Idi Sangathi - ఇదీ సంగతి

Idi Sangathi - ఇదీ సంగతి Hi Everyone!

09/10/2025

కాలనాగుకు పర్యాయపదం పాకిస్థాన్ . అదును దొరికితే భారత్ మీద కాట్లు వేయడానికి సిద్ధంగా ఉంటుంది ఆ ధూర్త దేశం. అలాంటి కాలనాగును ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్రేష్ఠమైన పాలు పెంచి పోషిస్తుండగా.....ఆ రెండు దేశాల స్నేహం మరింత బలపడేలా పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా అత్యాధునిక ఏ.ఐ.ఎం-120క్షిపణులను పాకిస్థాన్ కు అందించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు అమెరికా రక్షణ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సమాచారం. అటు ఇరాన్ లో భారత్ అభివృద్ధి భాగస్వామిగా ఉన్న చాబహార్ పోర్టుకు సమీపాన.... ఓడరేవు నిర్మాణంపై పాక్ అధికారులు అమెరికాతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. మరి ఈ పరిణామాలు దేనికి సంకేతం. దీని వల్ల భారత్ పై పడే ప్రభావం ఎంత. మనం ఎంతమేర అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.

09/10/2025

రెండేళ్ల విధ్వంసం.! ఉహించని వినాశనం.! మాటలకందని మారణహోమం.! అదే ఇజ్రాయెల్ , హమాస్ మధ్య జరిగిన యుద్ధం.! ఐతే ఏ యుద్ధమైనా...ఎప్పుడో ఒకసారి ఆగాల్సిందే. ఎట్టకేలకు ఆ దిశగా ఓ అడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతో ఎట్టకేలకు ఇరుపక్షాలు మొదటిదశ శాంతి ఒప్పందాలపై సంతకాలు చేయడం ప్రపంచ దేశాలతో పాటు పాలస్తీనీయులకు సంతోషం కలిగించింది. దీంతో గాజాలో శాంతి చిగురిస్తుందనే ఆశలు మళ్లీ పురుడు
పోసుకుంటున్నాయి. మరి, ఇరుపక్షాలు మొదటిదశ శాంతి ఒప్పందంపై సంతకాలు చేయడానికి దోహదపడిన అంశాలేంటి?...బందీల విడుదల, బలగాల ఉపసంహరణపై ఇరుపక్షాల షరతులేంటి?...ఇజ్రాయెల్ , హమాస్ మధ్య దీర్ఘకాలిక శాంతి నెలకొనే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి?...శాంతి ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడి పాత్ర ఎటువంటిది?

08/10/2025

సౌరశక్తిని ఒడిసిపట్టు...సోలార్‌ విద్యుత్‌తో ఆదాయం ఆర్జించు.! అవును ఇప్పుడిదే.. ఆదాయ వనరుగా మారింది. నెలకు వేల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. స్వయం సహాయక బృందాల మహిళలకు మంచి ఆదాయ వనరుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం SHG మహిళల చేత సోలార్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ యూనిట్లు స్థాపింపజేసి..వారిని మహారాణులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది. ఇందుకు పైలెట్‌ ప్రాజెక్టుగా నల్గొండ జిల్లా అయిటిపాముల గ్రామాన్ని ఎంపిక చేయగా..అక్కడి SHG మహిళలు..రూపాయి పెట్టుబడి లేకుండా నెలకు వేల రూపాయలు ఆర్జిస్తున్నారు. సోలార్‌ విద్యుత్‌తో వచ్చిన ఆదాయంతో వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడుతున్నారు. కుటుంబానికి ఆర్థిక భరోసాగా నిలుస్తున్నారు. ప్రభుత్వ సహకారం...ప్రతీక్‌ ఫౌండేషన్‌ తోడ్పాటుతో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి విజయగాథను మనమూ ఓ సారి చూద్దాం

