06/08/2025
* కష్టాల్లో ఓదార్పు.. కర్తవ్యం పిలుపు.
శ్రమైక జీవనంలోంచి జాలువారిన విమలక్క పాట..
అరుణోదయ సాంస్కృతిక సమైక్య చైర్మన్ ప్రజా గాయకురాలు విమలక్క కు జయశంకర్ సార్ స్మారక పురస్కారం అందుకుంటున్న సందర్భంగా ప్రత్యేక అభినందనలతో..🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
పీడత ప్రజల విముక్తి పోరాటాలలో పురుడోసుకుంది విమలక్క పాట. సిరిసిల్ల ప్రాంతంలోని పురుడోసుకున్న అనేక రైతాంగ పోరాటాలకు గానాన్ని ఇచ్చిన విమలక్క. గానంతో పాటు ప్రజా పాటలు వింటూ పెరిగిన తరం మాది.
ఒకనాడు తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకంగా సిరిసిల్ల పాత తాలూకా పరిధి.ఇప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోనీ ప్రాంతమంతా రైతాంగ పోరాటాలకు కేంద్రంగా పని చేసింది. 70 దశకం నుంచి (1978). చరిత్రలో సామాన్యుడి దిక్కరస్వరంగా నిలబడ్డ రైతాంగ పోరాటాలకు విమలక్క పాట అంతర్లీనంగా ఆక్సిజన్ల పని చేసింది.
రైతాంగ, వ్యవసాయ, కార్మిక వర్గ, విద్యార్థి పోరాటాలకు విమలక్క తన గానంతో అక్కున చేర్చుకుంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విమలక్క ఎత్తుకున్న బతకమ్మ ఇప్పటిదాకా ఎప్పుడు దించింది లేదు. రాష్ట్రం ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమాలను విమలక్క గానం భాస్వరమై మండించింది. ప్రజలను ముందుకు నడిపించింది.
అదేం చిత్రమో! సబ్బండవర్ణాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో హఠాత్తుగా విమలక్క గానంపై అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించిన రోజులు. తెచ్చుకున్న తెలంగాణలో నియంతృత్వం నిరంకుశంగా ప్రజల హక్కులను, ఉద్యమాలను ఉక్కుపాదంతో తొక్కి వేస్తున్న దుర్భర పరిస్థితిలలోను ప్రజాస్వామిక ఉద్యమాలపై ఉక్కు పాదాలు మోపిన రోజులలోనూ "తెలంగాణ" ప్రజా పోరాటల గుండెకు అయిన గాయాలను తలుచుకుంటూ ఆవేదనమయంగా మిగిలింది. కలలను ,త్యాగాలు ధారవోసి తెచ్చుకున్న తెలంగాణ "ఎవని పాలయ్యిందిరో"అనుకునే రోజులు వచ్చాయి.
తెచ్చుకున్న తెలంగాణలో మాయని మచ్చగా మిగిలిన "నేరెళ్ల"నెత్తుటి గాయాన్ని మిగిల్చిన పరిస్థితి. బాధితుల పక్షాన నిలబడడం కూడా నేరంగా పరిణమిస్తున్న పరిస్థితులు.
సరిగ్గా అలాంటి విపత్కర పరిస్థితుల్లో నిర్బంధాల సంకెళ్లను తెంచుతూ విమలక్క ఎత్తుకున్న "బహుజన బతుకమ్మ"నేరెళ్ల గడప తట్టింది. ఓదార్పై గుండెలకు హత్తుకుంది. మోక్కవోని ధైర్యమై నిలబడింది. ప్రజల పక్షాన నిలబడిన బహుజనులకు తన "గానం"తో ఏనలేని ధైర్యాన్ని అందించింది.
అనేక సామాజిక మార్పులకు కారణమైన "పాట"సర్కారు గడీలోకి జారిపోతున్న కాలంలోనూ ఒడిసిపట్టి ప్రజల కోసం నిలబెట్టింది విమలక్క. తెచ్చుకున్న తెలంగాణలో ప్రభుత్వాలు మారుతున్న ప్రజల జీవన విధానాల్లో మౌలికంగా మార్పులు రావాలన్న సంకల్పంతో ప్రజల కోసం ఎత్తుకున్న పాట ఎక్కడ అలసిపోలేదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి దిక్సూచిగా నిలబడ్డ ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్మారక రాష్ట్ర స్థాయి పురస్కారానికి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్మన్ విమలక్క ఎంపిక కావడం ఇప్పటి సాంస్కృతిక ఉద్యమానికి అక్కర కూడా.
ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్మారక పురస్కారాన్ని అందుకుంటున్న విమలక్కకు సిరిసిల్ల ప్రాంత ప్రజల శనార్థులు, అభినందనలు.....
అరుణోదయ సాంస్కృతిక సమైక్య చైర్మన్ ప్రజా గాయకురాలు విమలక్క జయశంకర్ సార్ పురస్కారం అందుకుంటున్న సందర్భంగా ప్రత్యేక అభినందనలతో..🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఫోటోలు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో 10 సంవత్సరాల క్రితం బహుజన బతుకమ్మ నిర్వహించిన కాలం నాటివి