
17/04/2025
రాజ్యాంగేతర శక్తులుగా గ్రామాభివృద్ధి కమిటీలు
* రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ తొలిచైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్
*25న గీత కార్మికులకు మద్దతుగా వేలాది మందితో ‘చలో తాళ్ల రాంపూర్’ కు వివిధ సంఘాల పిలుపు
***
నిజామాజిల్లాలోని పలు గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీ(వీడీసీ) ల పేరిట రాజ్యాంగేతరశక్తులుగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నాయని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, బలహీన వర్గాలను సాంఘిక బహిష్కరణలకు గురి చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన సర్పంచులు ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ లాంటి ఉన్నత అధికారులు వీడీసీల అరాచకాల పట్ల ఉదాసీనంగా ఉంటున్నారని అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ట మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గత ఆరు నెలలుగా కల్లుగీత కార్మికులను సాంఘిక బహిష్కరణకు గురిచేసిన వీడీసీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,
గౌడ మహిళలను శ్రీరామనవమి సందర్భంగా గుడి నుండి గెంటివేసి, గీత కార్మికులకు ఉపాధి కల్పించే ఈత చెట్లను కాల్చివేసిన దుర్మార్గులను తక్షణమే అరెస్టు చేయాలని, VDC లను నిషేధించాలని ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో *చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ యం.వి. రమణ అధ్యక్షతన వివిధ సామాజిక, గౌడ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేళశానికి కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరు కాగా గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పి .ఆశయ్య, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ,
గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి వెంకట నరసయ్య , క్షౌర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లేశం, KVPS రాష్ట్ర ఉపాధ్యక్షులు దశరథ్, గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయిలి వెంకన్న గౌడ్, గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు యెలికట్టే విజయకుమార్ గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్, సర్వాయి పాపన్న మోకు దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు జెక్కే వీరస్వామి గౌడ్, జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బూర మల్సూరు గౌడ్, జై గౌడ సేన రాష్ట్ర అధ్యక్షులు మోర్ల ఏడుకొండలు గౌడ్, రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నరేష్ , హైదరాబాద్ కార్యదర్శి మిర్యాల గోపాల్, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కొప్పు పద్మ, తదితరులు పాల్గొని ప్రసంగించారు. కల్లు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారిపై వీడీసీలు తమ ఆధిపత్యాన్ని అంగీకరించి అణిగిమనిగి ఉండాలని హుకుం జారీ చేస్తున్నారని అన్నారు. తాము చెప్పినట్టు వినని వారిపై సాంఘిక బహిష్కరణకు గురి చేస్తున్నారని అన్నారు. ఆరు నెలల క్రితం ఈ సాంఘిక బహిష్కరణ జరిగి గీత కార్మికులు నానా ఇబ్బందులు పడుతుంటే జిల్లా ఎస్పీ కలెక్టర్ ఆ జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు? ఏప్రిల్ 6 న శ్రీరామనవమి సందర్భంగా పూజ కోసం గౌడ మహిళలు గుడికి వెళితే అవమానించి గుడి నుంచి గెంటి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దృష్టికి తమ గోడు వినిపించుకుందామని వారు వెళితే సుమారు 150 ఈత చెట్లను తగలబెట్టారని వాటి ద్వారా ఉపాధి పొందుతున్న వారి పొట్టలు కొట్టారని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల అరాచకాల్ని ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు చెక్ పెట్టాలని వీడీసీలను నిషేధించాలని డిమాండ్ చేశారు.. జిల్లా కలెక్టర్ ఉన్నత అధికారులు తక్షణమే ఆ గ్రామాన్ని సందర్శించి సాంఘిక బహిష్కరణ ఎత్తివేసి వీడీసీలను సమూలంగా నిషేధించాలని గ్రామాలలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని సంఘాలు డిమాండ్ చేశాయి. అందుకు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారు,బీసీ కమిషన్ చొరవ చూపాలన్నారు.
తాళ్ల రాంపూర్ గీత కార్మికులపై సాంఘిక బహిష్కరణ ఎత్తివేయాలని,
గౌడ మహిళలను గుడి నుండి గెంటివేసి, ఈత చెట్లను తగలబెట్టిన వీడీసీ సభ్యులను కఠినంగా శిక్షించాలని, నిజామాబాద్ జిల్లాలో చట్ట విరుద్ధంగా ఏర్పాటైన VDC లను తక్షణమే నిషేధించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో గౌడ , సామాజిక సంఘాలు ప్రభుత్వాన్ని ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి.
ఈనెల 25 న వేలాది మందితో చలో తాళ్ల రాంపూర్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు తీర్మానం ప్రవేశపెట్టారు.