19/12/2025
వేలాది పాక్ పౌరుల బహిష్కరణ – సౌదీ, యూఏఈల కఠిన చర్యలు
అక్రమ వలసలు, వ్యవస్థీకృత భిక్షాటన, నేర కార్యకలాపాలకు పాల్పడుతున్న పాకిస్థాన్ పౌరులపై గల్ఫ్ దేశాలు కఠిన చర్యలు ప్రారంభించాయి. సౌదీ అరేబియా, యూఏఈలు ఇటువంటి వారిని భారీ సంఖ్యలో బహిష్కరిస్తున్నాయి.
పాక్ జాతీయ దర్యాప్తు సంస్థ (FIA) సమర్పించిన నివేదిక ప్రకారం, 2025లో ఒక్క సంవత్సరంలోనే 66,000 మందికి పైగా పాక్ పౌరులను వివిధ దేశాలు వెనక్కి పంపించాయి. గతేడాది ఈ సంఖ్య 35,000 మాత్రమే. వీరిలో వర్క్, పర్యటక, ఉమ్రా వీసాలతో వెళ్లినవారే ఎక్కువమంది.
డైరెక్టర్ జనరల్ రిఫాత్ ముఖార్ వెల్లడించిన వివరాల ప్రకారం —
• సౌదీ అరేబియా ఇప్పటివరకు 56,000 పాక్ భిక్షగాళ్లను బహిష్కరించింది.
• 2025లో ఇప్పటివరకు 24,000 మందిని సౌదీ పంపించగా, దుబాయ్ 6,000 మంది, అజర్బైజాన్ 2,500 మందిని వెనక్కి పంపింది.
• కాంబోడియాకు వెళ్లిన 24,000 మందిలో సగం మంది మాత్రమే తిరిగి వచ్చారు.
• మయన్మార్ టూరిస్టు వీసాలతో వెళ్లిన 4,000 మందిలో 2,500 మంది తిరిగి రాలేదు.
విదేశాల్లోని పవిత్ర స్థలాల్లో అరెస్టవుతున్న యాచకుల్లో 90 శాతం పాకిస్థానీలే ఉన్నారని, అక్కడి జేబుదొంగలలో కూడా వీరే అధికమని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాక్ పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది.
పాక్ ప్రభుత్వ వర్గాలు ఈ పరిస్థితిని దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించే అంశంగా పరిగణిస్తున్నాయి.