24/09/2025
*పవన్ కల్యాణ్ 'O G' సినిమాకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ*
బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంపు మెమోను కోర్టు సస్పెన్షన్లో పెట్టింది.
ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ప్రస్తుత ట్రెండింగ్ మూవీ 'O G' సినిమాకు విడుదలకు ముందే తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంపు మెమోను కోర్టు సస్పెన్షన్లో పెట్టింది. 'O G' సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది టీజీ హైకోర్టు. ఈ ఆదేశం సినిమా ప్రేక్షకుల్లో చర్చనీయాంశంకాగా, ఫిల్మ్ ఇండస్ట్రీకి షాకింగ్గాగా మారింది.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 'OG' సినిమాకు ప్రత్యేకంగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు, బెనిఫిట్ షోలు నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ మెమో జారీ చేసింది. ఈ మెమో.. సాధారణ టికెట్ ధరలతో పాటు అదనపు ఛార్జీలు వసూలు చేసి, ప్రేక్షకుల నుంచి ఎక్కువ ఆదాయం సంపాదించుకునేందుకు వీలు కల్పిస్తుంది. అయితే, ఈ నిర్ణయంపై నమోదైన కేసును పరిశీలించిన తెలంగాణ హైకోర్టు, దీన్ని తాత్కాలికంగా ఆపేసింది. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఉన్నాయని, ప్రేక్షకుల హక్కులను దెబ్బతీస్తాయని స్పష్టం చేసింది.
'OG' సినిమా, పవన్ కల్యాణ్ను గ్యాంగ్స్టర్ రొల్లో చూపించిన హై-యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమా విడుదల తేదీ సెప్టెంబర్ 25. రేపు విడుదల కానున్న నేపథ్యంలో, హై కోర్టు ఆదేశం సినిమాకు భారీ ఎదురుదెబ్బగా మారింది.
ఇండస్ట్రీ వర్గాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ప్రభుత్వం, కోర్టును పునర్విచారణకు పిటిషన్ వేయాలని సూచిస్తున్నాయి. బెనిఫిట్ షోలు లేకపోతే, సినిమా ప్రమోషన్, ఓపెనింగ్ డే కలెక్షన్లు దెబ్బతింటాయని నిర్మాణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంపు విషయం ఇదే మొదటిసారి కాదు. ముఖ్యంగా భారీ సినిమాలకు ప్రత్యేక అనుమతులు ఇవ్వడం ఇటీవల వివాదాస్పదంగా మారుతోంది. కాగా, రేపు (ఈనెల 25న) ఓజీ సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఈ కేసులో ముఖ్యమైన అంశాలు:
ఓజీ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసిన హైకోర్టు.
ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన జస్టిస్ ఎన్.వి శ్రవణ్ కుమార్.
ఓజీ టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ మెమో జారీ చేసిన తెలంగాణ హోంశాఖ.
హోంశాఖ మెమోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మహేష్ యాదవ్.
టికెట్ల పెంపునకు అనుమతి ఇవ్వడానికి హోంశాఖ స్పెషల్ సిఎస్కు ఎలాంటి అధికారాలు లేవన్నా పిటిషన్ తరపు న్యాయవాది.
హైదరాబాద్ పరిధిలో పోలీస్ కమిషనర్, జిల్లాల పరిధిలో జాయింట్ కలెక్టర్ కు మాత్రమే మెమో జారీ చేసే అధికారం ఉందన్న పిటిషన్ తరపు న్యాయవాది.
టికెట్లు అధిక ధరకు విక్రయించకూడదని నిబంధనలు ఉన్నాయన్న పిటిషన్ న్యాయవాది.
గేమ్ చేంజర్ సినిమా సందర్భంగా హోంశాఖ అండర్ టేకింగ్ కూడా ఇచ్చిందన్న పిటీషనర్ న్యాయవాది.
పిటీషనర్ న్యాయవాది వాదనను పరిగణలో తీసుకున్న హైకోర్టు.
టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ జారీ చేసిన మెమోను సస్పెండ్ చేసిన జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్.
తదుపరి విచారణ వచ్చే నెల 9వ తేదీకి వాయిదా