22/04/2025
సనాతన ధర్మంపై దాడి
* ప్రతిఘటించిన స్థానికులు
* కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
శేరిలింగంపల్లి: గ్రేటర్ హైదరాబాద్ ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పక్కనే ఉన్న శివమ్మ కాలనీలోని శ్రీ రాములవారి ఆలయ పరిసర ప్రాంతంలోని గోశాల ను మాయం చేసే పనిలో నిమగ్నమయ్యారు కొందరు కబ్జాదారులు. కొన్ని సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు రామాలయం నిర్మించుకున్న తర్వాత పక్కనే సుమారు రెండు వందల గజాల స్థలంలో గోశాలను ఏర్పాటు చేసుకుని గోవులకు సేవ చేసుకుంటున్నారు. శివమ్మ కాలనీ ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్దలతో గోమాతకు సేవ చేసుకుంటుంటే జీర్ణించుకోని కొందరు అల్లరి మూకలు దేశ్ పాండే పేరు చెప్పుకుని ఆలయ ప్రాంగణంలోకి చొరబడి ఫెన్సింగ్ వేసే దిశగా సుమారు రెండు వందల గజాల భూమిలో సిమెంట్ సహాయంతో కొన్ని పైప్ లను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా రేకులతో కూడిన ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఖాజా, అతని అనుచరులు హెచ్చరించి వెళ్లినట్టు స్థానికులు మీడియా కు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానికులు, ఆలయ కమిటీ చైర్మన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఆలయ ప్రాంగణంలో చొరబడి, శ్రీరాములవారి గోశాల స్థలాలు ఖాజేయాలని చూస్తే ఊరుకునేది లేదని తెలిపారు. సదరు గోశాల భూములు కాపాడుకోవటం కొరకు ఎంతవరకైనా వెలుతామని కబ్జాదారులను హెచ్చరించారు. సిమెంట్ సహాయంతో చుట్టూ ఫెన్సింగ్ కొరకు పాతిన పైపులను కొన్నింటిని స్థానిక మహిళలు తొలగించారు. ఈ విషయంలో పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ గోశాల భూముల రక్షణకు పాటుపడాలని స్థానిక ప్రజలు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో రామాలయం చైర్మన్ రాంచందర్ యాదవ్, బీజేపీ నాయకులు కృష్ణ, జక్కుల అంజి, పుట్ట మోహన్, సురేష్, నడిపి ఆంజనేయులు, అమర లక్ష్మమ్మ, కె. కుమారి, పద్మ, రాణమ్మ, ఏ. కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.