Life TV

Life TV Welcome To LIFE TV Page ...This page gives you the information about the different Cultures and Devo

15/12/2023

*మంకీ ట్రాప్ *
ఇటీవల మూడు రోజుల క్రితం చదివిన ఒక చిన్న వార్త ...
భాగ్యనగరంలో ఒక బిక్షగాడు మృతి.. పోస్టుమార్టం లో తేలింది ఏమిటంటే, అతనుకు 14 రోజుల నుంచి భోజనం లేదు... అంటే ఆకలి మరణం. ఇది కూడా పెద్ద సంచలన వార్త ఏమి కాదు, కానీ ఈ వార్తలోని కొసమెరుపు ఏమిటంటే బిక్షగాడి జోలిలో కానీ సంచిలో కానీ అక్షరాల మొత్తము 1లక్ష 34 వేల రూపాయలు దొరికాయి. న్యూస్ హెడ్డింగ్ కూడా ఇదేను. "బిచ్చగాడి దగ్గర భారీ మొత్తమని". ఇక్కడ బాగా గుంజి పడేస్తున్న విషయం ఏమిటంటే అంత డబ్బు ఉంచుకున్న బిక్షగాడు ఒక పూట ఆహారం ఎందుకు తీసుకోలేకపోయాడు? అదీ తన ప్రాణం పోతున్నా.. 14 రోజుల నుంచి ఆకలితో ఉన్నాడు.. తప్ప డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు? ఏమిటి ఈ మనస్తత్వం ? ఇటువంటి దౌర్భల్యం మనందరిలో కూడా ఉంటుందా? అంటే.. అవుననే చెబుతుంది మానసిక శాస్త్రము
"మంకీ ట్రాప్" అవును ఆఫ్రికాలోని ఒక తెగ వారు కోతులను వేటాడటానికి నికి చెట్టు తొర్రలో కానీ, పుట్టలో కానీ, ఇవి కాకపోతే ఎండు కొబ్బరికాయలో ... ఖచ్చితంగా కోతి చేయపట్టే అంత రంద్రం చేస్తారు. ఈ రంధ్రం ప్రత్యేకత ఏమిటంటే ఇది కోతి చేయి పట్టే అంత పెద్దది గా మరియు.. కోతి పిడికిలి బయటికి రానంత చిన్నదిగా ఉంటుంది.. ఇక ఈ రంద్రంలో కోతి కి కావలసిన అరటికాయనో వేరుశనగ గింజలనో పోసి ఉంచుతారు. దీనికి ఆశ పడిన కోతి రంద్రములో చేయి పేట్టి వాటిని పట్టుకుంటుంది. కానీ పిడికిలిని మాత్రం బయటికి తీయలేక పోతుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆ తెగ వారు ఆ కోతిని పట్టుకుంటారు. గమ్మత్తుగా మనుషులు తనను సమీపిస్తున్న... ప్రమాదం పొంచి ఉన్న.. కోతి మాత్రం ఆ పిడికిల్ని తెరవలేకపోతుంది.తాను పట్టుకొన్నది వదలలేక పోతుంది.చివరికి దొరికిపోతుంది. దీన్నే సింపుల్ గా మంకీ ట్రాప్ అంటాము.
నిజంగా మనకి ప్రమాదమని.. నష్టమని తెలిసినప్పటికినీ కొన్నిటిని మనం వదులుకోలేకపోతున్నామా ? అయితే ఇటువంటి మంకీ ట్రాప్ లో మనం ఉన్నట్లే.. రోజువారి కష్టపడి సంపాదించుకున్న కూలీ డబ్బులను దాచిపెట్టుకొని ఆసుపత్రికి వెళ్ళటానికి కూడా మనసు ఒప్పుకోకుండా తనువు చాలించిన చుట్టాలు నాకు చాలా మంది తెలుసు.నిజంగా డబ్బు అంతగా కట్టి పడేస్తుందా అంటే..డబ్బు కాదుకాని మన తత్వం మనల్ని ట్రాప్ లో పడేస్తుంది. విశిదంగా ఇంకా పరిశీలిస్తే మన నష్టాన్ని మనం అంత తొందరగా వదులుకోలేము అనిపిస్తుంది..... చచ్చిన బిచ్చగాడిని చూసి నవ్వుకునే మనము .. మనకు తెలియకుండానే మనం అదే ట్రాప్ లో ఉన్నామనిపిస్తుంది. ఎప్పుడో తెగిపోయిన ఒక బంధాన్ని పట్టుకొని ఇప్పటికి ఏడుస్తున్న వాళ్ళము ఎంతమంది లేము? ఒక మాట పంతానికి ఇంకెన్నో బంధాలను దూరం చేసుకుని ఒంటరిగా మిగిలిపోయిన వాళ్లు మనలో లేరా?వ్యాపార లాభాలు అంటూనో, పేరు ప్రతిష్ఠలంటునో వృత్తికి అంకితం అయిపోయి తన కుటుంబాన్ని పిల్లల్ని నిర్లక్ష్యం చేసిన పెద్దలు నాకు బాగా తెలుసు. మేము పరాజితులమని వాళ్లే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు. అందుకే చిన్న మోతాదుల కానీ పెద్ద మోతాదులో కానీ మనం కూడా ఇటువంటి ట్రాప్ లో ఏమైనా ఉన్నామేమో చూసుకోవాలి. అది బంధం కావచ్చు డబ్బు కావచ్చు, కీర్తి కావచ్చు.. మనల్ని పట్టేసి ఉంచుతుందేమో గమనించుకోవాలి. అవసరానికి దాన్ని వదులుకోగలమో లేదో చూసుకోవాలి. అప్పుడే మనము ఈ ట్రాప్ నుంచి బయటపడగలం.
మనల్ని ఏడిపించే జ్ఞాపకాలు...
నో చెప్పలేని మోహమాటలు...
తిరిగి అడగలేని అప్పులు...
దండిచలేని ప్రేమలు...
ఊపిరి సలపనివ్వని పనులు...
వత్తిడి పెంచే కోరికలు....
ఆరోగ్యాన్ని హరించే సంపాదనలు...
పేరు వెంట చేసే పరుగులు....
అన్నీ మంకీ ట్రాప్ లే.
మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పినట్లు " వదలటం గొప్పా పట్టుకోవడం గొప్ప? అంటే.. అవును సీతను వదిలేసి ఉంటే రావణుడు ప్రాణాలతో బతికేవాడు..

అందుకే ఫ్రెండ్స్ కొన్నిటిని వదిలేయడం అలవాటు చేసుకుందాం.. మరింత మనశ్శాంతిగా ఉందాము.

23/04/2022

*నమ్మకం__విశ్వాసం*

ఎత్తు అయిన రెండు భవనాల మధ్య ఒక తాడు కట్టబడి ఉంది. దాని మీద ఒక వ్యక్తి నడవసాగాడు. వందల అడుగుల ఎత్తున అత్యంత జాగ్రత్తగా అతను నడవసాగాడు..

చేతిలో పొడవయిన కర్ర ఉంది... భుజాలపై అతని కొడుకు ఉన్నాడు, అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు.... అతను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రెండో భవనం వైపు వచ్చాడు..,

అందరూ చప్పట్లు కొట్టారు...కేరింతలతో ఆహ్వానం పలికారు...చేతులు కలిపారు.ఫోటోలు తీసుకున్నారు.,

నేను ఈ తాడు మీద తిరిగి అవతలికి వెళ్లాలనుకుంటున్నాను. వెళ్లగలనా? అని అతను ప్రశ్నించాడు..
వెళ్లగలవు.., వెళ్లగలవు జనం సమాదానం..
నా మీద నమ్మకం ఉందా?..ఉంది..,ఉంది. కావాలంటే మేం పందానికి అయినా సిద్దం..!

