31/07/2025
*తిరుమల సర్వస్వం - 23*
•••┉┅━❀🕉️❀┉┅━•••
🙏 *ఓం నమో వేంకటేశాయ*🙏
*శ్రీవారి ఆలయవైశిష్ట్యం - 4*
✍️ శ్రీమతి&శ్రీ పల్లపోతు వాణిశ్రీ-కృష్ణబాలాజీ
•••┉┅━❀🕉️❀┉┅━••
*"వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన*
*వేంకటేశ నమో దేవో న భూతో న భవిష్యతి"*
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *నాలుగుకాళ్ళ మంటపాలు* 🌈
💫 1470వ సం. లో విజయనగర చక్రవర్తి సాళువ నరశింహరాయలు తన భార్య, ఇద్దరు కుమారులు, తన పేరున నాలుగుకాళ్ళ మంటపాలుగా పిలువబడే నాలుగు మంటపాలను సంపంగిప్రదక్షిణ మార్గానికి నాలుగు మూలల్లో అంటే - ఆగ్నేయ, నైఋతి, వాయువ్య, ఈశాన్యాల్లో - కళాత్మకంగా నిర్మించాడు. జనసమ్మర్థం అంతగా లేని కాలంలో స్వామివారి ఉత్సవ ఊరేగింపులన్నీ సంపంగి ప్రదక్షిణ మార్గం నందే జరిగేవి. ఆ సమయంలో, ఈ మార్గంలోని నాలుగు మూలల్లో ఉన్న మండపాల్లో స్వామివారు వేంచేసి పూజాదికాలు అందుకునే వారు. కళ్యాణోత్సవాలు సైతం వీటిలోనే నిర్వహించేవారు. ఎత్తైన ఈ మంటపాల్లో జరిగే పూజలను భక్తులు అన్నివైపుల నుండీ వీక్షించవచ్చు. కళ్యాణోత్సవ సమయాల్లో ఈ మండపాల ఉపరితలం నుంచి మంగళవాద్యాలను నగారాల వలె మ్రోగించేవారు.
💫 కాలక్రమేణా భక్తులరద్దీ ఎక్కువ కావడంతో, శ్రీవారి ఉత్సవాలను విశాలమైన ఇతర మంటపాల్లోనూ, ఊరేగింపులను వెడల్పాటి మాడవీధుల్లోనూ నిర్వహించసాగారు.
💫 ప్రస్తుతం, ఆగ్నేయ, వాయువ్య, ఈశాన్య మూలల్లోని నాలుగుకాళ్ళ మంటపాలు మూడు మాత్రం మిగిలి ఉండగా, నాల్గవది తరువాతి కాలంలో చేపట్టిన విస్తరింపు కట్టడాల్లో విలీనమైపోయింది. మిగిలిన మూడింటిలో కూడా, కేవలం ఆగ్నేయమూలలో ఉన్న మంటపాన్ని మాత్రమే ఇప్పుడు మనం చూడగలం. ఇతర దిక్కుల్లోనున్న మంటపాలను చూడటానికి భక్తులకు ప్రవేశం లేదు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *శ్రీవేంకటరమణుని కళ్యాణమంటపం* 🌈
💫 నీరజాక్షుని నిత్యకళ్యాణోత్సవం కోసం సంపంగి ప్రదక్షిణం లోని దక్షిణమార్గంలో నూతనంగా, సృజనాత్మకత ఉట్టిపడేటటువంటి కళాఖండాలతో, తూర్పుముఖంగా ఈ కళ్యాణమంటపం నిర్మింపబడింది. ఇందులో ప్రతిరోజూ మధ్యాహ్నం పన్నెండు గంటలకు మలయప్పస్వామి వారికీ ఉభయనాంచారులకు కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతుంది. విశాలమైన ప్రాంగణంలో వందలాది భక్తులు కూర్చొని కళ్యాణోత్సవాన్ని కన్నులారా తిలకించవచ్చు.
💫 ప్రతి సోమవారం జరిగే విశేషపూజ; పవిత్రోత్సవం, పుష్పయాగం, జ్యేష్టాభిషేకం వంటి సంవత్సరోత్సవాలు కూడా ఈ మంటపంలోనే జరుప బడతాయి.
