04/02/2024
_*💫 పాదమేది ? శిరమేది !? ⚜️*_
➖➖➖➖➖➖✍️
*_-(శ్రీరమణాశ్రమ స్మృతులు)-_*
*_⚡ఒకరోజు మధ్యాహ్నం మూడుగంటలకొక భక్తులు భగవాన్ సోఫాకు దగ్గరగా నిలిచి "స్వామీ, నాకు ఒకే కోర్కె ఉన్నది. భగవాన్ పాదంమీద నా శిరస్సుంచి నమస్కరించాలని. భగవాన్ అనుగ్రహించాలి" అన్నారు._*
*_🪷“ఓహో, అదా కోర్కె మంచిదేకాని పాదమేది ? శిరమేది ?” అన్నారు భగవాన్. జవాబులేదు. రవంత నిదానించి "తానెక్కడ అణగుతాడో అదేపాదం" అన్నారు భగవాన్._*
*_⚡"ఆ స్థానం ఎక్కడుంది ?" అన్నారా భక్తులు._*
*_🪷“ఎక్కడుందా ? తనలోనే ఉంది. నేను, నేనని విజృంభించే అహంభావమే శిరస్సు. ఆ అహంవృత్తి ఎక్కడ లయిస్తుందో, అదే "గురుపాదం" అన్నారు భగవాన్._*
*_⚡"తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ క్రమానుసారం భక్తి చేయాలంటారే, తానే అణగిపోతే భక్తితో సేవించడం ఎలా పొసగుతుంది ?" అన్నారు వారు._*
*_🪷“తానణగుట అంటే ఏమని అర్థం ? ఆ భక్తిని విశాలం చేయటం అన్నమాట అన్నీ తనలోనివే కదా ? అందువల్ల తన స్థానంలో తానుంటే వీటన్నిటినీ విస్తీర్ణం చేయగల శక్తి కలుగుతుంది" అన్నారు భగవాన్._*
*_⚡"తన స్థానంలో తానణగటం అంటే, బుద్ధిచేత అన్నమయాదికోశాలను తోసిపుచ్చి, ఆ తరువాత బుద్ధిని కూడా తోసివేయవలెనా ?” అన్నారా భక్తులు._*
*_🪷"బుద్ధిని విడిచి ఎక్కడికండీ పోయేది ? బుద్ధి ఉన్నట్లుండుటే, తన స్థితిని తానెరుగుట. పైన వచ్చే విషయాదులన్నీ తొలగించే నిమిత్తం బుద్ధిని కర్రగా పట్టుకోవాలి. మలిన బుద్ధి, అమలిన బుద్ధి అని ఆ బుద్ధిని రెండు విధాలుగ వివరిస్తారు._*
*_అంతఃకరణ కార్యాలైన విషయాలతో కూడి ఉన్నప్పుడు 'మలినబుద్ధి' అంటారు. దానికే మనస్సనీ, అహంకారమనీ పేర్లు. ఆ విషయాదులను తోసిపుచ్చుటకు ఊతకోలవలె ఉండే 'నే'నను అహంస్ఫురణకే అమలినబుద్ధి అని పేరు. దాన్ని పట్టుకొని మిగతాదంతా తోసివేస్తే, ఉన్నది ఉన్నట్లుంటుంది” అన్నారు భగవాన్._*
*_⚡"ఆ బుద్ధిని ఆత్మలో ఐక్యం చేయాలంటారు కదా ?" అని మళ్ళీ ప్రశ్న._*
*_🪷"ఐక్యం చేయటానికి ఎక్కడినుంచైనా వచ్చే వస్తువుకాదే ? తనలోనే ఉంది. ఆత్మయొక్క స్ఫురణే బుద్ధి. ఆ బుద్ధితో అచలమైన వస్తువును తెలుసుకుంటే, తానుతానుగా ఉంటాడు. ఆ బుద్ధినే కొందరు శక్తి అంటారు. కొందరు అహం అంటారు. ఏదో ఒక పేరు. పైన వచ్చేదంతా తరిమే నిమిత్తం దాన్ని పట్టుకోవాలి గట్టిగా" అన్నారు భగవాన్._*
*_-(సూరి నాగమ్మ)._*
*_🪷 రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి ప్లీజ్..._*
🙏🇮🇳🎊🪴🦚🐍🔱⚜️