Sakshi News Paper

Sakshi News Paper Sakshi Newspaper was brought out in 23 multi-colored editions by Jagati Publication, of which Y S Bharathi Reddy is the chairperson. S.

Sakshi Newspaper was brought out in 23 multi-colored editions (one edition per district) by Jagati Publication, of which Y. Bharathi Reddy is the chairperson. The newspapaper as well as the news channel are run by Sajjala Ramakrishna Reddy, editorial director, Jagati Publications and Mr. Jaganmohan Reddy's political mentor.

పరిపాలనలో మేలిమలుపు.నెల రోజుల్లోనే పెను మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్‌.పాలనలో తనదైన ముద్ర. స్వచ్ఛ పాలన దిశగా ఆంధ్...
29/06/2019

పరిపాలనలో మేలిమలుపు.
నెల రోజుల్లోనే పెను మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్‌.
పాలనలో తనదైన ముద్ర.
స్వచ్ఛ పాలన దిశగా ఆంధ్రప్రదేశ్‌.
సామాజిక న్యాయానికి పెద్దపీట..అవినీతిపై యుద్ధం.
సంక్షేమ రాజ్యం, గ్రామ స్వరాజ్యం సాకారానికి వేగంగా అడుగులు.
వైఎస్‌ జగన్‌ తొలి నెల రోజుల పాలనపై సర్వత్రా హర్షం.

అమరావతి: అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు. అదే విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాలన ఎంత ప్రజారంజకంగా ఉండనుందో తొలి నెల రోజుల్లోనూ చూపించారు. ఐదేళ్ల పాటు అంధకారం అలుముకున్న రాష్ట్రంలో ప్రగతి వెలుగులు ప్రసరింపజేస్తూ నవశకానికి తెరతీశారు. మేనిఫెస్టోయే పవిత్ర గ్రంథంగా పాలనకు శ్రీకారం చుట్టారు. అవ్వాతాతలు ఆశీర్వదించాలని కోరుతూ పింఛన్లను పెంచుతూ తొలి సంతకంలోనే సంక్షేమ రాజ్యానికి తెరతీశారు. గ్రామ సచివాలయాల ఏర్పాటు నిర్ణయంతో గ్రామ స్వరాజ్యానికి నాంది పలికారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం పదవులు కేటాయిస్తూ రాష్ట్రంలో సామాజిక విప్లవం తీసుకొచ్చారు. పార్టీ ఫిరాయింపులను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోనని అసెంబ్లీ సాక్షిగా చెబుతూ రాజ్యాంగ విలువల పరిరక్షణకు నిబద్ధుడయ్యారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతూ వ్యవస్థల ప్రక్షాళనకు నడుం బిగించారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతను ప్రజావేదిక నుంచే ప్రారంభించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంతోపాటు కృష్ణా నది కరకట్ట మీద అక్రమ నిర్మాణాల తొలగింపునకు సంసిద్ధమయ్యారు. రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి జలాలను శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లించే బృహత్తర పథకానికి రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన తొలి నెలరోజుల పాలనలో తనదైన ముద్రవేశారు. జగన్‌ నెల రోజుల పాలనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

మేనిఫెస్టోనే దిక్సూచిగా పాలన

ఎన్నికల మేనిఫెస్టో తనకు బైబిల్, ఖురాన్, భగవద్గీత వంటిదని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. పార్టీ శాసనసభాపక్ష సమావేశం, తొలి మంత్రివర్గ సమావేశం, జిల్లా కలెక్టర్ల సమావేశంలోనూ అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల పథకాల్లోని అంశాలను ఫొటో ఫ్రేములు కట్టించి మరీ తన కార్యాలయంలో గోడలకు అలంకరించారు. మంత్రులూ అదే విధంగా చేయాలని ఆదేశించారు. ప్రతి కలెక్టర్, ప్రభుత్వ ఉన్నతాధికారుల వద్ద మేనిఫెస్టో కాపీలు ఉండాలని స్పష్టం చేశారు. మేనిఫెస్టో అమలుకు కట్టుబడ్డారు.

సామాజిక విప్లవం

రాజకీయ, పాలనా వ్యవస్థలో సీఎం జగన్‌ సామాజిక విప్లవం తీసుకొచ్చారు. తమ ప్రభుత్వంలో అన్ని పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం ఇస్తామన్నారు. మంత్రివర్గంలో 50 శాతం పదవులు ఆయా వర్గాలకు కేటాయించి తాను చేతల మనిషినని నిరూపించుకున్నారు. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించారు. ఆ వర్గాలకు కీలకమైన మంత్రి పదవులు ఇచ్చారు. దళిత మహిళను హోంమంత్రిగా నియమించారు. బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంను అసెంబ్లీ స్పీకర్‌ను చేశారు.

రాజ్యాంగ విలువల పట్ల నిబద్ధత

రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తానని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి అందరి మన్ననలు పొందారు. టీడీపీ నుంచి ఆరేడుగురు ఎమ్మెల్యేలను లాగేసి, చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా దక్కకుండా చేద్దామని తనకు కొందరు సూచించినా ససేమిరా అన్నారు. చంద్రబాబు చేసినట్లు తాను రాజ్యాంగాన్ని అపహాస్యం చేయనని అసెంబ్లీలోనే ప్రకటించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండాలన్నదే తన విధానమన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించనని తేల్చిచెప్పారు. పార్టీ మారిన వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాంను కోరారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి కూడా మాట్లాడేందుకు తగినంత సమయం ఇవ్వాలని జగన్‌ విన్నవించడం గమనార్హం. ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తూ సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యేలు, ఎంపీలను భాగస్వాములను చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. తన మంత్రివర్గంలో మంత్రులు డమ్మీలు కారని, వారికి తగిన గుర్తింపు, ప్రాధాన్యం ఉంటాయని చెప్పారు.