అయితే మీలో ఎవరయినా నా భుజం మీద ఎక్కండి.., అవతలకి తీసుకు పోతాను..! అన్నాడు... అక్కడంతా నిశబ్దం..జనం మాటలు ఆగి పోయాయి.ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు.ఉలుకు లేదు.., పలుకు లేదు..,

నమ్మకం వేరు.., విశ్వాసం వేరు...విశ్వాసానికి సర్వస్వ సమర్పణ భావం కావాలి. ఈ రోజుల్లో దైవభక్తిలో మనం కోల్పోతున్నది ఇదే..

దేవుడు_అంటే_నమ్మకమే__కానీ_విశ్వాసం_లేదు.భగవంతునిపై మనకు పూర్తి విశ్వాసం వచ్చినప్పుడే దేవుడు మనల్ని నిరంతరం కాపాడుతుంటాడు.....

15/04/2022

*ఈ ప్రపంచాన్ని నడిపించేది ఎవరు?*

*ఒక ఔషధపు సీసా*

*రాజస్థాన్‌ లో రమేష్ చంద్ర అనే దయగల ఒక శ్రీకృష్ణుని భక్తుడు ఉండేవాడు. అతనికి ఒక మందుల దుకాణం ఉండేది. షాపులో ఒక మూలన శ్రీకృష్ణుడి చిన్న చిత్రం ఉంది. ప్రతిరోజూ దుకాణం తెరిచిన తర్వాత, తన చేతులు కడుక్కొని, ఆ దేవుని బొమ్మను శుభ్రం చేసి, దీపం, ధూపం మొదలైన వాటిని చాలా భక్తితో వెలిగించేవాడు.*

*అతనికి రాకేష్ అనే కొడుకు కూడా ఉన్నాడు, తన చదువు పూర్తి చేసి తండ్రితో పాటు దుకాణంలో కూర్చునేవాడు. తన తండ్రి రోజూ ఇదంతా చేయడం చూస్తూ ఉంటాడు. నవీన యుగంలో చదువుకున్న యువకుడు అవడంవల్ల తన తండ్రికి , దేవుడు అంటూ ఎవరూ లేరని, ఇదంతా మన మనస్సు యొక్క భ్రమ అని వివరించేవాడు.*

*సూర్యుడు తన రథంలో విశ్వం చుట్టూ తిరుగుతున్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని సైన్స్ రుజువు చేసిందని చెప్తూ.. ఇలా ప్రతి రోజూ సైన్స్‌ నుండి కొత్త ఉదాహరణలను ఇస్తూ, దేవుడు లేడని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.*

*తండ్రి అతనిని ఆప్యాయంగా చూసి నవ్వేవాడు తప్ప ఈ అంశంపై వాదించడానికి లేదా చర్చించడానికి ఇష్టపడేవాడుకాదు.*

*కాలం గడిచేకొద్దీ తండ్రి వృద్ధుడయ్యాడు. ఇప్పుడు తన అంతం ఆసన్నమైందని బహుశా అతను తెలుసుకుని ఉంటాడు... అలా ఒకరోజు తన కొడుకుతో ఇలా అన్నాడు," నాయనా, నువ్వు భగవంతుని నమ్మినా నమ్మకపోయినా, నువ్వు కష్టపడి పని చేస్తూ, దయతో, నిజాయితీగా ఉంటే చాలు. అయితే నేను చెప్పే ఈ ఒక్క మాట విని, పాటిస్తావా?"*

*కొడుకు,“అలాగే నాన్నా, తప్పకుండా పాటిస్తాను”, అని అన్నాడు. తండ్రి ఇలా చెప్పాడు, "నాయనా, నా మరణానంతరం, ప్రతిరోజు దుకాణంలో ఉన్న దేవుని బొమ్మను శుభ్రం చెయ్యి; రెండవది, నువ్వు ఎప్పుడైనా ఏదైనా సమస్యలో ఇరుక్కుంటే, చేతులు జోడించి, శ్రీకృష్ణునికి నీ సమస్యను చెప్పుకో. నేను చెప్పినట్లు ఈ ఒక్క పని చెయ్యి చాలు." కొడుకు ఒప్పుకున్నాడు.*

*కొన్ని రోజుల తర్వాత తండ్రి చనిపోయాడు, కాలం అలా గడిచిపోతూ ఉంది... ఒక రోజు జోరున వర్షం కురుస్తోంది. రాకేష్ రోజంతా షాపులో కూర్చునే ఉన్నాడు, కస్టమర్లు కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఆపై కరెంటు కూడా ఇబ్బంది పెడుతోంది. అకస్మాత్తుగా వర్షంలో తడుస్తూ ఓ కుర్రాడు పరుగు పరుగున వచ్చి "అన్నా... ఈ మందు కావాలి... మా అమ్మకి చాలా జబ్బుగా ఉంది... వెంటనే ఈ మందు నాలుగు చెంచాలు వేస్తేనే ... అమ్మ బతుకుతుందని డాక్టర్ చెప్పారు... నీ దగ్గర ఈ మందు ఉందా?" అని అడిగాడు.*

*రాకేష్ మందుచీటి చూసి వెంటనే “ఆ... నా దగ్గర ఉంది” అని వెంటనే తీసి ఇచ్చాడు. బాలుడు చాలా సంతోషించి, వెంటనే మందుసీసాతో వెళ్ళిపోయాడు.*

*అయితే ఇది ఏమిటి!!*
*అబ్బాయి వెళ్లిన కొద్దిసేపటికే రాకేష్ కౌంటర్ వైపు చూడగానే చెమటలు పట్టాయి... కొద్దిసేపటి క్రితం ఓ కస్టమర్ ఎలుకల మందు సీసా తిరిగి ఇచ్చేసి వెళ్ళాడు. లైట్లు వెలగకపోవడంతో లైట్లు వచ్చింతర్వాత దానిని సరైన స్థలంలో పెడదామని భావించి రాకేష్ కౌంటర్ పై సీసాను అలాగే వదిలేశాడు. అయితే మందు కోసం వచ్చిన ఈ బాలుడు తన మందు సీసాకు బదులు ఎలుకల మందు సీసాను తీసుకెళ్ళాడు... ఆ బాలుడు నిరక్షరాస్యుడు కూడా.*

*" ఓరి భగవంతుడా !!" అని రాకేష్ నోటి నుండి అసంకల్పితంగా ఆ మాటలు వెలువడ్డాయి, "ఏమిటి ఈ విపత్తు!!" అనుకుని, అప్పుడు తన తండ్రి మాటలు గుర్తుకొచ్చి, వెంటనే, ముకుళిత హస్తాలతో, బరువెక్కిన హృదయంతో శ్రీకృష్ణుని చిత్రపటం ముందు ప్రార్థించడం ప్రారంభించాడు. "ఓ ప్రభూ! మీరు ఉన్నారని తండ్రి ఎప్పుడూ చెబుతుండేవారు. మీరు నిజంగా ఉన్నట్లయితే, దయచేసి ఈ రోజు ఈ అవాంఛనీయ సంఘటన జరగనివ్వకండి. తన కొడుకు చేతిలో నుండి తల్లిని విషం త్రాగనివ్వకండి ... ప్రభూ ఆ విషాన్ని త్రాగనివ్వకండి!!!"*

*"అన్నా!" అని అప్పుడే వెనుక నుంచి ఒక గొంతు వినిపించింది... "అన్నా, నేను బురదలో జారిపోయాను, మందు సీసా కూడా పగిలిపోయింది! దయచేసి నాకు మరో సీసా ఇవ్వవా", అని అడిగాడు.*

*ప్రేమపూరితమైన చిరునవ్వుతో ఉన్న భగవంతుని చిత్రాన్ని చూస్తూండగా రాకేష్ ముఖంపై కన్నీళ్లు కారడం మొదలయ్యాయి!!!*

