03/10/2026
ఉవ్వెత్తున ఉద్యమించాలి
ప్రజాస్వామ్యం.. ఈ పదంలోనే ఒక అద్భుతమైన శక్తి ఉంది. జాతి, కుల, మత, వర్గ, వర్ణ వివక్షలకు తావు లేకుండా దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కును కల్పించే ఏకైక ఆయుధం ఓటు. ఆ ఓటు హక్కును ప్రయోగించడం ద్వారానే సామాన్యుడు సైతం దేశ గతిని మార్చగలడు, పాలకుల తలరాతలను తిరగరాయగలడు. కానీ, అత్యంత పవిత్రమైన ఈ ఓటు హక్కుకు, ఎన్నికల ప్రక్రియకు ఇప్పుడు మునుపెన్నడూ లేని స్థాయిలో ముప్పు వాటిల్లుతోంది. ఒకప్పుడు బూత్ క్యాప్చరింగ్, దొంగ ఓట్ల రూపంలో ఉన్న ముప్పు.. ఇప్పుడు సాంకేతి కత, చట్టబద్ధత ముసుగు వేసుకుని వ్యవస్థాగతమైన దాడిగా పరిణమించింది. ఈవీఎంల ట్యాంపరింగ్ నుండి మొదలుకుని, పౌరుల ఓట్లను వ్యవస్థాగతంగా గల్లంతు చేయడం వరకు సాగుతున్న ఈ పరిణామాలు భారత ప్రజాస్వామ్య పునాదులను కదిలిస్తున్నాయి. ఇటీవల ఇండియన్ ఎక్స్‍ప్రెస్ పత్రిక వెలువరించిన ప్రత్యేక కథనం, దాని చుట్టూ అల్లుకున్న విమర్శలు, ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణ.. ఇవన్నీ ఒక భయంకరమైన వాస్తవాన్ని మన కళ్ల ముందుంచుతున్నాయి.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కేవలం స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగడమే కాదు.. అలా జరుగుతు న్నాయని ప్రజలకు విశ్వాసం కలిగించాలి. కానీ, గత కొన్నేళ్లుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ‘ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయి, ఫలితాలను తారుమారు చేస్తున్నారు’ అని విపక్షాలు, పౌర సంఘాలు నెత్తీనోరు బాదుకుంటున్నా.. అధికార పక్షం, ఎన్నికల సంఘం మాత్రం ఆ ఆరోపణలను నిర్ద్వంద్వంగా తోసి పుచ్చుతూ వస్తున్నాయి. సాంకేతికంగా వాటిని హ్యాక్ చేయడం అసాధ్యమని బుకాయిస్తూ వచ్చారు. కానీ, సాంకేతికతకు ఉన్న పరిమితులు, అందులో ఉండే లొసుగులు ప్రపంచంలో ఎన్నో అగ్రరాజ్యాలకు సైతం అనుభవంలోకి వచ్చాయి. కేవలం యంత్రాలను సమర్థిం చడం ద్వారా వ్యవస్థపై నమ్మకాన్ని పెంచలేం. ఈవీఎంల వివాదం సద్దుమణగక ముందే, దానికి మించిన మరో పెను ప్రమాదం ఓటర్ల జాబితా సవరణల రూపంలో విరుచుకుపడటం ప్రస్తుత విషాదం.
ఓటర్ల జాబితా సవరణ/ SIR ప్రక్రియ అనేది అక్రమాలను అరికట్టి, అర్హులైన పౌరులకు ఓటు హక్కు కల్పించడానికి ఉద్దేశించినది. కానీ, ఇప్పుడు ఆ ప్రక్రియే ఒక ఆయుధంగా మారిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఓటర్ల జాబితాలో తప్పులున్నాయని, దేశంలో బంగ్లాదేశ్ తదితర దేశాల నుంచి వచ్చిన చొరబాటుదారులు తిష్టవేశారని, వారిని ఏరిపారేయా లన్న ఒక జాతీయవాద నినాదాన్ని తెరపైకి తెచ్చారు. చొరబాటుదారులను నిలువరించడం ఏ దేశానికైనా అత్యవసరమే. కానీ, దాని ముసుగులో స్థానిక పౌరుల, ముఖ్యంగా ఒక వర్గానికి, లేదా ప్రభుత్వాలకు వ్యతి రేకంగా ఓటు వేస్తారనుకునే వర్గాల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. నిజమైన పౌరులు తమ ఓటు హక్కును కాపాడుకోవ డానికి పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. రెవెన్యూ అధికారుల చుట్టూ, ఎన్నికల కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, వారు అడిగే పిచ్చి పిచ్చి ప్రశ్నలకు సమాధా నాలు చెబుతూ ప్రజలు విసుగెత్తిపోతున్నారు. పౌరస త్వాన్ని నిరూపించుకోవడానికి రకరకాల డాక్యుమెంట్లు, ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి వస్తోంది. ఏళ్లుగా ఒకే చోట నివసిస్తున్న సామాన్యులను సైతం మీ తాత ముత్తాతల ఆధారాలు ఎక్కడ అని ప్రశ్నిస్తూ వేధింపులకు గురిచేయడం ఏ రకమైన న్యాయం? ఒక సామాన్య పౌరుడు తన దైనందిన జీవిత పోరాటాన్ని పక్కనపెట్టి, తన ఓటును రక్షించుకోవడం కోసమే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి దాపురించింది.
