16/09/2025
సమాజంలో వైషమ్యాలు సృష్టించే శక్తులు పేట్రేగిపోతున్నాయి
• సామాజిక వర్గాల మధ్య అంతరాలు సృష్టించే యత్నాలు పెరిగిపోయాయి
• అలాంటి విద్రోహ శక్తుల పట్ల నిరంతర అప్రమత్తత అవసరం
• సోషల్ మీడియా పోస్టులు, ఫ్లెక్సీలపై నిఘా ఉంచండి
• మహిళల భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వండి.. సుగాలి ప్రీతి కేసుపై ప్రత్యేక శ్రద్ద చూపండి
• డ్రగ్స్ వ్యాప్తిపై ఉక్కుపాదం మోపాలి
• కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో ఉపముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు
సమాజంలో వైషమ్యాలు సృష్టించేలా, సామాజికవర్గాల మధ్య అంతరాలు పెంచేలా ఈ మధ్య కొన్ని శక్తులు పేట్రేగిపోతున్నాయి. అలాంటి శక్తుల కదలికల పట్ల నిరంతరం నిఘా ఉంచాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు సమష్టిగా కష్టపడదామని పిలుపునిచ్చారు. సామాజిక వర్గాల మధ్య గొడవలుపెట్టేలా పెడుతున్న ఫ్లెక్సీలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, సభలు సమావేశాలపై పోలీసులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి... అలాంటి శక్తులను ముందస్తుగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకుండా, అభివృద్ధిని నిరోధించే విధంగా ప్రజల్లో వైషమ్యాలు సృష్టించేందుకు, రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. మంగళవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో జరిగిన కలెక్టర్లు, ఎప్పీల సమావేశంలో ఇతర మంత్రివర్గ సహచరులతో కలసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతోపాటు పలు అంశాలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ "మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలి. వారి రక్షణ విషయంలో ఖచ్చితమైన లక్ష్యాలను నిర్ధేశించుకుని ముందుకు వెళ్లాలి. సుగాలి ప్రీతి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు తీసుకువెళ్లాలి. ఆ కుటుంబానికి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలి. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల వద్ద, ముఖ్యంగా బాలికల హాస్టళ్ల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలి. సంక్షేమ హాస్టళ్ల వద్ద జరుగుతున్న నేరాలు వెలుగులోకి రావడం లేదు.
• శబ్ద కాలుష్య కారకాలపై పరిమితులు అవసరం
రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఆలయాలు, ప్రార్ధనా మందిరాల వద్ద నిఘా విస్తృతం చేయండి. ఆలయాల ధ్వంసానికి పాల్పడే శక్తుల పట్ల అప్రమత్తత అవసరం. శబ్ద కాలుష్యానికి కారణం అవుతున్న డీజేలు, మైకుల అనుమతుల వ్యవహారంలో పరిమితులు పాటించాలి. ముఖ్యంగా మతపరమైన కార్యక్రమాలు, సినిమా ఫంక్షన్లలో డిసిబెల్ ప్రమాణాలను పాటించేలా చర్యలు తీసుకోండి.
• గంజాయిరహిత రాష్ట్రం సాకారం కావాలి
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వ్యాప్తిపై ఉక్కుపాదం మోపాలి. గంజాయి, డ్రగ్స్ రవాణా, మార్కెటింగ్ చేసే వారిపై దృష్టి పెట్టండి. ముఖ్యంగా కళాశాలలు, స్కూళ్ల వద్ద అమ్మకాలు సాగించే శక్తులపై నిఘా ఉంచితే అసలు నింధితులను పట్టుకోవచ్చు. డ్రగ్స్, గంజాయి సప్లయ్ చైన్ ను బ్రేక్ చేస్తే సమాజంలో చాలా వరకు నేరాలు తగ్గుతాయి. దీనిపై అన్ని జిల్లాల ఎస్పీలు ప్రత్యేకంగా దృష్టి సారించాలి. డ్రగ్స్, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ సాకారం కావాలన్నదే మనందరి లక్ష్యం కావాలి.
• తీవ్ర నేరాల సంఖ్య అదుపులోకి రావాలి
డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ తదితర ప్రాంతాల్లో ఇటీవల కులాల మధ్య సమస్యలు తలెత్తాయి. సినిమా హీరోలు, నాయకులకు ఫ్లెక్సీలు వేసే సమయంలో కూడా కులాలను తీసుకువస్తున్నారు. అలాంటి ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసే వారిని కట్టడి చేయాలి. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించండి. అవసరం అయితే లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు ప్రజల నుంచి సహకారం తీసుకోవాలి. ప్రజలతో స్నేహంగా మెలగండి. అదే సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గాలి. తీవ్రమైన నేరాల సంఖ్య అదుపులోకి రావాలి. వచ్చే ఏడాది కాలంలో తీవ్రంగా పరిగణించబడే నేరాల సంఖ్యలో 33 శాతం తగ్గుదల కనబడాలి" అన్నారు.