*ఆ రోజు, ఈ సమస్త విశ్వాన్ని నడిపేవారు ఎవరో ఉన్నారని అతనిలో ఒక విశ్వాసం మేల్కొంది... కొందరు ఆయన్ని భగవంతుడంటే, మరికొందరు సర్వోన్నతుడు అంటారు, కొందరు సర్వవ్యాపి అని, మరికొందరు దైవిక శక్తి అని అంటారు!*

♾️

*ప్రేమ, భక్తితో నిండిన హృదయంతో చేసిన ప్రార్థన ఎప్పుడూ ఆలకించబడుతుంది*
🚩👏🚩👏🕉️🕉️👏🚩👏🚩

09/03/2022

కాస్త ఓపికతో చదివితే నాకు తెలియని విషియాలు తెలిసాయి. అందుకే share చేశాను. 🙏
ఫ్రెండ్స్ జీవితం అనేది పరుగుపందెం కాదు
కొంత దూరం పరిగెత్తగానే ముగియడానికి
జీవితం చదరంగం లాంటి ఒక ఆట
దీన్ని మీరు దేవుడితో ఆడతారు
మీరు పావుని కదిపిన ప్రతిసారి
దేవుడు తన పావుని కదుపుతాడు
మీరు కదిపే పావుల పేర్లు ఎంపికలు
దేవుడు పావులకు పర్యవసానాలు అని పేరు.

మీ సంకల్పం స్వచ్ఛమైనది నిష్కళంకమైనది నిస్వార్ధమైనది నిరహంకారమైనది అయితే అలుపెరగక ప్రయత్నించండి

ఆ తండ్రి పరమాత్మ మనతో ఎన్నో ఆటలు ఆడతాడు
ప్రతి ఆటలో మనమే గెలిచేలా
ప్రతి పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకునేలా
మన మనసుని మన అంతరాత్మను సిద్ధం చేసుకోవాలి. అంతే కానీ సంకల్పం మధ్యలో వదిలేయకూడదు.

ఒకటి చెప్పనా ఆ తండ్రి మనతో
మనం ఆడ లేని ఆట ఆడాడు
మరీ కష్టమైన పరీక్షలు పెట్టాడు
అయినా వాటిలో విఫలమవుతున్న అంటే
దాని కారణం మనమే.
ఎలా అంటారా వేరొకరి జీవితంతో పోల్చుకోవడం
ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరుని గ్రహించకపోవటం

జీవితం వెలుగుతో ఉండాలంటే మనసులో చీకటిని తొలగించాలి. అలాగే జీవితం మనదే అయినప్పుడు దాని కోసం చేయాల్సిన కష్టం కూడా మనదే ఓడిన గెలిచిన కష్టపడటం మాత్రం ఆపకూడదు.
మన కష్టం అప్పటికప్పుడు గెలుపుని ఇవ్వకపోవచ్చు.కానీ ఎప్పడోకప్పుడు
ఆ గెలుపును మనకు పక్కగా పరిచయం చేస్తుంది.

గొంగళి పురుగు చుడండి తన జీవితం అయిపోయింది అని బాధపడే లోపే అందమైన సీతాకోక చిలుకలు మరి స్వేచ్ఛగా ఎగిరి పోతుంది.మనిషి జీవితం కూడా అంతే కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే
కొత్త జీవితం కచ్చితంగా మొదలవుతుంది

శ్రీ రామకృష్ణ పరమహంస గారు చెప్పిన
ఒక చిన్న సంఘటన...చెబుతాను వినండి

కాళీమాత ఆలయంలో ఓరోజు ప్రసాదంగా ఇవ్వడానికి లడ్డూ తయారు చేస్తున్నారు.
అయితే ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు..
లడ్డూకి చీమలు పట్టడం మొదలైంది.

లడ్డూ తయారు చేస్తున్న వారికి ఏం చేయాలో తెలీలేదు. చీమలను చంపకుండా ఎలా?" అని ఆలోచనలో పడ్డారు. వాటిని చంపకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పమని రామకృష్ణ పరమహంసను సలహా అడిగారు.

అప్పుడాయన చీమలు వస్తున్న దారిలో చక్కెర పొడి చల్లండి. వాటిని తీసుకుని చీమలు వెళ్ళిపోతాయి,
ఇక ఇటు రావు అని సూచించారు.
పరమహంస చెప్పినట్లే చీమలొచ్చే దారిలో
చక్కెర పొడి చల్లారు.
ఆ పొడిని చూడటంతోనే వాటిని నోట కరుచుకుని చీమలు కాస్సేపటికల్లా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి....
సమస్య కొలిక్కి వచ్చింది....

ఈ దృశ్యాన్ని చూసిన పరమహంస గారు
ఇలా అన్నారు మనుషులూ కూడ
ఈ చీమల్లాంటివారే.

తాము కోరుకున్న వాటిని పొందాలనుకుంటూనే
తమకు తెలియకుండానే దానిని మధ్యలోనే విడిచిపెట్టి మరొకటేదైనా దారిలో కనిపిస్తే దానితో సరిపెట్టుకుంటారు.తాము ముందనుకున్న
లక్ష్యాన్ని విడిచిపెడతారు అని చెప్పారు.

తమకు కావలసింది చక్కెర కాదు లడ్డూ పొడేనని
ఒక్క చీమా ముందుకు రాలేదు చూసేరా.
మనం కూడా అలానే ‘భగవంతుడు సర్వస్వము’ అనుకొనే ధ్యాన సాధన మొదలు పెడతాము,
మధ్యలో ఎవరో ఎదో చెపితే దాని వద్దకు వెళ్లి
మన సాధన అంతా వృధా చేసుకొంటాము..

తీయగా ఉందన్న చక్కెరతో సరిపెట్టుకుని వెళ్ళిపోయాయి చీమలు.
రవ్వంత చక్కెర సంతోషం చాలనుకున్నాయవి.
లడ్డూ అంత పరిపూర్ణమైన సంతోషం పొందాలనుకునే వారు చాలా తక్కువ మందే
అని పరమహంస చెప్పారు.

ఫ్రెండ్స్ విన్నారుగా అలాగే మన సంకల్పానికి
మధ్యలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి.దేనికి లొంగకండి
మన సంకల్పాన్ని వదిలేయకండి
సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే
విశ్వం మొత్తం మనకు అనుకూలంగా మారి
మనకు సహకరిస్తుంది కచ్చితంగా
నేను చెప్పేది నిజం
నా జీవితంలో ఎన్నో అనుభవాలు 🙏

శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి 🙏

12/11/2021

*🌈మనకోసం ఆకాశం💥*
*...ఎన్.శివ నాగేశ్వర రావు*
🎊💦✨🌹🌼🏵️

*గేటు తెరుచుకున్న చప్పుడయింది.*

*అప్పుడే నిద్రపడుతున్న శంకరానికి నిద్రా*
*భంగం అయింది.*

*తలతిప్పి గడియారం వంక చూశాడు.*
*సమయం రాత్రి పదకొండు అయింది. “ఈ సమయంలో వచ్చింది ఎవరా? అని ఆలోచించలేదతను.* *వచ్చింది నాన్న కోసమే!” అని మాత్రం అనుకున్నాడు.*

అంతలో పక్కగది తలుపు తెరుచుకుంది. "నువ్వా రమణయ్యా! ఈ సమయంలో వచ్చావు. మందేమైనా కావాలా?" అని తండ్రి అడగడం శంకరానికి వినిపిస్తూనే ఉంది.

"ఉన్నట్లుండి ఆయాసం వచ్చిపడింది. ఊపిరి సలపడం లేదు. అందుకే ఈ సమయంలో వచ్చాను. ఏమీ అనుకోకు
క్రిష్ణమూర్తీ!" అన్నాడు రమణయ్య.

