
09/07/2025
డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌కు హైకోర్టులో ఊరట
నిర్మల్ టౌన్, కడెం, ముధోల్, లోకేశ్వరం పోలీస్ స్టేషన్లలో కొణతం దిలీప్‌పై నమోదైన ఐదు కేసులపై తదుపరి చర్యలు చేపట్టకుండా హైకోర్టు ఈ రోజు స్టే విధించింది. దిలీప్ తరఫున సీనియర్ న్యాయవాదులు కె. వివేక్ రెడ్డి, కె. ప్రతీక్ రెడ్డి వాదనలు వినిపించారు.
వీరి వాదనలో, ఇది వాక్ స్వాతంత్య్రానికి సంబంధించిన వ్యవహారమని, ఇటువంటి సందర్భాల్లో ముందుగా ప్రాథమిక విచారణ (ప్రిలిమినరీ ఎంక్వయిరీ) చేయాలని సుప్రీంకోర్టు ఇమ్రాన్ ప్రతాపగఢ్ కేసులో స్పష్టం చేసిందని చెప్పారు. కానీ ఇక్కడ అలాంటి విచారణ జరిపకుండా ఏకంగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారని తెలిపారు. అదే విధంగా అర్నాబ్ గోస్వామి కేసును ఉదాహరణగా చూపుతూ, ఒకే అంశంపై విభిన్న పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడం చట్ట విరుద్ధమని వాదించారు.
అలాగే HCU ఘటనలో “అడవి పోతుంది” అన్న వ్యాఖ్యపై చేసిన కేసులోనూ, చివరికి హైకోర్టు రిజిస్ట్రార్‌తో పాటు సుప్రీంకోర్టు అభిప్రాయంతోనూ, అది నేరంగా పరిగణించదగినది కాదని తేలిందని తెలిపారు. ఈ అన్ని వాదనలు పరిశీలించిన హైకోర్టు, దిలీప్‌పై నమోదైన ఐదు ఎఫ్ఐఆర్‌లపై తదుపరి చర్యలను చేపట్టకుండా స్టే విధించింది.