26/12/2025
దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ గారు అసాధ్యుడన్పించారు...
మూడు మండలాలు- "నెల్లూరు"లోనే కొనసాగించడానికి ముఖ్యమంత్రి అంగీకారం.
రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను తిరుపతి జిల్లాలో కలపాలనే ప్రతిపాదన అధికారులు విరమించుకొన్నట్లు తెలుస్తున్నది.
ఈ మూడు మండలాల విలీన ప్రతిపాదన మీద తీవ్రమైన వ్యతిరేకత పెల్లుబుకింది. మండల ప్రజలు పెద్దఎత్తున ఉద్యమించారు. నెల్లూరు వరకు వచ్చి, బ్రహ్మాండమైన ఊరేగింపు చేశారు.
మాజీ శాసన మండలి సభ్యుడు "మాదాసు గంగాధరం" తప్ప మరొక రాజకీయవాది తమకు సహకరించక పోయినా, ప్రజలే పూనుకొని ఉద్యమం నడపడం గొప్ప విశేషం.
ఈ మండలాలను తిరుపతిలో కలపాలనే ప్రతిపాదన జగన్ హయాంలో కూడా వచ్చింది. అయితే అప్పటికి వెంకటగిరి ఎమ్మెల్యేగా వున్న ఆనం రామనారాయణరెడ్డి దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు, ఒక పర్యటన సందర్భంలో హెలికాప్టర్ దగ్గరకు పోయి, జగన్ చెవిలో చెప్పాడు. దానితో జగన్ ఆ ప్రతిపాదన ఉపసంహరించుకోమని అధికారులను ఆదేశించాడు. ఇప్పుడు కూడా రామనారాయణరెడ్డి చొరవ చూపడం గమనార్హం. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తమ అభ్యంతరాలను లేఖ రూపంలో మాత్రం వెలిబుచ్చితే, రామనారాయణరెడ్డి నేరుగా చంద్రబాబు వద్దకు వెళ్లి, ప్రతిపాదన మానుకోమని విజ్ఞప్తి చేశాడు. దానితో ఈ మండలాల వ్యవహారంలో తప్పు చేయవద్దని ముఖ్యమంత్రి హుకుం జారీ చేయడంతో అధికారులు సర్దుకొని, సవరణ ప్రతిపాదనలు పంపారు. దాని ప్రకారం ఈ మూడు మండలాలు నెల్లూరు జిల్లాలోనే కొనసాగుతాయని భావించవచ్చు. ఈ విలీనం జరిగితే, నెల్లూరు, తిరుపతి జిల్లాల మధ్య జల యుద్ధాలు తప్పవని రామనారాయణ హెచ్చరిక చేసినట్లు తెలుస్తున్నది.
అయితే గూడూరు నియోజకవర్గం విషయంలో మాత్రం ఇప్పటివరకు చలనం లేదు. స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ తన పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరిక చేసినా, ప్రజలు పూనుకొని భారీ స్థాయిలో బంద్ వంటి నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వంలో ఇప్పటివరకు స్పందన లేదు. వైకాపా నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఒక్కడు, దీనిపై ఎంతో కొంత కదలిక చూపుతున్నాడు. అయితే, ఆయనకు తన స్వంత పార్టీ నేతల నుంచి సహకారం అందుతున్నట్లు కన్పించడం లేదు. గూడూరు విషయంలో జిల్లా శాసన సభ్యులందరూ ఏకమై ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తేవలసిన అవసరం వుంది.