
14/08/2025
**సై సైరా చిన్నపరెడ్డి- నీపేరే బంగారుకడ్డీ@ నరసరావుపేట**
ఆగష్టు 14.
బ్రిటిష్ పాలకుల గుండెల్లో సింహస్వప్నంగా మారిన
సైరా చిన్నపరెడ్డి ఉరితీయబడిన రోజు... ఆసంఘటనల సమాహారం.,,,,,,
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం భరతగడ్డపై దురహంకారంతో చెలరేగుతున్న రోజులు....
భారతమాత కన్నీటి బొట్లు మాతృనేలను చిత్తడి చేస్తున్న దయనీయమైన రోజులు ...
ఈ సమయంలో -
దాస్య శృంఖలాల విముక్తి కోసం....
స్వేచ్ఛావాయువుల సంచారం కోసం....
కుదేలవుతున్న జాతి చైతన్యం కోసం...
ప్రాణాలకు తెగించి.. సమరోత్సాహంతో ముందుకు నడిచాడు ఒక యువకుడు.. !
వందేమాతరం అంటూ ఎందరో యువతీ యువకులను ముందుకు నడిపించి....పల్లె పల్లెని తట్టిలేపి.... గుండె గుండెలో ఫిరంగులు మోగించి.... ఆత్మస్థయిర్యమే ఆయుధంగా పిడికిలెత్తి నినదించిన ఆ యువకుడు సై సైరా చిన్నపరెడ్డి !
ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లా నర్సరావుపేట తాలూకాలోని రెడ్డిపాలెం. అక్కడికి సమీపంలోని కోటప్పకొండ ప్రముఖ శివక్షేత్రం. మహాశివరాత్రికి జరిగే తిరునాళ్లకు భక్తులు పోటెత్తి వస్తారు.ప్రభల ఉత్సవం కన్నుల పండుగలా సాగుతుంది.
రెడ్డిపాలెం కి చెందిన గాదెలింగమ్మ, సుబ్బారెడ్డి దంపతులకు ఉన్న నలుగురి కుమారుల్లో నాలుగోవాడు గాదె చిన్నపరెడ్డి. చిన్నపరెడ్డి తన గ్రామంలో ప్రభ కట్టి తన పందెపు ఎడ్లను కట్టుకుని కోటప్పకొండకు
ఉత్సాహంగా అనుచరులతో కలసి బయలు దేరారు.
చిన్నపరెడ్డి స్వతహాగా స్వేచ్చా ప్రవృత్తి, స్వాతంత్ర కాంక్ష కలవాడు అవ్వడంతో బ్రిటీష్ ప్రభుత్వ శాసనాలను లెక్కచెయకుండా ఎప్పటికప్పుడు దిక్కార స్వరం వినిపిస్తు ఉండేవాడు. చిన్నపరెడ్డి ధైర్యశాలి. ఆజానుబాహుడు. చిన్నతనం నుంచే గుర్రపుస్వారీ నేర్చుకున్నాడు. 1907లో మద్రాసు సంతకు వెళ్లినప్పుడు అక్కడ జరిగిన సభలో బాలగంగాధర తిలక్ రగిల్చిన దేశభక్తి ప్రభావం చిన్నపరెడ్డి పై పడింది. దాంతో తిరిగి గ్రామానికి వచ్చినప్పుడు స్వరాజ్యం కావాల్సిందే అంటూ గ్రామంలో ప్రజల్ని కూడగట్టాడు. బ్రిటిష్ పాలకులు విధించిన వివిధ రకాల పన్నులకు వ్యతిరేకంగా ప్రజల్ని సంఘటితం చేసి పోరాడాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా చిన్నపరెడ్డి ప్రదర్శించిన ధైర్యసాహసాల్ని ప్రజలు కథలు కథలుగా పాటల రూపంలో నేటికీ పాడుకుంటూనే ఉన్నారు.
ఫిబ్రవరి 18, 1909, శివరాత్రిపర్వదినం. జిల్లాలో నర్సరావుపేటకు సమీపంలో ఉన్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కోటప్పకొండలో ఉత్సవం జరుగుతోంది. అంబరాన్ని చుంబించినట్టు ఉండే ప్రభలు, అలంకరించిన ఎద్దులు ఈ ఉత్సవం ప్రత్యేకత. ఆ రోజు జరిగే సంత కూడా అప్పటికే జాతీయ స్థాయిలో పేరెన్నికగన్నది.
