12/10/2025
బనకచర్లపై మౌనమెందుకు రేవంత్?
బనకచర్లపై ఏపీ ముందుకెళ్తుంటే మొద్దునిద్ర పోతున్నవ్
టెక్నో ఎకనామికల్ అప్రైజల్ కోసం బనకచర్ల పీఎఫ్‌ఆర్
వచ్చిందని ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి పాటిల్ లేఖ
కర్ణాటక, మహారాష్ట్ర తమ అభ్యంతరాలు చెప్పినయ్
మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?
కర్ణాటకకు పోయి ఆల్ ఈజ్ వెల్ అనుకుంట వచ్చినవ్
ఆల్మట్టి ఎత్తు పెంచొద్దని ఒక్క మాట చెప్పకపోతివి?
బనకచర్లపై మీరు వెళ్లకున్నా మేం సుప్రీంకోర్టుకు పోతం
తెలంగాణభవన్‌లో మీడియాతో మాజీ మంత్రి హరీశ్ కేంద్రంలోని బీజేపీ సహకారంతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ఏపీ ప్రభుత్వం ముందుకుపోతుంటే సీఎం రేవంత్‌రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటూ ఏపీకి పూర్తిగా సహకరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. టెక్నో ఎకనామికల్ అప్రైజల్ కోసం బనకచర్ల ప్రాజెక్టు పీఎఫ్‌ఆర్ వచ్చిందని, అనుమతుల ప్రక్రియ ప్రోగ్రెస్‌లో ఉన్నదని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ సెప్టెంబర్ 23న సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారని, 20 రోజులైనా దాన్ని వ్యతిరేకించాల్సింది పోయి పరోక్షంగా సహకరిస్తున్నారని నిప్పులు చెరిగారు. మన దేశంలో వరద జలాల మీద డీపీఆర్ అప్రైజల్ ఉండదని, నికర జలాల మీద డీపీఆర్ ఉంటుందని, కానీ వరద జలాల మీద ఉండదని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), నదీ జలాల పంపిణీ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. వరద జలాల మీద డీపీఆర్ అప్రైజల్‌ను వ్యతిరేకిస్తూ కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి లేఖ రాస్తే రేవంత్‌రెడ్డి మాత్రం మౌనంగా ఉన్నారని ధ్వజమెత్తారు. తెలంగాణభవన్‌లో శనివారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దాసోజు శ్రవణ్‌తో కలిసి హరీశ్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్ర మంత్రి పాటిల్ రాసిన లేఖను, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కేంద్రానికి పంపిన లేఖలను మీడియాకు చూపించారు. బనకచర్ల పురోగతి.. తాజా పరిణామాలను మీడియా సాక్షిగా ప్రజల ముందు బయట పెడుతున్నానని చెప్పారు. బనకచర్ల డీపీఆర్ కోసం రూ.9కోట్లకు ఏపీ సర్కారు టెండర్లు కూడా పిలిచిందని, అయినా మన సీఎం మొద్దునిద్ర పోతున్నారని విమర్శించారు.