“మరేం ఫర్వాలేదు.అలా కూర్చో! మందు ఇస్తాను" అన్నాడు క్రిష్ణమూర్తి. అతనిచ్చిన మందు వేసుకుని అయిదు నిముషాల తరువాత వెళ్లిపోయాడు రమణయ్య.

క్రిష్ణమూర్తి బయట గేటు వేసి వచ్చి మంచం మీద నడుము వాల్చాడు.నిద్రాభంగం అయిన శంకరానికి మరిక నిద్ర పట్ట
లేదు. అందుకు కారకుడైన తండ్రి మీద పీకలదాకా కోపం వచ్చింది. అది వెంటనే వెళ్లగక్కకపోతే మరిక నిద్రపట్టదని
నిశ్చయం అయ్యాక మంచం మీద నుంచి లేచి తండ్రి గదిలోకి వెళ్లాడు.

“ఏం శంకరం! నిద్ర పట్టలేదా?" పలకరించాడు క్రిష్ణమూర్తి.“పట్టిన నిద్ర నీ వలన పాడైంది. అయినా మందులు ఇవ్వడానికి వేళాపాళా లేదా? ఎప్పుడు పడితే అప్పుడు రావద్దని వాళ్లకు చెప్పు" అన్నాడు విసుగ్గా.

“వచ్చే రోగం వేళాపాళా చూసుకుని వస్తుందా? ఏదోచేతనైన సహాయం చేస్తున్నాను. కోపగించకు" అన్నాడు
క్రిష్ణమూర్తి.

"నీ మటుకు నీవుండక ఎందుకొచ్చిన సహాయాలు? ఇంటిని సత్రం చేస్తున్నావు. ఎప్పుడూ ఎవడో ఒకడు వస్తూనే ఉంటాడు" చికాకు పడుతూ తన గదిలోకి వెళ్లిపో
యాడు శంకరం.

కొడుకు మాటలకు క్రిష్ణమూర్తి మనసు చివుక్కు మంది. అది అతనికి కొత్తేమీ కాదు. ప్రతీసారీ బాధనిపిస్తూనే ఉంటుంది. ప్రక్కవాడికి సహాయం చేయడం తప్పా? మనిషికి మనిషి సహాయం చేయకపోతే మరెవరుచేస్తారు? మనిషి తన మటుకు తాను ఉంటే కుంచించుకుపోతాడు. పదిమందికి సహాయం చేస్తేపరిమళిస్తాడు అన్నది అతని భావన. అతను అలాగే
ఉంటాడు. అందరూ అలా ఉండాలని అనుకుంటాడు.

శంకరానికి నిద్రపట్టలేదు. తండ్రితో అంత కటువుగా మాట్లాడకుండా ఉండ వలసింది అనుకున్నాడు.

శంకరానికి పదేళ్ల వయసు వచ్చేసరికి
అతని తల్లి కాలం చేసింది. ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా క్రిష్ణమూర్తి మరలా రెండో పెళ్లి చేసుకోలేదు. శంకరాన్ని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేశాడు. ఆ అభిమానం
శంకరానికి లేకపోలేదు. వద్దనుకుంటూనే తండ్రి మీద కోపగించుకుంటూ ఉంటాడు.

తలతిప్పి చూసిన శంకరానికి భార్య ఇందిర, అయిదేళ్ల కొడుకు అనిల్ నిద్రపోతూ కనిపించారు.శంకరానికి కంటిమీదకు కునుకు రాలేదు.

తెలతెలవారుతుండగా బయట గేటు తీసిన చప్పుడయింది.అప్పుడే నిద్ర పడుతున్న శంకరానికి వెంటనేమెలకువ వచ్చింది. 'ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. అప్పుడే తగలడ్డారు' అని మనసులో తిట్టుకున్నాడు.

క్రిష్ణమూర్తికి యోగాలో మంచి ప్రవేశం ఉంది. రిటైరయ్యాక నలుగురిని పిలిచి ఆసనాలు వేయించడం, ధ్యానం
చేయించడం వంటివి నేర్పించడం మొదలు పెట్టాడు.

ఎప్పుడూ పదిమందికి తక్కువ కాకుండా జనం అతని దగ్గరకు వస్తూనే ఉంటారు.
అది శంకరానికి నచ్చదు. ఎవరింటి దగ్గర వాళ్లుయోగా చేసుకోవచ్చు కదా! మా ఇంటి మీదకు వచ్చిపడతారెందుకు? అనుకుంటాడు. అదే విషయం తండ్రితో
వాదించాడు కూడా!

ఎవరింటి దగ్గర వాళ్లుఅయితే
బధ్ధకిస్తారు.అదే పదిమందీ ఒక చోట చేస్తే శ్రద్ధగా చేస్తారు.మనిషి పది మందితో కలిస్తే చాలా ప్రయోజనాలుంటాయి. నీవు కూడా వచ్చి వాళ్లతో పాటు యోగా చేయి. ఆరోగ్యానికి ఆరోగ్యం.మానవ సంబంధాలు మెరుగుపడతాయి" అని చెప్పేవాడు
క్రిష్ణమూర్తి.ఆ మాటలు శంకరానికి రుచించేవి కావు.

సమయం అయిదు గంటలు అయింది. శంకరం మరలా నిద్రపోవడానికి ప్రయత్నించాడు గాని నిద్ర పట్టలేదు.
అతనికి త్వరగా నిద్ర పట్టదు. పట్టినా చిన్న చప్పుడుకే మెలకువ వచ్చేస్తుంది.
అది తెలుసుకున్న క్రిష్ణమూర్తి ఒకసారి 'శంకరం! నీవు ఇష్టపడే ఒంటరితనం నీలో అభద్రతా భావంపెంచింది. నీ సంతోషం హరిస్తున్నది. అది నీవు గ్రహించడం లేదు. నీ మటుకు నీవుంటే నీ సంతోషం నీది. నీ
దుఃఖం నీది. బయటకి వచ్చి పదిమందితో పంచుకుంటే నీ సంతోషం మరింత పెరుగుతుంది. దుఃఖం తగ్గుతుంది" అని సలహా ఇచ్చాడు. తండ్రి మాటలు ఛాద
స్తంగా కొట్టిపారేశాడు శంకరం.

ఏడు గంటలకు యోగా క్లాస్ పూర్తి అయింది. వచ్చినవారు వెళ్లిపోయారు. క్రిష్ణమూర్తి డాబా మీద నుంచి కిందకు దిగాడు. అప్పటికీ శంకరం కాఫీ తాగి పేపర్
చదువుకుంటున్నాడు.

“కొంచెం సేపు ధ్యానం చేయకూడదూ? ఏకాగ్రత పెరుగుతుంది" అన్నాడు క్రిష్ణమూర్తి. శంకరం పేపర్ లోంచి
తలెత్తకుండానే “అవన్నీ పనీపాటా లేనివారికి. నాకెందుకు?" అన్నాడు.

క్రిష్ణమూర్తి మౌనంగా లోనికి నడిచి అప్పుడే నిద్రలేచిన మనవడ్ని పలకరించి వాడితో సూర్యనమస్కారాలు ప్రాక్టీస్ చేయించ
సాగాడు. అది చూసిన శంకరం “ఈయనగారు ఎవరినీ వదలడు" అనుకున్నాడు.

శంకరం స్నానం చేసి, టిఫిన్ తిని ఆఫీస్ కి బయలుదేరబోతుండగా క్రిష్ణమూర్తి అతని దగ్గరకువచ్చాడు.

“ఏమిటి?” అడిగాడు శంకరం. అతను,
శంకరానికి అయిదు వందలు అందించి “ఈ
చిరునామాకు మనీ ఆర్డర్ పంపించు" అని
చెప్పాడు. "ఎందుకట?" వివరం అడిగాడు శంకరం.