చిన్నపరెడ్డి కూడా స్వగ్రామం నుంచి అరవై అడుగుల ఎత్తు ప్రభ కట్టుకుని, ఎడ్లతో తిరనాళ్లకు వెళ్లాడు. కోటప్పకొండ చేరుకోనేసరికి తిరునాళ్ళు మంచి కోలాహళంగా ఉంది. అక్కడ అశేష జనవాహిణి సంబరాలను వీక్షించడానికై వచ్చియున్నారు.ఆ సంరంభంలో ఆయన ఎద్దులు అదుపు తప్పాయి. చిన్న తొక్కిసలాట జరిగింది.చిన్నప్పరెడ్డి ఎద్దులు బెదిరిపోయి అడ్డదిడ్డంగా కంగారుగా పరుగిడ సాగాయి. చిన్నపరెడ్డి బృందం వాటిని నిలువరించడానికై విశ్వప్రయత్నం చేసారు కానీ అవి వశంకావడంలేదు.
ఇంతలో అక్కడ కాపలా ఉన్న బ్రిటీషు పోలీసులు ఆ ఎడ్లను నిలిపివేయమని లేకుంటే ఎడ్లను కాల్చి చంపుతాం అని చిన్నపరెడ్డి ని బెదిరించారు. దాంతో చిన్నపరెడ్డి ఉగ్రుడై పోలీసులకు ఎదురుతిరిగాడు . చేతనైతే ముందు నన్ను చంపు ఆ తరువాత నా ఎడ్లను చంపమని పోలీస్ తుపాకులకు రొమ్ము చూపాడు.
ఆనాటి డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఆరణి సుబ్బారావు పోలీసులుకు ఆజ్ఞ ఇచ్చి చిన్నపరెడ్డి ఎద్దులని కాల్చి చంపమన్నాడు. దాంతో పోలీసులు నిర్ధాక్షయంగా చిన్నపరెడ్డి ఎద్దులని కాల్చి చంపేసారు
ఈ ఘటనతో కోపోదృక్తుడైన చిన్నపరెడ్డి తన వెంట ఉన్న ప్రజలతో కలిసి అక్కడే పోలీసులపై తిరగబడ్డాడు . వందేమాతరం - మనదే రాజ్యం అంటూ పోలీసులపై ఇనుపకడ్డీలతో దాడి చేసి
ఒకహెడ్ కానిస్టేబుల్ను, కొందరు కానిస్టేబుల్ను మంటల్లో వేసి కాల్చి చంపారు . తక్కిన పోలీసు వారిని , మెజిస్ట్రేట్ ను, బ్రిటీష్ అధికారుల్ని అక్కడినుండి తరిమి కొట్టారు. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న పోలీసులు చిన్నపరెడ్డిని అరెస్టు చేశారు. అక్కడే తాత్కాలికంగా తాటాకులతో నిర్మించిన పోలీసు స్టేషన్‌లో బంధించారు. చిన్నపరెడ్డిని విడుదల చేయాలని కోరుతూ ప్రజలు ఆందోళనకు దిగారు. వారి నోటి నుంచి వినిపించిన నినాదం - వందేమాతరం. పోలీసులు మళ్లీ కాల్పులు జరిపితే ఇద్దరు యువకులు మరణించారు. కోపోద్రిక్తులైన ప్రజలు తాటాకుల పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టారు. చిన్నపరెడ్డితో పాటు మరో వందమందిపై కూడా కేసులు నమోదైనాయి.
విచారణ ఒక ప్రహసనంగా మారిపోయింది. ఈ కేసులో గుంటూరు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఐషర్ కార్షన్ 21 మందికి ఉరిశిక్ష, 24 మందికి కఠిన శిక్షలు విధించాడు. అయితే ఈ తీర్పు ఇచ్చిన తరువాత అతడు పదవికి రాజీనామా చేశాడు.