అవినీతి అంతానికి పంతం

అవినీతి రహిత పాలన అందించేందుకు వైఎస్‌ జగన్‌ కార్యాచరణకు ఉపక్రమించారు. అదే విషయాన్ని ఇటు మంత్రివర్గ సహచరులకు, అటు అధికార యంత్రాంగానికి తేల్చిచెప్పారు. మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తే విచారిస్తానని... రుజువైతే పదవుల నుంచి తక్షణమే తొలగిస్తానని తొలి మంత్రివర్గ సమావేశంలోనే స్పష్టం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడొద్దని పోలీసు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని పటిష్ట పరచాలని సూచించారు.

ఉరకలెత్తిస్తున్న సీఎం

ప్రజలకు నీతివంతమైన పాలన అందించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉరకలెత్తిస్తున్నారు. సత్వరం, సరైన నిర్ణయాలు తీసుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. తన మంత్రివర్గ తొలి సమావేశంలోనే 50 కీలక నిర్ణయాలు తీసుకోవడం పాలనలో ఆయన వేగానికి నిదర్శనం. మంత్రివర్గ ఏర్పాటుకు ముందే అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేశారు. తన జట్టును ఏర్పాటు చేసుకున్నారు. నిత్యం వివిధ అంశాలపై సమీక్షలు జరుపుతూ పరిపాలనను గాడిలో పెడుతున్నారు.

నెల రోజుల పాలనలో వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయాలు

రైతన్నలకు వెన్నుదన్నుగా..
- రబీ సీజన్‌ నుంచే వైఎస్సార్‌ రైతు భరోసా పథకం అమలు
- పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500.. అందుకోసం రూ.13,125 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం సన్నద్ధం.
- రైతుల పంటల బీమా ప్రీమియం ప్రభుత్వ ఖజానా నుంచే పూర్తిగా చెల్లింపు
- పంటలకు కనీస మద్దతు ధర అందించేందుకు రూ.3 వేల కోట్లతో మార్కెట్‌ స్థిరీకరణ నిధి
- కౌలు రైతులకు గుర్తింపు కార్డులు
- వ్యవసాయ రంగ స్థితిగతులపై అధ్యయనం చేసి రైతులకు దిశానిర్దేశం చేసేందుకు వ్యవసాయ కమిషన్‌ ఏర్పాటు

మనసున్న నేతగా తొలి సంతకం

- మనసున్న పాలకుడినని సీఎం వైఎస్‌ జగన్‌ తొలి సంతకంతోనే నిరూపించుకున్నారు
- సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పింఛన్ల పెంపుపై తొలి సంతకం చేశారు
- పింఛన్లను దశల వారీగా రూ.3 వేలకు పెంచుకుంటూ పోతామన్న ఎన్నికల హామీని అమలు చేస్తూ తొలి దశలో పింఛన్‌ను రూ.2,250కు పెంపు
- వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గింపు
- దాంతో కొత్తగా 5.50 లక్షల మందికి పింఛన్లు అందే అవకాశం
- డయాలసిస్‌ చేయించుకుంటున్న మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు పింఛన్‌ నెలకు రూ.3,500 నుంచి ఏకంగా రూ.10 వేలకు పెంపు
- ఆశావర్కర్ల జీతాలు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంపు.. రాష్ట్రంలో 42 వేల మందికి లబ్ధి
- అంగన్‌వాడీ కార్యకర్తల జీతాలు రూ.11,500కు పెంపు.. రాష్ట్రంలో 55 వేల మందికి ప్రయోజనం
- పారిశుధ్య కార్మికుల జీతాలు ఏకంగా రూ.18 వేలకు పెంపు
- హోంగార్డులు, డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్‌పర్సన్ల జీతాలు సైతం పెంపు

ఇక గ్రామ స్వరాజ్యం

- ఆగస్టు 15 నాటికి గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఓ గ్రామ వలంటీర్‌
- దాంతో 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
- అక్టోబర్‌ 2 (గాంధీ జయంతి) నుంచి గ్రామ సచివాలయాల ఏర్పాటు
- ప్రతి గ్రామ పంచాయతీలో పది మంది ఉద్యోగుల నియామకం
- మొత్తం మీద రాష్ట్రంలో 13,060 గ్రామాల్లో 5.60 లక్షల మందికి ఉద్యోగాలు

జనవరి 26 నుంచి ‘అమ్మఒడి’

- ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌
- అమ్మ ఒడి పథకం వచ్చే ఏడాది జనవరి 26 నుంచి అమలు
- తమ పిల్లలను ఏ పాఠశాలలో చదివించినా పేద తల్లులకు ఏడాదికి రూ.15 వేలు
- మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినప్పటికీ ఇంటర్మీడియట్‌ విద్యకు కూడా అమ్మ ఒడి పథకం వర్తింపు
- అక్టోబరు 1 నాటికి మద్యం బెల్టు దుకాణాలు పూర్తిగా తొలగింపు
- వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో అందరికీ ఇంటి స్థలాల పంపిణీ
- ఐదేళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణానికి కార్యాచరణ
- వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్తు సరఫరాకు చర్యలు

అపర భగీరథుడిలా...

మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన జలయజ్ఞం స్ఫూర్తితో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. పోలవరం ప్రాజెకును సందర్శించి వాస్తవ పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. నీటిపారుదల రంగంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి స్పష్టమైన కార్యాచరణను రూపొందించారు. కాగా, రాయలసీమ జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేసేలా వైఎస్‌ జగన్‌ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. గోదావరి వరద నీటిని శ్రీశైలానికి మళ్లించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో సంయుక్తంగా కలిసి పనిచేయాలని నిర్ణయించడం పట్ల జాతీయస్థాయిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రత్యేక హోదానే లక్ష్యంగా..

రాష్ట్ర ప్రయోజనాల సాధనే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వంతో సీఎం వైఎస్‌ జగన్‌ సత్సంబంధాలకు పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మర్నాడే ఢిల్లీకి వెళ్లి, ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక సహాయం ప్రకటించాలని అభ్యర్థించారు. విభజన చట్టంలోని హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన నీతి ఆయోగ్‌ సమావేశంలోనూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని గట్టిగా వాదించారు. ఓవైపు హోదా కోసం పోరాడుతూనే, మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల సాధనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

విభజన సమస్యల పరిష్కారానికి చొరవ

అపరిష్కృతంగా ఉన్న విభజన చట్టం సమస్యల పరిష్కారానికి సీఎం వైఎస్‌ జగన్‌ చొరవ చూపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆ దిశగా చర్చలను వేగవంతం చేశారు. నెల రోజుల్లోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఐదుసార్లు కలిసి చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.

