
05/09/2025
మొహమ్మద్ ప్రవక్త జన్మదిన ఉరుసు గంధం ఊరేగింపు
జిలాన్ కుటుంబం నుంచి 200 ఏళ్లుగా ఉరుసు గంధం మహోత్సవం
ముఖ్యఅతిథిగా హాజరైన నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీం, రాష్ట్ర ముతవల్లిల సంఘం అధ్యక్షులు కేఎం షకీల్ షఫీ
నగరంలో మొహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించే ఉరుసు మహోత్సవానికి సంబంధించి గంధం ఊరేగింపు కార్యక్రమాన్ని గురువారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనంతపురం నగర మేయర్ మొహమ్మద్ వసీం సలీం, రాష్ట్ర ముతవల్లిల సంఘం అధ్యక్షులు కేఎం షకీల్ షఫీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నగరానికి చెందిన జిలాన్ వారి గృహం నుంచి ప్రతి ఏటా మొహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉరుసు నిర్వహణతో పాటు గంధం ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. వారి కుటుంబం పూర్వీకుల నుంచి 200 ఏళ్ల నుంచి ఆనవాయితీ కొనసాగుతోంది. ఈ సందర్భంగా గంధం ఊరేగింపు ద్వారా నగరంలో స్వామివారి దర్శనాన్ని చేసుకునేందుకు ప్రత్యేక అవకాశాన్ని కల్పించడం జరుగుతోందని తెలిపారు. గంధం మహోత్సవానికి సయ్యద్ షా కుస్తార్ రబ్బానీ సాహెబ్ ప్రత్యేక అతిధులుగా హాజరై ప్రత్యేక దువా ఆచరించారు. ఆయన చేతుల మీదుగా గంధం మహోత్సవాన్ని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకునే వేడుకలలో మొహమ్మద్ ప్రవక్త జన్మదినం అత్యంత ప్రత్యేకమైనదని ఆయన కొనియాడారు. ప్రపంచానికి శాంతిని సూచించిన గొప్ప మహనీయుడు ప్రవక్త మొహమ్మద్ అని కొనియాడారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆదర్శమని కొనియాడారు. అదేవిధంగా మరుసటి రోజు మొహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే మిలాద్ ఉన్ నబి వేడుకలలో భాగంగా కేశ దర్శనం కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వీక్షించేందుకు అవకాశాన్ని కల్పించడం జరిగిందన్నారు. కేశ దర్శనాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మదని ఇసాక్, అడ్వకేట్ అంగడి ఇసాక్, కార్యనిర్వహకులు జిలాన్ జావిద్ అక్రమ్ ఆఫ్రిద్ రియాజ్ గౌస్ పీరా తదితరులు పాల్గొన్నారు.