19/05/2026
మళ్లీ లాక్‌డౌన్ వస్తే సామాన్యుడి బతుకు శూన్యమేనా? ప్రపంచం మరోమారు పెను సంక్షోభాల సుడిగుండంలో చిక్కుకోబోతుందా? ఒకవైపు ప్రాణాంతక ఎబోలా, హంటా వైరస్‌లు సరికొత్త రూపంలో విరుచుకుపడుతూ మానవాళి మనుగడను ప్రశ్నిస్తుంటే.. మరోవైపు పశ్చిమాసియా లో ముదురుతున్న యుద్ధ జ్వాలలు అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను భగ్గుమనిపిస్తున్నాయి. వైరస్ భయాలు, ఇంధన కొరత నేపథ్యంలో ప్రపంచ దేశాలు మళ్లీ 'లాక్‌డౌన్' బాట పట్టక తప్పదా? అసలు ఈ సంక్షోభాల వెనుక ఉన్న అంతర్జాతీయ వ్యూహాలు ఏమిటి? ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న సంచలన హెచ్చరికల సారాంశం ఏమిటి? ఒకవేళ లాక్‌డౌన్ విధిస్తే సామాన్యుడి పరిస్థితి ఎంత ఘోరంగా ఉండబోతోంది?
ఎబోలా కొత్త స్ట్రెయిన్ – కాంగోలో మరణ మృదంగం:
ఆఫ్రికా ఖండంలో ఎబోలా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రధాన కేంద్రంగా విరుచుకుపడుతున్న ఈ తాజా ఎబోలా ఉధృతి వల్ల ఇప్పటికే వందకు పైగా మరణాలు సంభవించగా, వందలాది మంది అనుమానిత లక్షణాలతో ఆస్పత్రి పాలయ్యారు. కాంగో సరిహద్దులు దాటి ఈ మహమ్మారి ప్రస్తుతం ఉగాండా దేశానికి కూడా పాకింది.దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ ముప్పును 'అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి'గా అధికారికంగా ప్రకటించింది. ఈసారి విస్తరిస్తున్న వేరియంట్ 'బుందిబుగ్యో'అనే కొత్త స్ట్రెయిన్ కావడం వైద్య రంగాన్ని వణికిస్తోంది. దీనికి మార్కెట్‌లో ఇప్పటివరకు ఎలాంటి ఆమోదించిన అధికారిక వ్యాక్సిన్లు గానీ, నిర్దిష్టమైన మందులు గానీ అందుబాటులో లేవని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాలని,కఠినమైన ఐసోలేషన్ నిబంధనలు అమలు చేయాలని వైరస్ ప్రభావిత దేశాలను హెచ్చరించింది.
హంటా వైరస్ కలకలం – శ్వాసకోశ వ్యవస్థకు ముప్పు:
మరోవైపు, హంటా వైరస్ ఇటీవల కాలంలో చైనా , అమెరికా, దక్షిణ అమెరికా (అర్జెంటీనా, చిలీ అటవీ ప్రాంతాలు) లలో మళ్లీ వెలుగుచూసింది. అర్జెంటీనాలో బయటపడిన 'ఆండీస్ హంటావైరస్' చాలా అరుదుగా "మనుషుల నుంచి మనుషులకు"కూడా వ్యాపించే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
లగ్జరీ క్రూయిజ్ షిప్‌లో హంటా వైరస్ కల్లోలం-ముగ్గురు ప్రయాణికులు మృతి!:
'ఎమ్.వి. హోండియస్' అనే డచ్ లగ్జరీ క్రూయిజ్ షిప్ 147 మంది ప్రయాణికులు, సిబ్బందితో అర్జెంటీనా నుండి అంటార్కిటికా వైపు ప్రయాణిస్తున్న సమయంలో ఈ భయంకరమైన సంఘటన వెలుగుచూసింది. నౌక ఎక్కడానికి ముందు అర్జెంటీనా, చిలీ దేశాలలోని గ్రామీణ ప్రాంతాలలో పర్యటించిన ఒక ప్రయాణికుడికి అక్కడి ఎలుకల మలమూత్రాల ద్వారా మొదట హంటా వైరస్ సోకింది. అతను తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో నౌకలోనే మరణించడంతో ఈ వైరస్ ఉనికి బయటపడింది.సాధారణ హంటా వైరస్‌లు మనుషుల నుండి మనుషులకు వ్యాపించవు. కానీ ఈ నౌకలో ప్రబలింది అత్యంత ప్రమాదకరమైన 'ఆండీస్ స్ట్రెయిన్'కావడం గమనార్హం. ఇది మనుషుల నుండి మనుషులకు వ్యాపించే స్వభావం కలది కావడంతో పాటు, క్రూయిజ్ షిప్‌లోని సెంట్రల్ ఏసీ వ్యవస్థ, ఇరుకైన క్లోజ్డ్ క్యాబిన్లు,ఉమ్మడి భోజన శాలల కారణంగా ఈ వైరస్ కణాలు గాలి ద్వారా నౌకలోని ఇతర ప్రయాణికులకు కూడా అత్యంత వేగంగా విస్తరించాయి.