14/03/2018
ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌ను ప్రపంచం కోల్పోయింది. ఆయనకు 76 ఏళ్లు. ఆయన మృతిని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.
బ్లాక్ హోల్స్‌పై చేసిన ఆయన విశేష పరిశోధనలు ఖగోళశాస్త్ర పరిశోధనల్లో విప్లవాత్మకమైనవి.
ఆయన మహా వ్యక్తి మాత్రమే కాకుండా గొప్ప శాస్త్రవేత్త కూడా. చక్రాల కుర్చీకే అతుక్కుపోయి కదలలేని స్థితిలో ఉండి కూడా మొక్కవోని ఆత్మస్థైర్యంతో పరిశోధనలు సాగించారు.
మాట్లాడలేని స్థితిలో కూడా ఆయన కంప్యూటర్ సహాయంతో ఖగోళ పరిశోధనలు చేశారు. ఆయన పరిశోధనలు ఖగోళానికి చెందిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాయి.
1942 జనవరి 8వ తేదీన ఇంగ్లాండులోని ఆక్స్‌ఫర్డ్‌లో ఈయన జన్మించారు. ఎన్నో విశ్వవిద్యాలయాల్లో పనిచేసిన ఆయనకు వ్యాధి ఆటంకంగా కాలేదు. తన నాడీ మండలం పూర్తిగా పాడవుతున్నా కూడా మెదడు సహకరిస్తుండడాన్ని ఆయన పసిగట్టారు.
ఆయన 1970 నుంచి బ్లాక్ హోల్స్ (కృష్ణ బిలాలు) గురించి పరిశోధనలు ప్రారంభించారు. తనకు వ్యాధి ఉందనే విషయాన్ని కూడా ఆయన తన పరిశోధనల్లో మునిగిపోయి మరిచిపోయారు.
క్వాంటమ్ థియరీ, జనరల్ రిలెటివిటీలను ఉపయోగించి ఆయన బ్లాక్ హోల్స్ కూడా రేడియేషన్‌ను వెలువరిస్తాయని కనిపెట్టారు.
ఐన్‌స్టీన్ తర్వాత అంతటి ఫిజిస్టుగా పేరు గడించిన ఈయన చనిపోవడం వైజ్ఞానిక లోకానికి తీరని లోటు
amaravathipulse.com