"ఆ అబ్బాయికి చిన్న వయసులోనే గుండెజబ్బట. ఆపరేషన్ కి ఆర్ధిక
సహాయం కోరుతూ పేపర్ ప్రకటన
ఇచ్చారు. నేను చేయగల సహాయం
చేస్తున్నాను" చెప్పాడు క్రిష్ణమూర్తి.

"అవన్నీ దొంగ ప్రకటనలు" చెప్పాడు శంకరం."మనిషి మీద అంత అపనమ్మకం పెంచుకోకు శంకరం! మనిషి, మనిషిని నమ్మకపోతే అది మానవ మనుగడకే ముప్పు" కొడుకును హెచ్చరించాడు క్రిష్ణమూర్తి.

అంతలో అటు వచ్చిన ఇందిర, భర్తతో 'మామయ్య పెన్షన్ డబ్బు ఆయన ఇష్టం వచ్చినట్లు వాడుకోమని మీరే కదా ! చెప్పారు.
ఆయన చెప్పినట్లు మని ఆర్డర్ చేయండి.
సరిపోతుంది" అన్నది.

కృష్ణమూర్తి కోడలి వంక ప్రేమ పూర్వకంగా చూశాడు.శంకరం, భార్య వంక అదోలా
చూసి బయటకు నడిచాడు.

శంకరం స్కూటర్ స్టార్ట్ చేస్తూ "అనిల్ ని ఒకసారి బయటకు పిలువు" అని భార్యకు చెప్పాడు."అనిల్ !డాడీ పిలుస్తున్నారు" కేక వేసింది ఇందిర.

వీడియో గేమ్ ఆడుకుంటున్న అనిల్ బయటకురాకుండానే "బై డాడీ" అని అరిచి చెప్పాడు.కొడుకు బయటకు రాక పోవడం
శంకరానికి బాధ కలిగించింది. ఆఫీస్ కి బయలుదేరిపోయాడు.

మనవడు బయటకు రాకుండానే బై చెప్పడం గమనించిన క్రిష్ణమూర్తి "మనిషి మనసుతో చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీయాంత్రికం అయిపోతున్నాయి. కొంత కాలానికి మనిషి, మనసులేని మరబొమ్మ అయిపోతాడు" అనుకున్నాడు.

అతను మనవడి దగ్గరకు వెళ్లి 'అనిల్! నాన్న పిలిచినప్పుడు బయటకు వెళ్లి ప్రేమగా బై చెప్పాలి.అప్పుడతని మనసుకు సంతోషం కలుగుతుంది.వీడియో గేమ్ ఎప్పుడూ ఉంటుంది. డాడీ మళ్లీ
సాయంత్రానికి గాని రాడు" అని చెప్పాడు.

“అలాగే తాతయ్యా! రేపటి నుంచి బయటకు వెళ్లి డాడీకి బై చెప్తాను" అన్నాడు అనిల్. "కొడుకు కంటే మనవడే నయం. విషయం గ్రహించాడు" అనుకున్నాడు క్రిష్ణమూర్తి.

ఆయనకు భోజనం వడ్డించే సమయంలో
“మామయ్యా! ఎల్లుండి అనిల్ పుట్టినరోజు. మీ యోగా వాళ్లను భోజనానికి పిలుద్దాం" అన్నది. ఇందిర. అతను కోడలు
వంక అపురూపంగా చూశాడు. అతనికి శంకరం ఒక్కడే కొడుకు, కూతుళ్లు లేరు. అందుకని అతను కోడలులోనే కూతురిని చూసుకుంటాడు. ఆ అమ్మాయి కూడా అంతే.
మామగారిని పన్నెత్తి మాట అనదు. గౌరవం
చూపిస్తుంది. ప్రేమ కురిపిస్తుంది.

"వాళ్లను పిలవడం శంకరానికి ఇష్టం
ఉండదేమో!" అన్నాడు క్రిష్ణమూర్తి. “ఆయనఎవరినీ పిలవొద్దనే అన్నారు. అయినా రోజూ మన ఇంటికి వచ్చేవాళ్లకు చెప్పక పోతే ఏం బాగుంటుంది? మీరు ఆహ్వా
నించండి. మీ అబ్బాయికి నేను నచ్చ చెప్తానులెండి" అన్నది ఇందిర.
“అలాగేనమ్మా!" అన్నాడు. క్రిష్ణమూర్తి.

ఆ సాయంత్రం శంకరం ఇంటికి వచ్చాక “మనీ ఆర్డర్ పం పావా" అని అడిగాడు క్రిష్ణమూర్తి. "పంపాను. అది చూసి మా కొలీగ్ నవ్వాడు"అని చెప్పాడు శంకరం.

"ఎందుకు నవ్వాడు?" అడిగాడు క్రిష్ణ మూర్తి."తనకు ఉన్నదేదో మనవడికి ఇవ్వాలి గాని బయట వాళ్లకు దానం చేయడం ఏమిటి! అని కామెంట్ చేశాడు" చెప్పాడు శంకరం. “నువ్వేమన్నావు?"ఆరా తీశాడు క్రిష్ణమూర్తి. "అది నిజమే కదా! అందుకే మౌనం వహించాను" చెప్పాడుశంకరం.

"మనవాళ్లకే ఉపయోగ పడాలి అనుకోవడం స్వార్థం అవుతుంది.అందరూ మనవాళ్లే అనుకోవడం ప్రేమ అనిపించుకుంటుంది. మనిషి ప్రేమించడం నేర్చుకోవాలని నీ కొలీగ్ కి చెప్పు" అన్నాడు క్రిష్ణమూర్తి.

శంకరం తండ్రివంక విసుగ్గా చూసి ఊరుకున్నాడు.

శంకరం కాఫీ తాగుతుండగా "అనిల్ పుట్టిన రోజుకి యోగా వాళ్లను పిలవమని మామయ్యకు చెప్పాను" అంది ఇందిర.
“నేననుకోవడం ఈ ఆలోచన నీది కాదు. మా నాన్నది" అన్నాడు శంకరం. ఇందిర కాదని చెప్పినాశంకరం వినిపించుకోలేదు.

కాఫీ తాగడం పూర్తయ్యాక తండ్రి దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో క్రిష్ణమూర్తి
మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు.
“బాబు పుట్టిన రోజుకి యోగావాళ్లను పిలుస్తానన్నావట. వాళ్లు రావడం నాకిష్టం లేదు"చెప్పాడు శంకరం.

“అయితే మీ ఆఫీస్ స్టాఫ్ ని పిలువు. పుట్టిన రోజునాడు పదిమంది వచ్చిబాబు మీద అక్షింతలు వేసి దీవిస్తే మంచిది"
చెప్పాడు క్రిష్ణమూర్తి.

“మావాళ్లు బిజీ. రాలేరు" చెప్పాడుశంకరం. “ఇంట్లో టీవీ చూస్తూ కూర్చోవడం,
ప్రక్కింటి వాళ్లతో కూడా సెల్ ఫోన్ లో
మాట్లాడ్డం ఇదేగా మీ దృష్టిలో బిజీగా
ఉండడం?" ప్రశ్నించాడు క్రిష్ణమూర్తి.

“అదేం కాదు. పిల్లల్ని కష్టపడి చదివిం చడం, టాలెంట్ పరీక్షలు రాయించడం వంటి
పనుల్లో వాళ్లు బిజీ" చెప్పాడు శంకరం.
“పిల్లల మనసుల్ని చదువుల పేరుతో
మీరు ఎదగనివ్వడం లేదు. మొగ్గలుగా ఉండగానే తుంచేస్తున్నారు. మానవ సంబంధాలు దెబ్బతినడానికి ఇది ఒక కారణం" అన్నాడు క్రిష్ణమూర్తి,

అంతలో అక్కడకు వచ్చిన ఇందిర,
భర్తతో “రోజూ మన ఇంటికి వస్తున్నారు.
ఏనాడూ మనం కాఫీ ఇచ్చింది కూడా లేదు.
ఒక్క రోజైనా పిలిచి పలకరిస్తేబాగుంటుంది" అన్నది.

