25/04/2025
ప్రతియేటా "నమస్తే తెలంగాణ-ముల్కనూరు ప్రజాగ్రంథాలయం" ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న "కథల పోటీ"లో బహుమతి సాధించి, 13-04-2025న "నమస్తే తెలంగాణ" ఆదివారం అనుబంధం "బతుకమ్మ"లో ప్రచురింపబడిన ప్రముఖ రచయిత, ప్రచురణ కర్త "శ్రీ యస్వీకృష్ణ"గారి "అంతర్నేత్రం" కథపై ప్రముఖ రచయిత డా: ఎం. కోటేస్వరరావుగారి సమీక్ష.
కథ చదివేందుకు లింక్...
https://epaper.ntnews.com/Home/FullPage?eid=4&edate=13/04/2025&pgid=685877
నమస్తే తెలంగాణ- ములకనూరు సాహితీపీఠం 2023-2024 కథలపోటీలో
బహుమతి పొందిన “అంతర్నేత్రం” కథపై సమీక్ష
*
“అంతర్నేత్రం”తో చూస్తే తప్ప ఈ కథలోని విషయం బోధపడదనే సంగతిని ప్రఖ్యాత రచయిత శ్రీ యస్వీకృష్ణగారు “అంతర్నేత్రం” అనే శీర్షిక ద్వారా నర్మగర్భంగా సూచించారు.. వారి ముందుచూపుకి అభినందనలు.
కథలు ఎలా రాయాలో నేర్పించే కథా కార్యశాలలో నమూనా అధ్యయనానికి అన్ని అర్హతలు కలిగిన కథ ఇది. రచయిత నేర్పరితనం ప్రతి పేరాలో ప్రస్ఫుటంగా గోచరించిన గొప్ప రచన.
“అంతర్నేత్రం” ఇద్దరు విధివంచితుల దయనీయమైన కథ. అద్వితీయమైన ప్రేమకథ. కనీసం పాత్రల పేర్లు కూడా చెప్పకుండా కథ నడపటం యస్వీకృష్ణగారికే చెల్లింది. ఎందుకంటే కథ చదువుతున్నంతసేపు మనకి కళ్ళముందు పాత్రలు కనిపిస్తాయి తప్ప వాటి పేర్లు గుర్తురావు. అది పాత్రల గొప్పతనం. రచయిత నేర్పరితనం.
మనోవికారాన్ని ఏమాత్రం పట్టించుకోని మనుషులు, శారీరక వికారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలిపిన సన్నివేషాలు, ఆయా సందర్భాలలో ఆ విధివంచితుల మనోభావాలను చాలా బాగా ఆవిష్కరించారు రచయిత యస్వీకృష్ణగారు.
మనిషి తనలోని అవకరాన్ని చూసి నిరాశ పడకుండా, ఆ అవకరం పరోక్షంగా కల్పించే సౌకర్యాలను వెతకటం, గుర్తించటం వారి మానసిక పరిపక్వత. వారికి వారు చేసుకునే దిశానిర్దేశం. కల్పించుకునే ఆత్మవిశ్వాసం. అదే "అంతర్నేత్రం"లోని ఒక ప్రధాన అంశం.
"లోకుల దృష్టిలో మీరు అంధులేమో కానీ, లోకంపట్ల మాత్రం మీరు అంధులు కాదు."
"అతడి కళ్ళు శూన్యంలోకి చూస్తున్నా, అతడు చూడలేకున్నా, అతడి మనోనేత్రాలు మాత్రం నన్నే చూస్తున్నట్లు అనిపించటం" ...ఇవన్నీ రచయితలోని పరిపుష్టిని చూపించే, గిలిగింతలు కలిగించే పదప్రయోగాలు.
"గుండెలోని దిగులు పొర, కళ్ళల్లో తేమతెరగా మారింది..."
"అందుకే “మౌనిక”నయ్యాను..."లాంటి ప్రయోగాలు ఆకట్టుకున్నాయి.
"పసిపిల్లల్లో తప్ప, మనుషులలో ఎవరైనా మనస్ఫూర్తిగా నవ్వగలుగుతున్నారా?" అనే నేటి వాస్తవాన్ని గుర్తుచేస్తూనే, చేసినదానికి పశ్చాత్తాపం చెందే గుణాన్ని కోల్పోతున్న వైనాన్ని కూడా రచయిత ఎద్దేవా చేశారు.
