08/09/2026
పూలబాల ఫ్రెంచ్ నవల తెలుగులో - 7
ఇంటి ముందు చిన్న అరుగుమీద లక్ష్మమ్మ కాళ్లు ముడుచుకుని కూర్చుంది. ఆమె ముందు ఒక పాత గోనెసంచి పరచి ఉంది. దానిమీద తడి తునికలో చుట్టిపెట్టిన బీడీ ఆకులు, పక్కనే పొగాకు పొడి, చిన్న కత్తెర, దారం ఉన్నాయి. తయారైన బీడీలు పెట్టడానికి ఒక వెదురు బుట్టను దగ్గరగా పెట్టుకుంది. ఆ ఇల్లు ఇల్లుగానే ఉంది. కానీ ప్రతి ఉదయం అది ఒక చిన్న బీడీ కర్మాగారంగా మారిపోతుంది.
కృష్ణా జిల్లాలో చారిత్రాత్మకంగా బీడీ తయారీ ఉన్నా ఫ్యాక్టరీ తరహా బీడీ తయారీ యూనిట్లకు ప్రసిద్ధి చెందలేదు. ముఖ్యంగా ఇళ్లలోనే బీడీలు చుట్టే పని జరుగుతుంది. సాధారణంగా ఈ పనిలో అధిక భాగం కాంట్రాక్టర్లు లేదా ఏజెంట్ల ద్వారా నిర్వహించబడుతుంది. వీరు తమ ఇళ్ల నుండి పనిచేసే మహిళలకు పొగాకు మరియు టేకు ఆకులను పంపిణీ చేస్తారు.
లక్ష్మమ్మ ఒక ఆకును తీసుకుని అరచేతిలో పరచింది. పనికొచ్చే భాగాన్ని కత్తిరించి, కొద్దిగా పొగాకు వేసి, వేళ్ల మధ్య నేర్పుగా చుట్టింది. చివరను మడిచి బిగించింది. పూర్తయిన బీడీని బుట్టలో వేసి మరో ఆకును అందుకుంది. ఆకు తీసుకోవడం, పొగాకు వేయడం, చుట్టడం, మడవడం, బుట్టలో వేయడం—రోజుకు వందలసార్లు అదే పని.
ఎన్నేళ్లుగానో ఆమె చేతులకు తెలిసిన ఒకే ఒక్క సంగీతం అది. కానీ ఆ సంగీతానికి స్వరాలు లేవు; లెక్క మాత్రమే ఉంది. వంద, రెండు వందలు, మూడు వందలు... ఎన్ని బీడీలు చుడితే అంత కూలి.
మధ్యాహ్నమైందా, సాయంత్రమైందా అన్నది లక్ష్మమ్మకు గడియారం చెప్పదు. బుట్టలో పేరుకున్న బీడీలే చెబుతాయి.
ముత్యం ఇంట్లోకి వచ్చి అమ్మ ముందు కూర్చున్న బుట్టను చూసింది. ఇంకా సగం కూడా నిండలేదు. “అమ్మా, ఇంకా చాలా ఉన్నాయా?” అని అడిగింది. “ఉన్నాయి.” “ఎన్ని?” లక్ష్మమ్మ లెక్క చూడకుండానే, “ఇంకా నాలుగొందల దాకా,” అంది.
ముత్యం అమ్మ వేళ్లవైపు చూసింది. పొగాకు మరకలు పట్టిన వేళ్లు, గోళ్ల అంచుల్లో నల్లటి పొడి, ఎడమ చేతి బొటనవేలి దగ్గర చిన్న చీలిక కనిపించాయి. “వేలు మళ్లీ పగిలిందా?” అని అడిగింది. “అది కొత్తదేమీ కాదు,” అంటూ లక్ష్మమ్మ నవ్వింది.
ఆ నవ్వు ముత్యానికి నచ్చలేదు. బాధ అలవాటైపోయినవాళ్లు నవ్వే నవ్వులా అనిపించింది. ముత్యం అమ్మ పక్కనే కూర్చుని, “నేను కూడా చుడతాను. ఇవ్వు,” అంటూ ఒక ఆకుకోసం చెయ్యి చాపింది. లక్ష్మమ్మ వెంటనే ఆకుల కట్టను తనవైపు లాక్కుంది. “వద్దు.”
