19/08/2016
జీవన్ముక్తుల జితేంద్రియత్వం
పూజ అంటే మంత్రానుష్ఠానము, తంత్రము, యోగముతో కూడినది. అంబిక అంతర్యాగ సమారాధ్య, బయటకు కనిపించే బహిర్యాగము అంతర్యాగమునకు ప్రతీక. దీనిని వివరించేది మంత్ర శాస్త్రము. మహాస్వామివారు పీఠానికి వచ్చిన ఒకటి రెండు సంవత్సరాలలోనే వీరికి మంత్ర శాస్త్ర పరిచయం కలిగించడానికై ఆ రోజులలో మంత్ర శాస్త్రంలో బహు పరిశ్రమ చేసి విఖ్యాతులైన కరప్పూరు వాస్తవ్యులైన సాధకులను ఏర్పాటు చేశారట. ఆయన స్వామివారితో కొద్దికాలము ఏకాంతంగా సంభాషించి మఠపెద్దలతో, ”స్వామివారికి మంత్రదీక్షల అవసరం లేదు. మహాపురుషుడాయన. నా అంచనాలో మంత్రాధిష్టాన దేవతయైన కామాక్షి పోకడలు, చిహ్నములు వారిలో ఉన్నాయి. వారు పరదేవతకు అభిన్నులు” అని చెబుతూ స్వామివారికి సాష్టాంగంగా నమస్కరించి శలవు తీసుకొన్నారట. అవునుమరి. సన్యాసదీక్ష గ్రహించిన మొదటిరోజుననే ఎల్లప్పుడూ దేవితో అభేద ప్రతిపత్తితో ఉండవలెనని బోధించినవారాయన.
మహాస్వామివారు యోగీశ్వరేశ్వరులుగా లబ్ధప్రతిష్టులు, వీరికి మంత్రానుష్టానములోనూ, పూజలోనూ యోగము ఎంతో ఉపకరించిందని చెప్పుకోవాలి. అలాగే యోగమునకు అవి కూడా ఉపకరించి ఉండాలి. శ్రీవారు ప్రతిరోజు తమ 99వ సంవత్సరము వరకూ విధిగా ఒక గంట తపస్సు చేసేవారు. దీనికి ‘ఒరుగంటజపం’ అని శ్రీమఠంలో ప్రసిద్ధి. అప్పుడు వారు పద్మాసానంలో కూర్చునేవారు. పద్మాసనం వేయడానికి మనం చేతుల సహాయం తీసుకోవాలి కదా! వారికి ఆ అవసరం లేదు. మనం బాసిపట్టు వేసినట్లు ఎంతో లాఘవంగా పద్మాసనం వేసేవారు. ఆచమనం చేసి రెండు నిమిషాలు సంకల్పమో మరేం చేసేవారో కానీ కనులు మూసుకొని ఒకసారి చేతితో ఎడమముక్కు స్పృశించేవారు. అంతే మళ్ళీ గంట అయిన తరువాత కుడిముక్కు స్పృశించేదాకా వారికి గాలి పీల్చవలసిన అవసరం లేదు.
కాంచీపురం ఉడక వాతావరణంలో మేనాలోపల తలుపులు వేసుకొని మత్స్యాసనంలో రెండు మూడుగంటలు విశ్రాంతి తీసుకొని తెల్లవారి బయటికి వస్తే బయటపడుకున్న మా అందరికీ ఉక్కపోతగా ఉండేది. వారు మాత్రం ఎ.సి. గదిలో నుంచి వచ్చినంత తాజాగా వచ్చేవారు. ఎఱ్ఱటి ఎండలో నడుస్తున్నప్పుడు కూడా వారికి చెమట పోయదు. వారు శౌచాచమనాలకు తప్పితే మంచినీరు త్రాగేవారు కాదు. ఆహారం తీసుకొనే రోజులకంటే ఉపవాసం ఉండే రోజులు ఎక్కువ. దీనిని మరి జితేంద్రియత్వం అనేకదా అనాలి.
జితేంద్రియత్వం అంటే గుర్తుకువచ్చింది. శ్రీచరణులు ఒకసారి చలోక్తులు ఆడుతున్నారు. “నాకు చెవి వినిపించడం మానేసింది. అప్పుడప్పుడు మాత్రమే వినిపిస్తూ ఉంటుంది. చిన్నప్పటినుండే ఒక కన్ను కనిపించదు. చాలాకాలంగా నేను పూవులు వాసన చూస్తూ ఉంటాను. మీరంతా సువాసన కోసం అలా చేస్తున్నారేమో అనుకుంటారు. నిజానికి నాకు నలభై సంవత్సరాలుగా వాసన తెలియడం లేదు. ఎందుకని పరీక్షించుకొంటూ ఉంటాను. భిక్ష ఏర్పాటు చేసే పారిషదుని చూపుతూ - ఇక ఈయన చేసే పదార్థాలు తింటున్నాను కాబట్టి నాలిక రుచిపోయిందని మీరు గ్రహించవచ్చు కదా! నేను జితేంద్రియుణ్ణే” అంటూ నవ్వారు.
--- శ్రీకార్యం చల్లా విశ్వనాథశాస్త్రి, ఋషిపీఠం ప్రచురణ
#కంచిపరమాచార్యవైభవం