
20/04/2023
నగరానికి దక్షిణాన బుద్వేల్‌లో తొలుత 100 ఎకరాలను వేలం ద్వారా విక్రయించేందుకు హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) రంగం సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించి ఆన్‌లైన్ వేలం ప్ర£క్రియ ఈ నెలాఖరులో చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. కోకాపేట వెంచర్ తర్వాత అదే స్థాయిలో దీనికి డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. రాజేంద్రనగర్‌లో పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు గతంలో భూములు కేటాయించగా.. బుద్వేల్‌లో ఒకే చోట హిమాయత్‌సాగర్ దిగువ భాగాన రెండు వైపులా 300 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. ఇప్పటికే మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ తదితర ప్రాంతాల్లో అనేక వెంచర్లు వచ్చాయి. ప్రముఖ ఐటీ కంపెనీలు, ఆసుపత్రులు ఇతర భారీ వాణిజ్య, వ్యాపార సంస్థలు కొలువుదీరాయి. అక్కడ విపరీతమైన రద్దీ ఏర్పడటంతో బుద్వేల్ వైపు అభివృద్ధి విస్తరించాలన్నది ఎప్పటి నుంచో ప్రభుత్వ భావనగా ఉంది. ఈ క్రమంలోనే ఇక్కడ భారీ వెంచర్‌కు హెచ్‌ఎండీఏ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. విడతల వారీగా వెంచర్లు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. తొలి విడత లేఅవుట్ అభివృద్ధికి ఇప్పటికే టెండర్లు పిలిచారు. త్వరలో ఈ వెంచర్‌లో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టనున్నారు.
ఎకరాల్లో విక్రయాలు
తొలి విడతలో గజాల్లో కాకుండా వెంచర్‌లో ఎకరాల్లో విక్రయించాలని నిర్ణయించారు. గతంలో కోకాపేటలో ఎకరా భారీ ఎత్తున డిమాండ్ పలికింది. అదే స్థాయిలో ఇక్కడా డిమాండ్ ఉంటుందని హెచ్‌ఎండీఏ ఆశలు పెట్టుకుంది. అవుటర్ రింగ్‌రోడ్డు అనుసంధానంతో పాటు రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరించనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అప్పా జంక్షన్, రాజేంద్రనగర్ వద్ద మెట్రో స్టేషన్లు రానున్నాయి. బుద్వేల్ వెంచర్‌కు ఈ రెండు మెట్రో స్టేషన్లతో అనుసంధానించనున్నారు. వాణిజ్య, వ్యాపార, నివాస తదితర బహుళ వినియోగానికి అనుగుణంగా ఇక్కడ భూ వినియోగ జోన్లు కేటాయించనున్నారు. తొలి విడతలో వెంచర్‌కు వచ్చిన డిమాండ్‌ను బట్టి మలి విడతలో భూములు వేలం వేయనున్నారు. 300 ఎకరాల వరకు ఈ వెంచర్ విస్తరించనున్నట్లు హెచ్‌ఎండీఏకు చెందిన అధికారి తెలిపారు. ఇటీవలి కోకాపేటలో నియోపోలీస్ పేరిట వెంచర్‌ను వేలం వేసిన హెచ్‌ఎండీఏకు భారీ ఎత్తున ఆదాయం సమకూరింది. ప్రస్తుతం ఈ వెంచర్‌లో రోడ్డు, డ్రైనేజీ ఇతర మౌలిక వసతుల కల్పన ఒక కొలిక్కి వచ్చింది.అదే స్థాయిలో బుద్వేల్ వెంచర్‌ను అభివృద్ధి చేయనున్నట్లు చెబుతున్నారు.
Source Eenadu