ఈ వైరస్ బారిన పడి నౌకలో ముగ్గురు ప్రయాణికులు మరణించడంతో అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు తక్షణమే రంగంలోకి దిగాయి. ఆఫ్రికా సమీపంలో నౌకను నిలిపివేసి, రోగులను అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు.తర్వాత మిగిలిన ప్రయాణికులందరినీ స్పెయిన్ సమీపంలోని కానరీ ఐలాండ్స్‌లో దించేసి క్వారంటైన్ చేశారు. ప్రస్తుతం వివిధ దేశాలకు చెందిన ఈ పౌరుల ఆరోగ్య పరిస్థితులను వైద్య నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.హంటా వైరస్ మరణాల రేటు దాదాపు 38% వరకు ఉందని, ఇది సోకిన రోగులలో 'హంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్' (హెచ్పీఎస్ ) వల్ల ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతింటాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఎలుకలు, రోడెంట్ల వ్యర్థాలు ఉన్న పాత ఇళ్లు, గిడ్డంగులను శుభ్రం చేసేటప్పుడు ప్రజలు మాస్కులు, గ్లోవ్స్ తప్పనిసరిగా ధరించాలని, గాలి ద్వారా ఇది ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచించింది.
చమురు సంక్షోభం- దేశాలను పట్టిపీడిస్తున్న ఇంధన సెగ:
ఇరాన్ - ఇజ్రాయిల్ - అమెరికా ముక్కోణపు యుద్ధం,ప్రపంచంలోనే అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి' దిగ్బంధన హెచ్చరికల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఒపెక్ దేశాలు వ్యూహాత్మకంగా ఉత్పత్తిని తగ్గించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. భారత్ తన అవసరాలకు 85% పైగా చమురును దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయ ధరల సెగతో దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరులలో లీటర్ పెట్రోల్ ధరలు మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డులను తాకుతున్నాయి. ఇది దేశంలో రవాణా ఛార్జీలను పెంచి, ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది.చమురు నిల్వలు ఉన్నప్పటికీ అమెరికాలో గ్యాసోలిన్ (పెట్రోల్) ధరలు గ్యాలన్‌కు రికార్డు స్థాయికి పెరిగాయి. ముఖ్యంగా కాలిఫోర్నియా, న్యూయార్క్ వంటి నగరాల్లో ఇంధన ధరల పెరుగుదల వల్ల నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగి సామాన్య అమెరికన్లు బెంబేలెత్తుతున్నారు.రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం వల్ల ఇప్పటికే ఇబ్బంది పడుతున్న యూరప్ దేశాలకు ఈ పశ్చిమాసియా యుద్ధం కోలుకోలేని దెబ్బ కొట్టింది. బ్రిటన్, జర్మనీలలో పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో.. ఇంధనాన్ని ఆదా చేసేందుకు రాత్రి వేళల్లో విద్యుత్ కోతలు విధించడం, వారానికి రెండు రోజులు 'వర్క్ ఫ్రమ్ హోమ్' ను విధిగా అమలు చేయడం లాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుండటం గమనార్హం. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఈ పొరుగు పాకిస్తాన్ , శ్రీలంక దేశాలలో పెట్రోల్ ధరలు లీటరుకు ఊహించని స్థాయికి చేరాయి. చమురు దిగుమతులకు విదేశీ మారక నిల్వలు లేక ఇంధన బంకుల వద్ద సైన్యాన్ని మోహరించాల్సిన దుస్థితి ఏర్పడింది.