టీడీపీ దోపిడీపై విచారణ

ప్రాజెక్టుల కాంట్రాక్టులను పారద్శకంగా కేటాయించేందుకు జ్యుడీషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన ప్రాజెక్టుల టెండర్లలో చోటుచేసుకున్న అవినీతి నిగ్గు తేల్చేందుకు రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అడ్డగోలు దోపిడీపై విచారణకు ఆదేశించారు. చంద్రబాబు ప్రభుత్వంలో విద్యుత్తు కొనుగోళ్లలో కుంభకోణానికి పాల్పడి రూ.2,636 కోట్లు కొల్లగొట్టారని తేల్చారు. అందుకు బాధ్యులైన మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి, ఇతర అధికారులపై చట్ట ప్రకారం విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

బేసిన్లు లేవు.. భేషజాల్లేవు!సుహృద్భావ వాతావరణంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.ఇరు రాష్ట్రాల్లోని కరువు నేలలకు గోదారి తరలి...
29/06/2019

బేసిన్లు లేవు.. భేషజాల్లేవు!
సుహృద్భావ వాతావరణంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.
ఇరు రాష్ట్రాల్లోని కరువు నేలలకు గోదారి తరలింపునకు నిర్ణయం.
కృష్ణా, గోదావరిలోని 4వేల టీఎంసీల సద్వినియోగంపై చర్చ.
కలిసి ముందుకు సాగాలని నిర్ణయించిన కేసీఆర్, జగన్‌.
గోదావరి నీటిని శ్రీశైలం, సాగర్‌లకు తరలించాలన్న సీఎం కేసీఆర్‌.
జగన్‌ స్వచ్ఛమైన హృదయంతో వ్యవహరించారని ప్రశంస.
రాయలసీమ, దక్షిణ తెలంగాణ సాగునీటి సమస్యలు తీర్చేలా ప్రతిపాదనలు.
ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ అధికారులకు ఆదేశం.

హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదీజలాల్లో అందుబాటులో ఉన్న నీటి వనరులను సంపూర్ణంగా, సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. కృష్ణాలో నీటి లభ్యత తక్కువవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం, తెలంగాణలోని పాలమూరు, ఉమ్మడి నల్గొండ జిల్లాలు ఎదుర్కుంటున్న దశాబ్దాల సాగునీటి కష్టాలను దూరం చేసేందుకు గోదావరి నీటిని శ్రీశైలం తరలించాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో జరిగిన భేటీలో పలు కీలకమైన అంశాలపై సానుకూల వాతావరణంలో చర్చలు జరిపారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ మూల కు సాగు, తాగునీరు అందించే విషయంలో కలిసి ముందుకు సాగుతామని వీరిరువురు స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలు పచ్చగా కళకళ్లాడాలని, వ్యవసాయానికి, తాగునీటికి, పరిశ్రమలకు నీటికొరత రాకుండా చూడాలనే లక్ష్యంతో ముందుకెళ్తామని వెల్లడించారు. నదీ జలాల వినియోగానికి సంబంధించి గతంలో ఉన్న వివాదాలను పూర్తిగా పక్కనబెట్టాలని కూడా శుక్రవారం నాటి భేటీలో నిర్ణయించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండూ వేర్వేరనే భావన తమకు లేదని, రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలన్నదే తమ అభిమతమని వెల్లడించారు. గోదావరి నీటిని శ్రీశైలం రిజర్వాయర్‌కు తరలించే వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు.

తొలి అధికారిక భేటీలో..

రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను సుహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకునే దిశగా అడుగు వేయాలని నిర్ణయించుకున్న తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రుల తొలి అధికారిక సమావేశం శుక్రవారం ప్రగతి భవన్‌లో జరిగింది. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితోపాటు ఆ రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌ కుమార్‌ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, బి.రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు, పేర్ని వెంకట్రామయ్య (నాని), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, సీఎం ముఖ్య కార్యదర్శి అజయ్‌ కల్లం, నీటి పారుదల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, విద్యుత్‌శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్, సీనియర్‌ అధికారులు ఎల్‌.ప్రేమ చంద్రారెడ్డి, కె.ధనుంజయ రెడ్డి, నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వర్‌ రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తెలంగాణ తరఫున సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు ఈటల రాజేందర్, ఎస్‌.నిరంజన్‌ రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్, ఎంపీ కె.కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, జెన్‌కో–ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌ రావు, సలహాదారు టంకశాల అశోక్, ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగ్‌ రావు, నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్, రిటైర్డ్‌ ఇంజనీర్లు శ్యాంప్రసాద్‌ రెడ్డి తదితరులున్నారు. ఉదయం 11.15 గంటలకు ప్రగతి భవన్‌ చేరుకున్న జగన్‌ బృందానికి కేసీఆర్, తెలంగాణ మంత్రులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగన్‌కు తెలంగాణ అధికారులను కేసీఆర్‌ పరిచయం చేశారు. జగన్‌ను తన చాంబర్‌కు తీసుకెళ్లిన కేసీఆర్‌ కాసేపు మాట్లాడారు. 11.30 గంటలకు ఇద్దరు సీఎంలు సమావేశ మందిరానికి చేరుకున్నారు. కేసీఆర్‌ ప్రారంభోపన్యాసం చేశారు.

