11/05/2026
*అమరావతి ముఖద్వారంలా చిలకలూరిపేట: ‘స్వాగత’ బోర్డుల కోసం పురప్రజల ఎదురుచూపు!*
చిలకలూరిపేట:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, భౌగోళికంగానూ చిలకలూరిపేట నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్ర రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉంటూ, జాతీయ రహదారిపై అత్యంత కీలకమైన కూడలిగా ఈ పట్టణం విరాజిల్లుతోంది. రాజధాని ప్రాంతానికి వెళ్లే ప్రయాణికుల్లో అత్యధికులు చిలకలూరిపేట మార్గం గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది. ఒకవైపు పారిశ్రామికంగా, మరోవైపు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న ఈ నియోజకవర్గంలో ఒక చిన్న వెలితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
*పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ ఉంది.. మనకెందుకు లేదు?*
పల్నాడు జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు ప్రకాశం జిల్లాలోని పట్టణాల్లోనూ ఆయా ఊర్ల విశిష్టతను చాటిచెప్పేలా ‘ఐ లవ్..’ (I Love...) సింబల్స్‌తో కూడిన అందమైన స్వాగత బోర్డులను మనం చూస్తున్నాం. అవి కేవలం అందాన్ని ఇవ్వడమే కాకుండా, ఊరికి వచ్చే కొత్తవారికి ఒక గుర్తింపుగా మారుతున్నాయి. కానీ, అంతటి ప్రాధాన్యత ఉన్న చిలకలూరిపేట పట్టణ ప్రవేశంలో అటువంటి ఆకర్షణీయమైన 'స్వాగత బోర్డు' లేకపోవడం శోచనీయమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*మార్గదర్శకాలు కరువు*
పట్టణ పరిధిలోని వీధుల పేర్లు, ప్రధాన కూడళ్ల వద్ద దిశానిర్దేశం చేసే బోర్డుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఇతర నగరాల్లో వీధుల పేర్లు, ప్రముఖ ప్రాంతాల వివరాలతో చిన్న చిన్న బోర్డులు ఏర్పాటు చేసి కొత్తవారికి మార్గం సులభతరం చేస్తున్నారు. చిలకలూరిపేటలో కూడా:
*పట్టణ ప్రవేశంలో:* ‘చిలకలూరిపేట స్వాగతం’ అంటూ అమరావతి తరహాలో ఒక చక్కని ఐ లవ్ సింబల్ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆయా ప్రాంతాల పేర్లతో కూడిన సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలి.
*అధికారుల చొరవ అవసరం*
చిలకలూరిపేట రూపురేఖలు మారుతున్న తరుణంలో, పట్టణ సుందరీకరణలో భాగంగా ఈ బోర్డుల ఏర్పాటుపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని పురప్రజలు కోరుతున్నారు. అభివృద్ధి అంటే కేవలం రహదారులు మాత్రమే కాదని, పట్టణానికి వచ్చే వారికి ఆహ్వానం పలికే గుర్తులు కూడా అని వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, చిలకలూరిపేట పట్టణ ప్రాధాన్యతను చాటిచెప్పేలా బోర్డులను ఏర్పాటు చేస్తారని ఆశిద్దాం.