“ఎందుకమ్మా? నాకు వచ్చు.” “వచ్చినా వద్దు.”
“నువ్వొక్కదానివే ఎన్ని చుడతావు? ఇద్దరం చేస్తే త్వరగా అయిపోతుంది.” లక్ష్మమ్మ చేతిలోని బీడీ ఒక్కసారిగా ఆగిపోయింది. ముత్యం ముఖంలోకి చూస్తూ, “త్వరగా ఏది అయిపోతుంది?” అని అడిగింది. “పని.” అంది ముత్యం.
లక్ష్మమ్మ చిన్నగా నవ్వి “ఈ పని ఎప్పుడూ అయిపోదమ్మా.” అంది
ఆమె మళ్లీ ఆకును చేతిలోకి తీసుకుంది. కొద్దిసేపు ఇద్దరి మధ్యా మాటలు లేవు. బయట వీధిలో సైకిల్ గంట వినిపించింది. దూరంగా ఎవరో కూరగాయలు అమ్ముకుంటూ అరుస్తున్నారు.
ఆ శబ్దాల మధ్య లక్ష్మమ్మ నెమ్మదిగా, “నేను మొదటిసారి బీడీ ఎప్పుడు చుట్టానో తెలుసా?” అని అడిగింది. ముత్యం తల ఊపింది. “పదమూడేళ్లప్పుడు.” ముత్యం ఒక్కసారిగా అమ్మవైపు చూసింది. “పదమూడేళ్లకా? అప్పుడు నువ్వు స్కూలుకు వెళ్లేదానివా?” లక్ష్మమ్మ చేతులు క్షణం ఆగాయి. “వెళ్లేదాన్ని. ఏడో తరగతి.”
“మరి ఎందుకు మానేశావు?” లక్ష్మమ్మ చేతిలోని ఆకునే చూస్తూ ఉండిపోయింది. ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఆ ఆకుమీదే కనిపిస్తున్నట్టుంది. “ఒకరోజు మా అమ్మకు జ్వరం వచ్చింది. ఇంట్లో బీడీ ఆకులన్నీ అలాగే పడి ఉన్నాయి. సాయంత్రానికి కాంట్రాక్టరు మనిషికి బీడీలు ఇవ్వాలి. అప్పుడు మా అమ్మ నన్ను పిలిచి, ‘లక్ష్మీ, ఒక్కరోజు నాకు సాయం చెయ్యవే. రేపటినుంచి నువ్వు స్కూలుకు పోదువుగాని,’ అంది.”
ముత్యం నిశ్శబ్దంగా వింటోంది. “నేను అమ్మ పక్కన కూర్చున్నాను. మొదటి బీడీ చుట్టాను. సరిగ్గా రాలేదు. రెండోది కూడా బాగా రాలేదు. మూడోది కొంచెం బాగా వచ్చింది. ఆ రోజు స్కూలుకు వెళ్లలేదు.” “మరుసటి రోజు?” “అమ్మకు జ్వరం తగ్గలేదు.” “ఆ తర్వాత?” “ఇంట్లో అప్పు.” “ఆ తర్వాత?” “తమ్ముడికి జ్వరం.” “ఆ తర్వాత?” లక్ష్మమ్మ ముత్యం కళ్లలోకి చూసింది. “ఆ తర్వాత... బీడీలే.”
ముత్యం ఏమీ మాట్లాడలేదు. లక్ష్మమ్మ చేతిలో ఉన్న చిన్న బీడీని బుట్టలో వేసి, “మా అమ్మ ఒక్కరోజు మాత్రమే సాయం చెయ్యమంది,” అంది. కాసేపు ఆగి ముత్యం ముఖంలోకి చూస్తూ, “ఆ ఒక్కరోజు ఇంకా అయిపోలేదు ముత్యమా,” అంది.