నదీ జలాలపై కేసీఆర్‌ ప్రజెంటేషన్‌

ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాల సంబంధాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని ఈ సందర్భంగా కేసీఆర్‌ స్పష్టం చేశారు. ‘బేషజాలు లేవు. బేసిన్ల గొడవ లేదు. అపోహలు లేవు. వివాదాలు అక్కర్లేదు. వివాదాలే కావాలనుకుంటే మరో తరానికి కూడా మనం నీళ్ళివ్వలేము. కేసీఆర్, జగన్‌లు వ్యక్తిగతంగా ఆలోచించరు. ప్రజలకోణం నుంచే ఆలోచిస్తరు. ప్రజలు నమ్మి మాకు ఓటేశారు. వారికి మేలు చేయడమే మా బాధ్యత. రెండు రాష్ట్రాలు కలిసి నడిస్తేనే ప్రగతి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సంబంధాల్లో ఇప్పుడు గుణాత్మక మార్పు వచ్చింది. పూర్తి అవగాహనతో, పరిస్థితిని సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ, రెండు రాష్ట్రాల ప్రజలు మనవారే అనే భావనతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాం. ఏపీ సీఎం జగన్‌ స్వచ్ఛమైన హృదయంతో వ్యవహరించారు. కలిసి నడుద్దామనుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని ముఖ్యమంత్రులు కలిసి పాల్గొనడం మంచి సంకేతం ఇచ్చింది.

మహారాష్ట్రతో సయోధ్య కుదుర్చుకోవడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకోగలిగాం. అదే విధంగా రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలుంటే, అంతిమంగా ప్రజలకు మేలు కలుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ప్రజలకు ఎంత వీలయితే అంత మేలు చేయడమే మా లక్ష్యం’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. సమావేశం సందర్భంగా నదుల్లో నీటి లభ్యతపై సీఎం కేసీఆర్‌ పవర్‌ పాయిం ట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఎగువ రాష్ట్రాలైన మహా రాష్ట్ర, కర్ణాటకలు గోదావరి, కృష్ణా వాటి ఉపనదులపై బ్యారేజిలు నిర్మించడం వల్ల కిందికి నీరు రాని పరిస్థితిని వివరించారు. సీడబ్ల్యూసీ లెక్క ల ప్రకారం ఏ పాయింట్‌ వద్ద ఎంత నీటి లభ్యత ఉందో వివరించారు. గూగుల్‌ మ్యాపుల సహకారంతో గోదావరి, కృష్ణా నదుల నీళ్లను సమర్థవంతంగా వినియోగించుకోవడానికున్న మార్గాలను ప్రతిపాదించారు.

4వేల టీఎంసీలతో ఇరు రాష్ట్రాలు సుభిక్షం

ఈ సందర్భంగా లభ్యతగా ఉన్న జలాలు, వృథాగా సముద్రంలో కలుస్తున్న జలాలు, వాటిని శ్రీశైలం, నాగార్జున సాగర్‌లకు తరలించే మార్గాలపై తన అభిప్రాయాలను సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ‘గోదావరి, కృష్ణా నదుల్లో కలిపి 4వేల టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఈ నీళ్లను ఉపయోగించుకుని రెండు రాష్ట్రాలను సుభిక్షం చేయవచ్చు. కావాల్సినంత నీళ్లున్నాయి. ఆ నీళ్లను ఉపయోగించుకోవడానికి విజ్ఞత కావాలి. ఎన్ని నీళ్లను ఉపయోగించుకుంటామన్నది మన సమర్థత మీద ఆధారపడి ఉంది. ప్రతీ ఏటా దాదాపు 3వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. నీళ్లకోసం ట్రిబ్యునళ్ల చుట్టూ, కోర్టుల చుట్టూ, మరొకరి చుట్టూ తిరగడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుని, కలిసి నడిస్తే చాలు. రెండు నదుల్లో ఉన్న నీటిని రెండు రాష్ట్రాల ప్రజలకు వినియోగించే విషయంలో ఏకాభిప్రాయం ఉంటే చాలు.

కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం అనే ప్రతిపాదన తెస్తున్నది. మన నదుల నీళ్లు మన అవసరాలు తీర్చాక కేంద్రం చెప్పే ప్రతిపాదన విషయంలో మనం నిర్ణయం తీసుకోవచ్చు. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువ ఉన్నందున గోదావరి నది నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్‌ రిజర్వాయర్లకు నీటిని తరలించాలి. దీనివల్ల సాగునీటికి తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న రాయలసీమ, పాలమూరు, నల్గొండ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నీటి గోస తీరుతుంది. పోలవరం నుంచి వేలేరు ద్వారా విశాఖపట్నం వరకు నీళ్లు తీసుకుపోవాలి. వంశధార, నాగావళి నదుల నీళ్లను కూడా సముద్రం పాలు కాకుండా సమర్థంగా వినియోగిస్తే తమకు నీళ్లు రావడం లేదని, తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామనే ఉత్తరాంధ్ర వాసుల బాధ కూడా తీరుతుంది’అని సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించారు.

కరువుకు గోదావరే పరిష్కారం: జగన్‌

దక్షిణ తెలంగాణ జిల్లాలు, ఏపీలోని రాయలసీమ ప్రాంతాలకు గోదావరి జలాలను తరలిస్తేనే సాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. ‘తక్కువ ఖర్చుతో రెండు రాష్ట్రాల ప్రజలకు కావాల్సిన నీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఈ భేటీలో నిర్ణయించుకున్నాం. ఉత్తమమైన, సులభమైన మార్గం ద్వారా సాగునీటి కష్టాలు తీర్చాలి. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువవుతోంది. రాబోయే కాలంలో ఇంకా తగ్గవచ్చు. అందుకే గోదావరి నీటిని ఉపయోగించుకుని రాయలసీమ, పాలమూరు, నల్గొండ ప్రాంతాల సాగునీటి సమస్యను పరిష్కరించుకోవాలని ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉన్నాయి. నీటిని ఎలా తరలించాలనే విషయంలో అధికారులు అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి’అని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఈ భేటీ అనంతరం ఆంధ్రప్రదేశ్‌ బృందంతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో మధ్యాహ్న భోజనం చేశారు.

