28/03/2025
రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్
• తప్పు చేసిన వాళ్ళను ఎవరినీ కూడా కూటమి ప్రభుత్వం ఉపేక్షించేది లేదు. ఎక్కడ దాక్కున్నా పట్టుకుని చర్యలు తీసుకుంటాం
• తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడకండి
• కుటుంబ సభ్యులను దుఃఖంలో ముంచవద్దు
• డాక్టర్ దీపక్ ను అరెస్టు చేశాం
• వైసీపీ ఆందోళనలు సరికాదు
మహిళలకు, యువతులకు ఎలాంటి కష్టం వచ్చినా అన్నయ్యలా అండగా ఉంటానని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. ఎవరివల్లనో కష్టం వచ్చిందని, మానసిక క్షోభ కలిగిందని ఆత్మహత్యలకు, అఘాయిత్యాలకు పాల్పడి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను దుఃఖంలో ముంచవద్దని ఆయన కోరారు.
నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేస్తున్న ఫార్మశీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేయడానికి కారకుడైన డాక్టర్ దీపక్ ను ఈరోజు పోలీసులు అరెస్టు చేశారని ఆయన చెప్పారు. ఇది కూటమి ప్రభుత్వం,తప్పుచేసిన దీపక్ ఎక్కడ ఉన్నా పోలీసులు పట్టుకుంటారని తాను ముందే చెప్పానని, అన్నట్లుగానే అతడిని అరెస్టు చేయించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అంజలిని చూసి ఆమె తల్లిదండ్రులు హృదయ విదారకంగా రోదిస్తున్నారని, అలాంటి పరిస్థితి ఇక ఏ తల్లిదండ్రులకు రాకూడదని తాను కోరుకుంటున్నానని చెప్పారు.
అంజలి చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద వైసీపీ నాయకులు అటుగా వెళ్ళే విద్యార్థులతో ఆందోళన చేయించడం సరికాదని ఆయన హితవు పలికారు. దానివల్ల ఆసుపత్రికి వచ్చే వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని, వైద్య సేవలకు ఆటంకాలు కలిగాయని పేర్కొన్నారు. నిరసనలు చేయవచ్చు, కాని దానికి ఒక పద్దతి ఉంటుందని, అది స్థానిక వైసీపీ నాయకులు తెలుసుకోకపోతే ఎలా అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నిలదీశారు.
ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నగరంలో మహిళల కోసం “మీ భద్రత - మా బాధ్యత” కార్యక్రమం చేపట్టానని ఆయన గుర్తు చేశారు. ఇది కూటమి ప్రభుత్వం, తప్పు చేసేవారిని ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, మహిళల పట్ల తప్పుగా ప్రవర్తించేవారిని వదిలిపెట్టేది లేదని, కఠినంగా శిక్షిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు.