10/04/2024
ఆధునిక యుగ తధాగధుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే
(ఏప్రిల్ 11) రాష్ట్రపిత మహాత్మా జ్యోతిరావు ఫూలే 198 జయంతి.
'ప్రాచీన యుగంలో బుద్దుడు, ఆదునిక యుగంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే నాకు గురువులు' అని భారత రాజ్యంగా నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అన్నారు. దళిత, గిరిజన, బలిహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేయడం ద్వారా 'రాజ్యాధికార సాధనకి' కృషి చెయ్యాలని ఫూలే సూచించారు. ఆ సూచనను డా. అంబేడ్కర్ మనస్పూర్తి గా అంగీకరించారు కనుకనే నవీన యుగంలో ఫూలే నాకు గురువని ఆయన అన్నారు.
భారతజాతికి స్పూర్తి నిచ్చిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్ర లోని పూణే నగరంలో జన్మించారు. తల్లితండ్రులు గోవిందరావు ఫూలే, చిమనాభాయి. బాల్యంలోనే తల్లిని కోల్పోయారు జ్యోతిరావు ఫూలే. మాలి కులంలో పుట్టిన ఫూలే చిన్ననాటి నుంచి ఆధిపత్య వర్గాల అహంకరానికి గురయ్యారు. పీష్వాల పాలనాకాలమది. క్రింది కులాల పిల్లలు కేవలం పశువులు, గొర్రెలు మేపటానికే పరిమితమయ్యేవారు. మట్టిపనులు చేసేవారు. ఫూలే పూర్వీకులు పీష్వాలకు పూలు, పూలదండలు తీసుకువెళ్ళేవారు. పూలదండలు అల్లేవారు కాబట్టే వారి కులానికి 'మాలి' అనే పేరు వచ్చింది.
జ్యోతిరావు ఫూలే చిన్ననాటి నుండి చదువుపట్ల అమితమైన ఇష్టం చూపేవారు. ఏడేళ్ల వయసులో మరాఠా పాఠశాలలో చేరారు. ఇది సహించలేని కొన్ని వర్గాలవారు ఫూలే కుటుంభంపై దాడి చేశారు. శూద్రులు చదువుకుంటే కరువుకాటకాలు వస్తాయని, ధర్మం నశించిపోతుందని వాపోయారు. వారి ఆగ్రహానికి గురికావలిసి వస్తుందని భయపడిన ఫూలే తండ్రి చదువుని మద్యలో మాన్పించారు. అవి భాల్యవివాహపు రోజులు. పదమూడు సంవత్సరాల వయస్సులో ఫూలే సావిత్రిభాయిని వివాహం చేసుకున్నారు. వివాహానంతరం ఫూలే తన చదువును కొనసాగించేరు. ఆ రోజుల్లో ఒక ఆధిపత్య వర్గం వారి వివాహానికి ఫూలే వెళ్లారు. ఈ విషయం ఆరోజుల్లో పెద్ద కలకలం రేపింది. ఒక శూద్రడిని వివాహానికి పిలవడం పట్ల సంప్రదాయ ఆధిపత్య పెద్దలు యాగి చేశారు. ఫూలే రాకతో తమ వర్గం అపవిత్ర అయ్యీపోయిందని గగ్గోలు పెట్టారు. ఈ విషయం జ్యోతిరావు ఫూలే అవమానంగా భావించారు.
మహారాష్ట్ర ఋషులు తుకారాం, జ్ఞానేశ్వర్, క్రైస్తవ సంస్కర్త మార్టిన్ లూథర్ల రచనలు చదివి ఫూలే స్పూర్తి పొందారు. సమాజంలో అసమానతలకు కులవ్యవస్థే మూలమనే సత్యాన్ని జ్యోతిరావు ఫూలే గ్రహించారు. ఈ అసమానతలకు వ్యతిరేకంగా దళిత, గిరిజన, బలహీనవర్గాల వారిని, ప్రజలను చైతన్యం చేయుటకు ఫూలే సంకల్పించారు. శూద్ర, అతిశూద్ర కులాలలో పురుషులతో సమానంగా మహిళలు కూడా విద్యావంతులు కావాలని ఫూలే పిలుపునిచ్చారు. పూణే నగరం లో పాఠశాలను నిర్మించారు. తానే స్వయంగా విద్యావతిగా చేసిన భార్య సావిత్రిభాయిని ఆ పాఠశాలలో ఉపాధ్యాయరాలుగా నియమించారు. సావిత్రిభాయి ఫూలే దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయరాలు.
మహిళలకు చదువు నేర్పి చైతన్యం చేస్తున్నందుకు జ్యోతిరావు ఫూలే కుటుంభంపట్ల కొన్ని వర్గాల వారు పలు ఆంక్షలు విధించారు. అయిన ఫూలే వెనకడుగు వేయలేదు, ఎవ్వరికీ బెదరలేదు. మహిళను విద్యావంతులుగా చేసే కృషిని ధైర్యంగా కొనసాగించారు. ఆ కృషిలో ఘనమైన పురోగతిని సాదించారు. శూద్ర, అతిశూద్ర కులాల మహిళలలో విద్యావికాశాన్ని సాదించినందుకు బ్రిటిష్ వలస పాలకులు ఫూలేని ఘనంగా సన్మానించారు.
ఫూలే, సావిత్రిభాయి దంపతులకు సంతానం కలగలేదు. ఒక వితంతువుకు పుట్టిన బిడ్డను దత్తత తీసుకున్నారు. ఆ బిడ్డకు యశ్వంత్ అనే నామకరణం చేసి పెంచుకున్నారు. రైతు కూలీలు, వ్యవసాయదారుల కష్టాలను వివరిస్తూ *'గులాంగిరి'* అనే పుస్తకాన్ని ఫూలే రచించారు. ఇది ఆయన రచనలో కెల్లా తలమానికమైనది. అలాగే కొన్ని వర్గాలవారు చేస్తున్న దోపిడిని వివరిస్తూ *'తృతీయ రత్న'* అనే నాటకాన్ని కూడా ఫూలే వ్రాశారు. ఈ నాటకం పెద్ద సంచలనం సృష్టించింది. *'రైతు కోరడా'* అనేది ఫూలే మరో గ్రంధం. *"శూద్రులకు విద్యలేనందున జ్ఞానం లేకుండా పోయిందని, జ్ఞానం లేనందున నైతికత లుప్తమయ్యిందని, నైతికత లేనందున ఐక్యమత్యములోపించిందని, ఐక్యమత్యము లేనందున శక్తి కుంటుపడుతుందని, శక్తి లేకపోతే శూద్రులు అణిచివేతకు గురవుతున్నారని* ఫూలే మహాశయుడు వివరించారు.
*'సత్యశోధక సమాజాన్ని'* అనే సంస్థను స్తాపించి సత్య ధర్మాన్ని ఫూలే ప్రచారం చేశారు. స్త్రీ, పురుష సమానత్వం కోసం జీవితాంతం కృషి చేశారు. గుజరాత్ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేసినప్పుడు ఫూలే ఆయన అనుచరులు వరద ప్రాంతానికి వెళ్ళి సహాయమందించారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే జీవితం అధర్స, స్పూర్తిదాయక గ్రంధం. సామాజిక సమరానికి ఒక ప్రతీక. సమసమాజ స్థాపనకు మార్గం. వర్తమాన భారతదేశంలో అసంఖ్యాకులు ఫూలే జీవితం, కృషి నుంచి స్పూర్తి పొందుతున్నారు. భావితరాలకు మానవతావిలువలు తెలియజేసేవిధంగా అన్ని స్థాయిలలో ఫూలే జీవితాన్ని పాఠ్యంశ్యము గా ఉంచాలని ఫులేవాదులు కోరుతున్నారు. ఫూలే జన్మదిన్నాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 'సామజిక సాధికారత దినొస్తవంగా' ప్రకటించి అధికారకంగా జయంతి వేడుకలు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మహాత్మా జ్యోతిరావు ఫూలే మరణించిన ఏడాదికి భారత రాజ్యంగ నిర్మాత డా. భీమ్ రావు రాంజీ అంబేడ్కర్ జన్మించారు. ఇది కాకతాళీయామే అయినా ఫూలే ఆశయ సాదనకు మరో మహాత్ముడు జన్మించినట్లయ్యింది. సమసమాజ స్థాపనకు, అనాగారిన వర్గలకోసం పాటుపడిన ఫూలే జన్మదిన్నాన్ని భారతీయులు అందరు గుర్తుంచు కోవాలిసిన అవసరం ఎంతైనా ఉన్నది. బడుగు, బలహీన వర్గాల ప్రజలకోసం, దళిత, గిరిజన జాతి సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేసిన ఫూలే 1890 నవంబరు 28న కాలధర్మం చెందారు. దేశ, జాతి, ప్రజా స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన జ్యోతిరావు ఫూలేని మహారాష్ట్ర వాసులు *'రాష్ట్రపిత'గా* పిలుస్తుంటే, భారతదేశ ప్రజలు *'మహాత్ముడని'* తమ మనసుల్లో నిలుపుకున్నారు.
మహనీయుడు ఫూలే గార్ని స్మరించండి. ఈ వ్యాసాన్ని దయచేసి సామాజిక మాద్యమాలలో, సమాహాలలో పంచుకొని సామాజిక చైతన్యానికి కారకులు కండి ఆదర్శమూర్తి ఫూలే జీవితం ఆచరణీయం. ఫూలే జయంతి సందర్బంగా అందరం జోహార్లు పలికి మహనీయున్ని స్మరిద్దాం.