26/05/2024
ఆస్తికోసం వృద్ధురాలు కిడ్నాప్ ..
Follow Us : https://www.youtube.com/
అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని మన్నూరు రామాలయం సమీపంలో గత ఆదివారం ఆస్తికోసం తనను కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని, వృద్ధురాలు అని కూడా చూడకుండా తనపై భౌతిక దాడికి పాల్పడి స్వర్ణాభరణాలు అపహరించి ఆస్తి కాజేసేందుకు కుట్రలు పన్నారంటూ ఆరోపిస్తూ మన్నూరు రామాలయం సమీపంలో నివసిస్తున్న కుడుమల లక్ష్మీనరసమ్మ శనివారం తన నివాసంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి బోరున విలపించింది. మీడియాతో లక్ష్మీనరసమ్మ మాట్లాడుతూ తనకు సుబ్బారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి అని ఇద్దరు కుమారులు సంతానమని, వీరిలో చిన్న కుమారుడు శ్రీనివాసులు రెడ్డికి మంటపం పల్లె వాసి అయిన రేవతి తో సుమారు తొమ్మిది ఏళ్ల క్రితం వివాహం జరిపించామని తెలిపారు. వివాహం అవ్వగానే నూతన దంపతులు కడపలో వేరు కాపురం ఉంటూ వివాహమైన ఒక మాసానికే ఇద్దరూ కువైట్ కు వెళ్ళారని, అక్కడ ఇద్దరి మధ్య పరస్పర విభేదాలు రావడంతో కొడుకు, కోడలు విడిపోయారని తెలిపారు. కువైట్ నుంచి స్వదేశానికి వచ్చిన కోడలు రేవతి తనతో తరచూ గొడవ పడుతూ కోడలిపై హత్యాయత్నం చేశానని అభాండం వేసి తనను సెంట్రల్ జైలులో వేయించి నేటికి వాయిదాలకు తిప్పుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో గత ఆదివారం తన కోడలు రేవతి బంధువులను తీసుకొచ్చి మన్నూరు లోని తన నివాసం ఎదుట తనను కిడ్నాప్ చేసి ముసుగు తొడిగి రాయచోటికి తీసుకెళ్లి నాలుగు రోజులు పాటు చిత్రహింసలు చేసి బుధవారం విడిచిపెట్టారాని విలపించారు. వృద్ధురాలని కూడా చూడకుండా తనపై చేయి చేసుకోవడమే కాక, నాలుగు తులాల సరుడు, ఐదు గ్రాముల కమ్మలు, ఒక సెల్ ఫోన్ ను దౌర్జన్యంగా అపహరించారని ఆరోపించారు. కువైట్ లో ఉన్న తన చిన్న కుమారుడిని స్వదేశానికి పిలిపించి ఆస్తి తన పేరిట రాయించాలని, లేకపోతే చంపుతామని బెదిరించారని, భర్త మరణించి మన్నూరులో ఒంటరిగా ఉన్న తనపై హత్యాయత్నం చేసేందుకు కోడలు కుట్ర పన్నుతోందని, పోలీసులు తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. తనపై జరిగిన కిడ్నాప్ పై తన కుమారుడు శ్రీనివాసులు రెడ్డి ఆన్లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారని, పోలీసులు స్పందించి తన కోడలి నుంచి తనకు రక్షణ కల్పించి, కిడ్నాప్ చేసి దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేసి న్యాయం చేయాలని ఆమె వేడుకున్నది. ఈ ఘటనపై ప్రజా సంఘాలు కూడా ఈ కిడ్నాప్ కి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాపోతున్నారు.