శంకరం భార్య వంక గుర్రుగా చూశాడు.
ఆ రాత్రి క్రిష్ణమూర్తికి చాలాసేపు నిద్రపట్ట
లేదు. అతను తరిగిపోతున్న మానవ సంబంధాల గురించి ఆలోచించాడు. యంత్రాల మధ్య పడి మనిషి కూడా ఒక యంత్రంగా మారిపోతున్నాడు. మనిషికిమనసే తరగని ఆస్తి అన్న సత్యం మరచి పతనాన్ని కొని
తెచ్చుకుంటున్నాడు” అని ఆలోచించాడు.

అనిల్ పుట్టిన రోజు వచ్చింది. ఆ రోజు సాయంత్రం క్రిష్ణమూర్తి పిలుపు అందుకున్న యోగా బృందం వాళ్లింటికి వచ్చింది. బాబుకి నీతి కథల పుస్తకాలు, ఆటబొమ్మలు
తెచ్చిచ్చారు. తాము తెచ్చిన స్వీట్స్ బాబు చేత తినిపించారు. అక్షింతలు వేసి దీవించారు. పాటలు పాడి అనిల్ నిఆనందపరిచారు. వాడి చేత ఆడించారు, పాడించారు.
శంకరంతో కూడా కలుపుగోలుగా మాట్లాడారు.

ఎందుకో తెలీదుగానీ శంకరానికి కూడా
ఆ సాయంత్రం ఆనందంగా గడిచిందనిపించింది. వాళ్లు వచ్చి ఉండకపోతే
ఆ వేడుకకు అంత నిండుదనం వచ్చి ఉండేది కాదనుకున్నాడు.

వాళ్లందరూ వెళ్లాక క్రిష్ణమూర్తి, కొడుకుతో “మావాళ్లు రావడం నీకేమైనా ఇబ్బందిగా అనిపించిందా?" అని అడిగాడు.

“అటువంటిదేం లేదు. సంతోషంగానే అనిపించింది"మనస్ఫూర్తిగా చెప్పాడు శంకరం.

“శంకరం! ఒక సత్యం చెబుతాను. నాది ఛాద
స్తంగా భావించకుండా మనసు పెట్టి అలోచించు.మొక్కను తెచ్చి గదిలో పెడితే వాడిపోతుంది. బయట పెడితే చిగురిస్తుంది. దానికి జీవం పోసేది సూర్యకిరణం. ఇదే సూత్రం మనిషికీ వర్తిస్తుంది. ఒంటరిగా
గదిలో కూర్చుంటే మనసు చచ్చిపోతుంది. బయటకువెళ్లి పదిమందితో గడిపితే అది సేద తీరుతుంది. మనసుకు ప్రాణం పోసేది ప్రేమ అని మరువకు" అని
చెప్పాడు క్రిష్ణమూర్తి.

ఎప్పటిలా ఈసారి తండ్రిమాటలు శంకరం ఖండించలేదు. మౌనం వహించాడు.
ఆ రాత్రి క్రిష్ణమూర్తికి గుండెలో నొప్పిగా అనిపించింది. కొడుకును నిద్ర లేపి విషయం చెప్పాడు.ఎప్పుడూ ఏ నొప్పీ అనని తండ్రి ఒకేసారి గుండెనొప్పి అనగానే శంకరం కంగారుపడ్డాడు. "హాస్పిటల్ కి వెళ్దాం!" అన్నాడు.

“ఉదయం వెళ్దాం" అంటూ క్రిష్ణమూర్తి హోమియో మందులేసుకుని కళ్లు
మూసుకుపడుకున్నాడు. శంకరం తండ్రి మంచం పక్కనే పడక కుర్చీ వేసుకుని కూర్చున్నాడు.

అర్ధరాత్రి చూస్తే తండ్రి ఊపిరి పీలుస్తున్నట్లు అనిపించలేదు. నాడి చూసిన శంకరం తండ్రి ప్రాణం పోయినట్లు గ్రహించి కంట తడి పెట్టుకున్నాడు.విషయం తెలుసుకున్న ఇందిర, అనిల్ పెద్దగా ఏడవ సాగారు.

బంధువులకు, స్నేహితులకు కబుర్లు అందాయి.అంత దుఖం లోనూ శంకరానికి
ఆశ్చర్యం కలిగించింది ఏమంటే కబురు చేసిన వారి కంటే వచ్చిన వారు పది రెట్లున్నారు.
ఇంటి ముందున్న రోడ్డు అంతా జనంతో నిండిపోయింది. అందరూ విషాద వదనాలతో కనిపించారు.

క్రిష్ణమూర్తి మంచితనం గురించి,అతను తమకు చేసిన సహాయం గురించి కథలు కథలుగా చెప్పుకోసాగారు.

“శంకరం! పూలదండలోని దారం బయకు కనిపించదు. కానీ అది పూలనన్నింటినీ దగ్గరకు చేరుస్తుంది.ప్రేమ కూడా అంతే! అది బయటకు కనిపించదు. కానీ
మనుషులనందరినీ దగ్గరకు చేరుస్తుంది" అన్న తండ్రిమాటలు గుర్తుకొచ్చాయి శంకరానికి.

మధ్యాహ్నానికి శవయాత్ర మొదలయింది. పాడెమోయడానికి చాలామందిముందుకు వచ్చారు. భుజం మార్చుకుంటూ తమ అభిమానం చాటుకున్నారు. సాయంత్రానికి అంత్యక్రియలు కార్యక్రమం ముగిసింది.

ఆ తరువాత ప్రతీరోజు ఎవరో ఒకరు వచ్చి శంకరాన్ని కలిసి అతని తండ్రి మంచితనాన్ని పొగిడి, అతనికి ఓదార్పు మాటలు చెప్పేవారు. పెద్దకర్మ కూడా జరిగిపోయింది. ఇక అంతటితో అంతా ముగిసిపోయిందని ఇక ఎవరూ తమఇంటికి రారని ఊపిరి
పీల్చుకున్నాడు శంకరం.ఆ రాత్రి గాఢంగా నిద్రపోయాడు.

తెలతెలవారుతుండగా మెలకువ వచ్చింది. తండ్రి చనిపోయేవరకూ ప్రతీ రోజూ ఆ సమయానికి బయట గేటు తెరుచుకునేది. డాబా మీద తండ్రి, వచ్చినవారితో కలసి ఆసనాలు వేసేవాడు.వాళ్ల మాటలు, చిన్న చిన్న శబ్దాలు లీలగా వినిపించేవి.
అప్పట్లో వాళ్ల వలన నిద్రపాడైందని తిట్టుకునేవాడుశంకరం. ఇప్పుడా నిశ్శబ్దం అతని మనసుకు బాధను కలిగించింది.

భోజనం చేసి ఆఫీసుకి బయలుదేరి నప్పుడు పిలవకుండానే అనిల్ బయటకు వచ్చి బై చెప్పాడు. 'పిలిచినా రానివాడివి. ఈరోజు పిలవకుండానే వచ్చి బై
చెబుతున్నావు. ఏమిటి విశేషం?" అడిగాడు శంకరం.

“తాతయ్య చెప్పారు. నేను బయటకు వచ్చి నీకు 'బై' చెబితే నీ మనసుకు సంతోషం కలుగుతుందట" చెప్పాడుఅనిల్. శంకరం కళ్లముందు తండ్రి రూపం కదలాడింది.
మనసును ఎవరో మెల్లగా స్పృశించినట్లు
అనిపించింది.కన్నుల్లో చెమ్మ చేరింది.
కొడుక్కు ' బై' చెప్పి బయలుదేరి పోయాడు.

