్రబాబూ.. కమ్మవారు మా పార్టీలో ఉంటే నీకు అభ్యంతరమా?. కమ్మ వారు పుట్టింది కేవలం చంద్రబాబుగారికి ఊడిగం చేయడానికేనా?’.
అసలు కమ్మ వారు కేవలం చంద్రబాబుగారికి ఊడిగం చేయడానికే పుట్టారంట!. చంద్రబాబు అన్యాయాలను ఎవరైనా వ్యతిరేకిస్తే, ఆయన్ను ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని వెంటాడి వెంటాడి, హింసించి జైల్లో పెట్టడం, దొంగ కేసులు బనాయించడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం.. చివరకు వారంతట వారు ప్రాణాలు తీసుకునేలా అవమానించడం. ఇది కేవలం చంద్రబాబుగారికి మాత్రమే చెల్లు.
ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును చంపారు? ఏం పాపం చేశాడని తనను పొట్టన పెట్టుకున్నారని చంద్రబాబును అడుగుతున్నా. ఏం పాపం చేశాడని ఆత్మహత్య ప్రయత్నం చేసుకునేలా లక్ష్మీనారాయణను ప్రేరేపించారు?
అసలు వారంతా ఏం పాపం చేశారు?:
ఏం పాపం చేశారని ఇదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, మా పార్టీ నాయకుడు వల్లభనేని వంశీని ఇన్ని రోజులపాటు జైల్లో పెట్టారు? ఒక కేసులో బెయిల్ వస్తే.. బెయిల్ వచ్చే వరకు గమ్మున ఉంటారు. బెయిల్ రాగానే, వెంటనే ఇంకో కేసు పెడతారు. అలా మళ్లీ జైల్లోనే పెట్టే కార్యక్రమం చేస్తారు. ఇవాల్టికి దాదాపు రెండు నెలలు దాటి పోయింది.. వంశీ ఇంకా చంద్రబాబుగారి శాడిజానికి బలవుతూ జైలులోనే మగ్గుతున్నాడు. ఆయన ఏం పాపం చేశాడని అడుగుతున్నాను. ఒకదాని తర్వాత మరొకటి వరసగా తప్పుడు కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు.
ఏం పాపం చేశారని కొడాలి నానిని. మా పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి కూడా. ఏం పాపం చేశాడని తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు?. ఇంకా ఏం పాపం చేశారని దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై కేసులు మీద కేసులు పెడతున్నారు. ఇప్పటికే 9 కేసులు పెట్టారు. అలా ఆయన్ను ఎందుకు హింసిస్తున్నారు?.
ఏం పాపం చేశారని దేవినేని అవినాష్‌ను వేధిస్తున్నారు? కేవలం కమ్మ సామాజికవర్గంలో పుట్టాడనా? అవినాష్, చంద్రబాబును వ్యతిరేకిస్తున్నాడు. చంద్రబాబుకు ఊడిగం చేయడం ఇష్టం లేదన్నాడు. ఆ ఒకే ఒక్క కారణంతో అవినాష్‌పై కూడా కేసులు మీద కేసులు పెట్టి రోజూ హింసించే కార్యక్రమం చేస్తున్నారు. రోజూ కోర్టులకు పోయి బెయిల్ తెచ్చుకుని చంద్రబాబుతో యుద్ధం చేస్తున్నారు.
ఏం పాపం చేశారని మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తలశిల రఘురాంపై మూడు కేసులు పెట్టారు? రఘురాం నాతో 15 ఏళ్లుగా ప్రయాణం చేస్తున్నారు. ఆయన్ను కూడా చిత్రహింసలకు గురి చేస్తున్నారు.
ఏం పాపం చేశాడని ఇదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మా పార్టీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను రాష్ట్రంలో వ్యాపారాలు చేసే పరిస్థితి లేకుండా, వెళ్లగొట్టే కార్యక్రమం చేశారు. తనను కూడా బెదిరించి, తప్పడు సాక్ష్యాలతో, తప్పుడు కేసులు బనాయించి ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు?. ఇంకా ఏం పాపం చేశారని మా పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావుపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు?.
ఏం పాపం చేశారని మా పార్టీకి చెందిన వినుకొండ, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావుల మీద అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మీద అక్రమ కేసులు పెట్టారు. ఆయన కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీయిబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోగా కాలేజీలో తనిఖీల పేరుతో చిత్రహింసలకు గురి చేస్తున్నారు.
మా పార్టీ సానుభూతిపరుడైనందుకు ఇదే కమ్మ సామాజికవర్గానికి చెందిన సినీ నటుడు, దర్శకుడు, డైలాగు రైటర్ పోసాని కృష్ణమురళిని నెల రోజుల పాటు జైళ్లలో నిర్బంధించి వేధించారు. అక్రమంగా 9 కేసులు బనాయించి శ్రీకాకుళం నుంచి కడప దాకా పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఇబ్బంది పెట్టారు. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ ఏం పాపం చేశాడని ఆయనకు వైజాగ్‌లో స్టూడియో నిర్మాణం కోసం ఇచ్చిన భూములు రద్దు చేశారు.
