12/07/2024
కాంగ్రెస్ నేతల ఆగడాలు.. బలవుతున్న రైతన్నలు
కాంగ్రెస్ నేత భూదాహం.. వేధింపులు తట్టుకోలేక రైతు ఆత్మహత్యాయత్నం
20 లక్షలు ఇస్తేనే భూమి వదిలేస్తానని బెదిరింపు
సిద్దిపేట - గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలం దమ్మక్కపల్లిలోకి చెందిన ఆగంరెడ్డి అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన బండి పెద్దోళ్ల కిష్టయ్య అనే వ్యక్తికి ఉన్న భూమి నుండి కొంత భూమి రావాలని కొంత కాలంగా కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు.
గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డికి దగ్గర వ్యక్తిగా పేరు ఉన్న ఆగంరెడ్డి.. తనను ఏమీ చేయలేరంటూ నర్సారెడ్డి ద్వారా బెదిరించాడని కిష్టయ్య భార్య కనకవ్వ ఆరోపించింది.
అయితే తన భూమిని కొలిచి చూపించాలని ప్రభుత్వ సర్వేయర్కు కిష్టయ్య దరఖాస్తు చేసుకున్నాడు.. అయితే సర్వేయర్ ని ఆగంరెడ్డి బెదిరించడంతో.. తప్పుడు రిపోర్టు ఇచ్చాడు.
తమకు తీవ్ర అన్యాయం చేశారని బాధిత రైతు వాపోతున్నాడు. ఇది అన్యాయమని రైతు కిష్టయ్య ఎంత వేడుకున్నా కనికరించని ఆగంరెడ్డి.. రూ.20 లక్షలు ఇస్తేనే భూమి వదులుతానని, కిష్టయ్య కుటుంబాన్ని గ్రామంలో ఉండనివ్వనని బెదిరించాడు.
దీంతో మనస్తాపం చెందిన కిష్టయ్య తన పొలం వద్ద పురుగుల మందు తాగాడు.. గమనించిన స్థానికులు, కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.