ఆ సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు కూరగాయల దుకాణానికి వెళ్లాడు. దుకాణం అతను ఆప్యాయంగా పలకరించి “నాన్నగారు పోయారని తెలిసింది. ఊరిలోలేక
రాలేక పోయాను. మహానుభావుడు. ఈ దుకాణం పెట్టుకోడానికి బ్యాంక్ లోన్ ఇప్పించి సహాయం చేశాడు.అతన్ని ఎప్పటికీ మరచిపోలేను" అని చెప్పాడు.

“నాన్న కనిపించకుండా ఎంత చేశాడు?” అనుకున్నాడు శంకరం. నెల రోజుల తరువాత శంకరానికి ఒక విషయం అర్థమయింది. తను భావించినట్లు చనిపోవడంతో తండ్రి అధ్యాయం ముగిసిపోలేదు. ప్రతిరోజూ ఎవరో ఒకరు క్రిష్ణమూర్తి సహాయాన్ని, మంచితనాన్ని, ప్రేమను శంకరం దగ్గర గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.

ఒకరోజు శంకరం టవల్స్ కొనడానికి బట్టల కొట్టుకువెళ్లాడు. అది పేరుమోసిన బట్టల దుకాణం. ఆ దుకాణం
యజమాని శంకరాన్ని చూడగానే పలకరింపుగా నవ్వి“మీరు క్రిష్ణమూర్తిగారి అబ్బాయి కదూ!” అని కూర్చోబెట్టి మర్యాద చేశాడు.

“అప్పుడప్పుడూ మీ నాన్నగారు వచ్చి ఇక్కడ కూర్చునేవారు. ఒకసారి నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నాననిచెప్పాను. మానసిక అశాంతి వలన అయి ఉంటుంది.ధ్యానం చేయమని సలహా ఇచ్చారు. ధ్యానం ఎలా చేయాలో కూడా వివరించారు. అప్పటినుంచి ధ్యానం చేస్తున్నాను. మనసు చాలా ప్రశాంతంగా ఉంటున్నది.ఆయన చనిపోవడం దురదృష్టకరం" అని బాధపడ్డాడు
దుకాణదారు.

తండ్రి ఎందరి మనసుల్లోనో నిలిచి పోయాడు అన్న సత్యం గ్రహించేసరికి శంకరానికి దిగులుగా అనిపించింది. అటు
వంటి తండ్రిని తను ఖాతరు చేసేవాడు కాదు. ప్రేమ చూపించేవాడు కాదు. ప్రతి చిన్న విషయానికి తప్పు పట్టేవాడు. శంకరం మనసులో తీవ్రంగా బాధపడ్డాడు.

అతను ఇల్లు చేరగానే ఇందిర ఒక ఉత్తరం అందించింది. చనిపోయిన తండ్రి పేరున ఉన్నదా ఉత్తరం.శంకరం కవరు చింపి చదివాడు.

"శ్రీయుతులు క్రిష్ణమూర్తి గారికి! నమస్సులు. మీవంటి వాళ్లు పంపిన విరాళం చిన్న మొత్తము కావచ్చు. కాని అది కష్టకాలంలో నాకెంతో ధైర్యాన్నిచ్చింది. నేను ఒంటరిని కాదు. నాకు తోడుగా చాలామంది ఉన్నారన్న ఆత్మసంతృప్తిని కలిగించింది. మీకు ధన్యవాదాలు... ఇట్లు .. గోపీ
అని ఉందా ఉత్తరంలో.

శంకరం గోడకు తగిలించిన తండ్రి ఫోటో వంకచూశాడు. “శంకరం! మనిషి- నేను, నా కుటుంబం అన్న సంకుచితత్వం నుంచి బయటపడి మనం - మన వసుధైక
కుటుంబం అన్న విశాల దృక్పథం అలవరచుకోవాలి" అని చెబుతున్నట్లు అనిపించింది.

ఆ రాత్రి శంకరానికి నిద్ర కరువయింది. తనకు,తండ్రికి తేడా ఏమిటో అతను స్పష్టంగా గ్రహించగలిగాడు.తన తండ్రి మనసున్న మనిషి. తను మనసులేని మరబొమ్మ.తనకు జీవన సౌందర్యం తెలియదు. అదెలా ఉంటుందో తండ్రి తెలియబరిచాడు.

ఒక ఆదివారం అతను తన తండ్రి బ్రతికి ఉండగా యోగాసనాలు వేయడానికి తమ ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరి ఇంటికి వెదుక్కుంటూ వెళ్లాడు. “మా నాన్నగారు చనిపోయారని మీరు మా ఇంటికి రావడం మానుకోకండి. నేనూ మీతో కలుస్తాను. యోగాతో నాన్నగారికి అంజలి ఘటిద్దాం" అని ఆహ్వానించాడు. అందుకు వారందరూ
సంతోషంగా తమ సమ్మతి తెలిపారు.

మరునాడు తెలతెలవారుతుండగా శంకరం ఇంటి బయటి గేటు తెరిచాడు. వస్తున్న వారందరికీ హృదయ పూర్వకంగా ఆహ్వానం పలికాడు. డాబా పైకి వెళ్లి వాళ్లతో
పాటు ఆసనాలు వేశాడు. ఆ తరువాత ధ్యానంలో కూర్చున్నాడు.

మనసులో తండ్రి రూపం కనిపించింది. “శంకరం!మనిషి తలుపులు మూసుకుని ఒంటరిగా గదిలో ఉండిపోతున్నాడు. అది తప్పు. మన కోసం ఆకాశం బయట వేచి
చూస్తున్నదని తెలుసుకోవాలి. ఇంటి తలుపులే కాదు,మనసు తలుపులు కూడా తెరుచుకుని బయటకు రావాలి.అప్పుడు ప్రపంచమే అతనిదవుతుంది" తండ్రి చెప్పిన
మాటలు మనసులో ప్రతిధ్వనించాయి.

శంకరం కళ్లు తెరిచాడు. గదిలో ఉంటే కనిపించని ఆకాశం ఎంతో అందంగా, విశాలంగా కనిపించింది.మనసు
కొత్త చిగురు తొడిగిన భావన కలిగింది

*తొలిసారి అతని మనసుకు ఎంతో*
*సంతోషం, ప్రశాంతత కలిగాయి.*
*(ఆంధ్ర భూమి వార * *లో*
*02 .07 .2009*
*ప్రచురితం)*

🎊💦✨🏵️🌼🎈

15/10/2021
24/09/2021

Good evening all

వివేకానందుడు చెప్పిన గొప్ప జీవిత సత్యం.🙏

గ్రద్ద జీవితం గద్ద అనగానే మనకు ఎప్పుడూ కోడి పిల్లలను ఎత్తుకుపోయే దానిగా లేదా మనుషులను బయపెట్టే ఒక పక్షిగా మాత్రమే తెలుసు.

ఇంకా గద్దలు మనుషుల కలేభారాలని పీక్కు తింటాయని కథనాలు వింటుంటాం.

కానీ గద్ద జీవితం మనకు ఒక జీవిత పాఠాన్ని చెబుతుందని ఎంత మందికి తెలుసు????????

గద్ద జీవితకాలం 70ఏళ్ళు, ఈ జాతి పక్షుల్లో ఎక్కువ జీవితకాలం బ్రతికేది గద్దే. అయితే గద్దకి 40ఏళ్ళు పూర్తి అయ్యేసరికి దాని గోళ్ళు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు.