అవినీతి నిగ్గు తేల్చండి.టీడీపీ సర్కారు అడ్డగోలు దోపిడీపై విచారణకు మంత్రివర్గ ఉపసంఘం.దాదాపు 30 అంశాలపై విచారణకు ముఖ్యమంత్...
27/06/2019

అవినీతి నిగ్గు తేల్చండి.
టీడీపీ సర్కారు అడ్డగోలు దోపిడీపై విచారణకు మంత్రివర్గ ఉపసంఘం.
దాదాపు 30 అంశాలపై విచారణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశం.
గత ఐదేళ్లలో అడ్డగోలుగా ప్రకృతి సంపదను కొల్లగొట్టినందుకే.
సహజ వనరులు మొదలు సాగునీటి ప్రాజెక్టుల దాకా అవినీతి.
స్విస్‌ చాలెంజ్, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, భారీ ప్రాజెక్టుల టెండర్లలో నిబంధనల ఉల్లంఘన.
భూముల కేటాయింపు, గనుల లీజుల్లో క్విడ్‌ ప్రో కో.
వీటన్నింటిపై నిగ్గు తేల్చేందుకు మంత్రులు బుగ్గన, పెద్దిరెడ్డి,అనిల్‌కుమార్, కన్నబాబు, గౌతంరెడ్డి సభ్యులుగా ఉపసంఘం.
ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి.
కార్యదర్శిగా వ్యవహరించనున్న సీసీఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌.
సీఐడీ, విజిలెన్స్, ఏసీబీ విభాగాల సీనియర్‌ అధికారుల బృందం సహకారం.
ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని నిర్దేశం.

వ్యవస్థను బాగు చెయ్యాలన్న నా ఆకాంక్షకు అధికారులు చేయూతనివ్వాలి. మనకు ప్రజలు ముఖ్యమన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. ఎక్కడ డబ్బు మిగిల్చగలమో గుర్తించడానికి సహకరించాల్సింది అధికారులేనని పదేపదే చెబుతున్నా. అవినీతిని నిర్మూలించి వ్యవస్థలను సరిచేసుకోవడానికి అందరం కలిసికట్టుగా వెళదాం.
– సీఎం వైఎస్‌ జగన్‌

అమరావతి: రాష్ట్రంలో ఐదేళ్లుగా గత టీడీపీ ప్రభుత్వం ప్రకృతి వనరులను యథేచ్ఛగా దోచుకున్న తీరుపై నిగ్గు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసి సాగించిన దోపిడీని బట్టబయలు చేయాలని సంకల్పించింది. ఇష్టారాజ్యంగా ప్రాజెక్టుల అంచనాలు పెంచేసి, కమీషన్లే లక్ష్యంగా పని చేసి ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యేలా చేసిన వైనాన్ని ఎత్తిచూపాలని కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా ఐదేళ్లుగా గత ప్రభుత్వం సాగించిన అవినీతి బాగోతాలపై విచారణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 30 అంశాలపై మంత్రి వర్గ ఉపసంఘం విచారణ చేస్తుందని చెప్పారు. ఏసీబీ, విజిలెన్స్, సీఐడీ విభాగాల్లోని సీనియర్‌ అధికారుల బృందం విచారణకు సహకారం అందజేస్తుందన్నారు.

బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన విద్యుత్‌ రంగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గత టీడీపీ సర్కారు పాల్పడిన అక్రమాలపై సమగ్రంగా విచారణ చేసి ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఐదుగురు సభ్యుల మంత్రివర్గ ఉప సంఘానికి సీఎం వైఎస్‌ జగన్‌ నిర్దేశించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి.. అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి.. భారీఎత్తున దోచేసిన తీరును ప్రజల ముందు పెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించి పారదర్శక పరిపాలన అందించడానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో సాగిన అవినీతిని వెలికి తీయడం కోసం మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.

ఎందుకు ఉప సంఘం వేయాల్సి వచ్చిందంటే..: అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని విభజన గాయాలతో ఛిద్రమైన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన టీడీపీ సర్కార్‌ తద్భిన్నంగా వ్యవహరించింది. జూన్‌ 2, 2014 నుంచి మే 29, 2019 వరకు ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసి అడ్డగోలుగా దోపిడీకి పాల్పడింది. అక్రమార్జన కోసం అనుకూలమైన విధానాలను రూపొందించింది. వాటిని అడ్డం పెట్టుకుని ఇసుక నుంచి గనుల వరకూ సహజ సంపదను కొల్లగొట్టింది. టీడీపీ నేతలు దౌర్జన్యం చేసి పేదల భూములను కబ్జా చేశారు. ప్రభుత్వ, దేవదాయ భూములను హస్తగతం చేసుకున్నారు. సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని పెంచేసి.. పాత కాంట్రాక్టర్లపై వేటు వేసి.. కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. టీడీపీ నేతల దోపిడీ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. అభివృద్ధిలో రాష్ట్రం తిరోగమించింది. టీడీపీ సర్కారు అసంబద్ధ విధానాల వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు, రైతులు, యువకులు, బలహీన వర్గాలు, మైనారిటీలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

టీడీపీ నేతల భూ కబ్జాల వల్ల చిన్న, మధ్య తరగతి రైతులు భూములు కోల్పోయారు. భూ కబ్జాల వల్ల ప్రజలు వారి సొంత ఇళ్లను, గ్రామాలను కోల్పోయి నిర్వాసితులగా మారారు. ప్రకృతి వనరులను విధ్వంసం చేసి దోపిడీ చేయడం వల్ల రాష్ట్రంలో పర్యావరణ సమతౌల్యానికి విఘాతం కలిగింది. ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే ఈ దోపిడీ సాగింది. ఈ నేపథ్యంలో చెడిపోయిన వ్యవస్థను బాగు చేసేందుకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. అవినీతి రహిత, పారదర్శక, సమర్థవంతమైన పరిపాలన అందించడం ద్వారా వ్యవస్థలను బలోపేతం చేయడానికి, అవినీతికి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నడుం బిగించారు. ఇందులో భాగంగానే మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. అవినీతికి పాల్పడిన వ్యక్తులతో పాటు సంస్థలను గుర్తించి, ఆ నిర్ణయాల వెనుక ఉన్న దురుద్దేశాలపై తీసుకోవాల్సిన చర్యలను ఉప సంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా రాష్ట్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన సూచనలను చేస్తుంది.

మంత్రివర్గ ఉప సంఘం స్వరూపం..