ఇంత కష్టపడి, అధికారులు అడిగిన పత్రాలన్నీ సమర్పించినా ఓటు హక్కు దక్కుతుందా అంటే అదీ లేదు. ఇక్కడే అసలు కుట్ర దాగి ఉందని ఇండియన్ ఎక్స్‍ప్రెస్ తన ప్రత్యేక కథనంలో బాంబు పేల్చింది. పౌరులు ఎన్ని డాక్యుమెంట్లు సమర్పించినా, కిందిస్థాయి అధికారులు వాటన్నింటినీ సరిచూసి ఓకే చేసినా.. చివరికి ఓటర్ల జాబితాలో వారి పేర్లు గల్లంతవుతున్నాయి. దీనికోసం ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‍వేర్‌ను, అల్గారిథమ్‌ను వినియో గిస్తున్నారన్న వార్తలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. అంటే.. పౌరుడి ఓటు ఉండాలా వద్దా అనేది ఇక అధికారుల చేతుల్లో కూడా లేదు, తెరవెనుక ఎవరో ఆపరేట్ చేసే ఒక కోడింగ్, ఒక సాఫ్ట్‍వేర్ నిర్ణయిస్తుం దన్నమాట. ఇది ముమ్మాటికీ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కును సాంకేతికతతో హరించడమే.
ఓటు విలువ తెలిసిన పాలకులైతే ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకో వాలి. కానీ, విడ్డూరం ఏమిటంటే.. ఇంత ఘోరమైన పని చేస్తున్న అధికారులకు, సిబ్బందికి శిక్ష పడకుండా, వారిని కాపాడేలా ముందే చట్టపరమైన రక్షణ కవచాలను సైతం సిద్ధం చేయడం. అంటే, తప్పు జరుగుతోందని తెలిసినా, వ్యవస్థను నిలదీసే అవకాశం పౌరుడికి లేకుండా చట్టాల ద్వారా ఉక్కుకోట నిర్మించారు. ‘మా డ్యూటీ మేము చేశాం, సాఫ్ట్‍వేర్ లోపం వల్లే ఓట్లు పోయాయి, మాకేం సంబంధం లేదు’ అని అధికారులు చేతులు దులుపు కునేలా ఒక భయంకరమైన అధికారిక యంత్రాంగాన్ని తయారు చేశారు.
ప్రజాస్వామ్యంలో ఇంతటి దారుణం జరుగుతుంటే పౌర సమాజం ఎందుకు మౌనంగా ఉంది? ప్రతిపక్షాలు, మీడియా ఎందుకు గట్టిగా ప్రశ్నించలేకపోతున్నాయి? ఇక్కడే అసలైన రాజకీయ చదరంగం దాగి ఉంది. ఈ కుతంత్రాలను ప్రశ్నించకుండా, ప్రజల దృష్టిని మళ్లించ డానికి ఒక బలమైన సపోర్ట్ సిస్టమ్‌ను ముందే డెవలప్ చేశారు. ఎవరైనా ఓట్ల గల్లంతు గురించి మాట్లాడితే.. వెంటనే ‘ధర్మం ప్రమాదంలో ఉంది’, ‘దేశ భద్రత ముఖ్యం’, ‘చొరబాటుదారులను సమర్థిస్తారా?’ అంటూ భావోద్వేగాలను రెచ్చగొట్టే నినాదాలతో దాడికి దిగుతారు. సోషల్ మీడియా ట్రోల్ ఆర్మీల ద్వారా ప్రశ్నించే గొంతులను అణచివేస్తారు. దేశం, ధర్మం అనేవి ప్రతి భారతీయుడికి ప్రాణప్రదమైనవి. కానీ, వాటిని అడ్డుపెట్టుకుని రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును హరిం చడం ఏ రకమైన దేశభక్తి? పౌరుడి హక్కును కాలరాసి నిలబెట్టే ధర్మం ఏముంటుంది? భావోద్వేగాల మత్తులో ప్రజలను ముంచెత్తి, తెరవెనుక తమకు కావలసిన విధంగా ఎన్నికల ప్రక్రియను మార్చుకుంటున్న తీరు చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది.