పొడవైన దాని ముక్కు కొన చివర వొంగిపోయి పట్టుకున్న ఆహారాన్ని నోటితో తినడానికి సహకరించదు. ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై... చురుకుగా ఎగరడానికి సహకరించవు. ఆ సమయంలో దాని ముందున్నవి రెండే లక్ష్యాలు. ఒకటి ఆహారాన్ని సంపాదించుకోలేక సుష్కించి మరణించడం లేదా భాదకరమైన సరే తనను తాను మార్చుకోవడం.

ఈ ప్రపంచంలో ప్రాణం ఉన్న ఏ జీవి అయినా… ఎంత క్షీణ దశకు వచ్చినా బ్రతకాలనే అనుకుంటుంది. అలాగే, గద్ద కూడా బ్రతకాలనే అనుకుంటుంది. మరి గద్ద ఏవిధంగా తనను తాను మార్చుకుంటుంది ఒక్కసారి చూద్దాం….

గద్దకు ఈ మార్పు చాలా భాదాకరమైనది. ఈ మార్పు దాదాపు 150 రోజుల ప్రక్రియ. ఈ మార్పు కోసం గద్ద తనకు అందుబాటులో ఒక ఎతైన కొండను తన స్థావరంగా చేసుకుంటుంది. అక్కడ పెరిగిపోయిన తన ముక్కుకొనను కాలిగోళ్ళ మధ్య పెట్టుకొని ఎంతో భాధ కలిగిన నెమ్మదిగా వొలిచేసుకుంటుంది.

ఇలా వదిలించుకున్న ముక్కు మళ్ళీ కాస్తా కొత్తగా వచ్చి ముక్కు పదునుగా పెరిగే వరకు ఎదురుచూస్తుంది. అలాగే పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలిగోళ్ళను వదిలించుకుంటుంది. ఇక కొత్త గోళ్ళు పెరిగిన తర్వాత వాటి సహాయంతో తన రెక్కలకు బరువైన పాత ఈకలను పీకేస్తుంది. అలా బరువుగా ఉన్న తన రెక్కలను తేలికగా మార్చుకుంటుంది.

ఇలా 5నెలలు భాదాకరమైన కృషితో సాధించుకున్న పునర్జన్మతో మరో 30ఏళ్ళు హాయిగా బ్రతుకుతుంది. ఈ సృష్టిలో మనం బ్రతకాలంటే మార్పు అనేది చాలా అత్యవసరం అనే జీవిత సత్యాన్ని, గద్ద జీవించి మనల్ని కూడా అలా జీవించమని బోధిస్తుంది. ఇలానే ప్రతీ మానవుడుకు కూడా జీవించాలనే ఉంటుంది. కాని జీవితాన్నే మార్చే ధ్యానసాధన మాత్రం 1 గంట చేయలేము. జీవితం మాత్రం కావాలి.

ఒక పక్షి 150 రోజుల కఠోర సాధనతో మరో 30 సంవత్సరాల వయస్సు పెంచుకుంది. పాత సామేత ఒకటి ఉంది కుండలో ఉన్న అన్నం కుండలోనే ఉండాలి అమ్మాయి బొద్దుగా ఉండాలి అని....

అలానే మనం ధ్యానం చేయము కాని ఆరోగ్యం ఆనందం మనకు కావాలి..... ఎలా వస్తుంది... ???ఎక్కడ నుంచి వస్తుంది....?????

ఒక పక్షి సాధన చేత మరో పునర్జన్మ తెచ్చుకున్నట్టుగా ....

మనమూ కఠోర ధ్యాన సాధనచేద్జాం... మానవులుగా ఉన్న మనం మాధవులు గా మారుదాం!!!!!!! ఆరోగ్యంగా ఆనందంగా జీవించుదాం🙏

20/09/2021

_*🙏గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః.....*_
_*గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః....🙏*_

_*ఈ శ్లోకం అందరికీ తెలుసు కానీ ఈ శ్లోకం ఎలా పుట్టింది...మొదట ఎవరు పలికారు....ఎందుకు పలికారు.....దాని వెనుక ఉన్న కథ....*_

_*🍃🌻పూర్వం కౌత్సుడు అనే పేద పిల్లవాన్ని విద్యాధరుడు అనే గురువు గారు తన ఆశ్రమానికి పిలుచుకు వచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు. ఒకసారి గురువు గారు పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్ళాడు. గురువు గారు తిరిగి వచ్చేవరకు కౌత్సుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు.*_

_*🍃🌻గురువు గారు తిరిగివచ్చిన కొన్ని రోజులకు కౌత్సుడి చదువు పూర్తయింది. కౌత్సుణ్ణి తీసుకెళ్లాడానికి తల్లిదండ్రులు వచ్చారు. కానీ కౌత్సుడు తాను గురువు గారి దగ్గరే ఉంటానని ఇంటికి రానని ఖరాఖండిగా చెప్పి తల్లిదండ్రులను వెనక్కి పంపాడు.*_

_*🍃🌻వాళ్ళు వెళ్లిన తరువాత గురువు కారణం అడిగాడు.అప్పుడు కౌత్సుడు ఇలా చెప్పాడు "గురువు గారూ మీరు కొన్ని రోజుల క్రితం బయటకు వెళ్ళినపుడు మీ జాతకం చూసాను.మీరు సమీప భవిష్యత్తులో భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్లలేను." అని చెప్పాడు.*_

_*🍃🌻కొన్ని రోజులకు గురువు గారికి క్షయ రోగం వచ్చింది.ఆ కాలంలో క్షయకు చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్లి దాన ధర్మాలు ,పుణ్య కార్యాలు చేయాలని గురుశిష్యులు కాశీకి వెళ్లారు. గురువుగారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్ళను అసహ్యించుకున్నారు. కానీ కౌత్సుడు గురువు గారికి సేవలు చేస్తూనే ఉన్నాడు.ఎంతోమంది గురువు గారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కౌత్సుడు మాత్రం గురువు గారిని వదలలేదు.*_

_*🍃🌻కౌత్సుడి గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలనుకున్నారు. మొదట బ్రహ్మ మారువేషంలో వెళ్లి గురువుని వదిలేయమని సలహా ఇచ్చాడు. కౌత్సుడు బ్రహ్మ చెప్పిన మాటలు వినలేదు. మరలా విష్ణువు మారు వేషంలో వచ్చి సలహా ఇచ్చినా కూడా కౌత్సుడు వినలేదు. చివరికి పరమేశ్వరుడు వచ్చినా వినలేదు. మెచ్చిన పరమేశ్వరుడు ఏదయినా సహాయం కావాలా అని అడిగాడు. మరెవరూ గురువును వదిలేయమనే సలహా ఇవ్వడానికి రాకుండా కాపలా కాయమన్నాడు.*_

_*🍃🌻అతని గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. కౌత్సుడికి మోక్షం ఇస్తాం అన్నారు. అప్పుడు కౌత్సుడు వారితో నాకు మీ గురించి చెప్పి ఈ రోజు మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ, నా గురువే నాకు విష్ణువు, నా గురువే నాకు మహేశ్వరుడు. మీరు సాక్షాత్కారం అవడానికి కారణమైన నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా ఇలా శ్లోకం చెప్పాడు.*_

_*గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః*_
_*గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః*_

_*🍃🌻తన గురువు గారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు. గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువుగారికి మోక్షం ప్రసాదించారు. ఆనందంతో కౌత్సుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు.*_

_*ఇదీ ఈ శ్లోకం వెనుక ఉన్న కథ....*_

_*కొన్ని ముఖ్య శ్లోకల విలువలు, అర్ధాలు అందరము తెలుసుకోవాలి, మనము అందరం మన తరువాత వాళ్ళకి కూడా తెలియజేయాలి🙏*_🌻

Address


Alerts

Be the first to know and let us send you an email when Life TV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Media Company?

Share