ముత్యం ముఖం ఒక్కసారిగా మారిపోయింది. లక్ష్మమ్మ మళ్లీ పనిలో పడింది. “పెళ్లయ్యాకైనా ఈ పని పోతుందనుకున్నాను. పోలేదు. మీ నాన్న ఉన్నప్పుడు కొంచెం తగ్గింది. ఆయన పోయాక మళ్లీ ఇదే పట్టుకోవాల్సి వచ్చింది.”
ముత్యం అమ్మ చేతిని పట్టుకుంది. “అమ్మా...”
లక్ష్మమ్మ చెయ్యి విడిపించుకోలేదు. “ఇక్కడ బీడీ ఫ్యాక్టరీ ఎక్కడుందని అడిగితే ఎవరికీ కనిపించదు ముత్యమా. పెద్ద గేటు ఉండదు. సైరన్ ఉండదు. వందమంది ఒకేచోట కూర్చుని పని చేస్తూ కనిపించరు. కానీ ఈ వీధిలో చూడు. ఆ ఇంట్లో ఒకామె బీడీలు చుడుతుంది.
ఎదురింట్లో ఇద్దరు చుడతారు. వెనక వీధిలో ఇంకో పదిమంది ఉంటారు. ఫ్యాక్టరీ వాళ్లందరి ఇళ్లలోకి వచ్చేసింది.” ముత్యం ఆ మాటను అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది. “కాంట్రాక్టరు మనిషి ఆకులు, పొగాకు ఇచ్చి వెళ్తాడు. మనం ఇంట్లో కూర్చుని బీడీలు చుట్టాలి. తర్వాత వాళ్ల దగ్గరకు తీసుకెళ్లాలి. వాళ్లు లెక్క పెడతారు.”
నువ్వు పడుకున్నప్పుడు నేను చుట్టేస్తాను. లక్మమ్మ మళ్ళీ నవ్వింది. అలాటిపని చేయద్దమ్మా ఎక్కువ చుట్టేసినా సినా తీసుకోరు. " ఏం?" అంది ముత్యం. లక్ష్మమ్మ నవ్వింది. “ ఇది లావుగా ఉందంటారు. అది సన్నగా ఉందంటారు. ఇంకొకటి వదులుగా ఉందంటారు. ఆకు చినిగిందంటారు. పొగాకు తక్కువైందంటారు. ఏదో ఒక కారణంతో కొన్ని పక్కన పడేస్తారు.”
“అప్పుడు వాటికి కూలి?” “ఉండదు.” ముత్యం ముఖంలో కోపం కనిపించింది. “తప్పు వాళ్లు ఇచ్చిన ఆకులో ఉంటే?”
లక్ష్మమ్మ కూతురివైపు చూసి నవ్వి “ఆ ప్రశ్న అడిగేంత ధైర్యం మన దగ్గర ఉండాలి.” “నాకుంది అంది ముత్యం.”
“అయితే నువ్వు అడుగు. అడిగితే రేపు పని ఇంకొకరికి ఇస్తారు.”
ఆ మాటతో ముత్యం నిశ్శబ్దమైంది. లక్ష్మమ్మ మళ్లీ బీడీలు చుట్టసాగింది. కొంతసేపటికి ఆమెకు దగ్గు వచ్చింది. మొదట చిన్నగా మొదలైన దగ్గు క్రమంగా పెరిగింది. చేతిలోని ఆకును కింద పెట్టి చీరకొంగును నోటికి అడ్డం పెట్టుకుంది.
“అమ్మా, నీకు ఈ దగ్గు ఈ మధ్య ఎక్కువైంది.” “పొగాకు పొడి కదా.”
“డాక్టర్ దగ్గరకు వెళ్దాం.” “డాక్టర్ మందు ఇస్తాడు. ఈ పొగాకు తీసుకెళ్లిపోడుగా?” అంది లక్ష్మమ్మ.
ముత్యం కళ్లలో నీళ్లు తిరిగాయి. లక్ష్మమ్మ అది గమనించి, “అయ్యో, దీనికే ఏడుస్తావా?” అంది. “నేను ఏడవడం లేదు.” “అయితే ఆ కళ్లేమిటి?” ముత్యం వెంటనే ముఖం తిప్పుకుంది. తర్వాత అమ్మ ముందున్న ఆకుల కట్టలోంచి ఒక ఆకు తీసుకుని, “నేను చేస్తాను,” అంది.
