24/01/2022
టాక్ లండన్ సంస్థను అభినందించిన బ్రిటన్ మహా రాణి
- బ్రిటన్ మహా రాణి కి కృతఙ్ఞతలు తెలిపిన అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల
లండన్ : గత సంవత్సరం అక్టోబర్ 2021 లో లండన్ వేదికగా తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) ఆధ్వర్యంలో జరిగిన టాక్ - చేనేత బతుకమ్మ & దసరా వేడుకల్లో ఎంతో సామాజిక బాధ్యతతో కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్కచెయ్యకుండా సేవలందించిన నైషనల్ హెల్త్ సర్వీస్ (NHS UK) మరియు ప్రపంచవ్యాప్త కోవిడ్ వారియర్స్ కి కృతజ్ఞతలు తెలుపుతూ లండన్ టవర్ బ్రిడ్జి ఆకృతిని ఏర్పాటు చేసిన విషయం అందరికి తెలిసిందే.
టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం - ప్రభలత దంపతుల కుమార్తె నిత్య శ్రీ కూర్మాచలం టాక్ సంస్థ బతుకమ్మ వేడుకల వేదికగా జరిగిన విషయాలని ప్రత్యేకించి నైషనల్ హెల్త్ సర్వీస్(NHS UK) మరియు ప్రపంచవ్యాప్త కోవిడ్ వారియర్స్ కి కృతజ్ఞతలు తెలిపిన విధానాన్ని మరియు ప్రవాస తెలంగాణ బిడ్డలు బతుకమ్మ వేడుకల్ని జరుపుకొనే విషయాలతో బ్రిటన్ మహా రాణి కి ఒక లేఖ రాసింది.
ఇటీవల బ్రిటన్ మహా రాణి కార్యాలయం నిత్య శ్రీ కి లేఖను రాసింది, మహారాణి బతుకమ్మ వేడుకల ఫోటోలను చూసి సంతోషం వ్యక్తం చేసిందని, ముఖ్యంగా వేడుకల్లో నైషనల్ హెల్త్ సర్వీస్ (NHS UK) మరియు ప్రపంచవ్యాప్త కోవిడ్ వారియర్స్ కి కృతజ్ఞతలు తెలుపడం ఎంతో బాగుందని, టాక్ సంస్థ కృషిని అభినందించినట్టు పేర్కొన్నారు, అలాగే మహా రాణి దృష్టికి ఈ విషయాలని తీసుకొచ్చిన నిత్య శ్రీ ని కూడా ప్రత్యేకంగా అభినందించారు.
టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ, బ్రిటన్ మహా రాణి తెలంగాణ రాష్ట్ర పండగ బతుకమ్మ వేడుకల్ని అభినందిచడమే కాకుండా ప్రతీ వేడుకల్లో సామాజిక అంశాల్ని జోడించే టాక్ సంస్థ, గత సంవత్సరం బతుకమ్మ వేడుకల్లో నైషనల్ హెల్త్ సర్వీస్ (NHS UK) మరియు ప్రపంచవ్యాప్త కోవిడ్ వారియర్స్ కి కృతజ్ఞతలు తెలిపిన తీరుని బ్రిటన్ మహారాణి దృష్టికి తీసుకెళ్లిన నిత్య శ్రీ కూర్మాచలం ని అలాగే ఎంతో గొప్ప మనసుతో టాక్ సంస్థ ను అభినందించిన మహా రాణి కి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.
ఈ సందర్బంగా మరొక్కసారి ఎంతో కృషి చేసి పని చేస్తున్న టాక్ కార్యవర్గ సభ్యుల్ని రత్నాకర్ అభినందించారు.
రెట్టింపు ఉత్సాహం తో టాక్ సంస్థ పని చేస్తూ ప్రవాస బిడ్డలకు సేవలందిస్తూ, మన సంస్కృతి సంప్రదాయాల్ని ప్రపంచానికి చాటిచెప్తుందని రత్నాకర్ తెలిపారు.