17/07/2025
గురజాల నియోజక వర్గ విజన్ యాక్షన్ ప్లాన్ అమలులో భాగంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో రైతుల కోసం కిసాన్ మేళా నిర్వహించాలన్న ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ, ఆచార్య నాగార్జున వ్యవసాయ విద్యాలయాల నేతృత్వంలో నడికుడి ఏఎంసీలో కిసాన్ మేళా నిర్వహించారు.
వ్యవసాయరంగంలో వినియోగించే ఆధునిక పరికరాలతో పాటు ఆధునాతన డ్రోన్లు, సాగు యంత్రాలు, పనిముట్లను మంత్రి పరిశీలించారు. వాటి పనితీరును అధికారులు మంత్రికి వివరించారు.
సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలో ఎక్కడ రైతులకు కష్టం వచ్చినా ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొస్తోందన్నారు. నల్లబర్లీ ధరలు పతనమై పంట అమ్ముకోలేని స్థితిలో ఉన్న రైతుల కోసం నిబంధనలు సవరించదంతో పాటూ రూ.270 కోట్లు వెచ్చించి జిల్లాలో పొగాకు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. చిత్తూరులో కేజీకి రూ.4 అదనంగా చెల్లించి మామిడి కొనుగోలు చేశామన్నారు.
ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 12 రకాల శాఖలను ఆహ్వానించి రైతుల కోసం ఎన్నడూ లేని విధంగా గురజాల నియోజక వర్గంలో భారీ స్థాయిలో కిసాన్ మేళా నిర్వహించడం జరిగిందన్నారు. రైతులు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుని, ఉత్పత్తి పెంచి, అధిక రాబడులు పొందాలన్నారు.
జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు మాట్లాడుతూ..పత్తి, మిర్చి వంటి సంప్రదాయ పంటల నుంచి రైతులు ప్రత్యామ్నాయ పంటలపవైపు మళ్లాలన్నారు. నూతన సాంకేతికత గురించి అవగాహన పెంచుకుని లాభసాటి వ్యవసాయం చేయాలన్నారు.
ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ..భూమ్మీద వ్యవసాయం చేస్తున్న మాకు కొత్తగా తెలుసుకోవాల్సింది ఏముంది అనే ఆలోచన నుంచి రైతులు బయటికి రావాలన్నారు. ఉత్పత్తి పెంచి, రాబడి పెంచే మార్గాలను రైతులకు తెలియజేయడం కోసం కిసాన్ మేళా నిర్వహించడం జరిగిందన్నారు.
టీటీడీ పాలకవర్గం సభ్యులు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. వ్యవసాయ పద్ధతుల్లో వస్తున్న మార్పులను రైతులు అవలంబించాలన్నారు.
కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కలెక్టర్ అరుణ్ కుమార్, అధికారులు, స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.