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పంచాయతీరాజ్, గ్రామీణ, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి ఎం.గౌతంరెడ్డిలతో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి, వి.ప్రభాకర్‌రెడ్డిలు ప్రత్యేక ఆహ్వానితులుగా, సీసీఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ ఈ కమిటీకి కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు చేసే సూచనల ఆధారంగా ఉప సంఘం విచారణ సాగనుంది. ఈ విచారణ శాస్త్రీయంగా, పారదర్శకంగా సాగేందుకు వీలుగా ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాల్లోని ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా ఈ ఉప సంఘం ఎలాంటి సమాచారం, జీవోలు, డాక్యుమెంట్లు, ఫైళ్లు కోరినా ఆయా శాఖలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆరు వారాల్లోగా ఈ ఉప సంఘం నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.

ఇవీ మార్గదర్శకాలు

- గత ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన భారీ నిర్ణయాలు, కార్యక్రమాలు, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, ఏర్పాటు చేసిన సంస్థలను అడ్డం పెట్టుకుని భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయడంపై విచారణ.
- రాష్ట్రంలో టెండర్ల విధానం, ఆ విధానంలో టీడీపీ సర్కారు చేసిన సవరణలు, కాంట్రాక్టర్లకు అప్పగించిన భారీ ప్రాజెక్టుల పనులు, ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్య ప్రాజెక్టులు, స్విస్‌ ఛాలెంజ్‌ విధానం, సహజ వనరుల కేటాయింపు (ప్రధానంగా భూములు, నీళ్లు, గనులు, విద్యుత్‌)లో నిబంధనలను ఉల్లంఘించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి దోచుకున్న తీరుపై సమీక్ష.
- బిజినెస్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సంస్థలు, ప్రజాభ్యుదయం ముసుగులో తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ సంస్థలపై చూపిన దుష్ప్రభావంపై సమీక్ష
- గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) మెమొరాండం ఆఫ్‌ అగ్రిమెంట్స్, లెటర్స్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌వోఐ), స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్, జాయింట్‌ వెంచర్స్‌లో అవినీతికి పాల్పడటం, ఆశ్రిత పక్షపాతం చూపడంపై విచారణ.
- వివిధ కార్పొరేషన్లు, పరిశ్రమలు, అథారిటీలు, సొసైటీల పనీతీరుపై సమీక్ష. వాటిని గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను నివేదించాలి.
- గత ప్రభుత్వం భారీఎత్తున కన్సల్టెన్సీలను ఏర్పాటు చేయడంపై సమగ్రంగా విచారణ. ఈ వ్యవహారంలో అవినీతికి పాల్పడిన తీరుపై సమీక్ష
- ప్రభుత్వ భూముల కేటాయింపుపై సమగ్ర విచారణ. భూముల కేటాయింపులో క్విడ్‌ప్రోకోకు పాల్పడిన వ్యవహారాలపై ప్రత్యేకంగా సమీక్ష
- గత ప్రభుత్వం మైనింగ్‌ లీజులు మంజూరు చేయడంపై సమగ్ర విచారణ. అక్రమంగా మైనింగ్‌ లీజులు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు చేకూరిన నష్టంపై నివేదిక.
- విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో నిబంధనలను ఉల్లంఘించడం, అక్రమాలకు పాల్పడి కమీషన్లు తీసుకోవడంపై విచారణ. ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సొసైటీల్లో అక్రమాలకు పాల్పడిన తీరుపైన దర్యాప్తు.
- వైద్య, విద్య, పౌష్టికాహార కార్యక్రమాల్లో పబ్లిక్, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టులపై సమగ్ర విచారణ.
- ఐటీ రంగంపై సమగ్రంగా సమీక్ష.
- సీఆర్‌డీఏ, పోలవరం ప్రాజెక్టు, పోర్టులు, విమానాశ్రయాలు, హైవే ప్రాజెక్టుల్లో గత ప్రభుత్వ పెద్దలు పాల్పడిన అక్రమాలపై సమగ్ర సమీక్ష. సీఆర్‌డీఏ పరిధిలో భూముల కేటాయింపు, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ విధానంలో భూముల కొనుగోలు ద్వారా అక్రమంగా లబ్దిపొందడంపై విచారణ.
- ఈ అక్రమాల్లో రాజకీయ నేతలు, కీలక అధికారుల పాత్రపై విచారణ.

విజయనిర్మల కన్నుమూతహైదరాబాద్‌: అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి విజయనిర్మల(73) బుధవారం...
27/06/2019

విజయనిర్మల కన్నుమూత

హైదరాబాద్‌: అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి విజయనిర్మల(73) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. నగరంలోని గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో ఆమె గతకొంతకాలంగా చికిత్సపొందుతున్నారు. 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో ఆమె జన్మించారు. ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖతో సినీరంగ అరంగేట్రం చేశారు. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులో పరిచయమయ్యారు. మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన అనంతరం విజయనిర్మల కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు నరేష్ ఒక్కడే సంతానం.

సాక్షి చిత్రంతో తొలిసారిగా సూపర్ స్టార్ కృష్ణతో కలిసి నటించిన ఆమె ఆయనతో 47 చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ, మలయాళంలో 200కుపైగా చిత్రాల్లో విజయనిర్మల నటించారు. సొంత నిర్మాణ సంస్థ విజయకృష్ణ పతాకంపై 15కుపైగా చిత్రాలను నిర్మించారు. 1971లో దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తొలిసారిగా మీనా చిత్రాన్ని తెరకెక్కించారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆమె అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించారు.

తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆమె అత్యున్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డును (2008) అందుకున్నారు. మీనా, కవిత, దేవదాసు, దేవుడు గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, కిలాడీ కృష్ణుడు, బోగిమంటలు, పుట్టింటి గౌరవం, నేరము శిక్ష ఆమె దర్శకత్వం వహించిన చిత్రాల్లో ముఖ్యమైనవి. విజయనిర్మల నటించిన అధిక చిత్రాలలో కథానాయకుడు కృష్ణ కావటం విశేషం.

