
20/09/2025
“పద్మజమ్మి ఇంకా రాలేదా? ఏంది ఈ యాల దాకా?” సావిత్రమ్మ గొంతులో నిప్పులు. వంటి మీద గుడ్డ సగం జారి యాప చెట్టు కింద దొర్లాడుతున్న రంగయ్యను చూసి ఆమె చేతులు పిడికిళ్ళు బిగించాయి. “ఒరే తాగుమోతోడా పద్దేకలా తాగటమేనా? ఒక్కగానొక్క కూతురు బళ్ళోకి పోయి ఇంటికి వచ్చిందా లేదా చూసుకో పన్లేదా? ఏ జన్మలో పాపం చేసానో నీ పాలిట పడ్డా! ఆ బిడ్డని చూసి బతికుండా లేకపోతే ఏ నుయ్యో గొయ్యో చూసుకుందును!” రంగయ్య కళ్ళు సగం తెరిచి “ఎందుకె అట్టా తిడతావ్? యాడికి బోద్ది? చిన్న పిల్లనా? పదిహేనేళ్ళు వచ్చిళ్లా దారి తెలీదా? నా బిడ్డ మా చురుకుది. నీలా మొద్దు మొహం ది కాదులే! అయినా ఏందే నా బతుకు ఇట్టా అయిపొయింది? దొరల బిడ్డని దొరల ఉండేటోడిని… నీ చేత రోజూ శాపనార్ధాల బతుకయ్యింది కదే!” అతని మాటల్లో పంకజం పేరు రాగానే సావిత్రమ్మ ముఖం మరింత కందిపోయింది. “సిగ్గులేదా దొంగ ముఖపోడా? అది బతికున్నప్పుడేగా సేతిలో వున్న భూమి దాని ఎదాన పెట్టావ్? ఇప్పుడు బికారోడివి అయ్యాక కూడా దానికోసమే ఏడుస్తుంటివి? డబ్బుకోసం పడుకొనే దాని కోసం దేవదాసులా తాగి దొర్లే ఓడిని నిన్నే చూస్తున్నా… తూ!” అంతలో పద్మజ ఇంటి గుమ్మంలో అడుగుపెట్టింది. ఆమె రాకతో ఆ క్షణానికి యుద్ధం ఆగినట్టయింది. “అవునమ్మా… నా ఫ్రెండ్ సరోజ ఇంటికి పోయి వస్తున్నా. నువ్వు గాబరా పడతావని బేగి వచ్చేసా” అంది తల్లి దగ్గర చేరి. సావిత్రమ్మ కళ్ళల్లోని కోపం కాస్త తగ్గి “పో… పోయి కాళ్ళు చేతులు కడుక్కో. అమ్మగారు నీ కోసం లడ్డూ కారంపూస ఇచ్చింది” అంది. పద్మజ సంతోషంగా దొడ్లోకి పరిగెత్తింది. ఆ రాత్రి మాలకొండ విహారయాత్ర గురించి పద్మజ అడగ్గానే సావిత్రమ్మ ముఖం మళ్ళీ గంభీరంగా మారింది. “కొత్త కొత్త కోరికలు పుడతాండాయే! ఎప్పుడన్నా యాడ కన్నా పంపినానే నిన్ను? మూసుకొని కూచోయే!” “సరోజ కూడా వస్తా వుంది… ఇంకేంది నీ భయం?” పద్మజ అడిగింది. “భయంగానే ఉంటది! మిమ్మల్ని ఇంట్లోను కట్టేయలేం చదివించకుండా ఉండలేం… ఒక ఇంటికి పంపేదాకా భయమేనే!” సావిత్రమ్మ కళ్ళల్లో ఆందోళన. కానీ రంగయ్య అనూహ్యంగా “పోనియ్యవే దాన్ని! నేస్తురాలు ఉందిగా! ఎపుడు కొంప స్కూలు అంటే దానికి ఊపిరాడాలా?” అన్నాడు. ఆ మాటతో సావిత్రమ్మ మనసు కాస్త మెత్తబడి “సర్లే… ఈ సారికి పో. దేవుడికి బాగా దణ్ణం పెట్టుకో. సరోజ తోనే వుండు ఒక్కత్తివి అటూ ఇటూ తిరగమాకా” అంది. పద్మజ ఆ రాత్రి నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లింది. పుట్టి బుద్దెరిగాక ఈ ఇల్లు ఊరు గాక బయట ప్రపంచాన్ని చూడబోతుంది! ఆదివారం ఉదయం పది రూపాయల నోటు చేతిలో పెట్టి సావిత్రమ్మ పద్మజను బస్సు ఎక్కించింది. బస్సు పిల్లల కేరింతలతో సందడిగా ఉంది. ఒక మూల సీట్లో కూర్చున్న పద్మజ తేనె బొట్టుకు లంగా వోణి కట్టినట్టు మెరిసిపోతోంది. ఆమె నిశ్శబ్ద సౌందర్యం మగపిల్లల చూపులను ఆకర్షిస్తోంది. టీచర్లకు అభిమాన విద్యార్థిని క్లాస్ ఫస్ట్ పద్మజ. బస్సు మాలకొండ చేరింది. ఈ బంగారు ఛాయలో మెరుస్తున్న మిన్నాగు లాంటి ప్రపంచం పద్మజకు నిచ్చెన అవుతుందా లేక పాములా కాటేస్తుందా? ఆమె తల్లి భయాలు నిజమవుతాయా?
లింక్ పై క్లిక్ చేసి పూర్తి కథను చదవండి.
అవును.. జీవితం పాము నిచ్చెనల ఆట.. రక్త మాంసాల తోలు బొమ్మలాట.. తప్పుడు ఆలోచనల పాములు.. మధురమైన ఊహల నిచ్చెనలతో ఒక ఆట.. అ...