ఇండియన్ ఎక్స్‍ప్రెస్ కథనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తర్వాత, తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల సంఘం ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఆ కథనంలోని అంశాలను ఖండిస్తూ, ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా జరిగిందని, ఏ ఒక్కరి ఓటు ఉద్దేశపూర్వకంగా తొలగించబడలేదని ఒక మొక్కుబడి వివరణ ఇచ్చుకుంది. సాఫ్ట్‍వేర్ ద్వారా ఓట్ల తొలగింపు జరిగిందన్న ఆరోపణలను కొట్టిపారేసింది. కానీ, క్షేత్ర స్థాయిలో వాస్తవాలు ఈసీ చెబుతున్న మాటలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. లక్షలాది మంది అర్హులైన పౌరులు తమ ఓటు హక్కును కోల్పోయి బూత్‌ల వద్ద కన్నీరు మున్నీరు అవుతున్న దృశ్యాలు ప్రతీ ఎన్నికల్లోనూ కనిపి స్తూనే ఉన్నాయి. పత్రికలు ఆధారాలతో సహా కథనాలు ప్రచురిస్తున్నప్పుడు, ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థగా ఎన్నికల సంఘం చేయాల్సింది.. ఒక పత్రికా ప్రకటనతో చేతులు దులుపుకోవడం కాదు. నిష్పాక్షికమైన విచారణ జరిపి, సాంకేతిక వ్యవస్థలపై ఆడిట్ నిర్వహించి, ప్రజలకు నమ్మకం కలిగించాలి. కానీ, ఈసీ తీరు చూస్తుంటే.. ప్రభుత్వానికి ఒక అనుబంధ సంస్థలా వ్యవహరిస్తోందన్న విమర్శలకు బలం చేకూరుతోంది.
న్యాయస్థానాలు సైతం ఎన్నికల సంఘం పరిధిలోని వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి వెనుకాడతాయి. చట్టాలు పాలకులకు చుట్టాలుగా మారాయి. పౌరుల హక్కులను కాపాడాల్సిన వ్యవస్థలు, అధికారులే ఆ హక్కుల హననానికి మౌన సాక్షులుగా లేదా భాగస్వా ములుగా మిగిలిపోయారు. మరి ఈ దేశాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించేదెవరు? దీనికి ఒకే ఒక్క సమాధానం.. ‘ప్రజలు’. దేశాన్ని ప్రజలే రక్షించుకోవా ల్సిన చారిత్రక అవసరం ముందు నిలబడి ఉన్నాం. ఓటు హక్కు పోయిందని బాధపడుతూ కూర్చుంటే, రాబోయే తరాలకు మనం బానిసత్వాన్ని వారసత్వంగా ఇచ్చినట్లే. ధర్మం, దేశం పేరిట చేసే ఉద్వేగపూరిత నినాదాల వెనుక ఉన్న అసలు కుట్రలను ప్రజలు గుర్తించాలి. ప్రశ్నించే తత్వాన్ని కోల్పోయిన సమాజం తనను తాను నాశనం చేసుకుంటుంది. ప్రతి పౌరుడూ తన ఓటు హక్కు పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాను సరిచూసుకోవాలి, ఒకవేళ తమ ఓటును అక్రమంగా తొలగిస్తే.. వీధుల్లోకి వచ్చి పోరాడాలి. సాంకేతికత పేరిట జరుగుతున్న ఈ డిజిటల్ నియంతృత్వాన్ని ఛేదించాలంటే ఐక్య ప్రజా ఉద్యమాలే ఏకైక శరణ్యం.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఏనాడో హెచ్చరించారు.. ‘రాజ్యాంగం ఎంత మంచిదైనా, దానిని అమలు చేసేవారు చెడ్డవారైతే దానికి ముప్పు తప్పదు’ అని. నేడు ఆ ముప్పు మన ముందు సాక్షాత్కరించింది. మాయమాటలకు మోసపోకుండా, వ్యవస్థల కుట్రలను తిప్పికొడుతూ.. మన ఓటును, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యత భారతీయుల భుజస్కంధాల పైనే ఉంది. మేల్కొనకపోతే, రేపటి చరిత్ర మనల్ని క్షమించదు.
వడ్డే సత్యం
సామాజిక కార్యకర్త