మంగళగిరికి చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో చంద్రబాబుకి వ్యతిరేకంగా, జగన్‌కి అనుకూలంగా పోస్టులు పెట్టినందుకు ఆయనతో పాటు, ఆయన భార్య పాలేటి కృష్ణవేణి మీద ఏకంగా 11 కేసులు పెట్టి నెలరోజులపాటు జైళ్లలో పెట్టి ఇబ్బంది పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజ్‌కుమార్‌ను దారుణంగా కొట్టి చొక్కా విప్పించి లోకేష్ ఫొటో ముందు మోకాళ్లపై కూర్చోబెట్టి, దండం పెట్టించి ప్రాధేయపడేలా చేశారు. ఏం పాపం చేశాడని మరో సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్ మీద 19 తప్పుడు కేసులు పెట్టి నెలల తరబడి స్టేషన్ల చుట్టూ తిప్పారు.
మీ తీరు రాక్షసుల ప్రవర్తన కన్నా హీనం కాదా?:
చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నా. ‘ఏమయ్యా చంద్రబాబూ, కమ్మ వారంతా నీకు ఊడిగం చేయడానికే పుట్టారా? నువ్వు, నీకు తోడు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5. ఒక దొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకోవడం. దోచుకున్నది పంచుకోవడం. ఇదీ, మీరంతా చేస్తున్న పని. మీరు దోచుకోవడానికి చంద్రబాబు సీఎంగా ఉండటం అవసరం’.
మీరంతా గజదొంగల ముఠాగా ఏర్పడి దోచుకుంటుంటే మీ అన్యాయాలను ఏ ఒక్క కమ్మవాడైనా ప్రశ్నిస్తే చాలు.. వారి మీద తప్పుడు కేసులు పెట్టి వేధించడానికి ఏ మాత్రం వెనుకాడని నీ నైజం చూస్తుంటే అసలు నువ్వు మనిషివేనా అని అనిపిస్తోంది.
చంద్రబాబుని ప్రశ్నిస్తే కమ్మ కులంలో తప్పు పుట్టినట్టుగా వారి మీద కక్ష కట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ ఆయన్ని వెనకేసుకొస్తున్న ఈటీవీ, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఈనాడు, తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా మొత్తం కలిసి చంద్రబాబుని వ్యతిరేకించిన వారి మీద బురద జల్లుతూ అప్రతిష్టపాలు చేస్తున్న తీరు రాక్షసుల ప్రవర్తన కన్నా హీనం కాదా? అని ప్రశ్నిస్తున్నా.
ఆ అ«ధికారులకు ఇదే నా మాట:
ఈరోజు చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న పోలీస్ శాఖలో ఉన్న కొందరు.. అందరూ కాదు.. కొందరికి మాత్రమే ప్రత్యేకంగా చెబుతున్నా. చూస్తూ చూస్తూ ఇప్పటికే ఒక ఏడాది గడిచిపోయింది. మరో మూడు నాలుగేళ్లలో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరికీ సినిమా చూపిస్తాం.
ఎందుకంటే నాగమల్లేశ్వరరావు కుటుంబానికి చేసిన అన్యాయమే రెడ్‌బుక్ కారణంగా ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది. ప్రతి గ్రామంలో కనిపిస్తున్న అన్యాయాలను చూసి, ప్రతి అధికారికీ ఒకటే చెబుతున్నా. ఈ అన్యాయాల్లో మీరు భాగస్వాములు కావొద్దు. మీరు వాటిలో భాగస్వాములైతే చంద్రబాబుతో పాటు, మిమ్మల్ని కూడా కచ్చితంగా బోను ఎక్కించే కార్యక్రమం చేస్తానని హెచ్చరిస్తున్నా.
ఆరోజు తొందర్లోనే వస్తుంది:
సీఐ రాజేష్ మీద నాగమల్లేశ్వరావు తండ్రి వెంకటేశ్వర్లు ప్రైవేటు కేసు వేస్తే, కోర్టు ఆదేశించినా పోలీసులు కేసు కట్టలేదు. ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ రెడ్‌బుక్ రాజ్యాంగంతో పాలన చేస్తే ఈ ప్రభుత్వం నిలబడుతుందా అని ప్రశ్నిస్తున్నా.
చంద్రబాబు పాలనలో రైతులు, చదువుకుంటున్న పిల్లలు, అక్కచెల్లెమ్మలు.. ఇలా ఎవ్వరూ సంతోషంగా లేరు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలు, వెన్నుపోట్లకు అన్ని వర్గాలు బలైపోయాయి. రెడ్‌బుక్ రాజ్యాంగం, విచ్చలవిడి అవినీతితో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నాశనం అయ్యాయి. అందుకే ఈ పరిపాలన ఎక్కువ రోజులు నడవదు. దేవుడు, ప్రజలు గట్టిగా మొట్టికాయలు వేసే రోజు తొందర్లోనే వస్తుంది అని శ్రీ వైయస్ జగన్ స్పష్టం చేశారు.