ఈసారి లక్ష్మమ్మ గట్టిగా ఆమె మణికట్టు పట్టుకుంది. “చెప్పాను కదా, వద్దు.” “ఎందుకు?” “ఎందుకంటే నాకు పదమూడేళ్లప్పుడు మా అమ్మ నా చెయ్యి ఆపలేకపోయింది. కానీ ఇప్పుడు నేను నీ చెయ్యి ఆపగలను.”ముత్యం అమ్మవైపు చూస్తూ ఉండిపోయింది.
లక్ష్మమ్మ ముత్యం చేతిలోని ఆకును తీసుకుని తిరిగి కట్టలో పెట్టింది. “నా చేతుల్లోనే ఈ పని ఆగిపోవాలి.” ముత్యం ఏమీ మాట్లాడలేక పోయింది. లక్ష్మమ్మ కూతురి రెండు చేతులనూ తన చేతుల్లోకి తీసుకుంది. తల్లి చేతులు గరుకుగా ఉన్నాయి. కూతురు చేతులు మెత్తగా ఉన్నాయి. ఆ రెండు చేతుల మధ్య రెండు తరాల జీవితాలు ఉన్నట్టనిపించింది.
“ఈ చేతులకు పొగాకు వాసన పట్టకూడదు ముత్యమా. ఈ చేతుల్లో పుస్తకం ఉండాలి. ఈ వేళ్లు తాళం వేయాలి. సంగీతం నేర్చుకోవాలి. ఒకరోజు ఇదే చేతులతో పిల్లలకు అక్షరాలు నేర్పాలి. ”కానీ నువ్వు మాత్రం చదువు మానకూడదు. శాస్త్రిగారి దగ్గర సంగీతం నేర్చుకో. దుర్గ వాళ్లతో కలిసి పిల్లలకు నేర్పు. నీకు వచ్చిన విద్యను ఇంకొకరికి ఇవ్వడం నేర్చుకో.”
లక్ష్మమ్మ తన చేతులను చూసుకుంది. పొగాకు మరకలు, పగుళ్లు, ఎన్నో వేల బీడీలను చుట్టి గట్టిపడిపోయిన వేళ్లు కనిపించాయి. “నిన్ను చూస్తే నాకు ఒక్కటే అనిపిస్తుంది.” “ఏమిటమ్మా?”
లక్ష్మమ్మ కూతురి చేతులను మరింత గట్టిగా పట్టుకుంది. “నా చేతుల్లో ఆగిపోయిన జీవితం నీ చేతుల్లో మళ్లీ మొదలవ్వాలి.”
ముత్యం ఒక్కసారిగా అమ్మను కౌగిలించుకుంది. లక్ష్మమ్మ నవ్వుతూ, “అయ్యో, పొగాకు అంతా నీ బట్టలకు అంటుతుంది. పో... పో...” అంది. కానీ ముత్యం లేవలేదు. మరికొంచెం గట్టిగా అమ్మను పట్టుకుంది. ఆ చిన్న ఇంట్లో కొద్దిసేపు బీడీలు చుట్టే పని ఆగిపోయింది.
అప్పుడే దూరం నుంచి సంగీతం వినిపించింది. చంద్రశేఖర శాస్త్రిగారి ఇంట్లో పాఠం మొదలైనట్టుంది. మొదట తంబూరా శ్రుతి వినిపించింది. తర్వాత చిన్నగా “సా... రి... గ... మ...” అంటూ స్వరాలు గాలిలో తేలుతూ వచ్చాయి.
ముత్యం తలెత్తింది. లక్ష్మమ్మ కూడా ఆ స్వరాలను విన్నది. లక్ష్మమ్మ ముత్యాన్ని చూసి, “ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి? పో” అంది. ముత్యం పరుగెత్తింది. ఆమె అడుగులు వీధి చివరికి చేరేసరికి సంగీతం మరింత స్పష్టంగా వినిపించింది. “సా... రి... గ... మ... ప...” అంటూ స్వరాలు ఆమెను తమవైపు పిలుస్తున్నట్టుగా ఉన్నాయి.