 
                                                                                                    02/09/2025
                                             #లంబాడీలను_ఎస్టీ_జాబితానుండితొలగించాలనడంరాజ్యాంగ_వ్యతిరేకం*
*- కాంగ్రెస్ పార్టీ ప్రజా  ప్రతినిధులుగా ఉంటూ లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలనే వైఖరి తీసుకున్న సోయం బాబురావు,ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుల తీరుపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరి ప్రకటించాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.*
గత 50 సంవత్సరాలుగా ఎస్టీ జాబితాలో ఉన్న లంబాడి గిరిజనులను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సోయం బాబురావు, తెల్లం వెంకట్రావు లు డిమాండ్ చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని సోమవారం, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మ నాయక్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్, ఉపాధ్యక్షులు,సహాయ కార్యదర్శులు వాంకుడోత్ వీరన్న, మూడ్ బాలు,భూక్యా హరి,అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు.
గత పార్లమెంటు,అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజెపి పార్టీ పార్లమెంటు సభ్యుడిగా ఆనాడున్న సోయం బాబురావు ద్వారా లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేయిస్తూ గిరిజన తెగల్లో ఘర్షణ సృష్టించి లబ్ధి పొందిందని అన్నారు. కొంతమంది బిజెపి పార్లమెంటు సభ్యులతో సంతకాలు చేయించి ప్రధాని నరేంద్ర మోడీకి మెమొరాండం సమర్పించారని గుర్తు చేశారు. బిజెపి సహకారంతో సోయం బాబురావు  లంబాడీలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పెద్ద సభ నిర్వహించి రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని అన్నారు. అదే సోయం బాబురావు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి అదే వైఖరిని అనుసరిస్తూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సుప్రీం కోర్టులో కేసు వేయడం, ఆ పేరుతో విద్వేష ప్రసంగాలు చేస్తూ గిరిజన తెగల్లో ఘర్షణ సృష్టిస్తున్నారని ఆరోపించారు.వీరు వ్యక్తిగతంగా చేస్తున్నారా లేక కాంగ్రెస్ పార్టీ విధానమా అని  రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా అనేకసార్లు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో  కేసులు వేసి ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టివేశారని గుర్తుచేశారు.అయినా సోయం బాబురావు,తెల్లం వెంకట్రావు లాంటి కొంత మంది పరిష్కారం కానీ రాజ్యాంగ వ్యతిరేక డిమాండ్ ను పదే పదే ముందుకు తెస్తూ న్యాయస్థానాల్లో కావాలని కేసులు వేస్తూ గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. వీరికి నిజంగా  చిత్తశుద్ధి ఉంటే కోట్లాదిమంది ఆదివాసి గిరిజనుల హక్కులను, షెడ్యూల్డ్ ప్రాంత రాజ్యాంగ హక్కుల్ని  కాలరాస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన అటవీ సంరక్షణ నియమాల చట్టం 2023 కు వ్యతిరేకంగా పోరాడాలని హితవుపలికారు. షెడ్యూల్ ప్రాంతంలో 100% స్థానిక గిరిజనులకు రిజర్వేషన్ కల్పిస్తూ గత 25 ఏళ్లుగా అమలైన జీఓ నెంబర్ 3 సుప్రీంకోర్టు కొట్టి వేసి ఐదేళ్లు గడుస్తున్నా కొత్త జీవో కొరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఎందుకు పోరాడటం లేదని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 1/70 చట్టం, పీసా చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఆదివాసీల భూములు, అటవీ సంపదను బడా కార్పొరేట్లకు, భూస్వాములకు కట్టబెడుతున్నా ఆ పార్టీలోని గిరిజన ప్రజాప్రతినిధులు ఒక్క మాట మాట్లాడటం లేదని విమర్శించారు. గిరిజన బంధు తరహాలో ప్రతి గిరిజన కుటుంబానికి 12 లక్షలు ఇస్తాం, ప్రతి గిరిజన గూడెం, తండాల పంచాయతీలకు ప్రతి ఏటా 25 లక్షలు ఇస్తాం, పోడు భూములకు హక్కులు కల్పిస్తాం, మైదాన ప్రాంతంలో ఐటిడీఏలను నిర్మిస్తాం, రిజర్వేషన్లను 10 నుండి 12 శాతానికి పెంచుతామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 15 రకాల హామీలపై గిరిజనులు పోరాడకుండా దృష్టిని మళ్లించడానికే కుట్రపూరితంగా ఆ పార్టీ వ్యవహరిస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సుప్రీం కోర్టులో కేసు వేశామనే పేరుతో సోషల్ మీడియాలో అవాస్తవాలు మాట్లాడుతూ,విద్వేషాలను రెచ్చగొడుతూ ఘర్షణ సృష్టించే వారిపట్ల రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు బిజెపి, కాంగ్రెస్ పార్టీల మాయలో గిరిజనులు పడోద్దని విజ్ఞప్తి చేశారు.
అభివందనములతో..
*ఆర్ శ్రీరాం నాయక్* 
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 
 తెలంగాణ గిరిజన సంఘం                                        
 
                                                                                                     
                                                                                                     
                                                                                                     
                                                                                                     
                                                                                                     
                                                                                                     
                                                                                                     
                                                                                                     
                                                                                                     
                                         
   
   
   
   
     
   
   
  