మళ్లీ లాక్‌డౌన్ పడితే ప్రజల జీవితాలు ఏమౌతాయి?
వైరస్‌ల తీవ్రత,చమురు కొరత కారణంగా ప్రపంచం మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ వైపు వెళ్తే, అది సామాన్యుడి జీవితాన్ని పూర్తిగా అతలాకుతలం చేస్తుంది. దినసరి కూలీలు, ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులు, రవాణా రంగ కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతారు.ఒకవైపు చమురు సంక్షోభం వల్ల రవాణా ఖర్చులు పెరగడం, మరోవైపు లాక్‌డౌన్ వల్ల సరుకుల రవాణా నిలిచిపోవడం వల్ల పాలు, కూరగాయలు, మందులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరుగుతాయి. మార్కెట్లలో కొరత ఏర్పడి, చేతిలో డబ్బు ఉన్నా వస్తువులు దొరకని 'హైపర్ ఇన్‌ఫ్లేషన్' పరిస్థితులు తలెత్తుతాయి.గత కొవిడ్ లాక్‌డౌన్ కాలం నాటి ఒంటరితనం, కుటుంబ ఆర్థిక భారాలు, భవిష్యత్తుపై నెలకొనే అభద్రతాభావం ప్రజల్లో మానసిక ఒత్తిడిని విపరీతంగా పెంచే ప్రమాదం ఉంది.
అసలు ప్రస్తుతం లాక్‌డౌన్ పడే పరిస్థితులు ఉన్నాయా?
అంతర్జాతీయ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా "సంపూర్ణ గ్లోబల్ లాక్‌డౌన్" పడే అవకాశాలు చాలా తక్కువ. ఎబోలా ,హంటా వైరస్‌లు రెండూ కొవిడ్-19 లాగా గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరికి అత్యంత వేగంగా, విస్తృతంగా వ్యాపించే స్వభావం ఉన్నవి కావు. ఎబోలా శారీరక ద్రవాల ద్వారా, హంటా ఎలుకల వ్యర్థాల ద్వారా మాత్రమే వ్యాపిస్తాయి. కాబట్టి వీటిని క్షేత్రస్థాయి క్వారంటైన్, కఠినమైన స్క్రీనింగ్ ద్వారా నియంత్రించవచ్చు.గత కొవిడ్ లాక్‌డౌన్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అమెరికా వంటి అగ్రదేశాలే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతుందని అన్ని దేశాలకూ స్పష్టమైన అవగాహన ఉంది.
'హైబ్రిడ్' వ్యూహాలే ఏకైక మార్గం:
అందుకే దేశాలు సంపూర్ణ లాక్‌డౌన్ వైపు వెళ్లకుండా.. ఇంధనాన్ని ఆదా చేయడానికి,వైరస్ ముందస్తు జాగ్రత్తగా పాశ్చాత్య దేశాలలో వారానికి రెండు రోజులు 'వర్క్ ఫ్రమ్ హోమ్'ఇవ్వడం, రాత్రి వేళల్లో కొన్ని నియంత్రణలు విధించడం, అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రయాల వద్ద కఠినమైన థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి.ప్రస్తుత తరుణంలో ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ ముక్కోణపు ముప్పు (వైరస్ + యుద్ధం + చమురు సంక్షోభం) మానవాళికి పెద్ద సవాల్‌గా నిలిచింది. ఇంధన ధరల పెరుగుదల సామాన్యుడిపై మోయలేని ఆర్థిక భారాన్ని మోపుతోంది. ఈ సంక్షోభం నుండి ప్రపంచం పూర్తిగా బయటపడాలంటే అంతర్జాతీయంగా దౌత్యపరమైన శాంతి చర్చల ద్వారా పశ్చిమాసియాలో యుద్ధాన్ని ఆపడం, చమురు సరఫరాను పునరుద్ధరించడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను పాటిస్తూ వైరస్ వ్యాప్తిని క్షేత్రస్థాయిలోనే అడ్డుకోవడం అత్యంత కీలకం.
పల్నాడు పంచ్
-JMR