
13/08/2025
*పేదరిక నిర్మూలనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం*
*అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం MSME భవనంలో హోం మంత్రి వంగలపూడి అనిత.*
అనకాపల్లి, ఆగస్టు 12: రాష్ట్రంలో పేదరిక నిర్మూలనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవసరమని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం MSME భవనంలో మంగళవారం సాయంత్రం పారిశ్రామికవేత్తలతో P4 (People–Private–Public–Partnership) సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హాజరై, పేదరిక నిర్మూలనతో పాటు పారిశ్రామికాభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, పలువురు పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హోం మంత్రి అనిత మాట్లాడుతూ, పేదరికం నిర్మూలన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ప్రధాన లక్ష్యమని, ఈ దిశగా ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని అన్నారు. NDA ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు కూడా అభివృద్ధి యాత్రలో ఒక కీలక భాగమని పేర్కొన్నారు. పరిశ్రమలకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు. NDA ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీకి జీతాలు అందిస్తున్నామని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిరంతరంగా అమలు అవుతున్నాయని తెలిపారు.
జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ, P4 మోడల్ ద్వారా ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజలు కలసి సుస్థిర అభివృద్ధి సాధించగలరని అన్నారు. పారిశ్రామికవేత్తల CSR నిధులను జిల్లా అవసరాలకు అనుగుణంగా వినియోగించడం ద్వారా విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల అభివృద్ధి రంగాల్లో అనేక ప్రాజెక్టులు అమలు చేయవచ్చని పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సదుపాయాలు, మౌలిక వసతుల మెరుగుదలకు ఈ భాగస్వామ్యం ఒక మంచి వేదికగా ఉపయోగపడుతుందని చెప్పారు.
ఈ సమావేశంలో పాల్గొన్న పారిశ్రామికవేత్తలు, CSR నిధులను జిల్లా అభివృద్ధికి వినియోగించేందుకు తమ సానుకూలతను తెలియజేశారు.