"ఈ ఒంటరితనాన్నే ఒకవిధంగా “ఏకాంతం”గా భావించే మనోస్థితిని అలవాటు చేసుకున్నాను..."
"నా మనసునే మాటల్లోకి అనువదించి ఉంటాడా? అనిపించింది..." అనే మాటలు చెయ్యి తిరిగిన రచయితలే రాయగలరు.
ఇద్దరు మానసిక పరిపక్వత కలిగిన వ్యక్తుల మధ్య ప్రేమసంభాషణ ఎలా జరుగుతుందో, ఎంత గుంభనంగా, ఎంత గడుసుగా ఉంటుందో చక్కగా చూపించిన కథ... “అంతర్నేత్రం.”
మనుషులలోని సందర్భోచితమైన, సహజమైన హావభావాలు, మానసిక స్పందన, ఆ ఆశ, ఆ ఆరాటం, ఆ ఉత్సుకతను ప్రతిబింబిస్తూ... చివరికి “గుంటూరు... గుంటూరు స్టేషన్ వచ్చేసింది” అనే మాటతో, ఆ సన్నివేశానికి "చెక్" పెట్టిన చతురతకి రచయితను ప్రశంసించకుండా ఉండలేం.
అంధుడి పాత్ర గురించి ప్రస్తావిస్తూ...
-అతడి కళ్ళల్లో “వెలుగు” కనిపించింది- లాంటి పదం వాడటం అద్భుతంగా ఉంది.
“కనిపించానా?”
“అవును, కనిపించారు... నాలోని అంతర్నేత్రానికి, నా మనసుకి, నా మనోదృష్టికి, మీ మాటల్లో చెప్పాలంటే నా మేధోదృష్టికి కనిపించారు, కనిపిస్తున్నారు. నేను మిమ్మల్ని చూడగలుగుతున్నాను” ...ఎంత హృద్యమైన మాటలు!
"తన హృదయంతో నా హృదయాన్ని ఆప్యాయంగా హత్తుకున్న నిశ్చింత కూడా ద్వనించింది" ...ప్రేమకు ప్రేమ, ప్రేమలోని భద్రత, నమ్మకాన్ని మేళవించి రాసిన మాటలు కదా ఇవి!
“చిత్రం... నా చేయి అందుకోటానికి అతడు తడుముకోలేదు" ...ఇక్కడ కూడా బయటకు కనిపించే అర్థంతో పాటు, అంతర్నేత్రానికి కనిపించే మరో భావాన్ని కూడా పొందుపరిచిన రచయిత చమత్కారాన్ని గమనించకుండా ఉండగలమా?
“చిత్రం... నా చేయి అందుకోటానికి అతడు తడుముకోలేదు." నిజానికి కథ ఇక్కడితో ముగించవచ్చు. శుభంకార్డు పడ్డట్టే. కానీ ఇంకో పేరా జతచేశారు. మానసిక పరిపక్వత కలిగిన మనుషుల, మనసుల పరిణయాలు ఎంత ఫలవంతం అవుతాయో చెప్పేటందుకే ఆ పొడిగింపు అనిపించింది.
ఇది కూడా రైలు నేపథ్యంలో నడిచిన కథ కావటం... వ్యక్తిగతంగా నాకు అదనపు ఆనందాన్ని కలిగించింది.
అత్యంత సహజంగా, ముక్కుసూటిగా కనిపించే, రాసే రచయిత శ్రీ యస్వీకృష్ణగారు. చాలా సరళమైన పదాలలోనే లోతైన భావాలను నిక్షిప్తం చేయగలిగే రచయిత వీరు. నేను వీరి కథలు కొన్ని చదివాను. ఎంతో పరిశోధన చేసి, ప్రత్యక్ష అనుభవంతో రాసినంత సహజంగా రాయటం వీరి ప్రత్యేకత.
ఒక మంచికథను అందించిన రచయిత శ్రీ యస్వీకృష్ణగారికి అభినందనలు.
ఒక మంచికథను ఎంపిక చేసిన న్యాయనిర్ణేతలకు, నమస్తే తెలంగాణ వారికి, ముల్కనూరు సాహితీపీఠం వారికి ధన్యవాదాలు.
--డా. ఎం. కోటేశ్వరరావు (కరీంనగర్)