01/08/2025
మారుతున్న జీవనశైలితో సంతానలేమి
సమాజంలో మారుతున్న జీవన శైలిని ఆసరాగా కొంతమంది తమ స్వార్థానికి వాడుకుంటున్నారు.ఇటీవల కాలంలో యువతీ యువకులు తమ కేరీర్ ను ప్రధానంగా చేసుకుని,తాము అనుకున్న లక్ష్యం సాధించేవరకూ వివాహం మాట తలపెట్టడంలేదు. దాంతో ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగడంలేదు. మహిళలకు నేటి వివాహం వయస్సు 30- 35 మధ్యకు చేరింది. వివాహం తరువాత సంతానం కోసం కొంతకాలం విరామం పాటిస్తున్నారు. వారు కావాలనుకున్నప్పుడు సంతాన ఉత్పత్తి కష్టమవుతున్నది. ముఖ్యంగా సాఫ్టువేర్,ఇతర వృత్తి ఉద్యోగాల్లో ఉన్న యువతీ యువకులు జీవితంలో స్ధిరపడేసరికీ 35 ఏళ్లు దాటి పోతున్నాయి.ముఖ్యంగా 35 ఏళ్లు దాటిన మహిళలల్లో అండం ఉత్పత్తి శాతం తగ్గిపోయి సంతానం కలగడంలేదు. పురుషుల్లో కూడా జీవన శైలితో వారి వీర్య బలం తగ్గి సంతానం కలగడం లేదు. దాంతో సంతానసాఫల్య కేంద్రాలు చుట్టూ తిరుగుతున్నారు. ఈ కేంద్రాలు చేసే అక్రమాలు అన్నీ ఇవన్నీ కాదు. ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంతానసాఫల్య కేంద్రం అక్రమాలు బయటపడిన విషయం విదితమే.సాధారణంగా ప్రతి మహిళ కు 20-35 వయస్సులో ఆరోగ్యకరమైన అండాలు ఉత్పత్తి అవుతాయి.వారు ఆ వయసు లో కేరీర్ లో బిజీలో ఉండడంతో "ఎగ్ ఫ్రీజింగ్" పేరుతో అండాలను నిల్వ చేసే సంస్థలు వెలిశాయి. దీనికి సుమారు రెండు లక్షల రూపాయలు వసూలు చేసి అండాలను నిల్వ చేస్తున్నారు.మళ్లీ ప్రతి ఏడాదీ 30 వేలు చెల్లించాల్సిఉంది.అవి 20 ఏళ్ల వరకూ పని చేస్తాయి. మగవారి వీర్యం నిలువ చేసే బ్యాంకులు ఎప్పటినుంచో పనిచేస్తున్నాయి.నేటి ఆధునిక వైద్యశాస్త్రం అభివృద్ధితో పిండాలను నిల్వచేసే విధానం కూడా వచ్చింది.దానిని ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటారు.దీనిని మహిళ గర్భంలో ప్రవేశ పెట్టవచ్చు.పిండం భద్రపరిస్తే భవిష్యత్తు లో పనికిరాదనే అపోహలు ఉన్నాయి.కాని ఇది నిజం కాదని పునరుత్పత్తి నిపుణులు చెబుతున్నారు. పిండం నిల్వకు రెండుమూడు లక్షలరూపాయల ఖర్చు అవుతుంది.మళ్లీ ప్రతి సంవత్సరం 50 వేల పైగా కట్టాల్సి ఉంది.కాని అన్నింటిలోనూ ఇంత ఖర్చుచేసి అండాలు,వీర్యాలను నిలువ చేసుకునే పరిస్థితి లేదు.వారికి అవగాహన ఉండదు.వారు వివాహం అయినతరువాత ఐదేళ్లు దాటిన తరువాత సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు.ఒకేసారి మూడు నాలుగు లక్షల రూపాయల ఖర్చుతో సరిపోతుందని భావిస్తారు. దీన్ని ఆసరాతో ఈ కేంద్రాలు వచ్చే జంటలకు నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు.సరోగసి అద్దె గర్భాల విధానం కూడా ఈ సంతానం సాఫల్య కేంద్రాలు నిర్వహిస్తున్నాయి.వీర్యం,అండాలు సురక్షితంగా లేని జంటలకు వేరేవారి వీర్యాలు,అండాలను ఉపయోగిస్తున్నారు. సంతానభాగ్యంలేని దంపతులు కొంతమంది ఈ బ్యాంకుల నుంచి వీర్యం,అండాలు ఉపయోగించుకుంటున్నారు. కాని వారు ఆరోగ్య వంతమైన మేధావుల వీర్యం,అండాలు ఆశిస్తారు. కాని ఈ బ్యాంకుల వారు సంతానకేంద్రాలవారితో కుమక్కై బిచ్ఛగాళ్లు,కూలీల వీర్యాలు నిలువ చేస్తున్నారు.