11/03/2025
నిజాయితీగా వుండేవాళ్లూ, పీడితులతరపున నిలబడేవాళ్లమీద బురదజల్లడం పరిపాటే. అయితే దానికి రాజకీయ పార్టీ రంగు అద్దడం తెలుగునాట కొత్తగా విస్తరిస్తోన్న జబ్బు.
సదరు పత్రిక ఐపీఎస్ అధికారిమీద తీవ్ర ఆరోపణలతో "ఐపీఎస్"ని కాస్తా "వైపీఎస్" అని రాసింది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఈ దేశంలో అత్యంత అణగదొక్కబడిన కిందికులాలనుండి దేశంలో అత్యున్నత ఉద్యోగమైన ఐపీఎస్ సాధించి, రాష్ట్రంలో అత్యున్నత పోలీసు అధికారి (డీజీపీ)గా ఎన్నిక కావలసిన వ్యక్తిమీద కేవలం పార్టీ అనే ముద్రవేసి అవినీతిపరుడిగా చీత్రీకరించడం దుర్మార్గం. అతడి సర్వీసంత వుండదు సదరు పార్టీ వయస్సు, ఎదుకంటే అతడు సర్వీసులోకి వచ్చేసరికి ఆపార్టీ ఏర్పడలేదుకూడా, అటువంటి పార్టీకి అతడినీ, అతని ఎదుగుదలనీ, అతని వ్యక్తిత్వాన్నీ, అతడి సర్వీసునీ ముడేసి తాకట్టుపెట్టడమంటే ఇంతకన్నా మరో అన్యాయం లేదు.
కిందికులాలకు చెందినవాళ్లు తమ వర్గానికి తమ వ్యక్తిగత జీవితం కేటాయించినా, వాళ్లను సమీకరించడానికి సమావేశాలుపెట్టినా, వాళ్లని సంఘటితపరచడానికి నాలుగు మాటలు మాట్లాడినా, వాళ్ల హక్కుల తరపున, వాళ్ల విముక్తికోసం లాబీయింగ్ జరపడం, వారి చదువులకి, భధ్రతకి ఆర్థిక సహాయాలు ఏర్పాటు చేస్తే ఎంత తప్పుడు పనో కదా! ఎంతటి తీవ్రవాదమో, దేశద్రోహమో కదా! అలాంటి వాళ్లని "డాన్"అని పత్రిక తీర్మానించాలని సరికొత్త తీర్పురావడం జాతి పతనదశకు సూచిక.
సస్పెన్షన్‌కీ డిస్మిస్‌కీ తేడా తెలియని సగటు సామాజానికి తనదైన తీర్పరితనం ఇక్కడ రుద్దేయబడింది. అతడు పెట్రోలు బంకులమీద వచ్చిన వసూళ్లతో విదేశీయాత్రలు చేశాడట? వసూళ్లేమిటి? అంటే ఏ ప్రభుత్వ ఉద్యోగైనా ట్రావెలింగ్, డియర్నెస్ అలవెన్స్లులు పొందితే వాటిని అయా సంస్థలోని వసూళ్ల మీద పొందాడంటారా! అతడు తన కార్యాలయం పైన మీటింగులు పెట్టాడట? రాజకీయ పార్టీ మీటింగులా? తాగి తందనాలాడే రేవ్ పార్టీ మీటింగులా? ఏం మీటింగులనేది ఎందుకు రాయలేదు? రాస్తే అతడు సమాజానికి చేస్తోన్న సేవ తెలిసి అతడిపట్ల గౌరవం పెరుగుతుందనా! అతడు విదేశాలనుండి డబ్బు తెచ్చి పంచాడట? ఎక్కడినుండి, ఎవరినుండి, ఎలా తెచ్చాడు, ఎవరికి పంచాడో, ఎందుకు పంచాడో రాస్తే అతడి పట్ల గౌరవం పెరుగుతుందనా! అతడు విదేశాలనుండి సూట్‌కేసులూ, సెంటు సీసాలూ తెచ్చాడట? ఏం అవి తెచ్చుకోవడం నేరమా, లేక ఆన్లైన్లో ప్రపంచంలో ఏమూలనున్నా ఇవి దొరకనివీ, నిషేధించినవా! ఒకదేశపు పర్మిషన్ పొంది మరోదేశం వెళ్లాడా? ఏం పాస్‌పోర్టుమీద స్టాంపింగ్ వుండదా? అలా పోయినట్లు నిరూపణ అయ్యిందా!
