
14/09/2025
కూల్ డ్రింక్స్ తో జుట్టు ఊడిపోతుందా ❓
నిండా ముప్ఫైఏళ్లు కూడా రాకుండానే అబ్బాయిల్లో చాలామందికి జుట్టు రాలిపోయి... ఒత్తుగా ఉండాల్సింది కాస్తా పలుచగా తయారవు తోంది. అలాంటప్పుడు షాంపూలు మార్చడం, నూనెలు వాడటం చేస్తుంటారు కానీ, అంతకన్నాముందు చక్కెరలు అధికంగా ఉండే కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండమంటున్నారు పోర్చుగల్ కి చెందిన యూనివర్సిటీ ఆఫ్ పోర్టో శాస్త్రవేత్తలు. తినే ఆహారంతో జుట్టు ఒత్తుగా, బలంగా మారుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి మనం తినే ఆహారంలో ఏదైనా జుట్టు రాలడానికి కూడా కారణమవుతోందా అనే దిశగా పోర్చుగల్ శాస్త్రవేత్తలు పరిశోధించినప్పుడు... చక్కెరలు ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్ ఈ వరుసలో ముందున్నాయట. వారంలో 11 కూల్ డ్రింక్స్ బాటిల్స్ లేదా 3500 మిల్లీమీటర్లకు మించి శీతలపానీయాలని తాగేవారిలో జుట్టు ఎక్కువగా రాలడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. సాధారణంగా కూల్డ్రింక్స్ తాగేవారిలో ఊబకాయం, దంతాలు పాడవడం వంటి సమస్యలొస్తాయని తెలుసుకానీ జుట్టు రాలడానికి గల కారణాలని శోధించే క్రమంలో... ఈ పానీయాలు మాడులో సెబమ్ ని ఎక్కువగా విడుదల చేస్తాయని గుర్తించారు. నిజానికి ఈ సెబమ్ జుట్టుకీ, చర్మానికీ మేలే చేసినా అది ఎక్కువగా విడుదలైతే ఇరిటేషన్ రావడం, దురద, వాపులవల్ల కుదుళ్లు బలహీనమవుతాయి. అలాగే, జుట్టుని బలంగా ఉంచే క్యాల్షియంనూ, ఐరన్ ని జుట్టుకు అందకుండా కూల్ డ్రింక్స్ ని పాస్ఫారిక్ యాసిడ్ అడ్డుకుంటుందట. అందుకే వీటికి వీలైనంత దూరంగా ఉండమంటున్నారు.