విజయ నిర్మల పార్థివ దేహాన్ని ఈ రోజు ఉదయం 11 గంటలకు నానక్ రామ్ గూడాలోని ఆమె స్వగృహానికి తీసుకు వస్తారు. ఈ రోజు మొత్తం అక్కడేవుంచి రేపు ఉదయం ఫిల్మ్‌ ఛాంబర్‌కు తీసుకువస్తారు. శుక్రవారం విజయ నిర్మల అంత్యక్రియలు జరగనున్నాయి.

ప్రజావేదిక కూల్చివేత.అక్రమ కట్టడంపై సమ్మెట పోటు.క్యాంటీన్, వంట షెడ్, ప్రహరీలు నేలమట్టం.భవనంలోని విలువైన వస్తువులు సచివాల...
26/06/2019

ప్రజావేదిక కూల్చివేత.
అక్రమ కట్టడంపై సమ్మెట పోటు.
క్యాంటీన్, వంట షెడ్, ప్రహరీలు నేలమట్టం.
భవనంలోని విలువైన వస్తువులు సచివాలయానికి తరలింపు.
అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించి కరకట్టపై ‘ప్రజావేదిక’ నిర్మాణం.
బిల్డింగ్‌ ప్లాన్‌ అనుమతి లేకుండానే నిర్మించిన సీఆర్‌డీఏ
నదీ తీరంలో నిర్మాణం చేపట్టవద్దన్న ఇరిగేషన్‌ సీఈ సూచనలు బేఖాతర్‌.
గ్రీవెన్స్‌ సెల్‌ పేరుతో నిర్మాణం.. కార్యకలాపాలు మాత్రం టీడీపీవి.

అమరావతి/తాడేపల్లిరూరల్‌ (మంగళగిరి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లే అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచే మొదలైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా ఉండవల్లిలో కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయించిన విషయం విదితమే. సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ విజయకృష్ణన్‌ నేతృత్వంలో అధికారుల బృందం మంగళవారం సాయంత్రం ప్రజావేదిక వద్దకు చేరుకుని కూల్చివేతకు అవసరమైన సూచనలు జారీ చేశారు.

అందులో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్లు, ఏసీలు, మైక్‌ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్‌ సామగ్రి, పూల మొక్కలు కుండీలు సహా అన్నింటి వివరాలు నమోదు చేసుకుని ఆ తర్వాత కూల్చివేత పనులు మొదలు పెట్టారు. పూల కుండీలన్నింటినీ రాయపూడి సమీపంలోని సీఆర్‌డీఏ నర్సరీకి, మిగిలిన వస్తువులన్నింటినీ సచివాలయానికి తరలించారు. ఆ తర్వాత జేసీబీలతో క్యాంటీన్, వంట షెడ్, ప్రహరీని కూలగొట్టారు.

అక్రమాల వేదిక!

కృష్ణా కరకట్టపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం పక్కన అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని కలెక్టర్ల సమావేశ వేదిక నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు స్వయంగా అక్రమ కట్టడంలో నివాసం ఉండడమే కాకుండా అధికారంలో ఉండగా దానిపక్కనే నిబంధనలకు విరుద్ధంగా మరో భవనాన్ని నిర్మించడంపై ప్రతిపక్షాలు ఆందోళనలు చేసినా లెక్క చేయలేదు. పర్యావరణవాదుల అభ్యంతరాలను బుట్టదాఖలు చేశారు. ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేస్తూ ముందుకెళ్లిన చంద్రబాబు అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆ అక్రమ కట్టడాన్ని తనకు కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాసి చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నించారు. ప్రజావేదిక నిర్మాణంలో జరిగిన ఉల్లంఘనలు, అవకతవకలను కలెక్టర్ల సమావేశంలో ప్రస్తావించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వమే వ్యవస్థలను దిగజార్చేలా అక్రమ కట్టడాలు నిర్మించడం సరికాదంటూ దాన్ని కూల్చివేయాలని ఆదేశించడం సంచలనం సృష్టించింది. పేదవాడికో నిబంధన, ప్రభుత్వానికో నిబంధన ఉండదని స్పష్టం చేసి తన చిత్తశుద్ధి, ప్రభుత్వ పారదర్శకతను తేటతెల్లం చేయడంపై అందరిలోనూ సంతృప్తి వ్యక్తమవుతోంది.

అడుగడుగునా ఉల్లంఘనలే

ప్రజావేదిక నిర్మాణం నుంచి నిర్వహణ వరకూ లెక్కలేనన్ని ఉల్లంఘనలు, అవకతవకలు చోటుచేసుకున్నాయి. పర్యావరణ పరిరక్షణ చట్టం, నీటిపారుదలశాఖ నిబంధనలు, లోకాయుక్త ఆదేశాలకు భిన్నంగా సీఆర్‌డీఏ అధికారులపై ఒత్తిడి చేసి చంద్రబాబు దీన్ని నిర్మించారు. భవన నిర్మాణ సమయంలో కనీస నిబంధనలను సైతం పాటించలేదు. ఒక పంచాయతీలో భవనం కట్టుకోవడానికైనా ప్లాన్‌కు పంచాయతీ బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉండగా అలాంటిదేమీ లేకుండానే ప్రజావేదికను నిర్మించారు. భవన నిర్మాణాలకు అనుమతులివ్వాల్సిన సీఆర్‌డీఏతోనే నిబంధనలను తుంగలో తొక్కి మరీ దీన్ని నిర్మించారు. బిల్డింగ్‌ ప్లాన్‌లో చిన్న లోపాలుంటేనే కూలగొడుతున్న సీఆర్‌డీఏ అసలు ప్లాన్‌ లేకుండా తానే స్వయంగా ప్రజావేదికను కట్టి రాజభవనంగా తీర్చిదిద్దింది. కృష్ణా కరకట్టపై నిర్మాణాలు ఉండకూడదని గరిష్ట వరద స్థాయి సూచికలు, నీటిపారుదల శాఖ స్పష్టం చేసినా చంద్రబాబు పట్టించుకోకుండా తన నివాసం పక్కన దీన్ని కట్టించారు.

కార్యకలాపాలన్నీ టీడీపీవే..