ఒక తప్పుని నమోదుచేయడం, విచారించడం, సాక్ష్యాధారాలు సేకరించడం, వాటిని కోర్టుముందు నిరూపించడం, శిక్ష ఖరారు చేయించడం, శిక్షని అమలుల పరచడం వంటి పనులకు రాజ్యాంగ వ్యవస్థలున్నాయి. కానీ ఇవేవీ లేకుండానే నోటిమాటగా నచ్చని వ్యక్తులమీద, ముఖ్యంగా కిందికులాలకు చెందిన వ్యక్తులమీద తీర్పులు రాసే పత్రికలు, మీడియా, ఆయా పార్టీల సోషల్ మీడియాలూ ప్రకటిస్తూండడం దారుణం.
ఆధిపత్యకులాలవాళ్లూ, వర్గాల వాళ్ళు, రాజకీయ మధ్యవర్తులకూ ప్రజలకోసం ముఖ్యంగా పేదలకోసం, కిందికులాలకోసం మాట్లాడేవాళ్లంటే వొళ్లుమంట. అణగారిన వర్గాలకోసం పాటుపడిన ఈ దేశంలోకెల్లా నిజాయితీ కలిగిన కమ్యూనిస్టు పార్టీనికూడా మొన్న ఒక రాజకీయ పార్టీతో అంటుకట్టి రాసిన తర్వాత సునీల్ కుమార్ మీద రాయడం పెద్ద విషయం కాదు. తెలుగునాట ప్రసిద్దుడైన నాగేశ్వర్ అనే రాజకీయ అనలిస్టుకికూడా పార్టీ సోషల్ మీడియా ఒక పార్టీకి అంటుకట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడినప్పుడు ఈ వ్యవస్థ పతనమ్మీద మనమంతా భయపడాలి.
కిందికులాలనుండి చదువుకుని పైకొచ్చిన ఉద్యోగులు నోర్మూసుకుని రిటైరవ్వాలి. అలా గాకుండా ఏదైనా ఒక పార్టీకాలంలో గౌరవం దక్కితే, పనిచేయడానికి స్వేచ్చ పొందితే, ముఖ్యంగా ముక్కుసూటిగా, నిబద్దతతో, సొంత వ్యక్తిత్వంతో పనిచేస్తే చాలు అతడికి సదరు పార్టీతో సంబంధముందని ఎదుటి పార్టీ ప్రచారం చెయ్యాలి. పోనీ ఏ పార్టీ అయినా రాజ్యాంగ వ్యతిరేకంగా, ఎన్నికల గుర్తింపు లేనిదా అంటే అదీకాదు. నిజానికి అన్ని పార్టీలూ ఆ తానులోని ముక్కలే. సిద్దాంతాలూ, భావజాలాలాలూ ఇక్కడ ఏపార్టీకీ లేవు. విమర్శ లేదా మెచ్చుకోలు అనేది పనితీరు అయా సందర్భానికి, ఎన్నుకున్న విషయానికే వర్తిస్తుందని వ్యక్తులని పార్టీలకి అంటేగట్టి ప్రతివాడూ తెలుసుకోవాలి.
సామాన్య జనంకోసం, అభ్యుదయంకోసం, హేతుబద్దంగా మాట్లాడాల్సిన వాళ్లని మాట్లాడనివ్వకుండా వాళ్లకి పార్టీ రంగు పూసి నోరు మూసేయాలని చూస్తే, రేపు నీ సొంత విషయం మాట్లాడడానికి కూడా ఎవరూ నోరు తెరవరని ముఖ్యంగా గొర్రెలా తలకాయలూపే బహుజన, కిందికులాల యువకులు అర్థం చేసుకోవాలి.