💫 మొదట్లో విమానప్రదక్షిణ మార్గపు నైఋతి దిక్కులోని కళ్యాణమంటపంలో, తరువాత సంపంగిప్రాకారంలోని రంగనాయకమంటపంలో జరుపబడే కళ్యాణోత్సవాలు ప్రస్తుతం విశాలమైన ఈ కళ్యాణమంటపం లో జరుగుతున్నాయి. కళ్యాణోత్సవ ఆర్జిత సేవలో పాల్గొనే భక్తులు మాత్రమే ఈ కళ్యాణమంటపాన్ని కాంచగలరు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *ఉగ్రాణం* 🌈
💫 *"ఉగ్రాణం"* గా పిలువబడే సరుకుల గిడ్డంగులను మనం తి.తి.దే. ఆధ్వర్యంలోని అన్ని దేవాలయాల్లోనూ చూస్తాం. వీటిలో ప్రసాదాల తయారీకి ఉపయోగించే వంట సామగ్రీ మరియు పూజాద్రవ్యాలు నిలువ ఉంచుతారు. సంపంగి ప్రదక్షిణమార్గం లోని వాయువ్యమూలలో ఉన్న ఈ "ఉగ్రాణం" లో, స్వామివారి అభిషేకాలకు, అర్చనలకు ఉపయోగించే పసుపు, చందనం, కర్పూరం, నెయ్యి, సుగంధద్రవ్యాలు వంటి వాటిని నిలువ చేస్తారు.
💫 ఇదే కాకుండా, సంపంగి ప్రదక్షిణ మార్గానికి పడమటి దిక్కున ఉన్న కొన్ని మంటపాలను కూడా – శనగపిండి, బెల్లం, మినప్పప్పు, పంచదార, బియ్యం వంటి సరుకులు; పిండి కలుపుకోవడం కోసం ఉపయోగించే పెద్ద పెద్ద మిక్సీలు ఉంచటానికి ఉపయోగిస్తారు. ప్రసాదాల తయారీ నిమిత్తం వాడే వంటదినుసులు బాహ్యకుడ్యం వెనుక నుండి కన్వేయరు బెల్టుల ద్వారా సంపంగి ప్రదక్షిణం పడమరదిశగానున్న గిడ్డంగుల్లోనికి చేర్చబడతాయి. వీటివద్దకు కూడా భక్తులకు ప్రవేశం లేదు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *విరజానది లేదా విరజాతీర్థం* 🌈
💫 వైకుంఠంలోని పవిత్రతీర్థమైన విరజానది స్వామివారి పాదాల క్రింద నుండి ప్రవహిస్తూ స్వామిపుష్కరిణిలో కలుస్తుందని భక్తుల విశ్వాసం. అందువల్లనే, గోవింద నామాల్లో శ్రీనివాసుణ్ణి "విరజాతీర్థుడని" కూడా అభివర్ణిస్తారు.
💫 ఈ నదీగమనమార్గంలో ఉపరితలంపై నిర్మింపబడిన బావిని విరజానది గా పిలుస్తారు. ఈ బావి అంచులపై అద్భుతమైన శిల్పాలు, పౌరాణిక ఘట్టాలు చెక్కబడి ఉండటంతో స్థానికులు దీన్ని *"బొమ్మలబావి"* గా కూడా పిలుస్తారు. ఈ బావి ప్రస్తుతం నేలమట్టానికి ఉన్న కటకటాల తలుపుతో మూయబడి, దానివద్ద "విరజానది" అనే బోర్డు వ్రేలాడ దీయబడి ఉంటుంది. ఈ బావి వద్దకు కూడా భక్తులకు ప్రవేశం లేదు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *పడిపోటు* 🌈
💫 ఇది సంపంగి ప్రదక్షిణానికి ఉత్తర మార్గంలో ఉంటుంది. పడమటి భాగంలో ఉగ్రాణం వద్ద మొదలై, పొడవుగా, దాదాపు మనం ప్రసాదాలు స్వీకరించే ప్రదేశం వరకూ విస్తరించి ఉంటుంది. స్వామివారి ప్రసాద నివేదనలన్నీ అన్నప్రసాదాలు తప్ప - అంటే లడ్డూ, వడ, జిలేబీ, మురుకు, అప్పం, దోశ మొదలైనవి పరిశుభ్రమైన వాతావరణంలో, అత్యంత నైపుణ్యంతో, భారీ ఎత్తున ఈ పడిపోటులో తయారు చేయబడతాయి.
ఈ ప్రదేశంలోకి సాధారణంగా భక్తులకు ప్రవేశం లేదు. అయితే, మనం ప్రార్థనా పూర్వకంగా అడిగితే, అక్కడ ఉన్న సిబ్బంది ఒక్కో సారి అనుమతిస్తారు. ఈ సారి ప్రయత్నించండి. ప్రపంచంలో మరెక్కడా లేనంత భారీ ఎత్తున జరిగే వంటల ప్రక్రియను చూసి తీరాల్సిందే! ఈ మధ్య కాలంలో, స్థలాభావం చేత, లడ్డూ తయారీకి కావలసిన బూందీని మాత్రం ఆలయం వెలుపల తయారు చేయిస్తున్నారు.