08/10/2025

పాశ్చాత్య పోకడలు రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో...సంస్కృతి సంప్రదాయాలు, చేతి వృత్తుల్ని కాపాడుకోవడం కష్టమైంది. ఐతే, మారుతున్న కాలానికి అనుగుణంగా అలోచనల్ని మేళవింపుతో ఏ రంగంలోనైనా రాణించవచ్చు. అందుకు నిదర్శనమే మంగళగిరి చేనేతలు. కరోనా సమయంలో వ్యాపారాలు కుదేలైనా..ఆన్ లైన్ మార్కెటింగ్ ఆలోచన వారిని ఆదుకుంది... ఆర్థికంగా నిలబెట్టింది. విభిన్నమైన వస్త్రాలు మార్కెట్ ను ముంచెత్తుతున్న క్రమంలో కొత్త డిజైన్లు అద్ది..బ్రాండింగ్ ను జోడించడంతో మంగళగిరి చేనేతల వారసత్వ కళ దేశవిదేశాలకు విస్తరించింది. దీనికి సర్కారు సహకారమూ తోడవ్వడంతో చేనేతల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఫలితంగా సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు, V.I.Pల ఇంట జరిగే పండగలు, శుభకార్యాల్లో మంగళగిరి బ్రాండ్ మెరిసిపోతోంది. ఈ నేపథ్యంలో మంగళగిరి చేనేత కొత్త సొబగులద్దుకొని మార్కెట్ కు అనుగుణంగా మెరిసిపోతున్న తీరుపై ప్రత్యేక కథనం

08/10/2025

మనిషి శరీర భాగాల్లో అత్యంత కీలకమైన వాటిలో మొట్టమొదటిది రక్తం. మానవ జీవన క్రియలో ముఖ్య పాత్ర పోషించడంతో పాటు శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో రక్తందే కీలక భూమిక. ప్రమాదాల బారిన పడిన వారికి అత్యవసరంగా రక్తం ఎక్కించగలిగితే వారికి పునర్జన్మ ఇచ్చినట్టే. మరో వైపు తలసేమియా, హీమోఫీలియా, కాన్సర్ బారిన పడిన వారికి తరచూ రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే 146కోట్ల జనాభా కల్గిన భారతదేశంలో... అవసరమైన సమయాల్లో రక్త లభ్యత తక్కువగానే ఉంది. సగం అవసరాలను కూడా తీర్చలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రక్తం, రక్తం ఉత్పత్తుల హేతుబద్ధ వినియోగంపై విశాఖపట్నంలో జాతీయ సదస్సు జరిగింది. దేశంలో రక్తదానాలను పెంచడం సహా దాని కొరతను అధిగమించడంపై సదస్సు అనేక అంశాలను చర్చించింది.

07/10/2025

ఒక్కరు ముద్దు... ఇద్దరు హద్దు... ముగ్గురు వద్దు... జనాభా
పెరుగుదల నేపథ్యంలో పదిహేనేళ్ల ముందు వరకు ఎక్కువగా
ప్రాచుర్యంలో ఉన్న నినాదం ఇది. కానీ, ఆశించినంత మేర
ఆచరణకు నోచుకోలేదు. ఫలితంగా 2023లో చైనాను అధిగమించి
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్
అవతరించింది. జనాభా పెరిగిందని అనుకునేలోపే సంతానోత్పత్తి
రేటు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కచ్చితంగా
ఒక్కరు లేదా ఇద్దరు పిల్లల్ని కనండని ప్రభుత్వాలు, పలు రాష్ట్రాల
ముఖ్యమంత్రులు సైతం చేప్పే పరిస్థితి ఏర్పడింది. కారణం..ఏటా
సంతానోత్పత్తి రేటు పడిపోతుండటమే.

సాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ గణాంక నివేదిక 2023,
ఐక్యరాజ్యసమతి సహా పలు అధ్యయనాల ప్రకారం...దేశంలో
సంతానోత్పత్తి రేటు 1.9కి పడిపోయింది. దీనివల్ల భారత భవిష్యత్తు
ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మరి, దేశంలో సంతానోత్పత్తి
రేటు క్షీణించడానికి గల ప్రధాన కారణాలేంటి? సంతానంపై ఈతరం
దంపతులు ఎందుకు ఆనాసక్తి కనబరుస్తున్నారు? దీని వల్ల
భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలేంటి?

