22/06/2026
ముసుగుల యుద్ధం
ఎడమ చేత్తో ఒకడు ఎర్ర జెండా ఊపుతాడు,
సమసమాజం అంటూనే సామ్రాజ్యాలు ఏలుతాడు!
శ్రామికుడి చెమటను సిరగా మార్చి రాస్తాడు,
కానీ శ్రమ దోపిడీలో వాడే మొదటి వరుసన ఉంటాడు!
కుడి చేత్తో ఇంకొకడు కుల మతాల మంత్రం వేస్తాడు,
భక్తి పేరుతో ద్వేషాన్ని నూరుతాడు!
సంస్కృతి సంప్రదాయం అంటూ సంకెళ్లు వేస్తాడు,
అధికార పీఠం కోసం అన్నదమ్ములను విడదీస్తాడు!
ఒకడికి సిద్ధాంతం ముసుగు... ఇంకొకడికి భక్తి ముసుగు!
కానీ ఇద్దరి ఆకలి ఒక్కటే... అది "అధికార దాహం"!
మీ ఎడమ సిద్ధాంతం ఆకలిని తీర్చలేదు,
మీ కుడి నినాదం శాంతిని ఇవ్వలేదు!
జెండాల రంగులు వేరైనా... మీ గుణాలు ఒక్కటే,
ప్రజల రక్తాన్ని తాగే జల్గాల రూపాలు ఒక్కటే!
భాషణల వేదికలపై మీరు కత్తులు దూసుకుంటారు,
చీకటి గదుల్లో చేతులు కలిపి పంచుకుంటారు!
మీరు విసిరే రొట్టె ముక్కల కోసం కొట్టుకునేది జనం,
కానీ మీ ఇరుపక్షాల ఆటల్లో బలవుతోంది దేశం!
చాలు ఇక ఆపండి మీ రంగుల నాటకాలు,
ఎడమ వైపో, కుడి వైపో కాదు...
ఇక నడవాల్సింది "న్యాయం" వైపు, "మనిషి" వైపు!
సిద్ధాంతాల పేరిట సమాజంలో ద్వేషాన్ని పెంచే ఏ శక్తీ దేశానికి మంచి చేయలేదు. నిజమైన మార్పు మనుషుల మధ్య బంధాలను కలపడంలో ఉందే కానీ, మీ భావాజాలంలో, జెండాల రంగుల్లో లేదు.