💫 పడిపోటుకు ఆగ్నేయమూలలో, తూర్పుదిశగా ఉన్న *"పోటుతాయారు"* అనే అమ్మవారికి భక్తిపూర్వకంగా నమస్కరించి వంట బ్రాహ్మణులు శుచిగా తమ దినచర్యను ప్రారంభిస్తారు. పడిపోటుకు ఎదురుగా ఇదివరకు ఉండే చిన్న బావిలోని నీటిని వంటలకు ఉపయోగించే వారు.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *పూల అర లేదా పుష్పమండపం లేదా యమునోత్తరై* 🌈
💫 సంపంగి ప్రదక్షిణం లోని ఉత్తరమార్గంలో, పడిపోటు నానుకొని ఉన్న గదిని ఈ మూడు పేర్లతో పిలుస్తారు. శ్రీవారి కైంకర్యాలకు, వివిధ ఉత్సవాలకు అవసరమయ్యే పుష్పమాలలను ఈ గదిలో తయారు చేసేవారు. అయితే స్థలాభావం, పెరిగిన అవసరాల దృష్ట్యా, ఇప్పుడు పుష్పమాలలను వేరొక చోట తయారు చేయించి, ఉపయోగార్థం విమానప్రాకారంలోని ఓ శీతలీకరించిన గదిలో భద్రపరుస్తున్నారు. దాని వివరాలు తరువాత తెలుసుకుందాం.
💫 *"యమునోత్తరై"* అంటే *"యమునానది ఒడ్డు"* అని అర్థం. స్వామిని శ్రీకృష్ణునికి ప్రతిరూపంగానూ, స్వామి పుష్కరిణిని యమునానది గానూ భావించడం వల్ల దీనికా పేరు వచ్చి ఉండవచ్చు. మరో కథనమేమంటే - ఈ పుష్పకైంకర్యాన్ని ప్రారంభించిన అనంతాళ్వార్ అనే భక్తుడు తన గురువు రామానుజుల వారి గురువుగారైన *"యామునాచార్యుల"* వారి పేరు మీద ఈ గదికి ఆ పేరు పెట్టాడు. ఈ మహాభక్తుని గురించి ముందుగానే తెలుసుకున్నాం.ఈ గదిని బయటనుంచి దర్శించుకోవచ్చు. ఈ
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *వగపడి* 🌈
💫 రెండస్తుల కలిగిన ఈ ప్రసాదాల గిడ్డంగి, పూల అరను ఆనుకుని ఉంటుంది. ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు, తి.తి.దే. సిబ్బందికి ఇక్కడే ప్రసాదవితరణ చేస్తారు. సిబ్బంది అనుమతితో లోనికి ప్రవేశించవచ్చు. ఈ గది ముంగిట్లో నుంచే లడ్డూ, వడ, జిలేబీల సుగంధాలు చవులూరిస్తాయి. సాధారణంగా, మనం దీని ముంగిట్లో నుంచునే ఉచిత ప్రసాదాలను సేవిస్తాం. గంటల తరబడి క్యూలో వేచి ఉండటం వల్ల వచ్చిన అలసట, ఆకలి; ఘుమఘమలాడే స్చచ్ఛమైన నేతి సువాసనలు; అంతకుమించి శ్రీవారి ప్రసాదాల మీదుండే అపరిమిత భక్తిశ్రద్ధలు; వెరసి, మన ఆలోచనలన్నీ తాత్కాలికంగా, ఆధ్యాత్మిక భావనల్లోంచి ఆత్మారాముణ్ణి సంతృప్తి పరచే దిశలో అనాలోచితంగానే పయనిస్తాయి.
♾┉┅━❀🕉️❀┉┅━♾
🌈 *పూలబావి* 🌈
💫 స్వామివారికి సడలింపు చేసిన పూలమాలలను భక్తులకిచ్చే సాంప్రదాయం తిరుమలలో లేదు. *"పూజానైర్మల్యాలు"* గా పేర్కొనబడే వీటన్నింటినీ, సంపంగి ప్రదక్షిణానికి ఈశాన్యంలో ఉన్న *"పూలబావి"* గా పిలువబడే ఓ బావిలో విసర్జించేవారు. అందుకే దానికా పేరు వచ్చింది. అయితే సంవత్సరంలో ఒక్కసారి తిరుచానూరులో కార్తీకమాస బ్రహ్మోత్సవ చక్రస్నానం జరిగే రోజున మాత్రం, శ్రీవారికి అలంకృతమైన పూమాలలు, పరిమళద్రవ్యాలు, ప్రసాదాలు, చీర-రవికెలు సమస్త గౌరవలాంఛనాలతో, తిరుమలనుంచి కాలినడకన తీసుకొని వచ్చి పద్మావతి అమ్మవారికి సమర్పిస్తారు.