ఈ తీర్పును చిన్నపరెడ్డి మద్రాసు హైకోర్టులో సవాలు చేశాడు. కావాలంటే తనను శిక్షించి, మిగిలిన వారిని వదిలివేయమని ఆయన కోరాడు. ఆగస్టు 13, 1910న న్యాయమూర్తి మన్రో తీర్పు వెలువరించాడు. చిన్నపరెడ్డికి మరణశిక్ష, 21 మందికి ద్వీపాంతర శిక్ష పడింది. ఆ వెంటనే శిక్షను అమలు చేశారు.
చిన్నపరెడ్డిని బ్రిటీష్ ప్రభుత్వం రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఆగష్టు 14న ఉరితీసి చంపారు.
దేశ విముక్తి కోసం చిన్నపరెడ్డి చిరునవ్వుతో ఉరితాళ్లని ముద్దాడాడు. చిన్నపరెడ్డి ఉరితో జిల్లా ప్రజలు బెదరలేదు.
సైరా చిన్నపరెడ్డి
సై సైరా చిన్నపరెడ్డి
నీ పేరే బంగారుకడ్డీ
పుట్టింది రెడ్డిపాలెములో
పెరిగింది చేబ్రోలున రెడ్డీ....
""సైరా ""
చిన్నపరెడ్డి మాటలాకు
చుట్టూనొక పన్నెండామడ
నిప్పులేక మండిస్తివి రెడ్డీ
చుట్టును యొక్క నాలుగామడ
బందిపోటు కొట్టిస్తివి రెడ్డీ..... ""సైరా ""
చిలుకలా తలగుడ్డ చుట్టి
గోరంచు పంచెను గట్టి
ఏడాది ఒక్క దినంబు
కోటప్పకొండ వెళ్ళడానికి
బండిని ప్రభనుగా తయారుజేసే
ఏభై ముళ్ళా ప్రభను గట్టే
నాలుగు గాండ్ల ఎద్దులు గట్టే... ""సైరా ""
అంటూ....మరణం తర్వాత కూడా జనాలు చిన్నపరెడ్డిని మరిచిపోలేదు. పాటలుగా పాడుకుంటూ చిన్నపరెడ్డి తమ మధ్యనే జీవిస్తున్నట్టుగా పాటల్లో వెదుక్కోవడం మొదలెట్టారు.
చిన్నపరెడ్డి వీరత్వపు కథలను బుడిగజంగాలు, గుర్రాలు ఆడించేవాళ్ళు , తదితర జానపదులు తమ పాటల్లో నేటికిని స్మరించుకోవడం గుంటూరు పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. కోలాటాల పాటల్లో, వరి నార్లల్లో, వినిపించే చిన్నపరెడ్డి పాటలు రాగయుక్తమైనవి.
అని ఆయన త్యాగాన్నీ, దేశభక్తిని ప్రజలు గానం చేశారు.
వందేమాతరం ఊపిరిగా ఉరికొయ్యని దిక్కరించిన చిన్నపరెడ్డి వంటి దేశభక్తులు నడియాడిన స్థలాలను, వారు జీవించిన ఇళ్లను చారిత్రక స్మృతి కేంద్రాలుగా తీర్చిదిద్ది భావితరాలకు స్ఫూర్తినిచ్చేందుకు అందించాలి. వారి చరిత్రను పాఠ్యపుస్తకాలలో పొందుపరచాలి.
చిన్నపరెడ్డి ఉరితీత ఘటనతో నాటి ఆంధ్రుల్లో స్వాభిమానంతో పాటు దేశ భక్తి, స్వాతంత్ర కాంక్ష మరింత పెరిగి ,నాటి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడేలా చేశాయి .
వంద సంవత్సరాలు వెనక్కివెళితే వీరుల త్యాగాల జాడలు కనపడ తాయి. వారు కన్న కలలూ, నిర్మించాలనుకున్న స్వేచ్ఛాభారతం కోసం ప్రదర్శించిన పట్టుదల మన ముందున్నాయి. బ్రిటిష్ పాలకుల గుండెల్లో సింహస్వప్నంగా మారిన చిన్నపరెడ్డి లాంటి దేశభక్తుల పోరాట చరిత్రను నేటి తరాలకు అందించాల్సిన కర్తవ్యం మనపై ఉంది.