07/10/2025

ఔషధాలు అంటే ప్రాణాలు నిలబెట్టే సంజీవునిలు. చిన్న చిన్న
అనారోగ్య సమస్యలు తలెత్తినపుడు వైద్యులు అందుబాటులో
లేకున్నా ఇంట్లో ఉండే మందులతో సాంత్వన పొందవచ్చు.
అలాంటి ఔషధాలే ప్రాణాలు తీస్తున్నాయి. మధ్యప్రదేశ్ , రాజస్థాన్
లో కోల్డ్ రిఫ్ అనే దగ్గు మందు వల్ల పలువురు చిన్నారులు
ప్రాణాలు కోల్పోవడం కలవరం రేపుతోంది. ఈ సంఘటన
నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆ మందుని నిషేధించాయి. అయితే
తమిళనాడులోని ఈ కంపెనీ ప్లాంటులో మందుల తయారీ విధానం
చూసి అధికారులు విస్తుపోయారు. అత్యంత అపరిశుభ్ర
వాతావరణంలో ఇక్కడ ఔషధాలు తయారు చేస్తున్నట్లు తేలింది.
మరి తరచూ మందుల విషయంలో ఎందుకీ సమస్య. ముందే
మేలుకోవాల్సిన అధికార యంత్రాంగం ఎందుకు చర్యలు
తీసుకోవడం లేదు. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి.

06/10/2025

నీటిపారుదల అభివృద్ధి సంస్థ-I.D.C ఆధ్వర్వంలోని ఎత్తిపోతల పథకాల పరిస్థితి గందరగోళంగా మారింది. స్థానిక ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు వీలుగా నిర్మించిన చిన్న తరహా ఎత్తిపోతల పథకాలు...నిర్వహణ లోపాలు, నిధుల లేమితో అటకెక్కుతున్నాయి. పట్టించుకునే నాథులే.. కరవయ్యారు. అంతేనా మరమ్మత్తులకు నిధులూ అందడం లేదు. దీంతో ఎత్తిపోతల పథకాలు నిరుపయోగంగా మారుతున్నాయి. ఫలితంగా ఆయకట్టు సాగునీటికి నోచుకోవడం లేదు. విద్యుత్ ఖర్చులు, నీటి లభ్యత, నిర్వహణ సమస్యలు లాంటివి ఎత్తిపోతల పథకాల మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ప్రత్యేక వ్యవస్థ నుంచి మినహాయించడం కూడా శాపంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ సాగునీటి
వినియోగదారుల సంఘాల ఏర్పాటుకు సిద్ధం అవుతోంది. వాటి ద్వారా చెరువులు, కాల్వలతో దశలవారీగా ఎత్తిపోతల పథకాల నిర్వహణ కూడా రైతుల ద్వారానే చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఆ నేపథ్యంలో రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల దుస్థితిని తెలిపే కథనమే ఇదీ.

06/10/2025

సరిహద్దుల రక్షణ ఎంత కీలకమో...సాగర జలాల్లో తలెత్తే ముప్పును తప్పించి శత్రుదుర్భేద్యంగా మార్చడమూ అంతే కీలకం. ఈ విషయంలో భారత నౌకాదళం పోషిస్తున్న పాత్ర వెలకట్టలేనిది. ఎప్పటికప్పుడు కొత్త ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటూ అమ్ములపొదిని పటిష్ఠం చేసుకుంటూ వస్తోంది నౌకాదళం. అదే క్రమంలో తీర ప్రాంతానికి సమీపంలోని సాగర జలాల్లో శత్రు దేశాల జలాంతర్గాములను గుర్తించే యుద్ధ నౌక అండ్రోత్‌ నౌకాదళంలో చేరింది. భారత నౌకాదళం స్వదేశీకరణ యత్నాల్లో ఇది మైలురాయిగా నిలిచింది. లక్షదీవుల్లోని ఆండ్రోత్‌ దీవి పేరు మీద దీనికి నామకరణం చేశారు. మరి ఏమిటి ఈ నౌక ప్రత్యేకత. భారత నౌకాదళానికి ఇది ఎందుకు కీలకం.