అలాగే అండాలను డబ్బిచ్చి కొంటున్నారు. సంతానం కావాలనుకునే వారిని అడ్డంగా మోసం చేస్తున్నాయి ఈ కేంద్రాలు.ప్రజల జీనన శైలిని మారితేనే ఇలాంటి ఉపద్రవాలు తప్పుతాయి. పూర్వం ఆడపిల్లలకు 20 ఏళ్లకు,మగవారు 30 ఏళ్ల లోపు వివాహం చేసుకుంటే సంతాన సమస్య ఉండేదికాదు. కేరీర్ పేరుతో వారు తమ జీవితాలలోని ఆనందాలకు ఫుల్ స్టాప్ పెట్టుకుంటున్నారు.పెళ్లి అయిన తరువాత కూడా కేరీర్ కొనసాగించవచ్చని చెప్పే పెద్దలు మాట చెల్లుబాటు కావడంలేదు.యువతీ యువకులు తమ జీవన శైలి మార్చుకోకపోతే ఈ అనైతిక సంతానసాఫల్య కేంద్రాలు పుట్టుకొస్తాయి. సంతానం లేమికి జంటల అవసరాన్ని అవకాశంగా తీసుకొని వారు తమ లాభం కోసం ఎలాంటి అనైతికత పనికన్నా సిద్ధపడుతున్నారు. వారికి అవకాశం ఇవ్వకుండా యువతీ యువకులు సరైన వయస్సులో వివాహం చేసుకోవాలి.వారి తల్లిదండ్రులు కూడా లేట్ మ్యారేజ్ వల్ల కలిగే అనర్ధాలు వివరించాలి.కేరీర్ తో పాటు వివాహం, సంతానం కూడా అవసరమని వివరించాలి.ఇటీవల కొన్ని జంటలు అవివాహితులు గానే ఉంటున్నారు.మరికొంతమంది సహజీవనం చేస్తున్నారు.జీవితమంటే ఆనందంగా గడపడమే తప్ప సంతానం అవసరం లేదని మరి కొన్ని జంటలు భావిస్తున్నాయి. ఇలా భారతీయ సమాజం కొనసాగితే రాబోయే రోజుల్లో వృద్ధుల జనాభా పెరిగి జపాన్ లా తయారవుతుంది.యువశక్తి లేక ఆర్ధిక వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది.అందుకని యువతీ యువకులు ఆరోగ్యవంతమైన సంతాన్ని సమాజానికి అందించాలి.అలాగే వారిని భవిష్యత్తు లో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి.
సంతానం లేమికి జీవన శైలితో పాటు మన ఆహార అలవాట్లు కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. నేడు పట్టణాల్లో,నగరాల్లో ఆర్గానిక్ ఫుడ్ పట్ల అవగాహన పెరిగింది. ఫలితంగా ఆహార పదార్ధాల కాలుష్యం తగ్గుతోంది. కాని అది చాలా తక్కువ శాతమే.అత్యధికులు బయటి ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఫుడ్ సెంటర్లు,టిఫెన్ సెంటర్లు సందుకొకటి వెలుస్తున్నాయి.అక్కడ పెట్టే ఆహారం ఎంతవరకూ ఆరోగ్యదాయకం అనేది ప్రభుత్వ శాఖలు నిర్ణయించే పరిస్థితి లేదు.ఎందుకంటే లంచావతారాలు పెరగడమే కారణం. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసుకునే కుటుంబాలు శని ఆదివారాలు బయటే తింటున్నారు. రోజూ ఆర్డర్ మీద తెప్పించుకుని తినే కుటుంబాలు ఉన్నాయి. బయటి ఆహారం తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాయి. అలాగే చల్లని పానీయాలు విషపూరితమని శాస్త్రవేత్త లు ఆధారాలతో సహా నిరూపించినా అమ్మకాలను ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి.ప్రజలు తాగుతున్నారు.ఇలా చెప్పుకుంటూ పోతే సంతానం లేమికి మన జీవన శైలితో పాటు మారిన మన ఆహార అలవాట్లు కారణమవుతున్నాయి. మనం చేసే కర్మను అనుసరించే ఫలితం ఉంటుందని భగవద్గీత లో గీతా చార్యుడు చెప్పింది నేడు కళ్ళముందు కనిపిస్తున్నది.మరి మారాలా వద్దా అనేది మనచేతుల్లోనే ఉంది.
యం.వి.రామారావు