💫 ఈ పూలబావిని అద్దాలమండపానికి వెనుకభాగంలో, సరిగ్గా మనం ఉచిత ప్రసాదాలు స్వీకరించే ప్రదేశానికి ఎదురుగా చూడవచ్చు.
💫 ఐతిహ్యం ప్రకారం భూదేవిచే ఏర్పరచబడిన ఈ *"భూతీర్థం"* (పూలబావికి పూర్వనామం) కాలాంతరంలో నిక్షిప్తమై పోయింది. శ్రీనివాసుని ఆనతిపై రంగదాసుడనే భక్తుడు నేలను త్రవ్వి ఈ బావిని వెలుగులోకి తెచ్చి దాని నీటిని శ్రీవారి పుష్పకైంకర్యానికి ఉపయోగించేవాడు. శ్రీవారికి ప్రీతిపాత్రమైన ఈ బావి శిథిలమైపోగా రంగదాసే తొండమానునిగా పునర్జన్మించి, ఆ బావిని తిరిగి పునరుద్ధరించాడు. అంతే కాకుండా, ఆ బావినందలి రహస్య మార్గం ద్వారా నిత్యం వచ్చి స్వామిని దర్శించుకునే వాడు.
💫 ఒకప్పుడు శత్రురాజులు తరుముకు రాగా, తొండమానుడు ఈ మార్గం ద్వారా పరుగు పరుగున వచ్చి శరణాగతవత్సలుణ్ణి శరణువేడాడు. అభ్యంతరమందిరంలోకి అకస్మాత్తుగా వచ్చిన ఆగంతుకుణ్ణి చూసి సిగ్గుతో - శ్రీదేవి శ్రీవారి వక్షస్థలంలోను, భూదేవి ఈ బావిలోనూ - దాక్కున్నారు.
💫 వరాహపురాణం ద్వారా ఈ ఇతిహాసాన్ని తెలుసుకున్న భగవద్రామానుజులవారు భూదేవిని ఆ బావిలో తిరిగి ప్రతిష్ఠింపజేసి, అర్చనాదులు క్రమం తప్పకుండా జరిగే ఏర్పాటు చేశాడు. అంతే కాకుండా, భూదేవి నిమిత్తం పెనిమిటి పూజా నైర్మల్యాలను ఈ బావిలో విడిచే కట్టడి కూడా చేయడంతో, కొన్ని వందల సంవత్సరాలు ఆ సాంప్రదాయం కొనసాగింది.
💫 కానీ, ఈ మధ్యకాలంలో పూలవాడకం విపరీతంగా పెరిగిపోవడం వల్ల, వాడిన పూమాలలను తిరుమల సానువుల్లో ఎవరూ తొక్కని ప్రదేశంలో విడవడం ప్రారంభించారు. అదీ "పూలబావి" పుట్టు పూర్వోత్తరాలు!
💫 ఈ మధ్యకాలం వరకూ దిగుడుబావిగా ఉన్న ఈ బావిని చేదుడు బావిగా మార్చి, దాని వరలకు బయటివైపు నల్లటి గ్రానైట్ పలకలు తాపడం చేసి, దాని చుట్టూ ఇనుప ఊచల తడికెను ఏర్పాటు చేశారు. ఇంతటి పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం కలిగిన పూలబావికి ఈసారి తప్పక నమస్కరించి తరించండి.
💫 శ్రీవారి ఆలయంలో అత్యంత ముఖ్యమైన సంపంగి ప్రదక్షిణ మార్గం లోని అన్ని విశేషాలను దాదాపుగా తెలుసుకున్నాం.
💫 సంపంగి ప్రదక్షిణ మార్గం లోనే ఉండినట్లుగా చెప్పబడే *ప్రొద్దుతిరగని చింతచెట్టు* గురించీ, *వెండివాకిలి* గురించీ, దేవాలయ మహద్వారానికి తూర్పు దిక్కున గంభీరంగా నిలబడి ఉండే *గొల్లమంటపం* గురించి చెప్పుకొని రేపటితో *"సంపంగి ప్రదక్షిణం"* సమాప్తం చేద్దాం.
[ రేపటి భాగంలో... *శ్రీవారి ఆలయవైశిష్ట్యం* గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం]
•••┉┅━❀🕉️❀┉┅━•••
🙏 *శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 🙏
*...తిరుమల సర్వస్వం..... సశేషం...*
•••┉┅━❀🕉️❀┉┅━•••