06/10/2025

ఆకట్టుకునే పాఠశాల భవనాలు... ఆహ్లాదపరిచేలా బడి ప్రాంగణం... అద్భుతమైన ప్రయోగశాలలు... అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన... ఇవన్నీ కలగలిపిన స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం కట్టింది. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్... సంక్షిప్తంగా లీప్ పేరిట సరికొత్త విద్యా ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సమ్మిళిత విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి ఆధారిత బోధన, పరిశోధన-సృజనకు పెద్దపీట, ప్రపంచంతో పోటీపడే విద్యాప్రణాళిక అనే ఐదు అంశాలను ప్రాతిపదికగా చేసుకుని లీప్ స్కూళ్లు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వినూత్నరీతిలో విద్యాబోధనకు ఉద్దేశించిన లీప్ స్కూళ్ల ఆలోచన... క్షేత్ర స్థాయిలో అమలు కార్యాచరణ... పైలెట్ ప్రాజెక్టు పురోగతి వంటి అంశాలపై నేటి ఇదీ సంగతి

05/10/2025

వ్యవసాయం అత్యంత కష్టంతో, మరెన్నో సవాళ్లతో కూడుకున్నది. ఒకే రకమైన పంట సాగుకు నానా అవస్థలు పడుతుంటారు..రైతులు. యువకులకూ సాగు సమస్యే. అలాంటిది.. 72ఏళ్ల వయసున్న ఓ వ్యవసాయదారు..పదుల సంఖ్యలో వంగడాలను సాగు చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. మూడెకరాల పొలాన్నే ప్రయోగశాలగా మార్చి ప్రతీ సీజన్ లో వినూత్న ఆకృతుల్లో పంట సాగు చేస్తూ అందరి దృష్టిని ఆకర్శిస్తున్నారు. విదేశాల నుంచి తీసుకొచ్చిన విత్తనాలను తన పొలంలో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తూ దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నా రు. ప్రస్తుతం 18 రకాల వంగడాలను సాగు చేస్తుండగా..తన ప్రయాణంలో 150 రకాల వంగడాలు పండించారు. ఫలితంగా తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి ఆ రైతు ఎవరూ.? సేంద్రీయ సాగుతో ఎలా ప్రత్యేకత చాటుకున్నారు.? ఎలాంటి వంగడాలు సాగు చేస్తున్నారు.?

05/10/2025

మేనేజర్‌తో మీటింగ్‌లో ఉన్నప్పుడు..! క్లయింట్స్‌తో కాల్‌ మాట్లాడుతున్నప్పుడు..! డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు..! లేదా అత్యవసర పనిపై బయటికి వెళ్లినప్పుడు..! ఇలా బీజీ సమయంలో ఫోన్ రింగ్ అవుతుంది. చూస్తే అన్‌నౌన్ నంబర్‌. లిఫ్ట్ చేద్దామా? వద్దా? అన్న సందేహం. స్పామ్‌ కాల్‌ కావొచ్చనే అనుమానం. కానీ, తెలిసిన వాళ్లు చేస్తున్నారేమో అని ఆలోచించి కాల్‌ లిఫ్ట్‌ చేస్తాం. అనుకున్నట్లుగానే...అది స్పామ్‌ కాల్‌. దీంతో ఒక్కసారిగా చిరాకుపడి..కాల్‌ కట్‌ చేస్తుంటాం. లోలోపల రెండు మాటలు అనేసుకొని మళ్లీ పనిలో నిమగ్నం అవుతాం. ఏదో ఒక సందర్భంలో మనమంతా ఎదుర్కున్న సమస్యే ఇది. రోజుకు రెండు, మూడు స్పామ్‌ కాల్స్‌తో విసిగి వేసారి పోయేవాళ్లు చాలామందే ఉన్నారు. ఇంచుమించు 90% వరకు యూజర్లు సగటున మూడేసి స్పామ్‌ కాల్స్ బారిన పడినట్లు టెలికాం గణాంకాలు చెబుతున్నాయి. మరి, ఇందుకు గల కారణాలు ఏంటి? స్పామ్‌ కాల్స్‌కి అడ్డుకట్ట వేయలేమా? ఈ సమస్యకు టెలికాం సంస్థలు తీసుకుంటున్న చర్యలేంటి? మొబైల్ యూజర్లు అప్రమత్తంగా ఉండకపోతే ఎదురయ్యే పరిణామాలేంటి?

Address

Hyderabad

Telephone

+918415246555

Alerts

Be the first to know and let us send you an email when Idi Sangathi - ఇదీ సంగతి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Idi Sangathi - ఇదీ సంగతి:

Share