ముఖ్యమంత్రి ప్రజలను కలుసుకునేందుకే దీన్ని నిర్మించినట్లు టీడీపీ చెప్పినా ఏనాడూ ప్రజలను అందులోకి రానివ్వలేదు. టీడీపీ కార్యాలయం అందుబాటులో లేకపోవడంతో పార్టీ కార్యకలాపాల కోసమే దీన్ని నిర్మింపజేశారు. నిర్మించిన నాటి నుంచి టీడీపీ కార్యాలయం మాదిరిగానే ప్రజావేదిక పనిచేసింది. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ ఉద్యోగులు, పార్టీ నేతలంతా ఇక్కడి నుంచే పనిచేశారు. రెండేళ్లుగా పార్టీ సమావేశాలన్నీ ఇక్కడే జరిగాయి. చంద్రబాబు పలుసార్లు ఇందులోనే పార్టీ శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో యనమల రామకృష్ణుడి నేతృత్వంలో టీడీపీ మేనిఫెస్టో కమిటీ సమావేశాలు, పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం ఏర్పాటైన స్క్రీనింగ్‌ కమిటీ సమావేశాలు, చేరికలు కూడా ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ఇక్కడే జరిగాయి. అధికారం కోల్పోయిన తర్వాత కూడా చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్, ముఖ్య నాయకులు ప్రజావేదికను పార్టీ కార్యాలయంగానే వినియోగిస్తూ వచ్చారు. నాలుగు రోజుల క్రితం టీడీపీ నేత బుద్ధా వెంకన్న ప్రజావేదికలోనే మీడియా సమావేశం నిర్వహించడం గమనార్హం. ప్రజావేదికను అక్రమంగా నిర్మించడమే కాకుండా అన్ని రకాలుగా దుర్వినియోగం చేసిన చంద్రబాబు, టీడీపీ నేతలు దాన్ని కూల్చివేస్తామనగానే నీతి సూత్రాలు వల్లిస్తుండడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

మంత్రి నోటిమాటతో రెట్టింపైన అంచనాలు

ప్రజావేదికను ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించడమే కాకుండా టెండర్లు, అంచనాల రూపకల్పనలోనూ అవకతవకలకు పాల్పడ్డారు. కాగితాల్లో మూడుసార్లు టెండర్లు పిలిచినట్లు చూపించి చివరికి తమకు కావాల్సిన ఎన్‌సీసీ సంస్థకు ఆ పని అప్పగించారు. చివరికి చూపించిన టెండర్‌ను కూడా తుంగలో తొక్కారు. టెండర్‌ విలువ ప్రకారం రూ.4.34 కోట్ల పనిని అప్పటి మంత్రి నారాయణ తన నోటి మాటతో రూ.8.90 కోట్లకు పెంచేయడం గత ప్రభుత్వంలో టెండర్ల ప్రక్రియ ఎలా సాగిందో రుజువు చేస్తోంది. కాంట్రాక్టు విలువ కంటే రెట్టింపు మొత్తాన్ని మంత్రి నోటి మాటతో పెంచడాన్ని బట్టి గత ప్రభుత్వం టెండర్ల పద్ధతిని ఏ స్థాయికి దిగజార్చిందో స్పష్టమవుతోంది. వాస్తవానికి టెండర్లు పిలవకుండానే ఎన్‌సీసీతో ప్రజావేదికను కట్టించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత కాగితాలపై టెండర్లు పిలిచినట్లు చూపించి పాత తేదీలతో మాయ చేసినట్లు చెబుతున్నారు.

ప్రజావేదిక నిర్మాణం-పూర్వాపరాలు

- ఉండవల్లిలో నాటి సీఎం క్యాంపు కార్యాలయం సర్వే నెంబరు 272/2 ఏ వద్దగ్రీవెన్స్‌ హాల్‌ నిర్మాణానికి అంచనా కంటే 4.3 శాతం అదనంతో (రూ.4,34,61,919.52) ఎన్‌సీసీ దాఖలు చేసిన బిడ్‌కు అర్హత ఉందని ధృవీకరించి ఆమోదించిన సీఆర్‌డీఏ. 2017 అక్టోబర్‌ 4న ఆ సంస్థతో నిర్మాణానికి ఒప్పందం
- గ్రీవెన్స్‌ హాల్‌ నిర్మాణానికి అనుమతి కోరుతూ 2017 సెప్టెంబర్‌ 6వ తేదీన అందిన విజ్ఞప్తిని తిరస్కరించిన కృష్ణా సెంట్రల్‌ డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌. కృష్ణానదికి వచ్చే గరిష్ట వరద, సాంకేతిక కారణాల రీత్యా గ్రీవెన్స్‌ హాలు నిర్మాణానికి అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టీకరణ.
- కృష్ణానది ఎడమ కరకట్టపై ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న ఆక్రమణలన్నింటినీ ఆరు నెలల్లోపు తొలగించాలని
2017 ఫిబ్రవరి 1న లోకాయుక్త ఆదేశించింది. ఈ నిర్మాణాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ జరుగుతున్న నేపథ్యంలో అనుమతి నిరాకరించిన ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌.
- గ్రీవెన్స్‌ హాలు నిర్మాణానికి (ప్లాన్‌) అనుమతి ఇవ్వాలని 2017 జూన్‌ 13వ తేదీన సీఆర్‌డీఏ సీఈ (హౌస్‌ అండ్‌ బిల్డింగ్స్‌) పంపిన లేఖపై సీఆర్‌డీఏగానీ, టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ విభాగంగానీ అనుమతి ఇవ్వలేదు
- అనంతరం నాటి మంత్రి నారాయణ నిర్మాణ ప్రదేశాన్ని సందర్శించి రూ.4.43 కోట్లకు ఇచ్చిన పరిపాలనాపరమైన మంజూరును రూ.8.90 కోట్లకు పెంచాలని మౌఖికంగా ఆదేశించారు. అందుకనుగుణంగా 2017 డిసెంబర్‌ 15వతేదీన సవరించిన అంచనాలను ఆమోదించిన సీఆర్‌డీఏ సీఈ. 2018 ఫిబ్రవరిలో గ్రీవెన్స్‌ హాల్‌ నిర్మాణం పూర్తి.

Address

Hyderabad
500073

Alerts

Be the first to know and let us send you an email when Sakshi News Paper posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sakshi News Paper:

Share