02/06/2025
⚫ మహాశూన్యం ⚫
నేను గొప్పా లేక నాలో ఉన్న జీవుడు గొప్పా ❓
ఎవరు ఇచ్చారయ్యా నాకు ఈ శరీరాన్ని, ఆత్మని.
నా గుండెని నిరంతరం ఆడిస్తున్నది ఎవరు
నా కాలేయాన్ని సంకోచించమని చెబుతున్నది ఎవరు
నా కళ్ళకి దృష్టిని అందిస్తున్నది ఎవరు
నా చెవులకి వినికిడి శక్తిని ఇస్తున్నది ఎవరు
నా ముక్కుని శ్వాసించమని చెబుతున్నది ఎవరు
నా మాటలకి స్వరాలని అందిస్తున్నది ఎవరు
నా జీర్ణ క్రియ ని పర్యవేక్షిస్తున్నది ఎవరు
నా ఒళ్ళంతా రక్తం పారిస్తున్నది ఎవరు
నా మెదడుకి ఆజ్ఞలు వేస్తున్నది ఎవరు
ఇలా అన్ని వ్యవహారాలు నడిపించి పనికిరాని దాన్ని నవరంద్రాల గుండా బయటకి పారదోలుతున్నది ఎవరు
ఎ. వ. రు
నేను కదలాలి అంటే నా కాలుని కదుపుతున్నావు
నేను చేయాలి అనుకుంటే నా చేతిని విదిలిస్తున్నావు
ప్రమాదం పొంచి ఉంటే ఆగమని హెచ్చరిస్తున్నావు
మంచిదనిపిస్తే సరైన దారిలో నన్ను నడిపిస్తున్నావు
అసలు ఎవరు నువ్వు, ఇవన్నీ చేయించమని చెబుతున్నది ఎవరు.
నాకు కావాల్సినవన్నీ నువ్వు చేస్తున్నావు,
కానీ నీకు కావాల్సినవన్నీ నేను చేస్తున్నానా నాకు తెలియడం లేదు
అబద్దమాడితే నీ చెంప పగులుతుందని తెలుసు కానీ నేను ఆడుతున్నాను
మోసం చేస్తే నీ దేహాన్ని చీదరించుకుంటారని తెలుసు కానీ నేను చేస్తున్నాను
ఆపద ఉంది నీకేమైనా ప్రమాదం పొంచి ఉందని తెలుసు కానీ నేను అటే వెళ్తున్నాను
సిగరెట్ తాగితే నీ ఊపిరితిత్తులు మాడి మసి అవుతాయని తెలుసు కానీ నేను పీలుస్తున్నాను
మందు తాగితే నీ కాలేయం కరాబు అవుతుందని తెలుసు కానీ నేను తాగుతున్నాను
కల్తీ ఆహారం తింటే నీలో కొవ్వు పేరుకు పోతుందని తెలుసు కానీ నేను తింటున్నాను
అన్నీ తెలిసి నీకు కావాల్సింది నేను చేయలేకపోతున్నాను
నాకు ఇన్ని పనులు చేసి పెడుతున్న నిన్నే మోసం చేస్తున్నాను
నాకు సిగ్గుగా ఉంది
ఇన్ని చేసినా నన్ను ఏమీ అనడం లేదు అసలు ఎవరు నువ్వు
కత్తితో పొడిస్తే నీకు గాయం అవుతుందని తెలుసు కానీ నేను చేస్తున్నాను
కాలిస్తే నువ్వు చనిపోతావని తెలుసు కానీ నేను చేస్తున్నాను
చివరికి చితిలోనైనా నువ్వు ఎవరో తెలుసుకొని క్షమాపణ అడగాలని ఉంది కానీ ఎవరు నువ్వు
కనబడవు , వినబడవు .
ఆ మధ్య రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నా కాలికి రాయి తగిలి గోరుచిట్లి రక్తం కారుతోంది. దాన్ని కాసేపు అలా అదిమిపట్టా దెబ్బకి రక్తం గడ్డ కట్టి కొన్ని రోజులకే మానడం మొదలైంది
నువ్వు డాక్టరువా ...
మా వీధిలో పంచాయతీ నడుస్తోంది ఇరువర్గాల వాదన విన్న తర్వాత ఎవరైతే తప్పు చేశారో వారిది తప్పు అని నిలదీశాను అలా నాతో అనిపించింది నువ్వే కదా
నువ్వు లాయరువా ...
ఒక వెధవ దొంగతనం చేసి పారిపోతుంటే వెంటపడి మరీ పట్టుకొని చితక్కొట్టాను అది చేయించింది నువ్వే కదా
నువ్వు పోలీసువా ...
నా మిత్రుడు ఒకడు ఆపదలో ఉంటే వెళ్లి ఆదుకున్నాను అదీ చేయించింది నువ్వే
నువ్వు దైవానివా ...
మా ఇంటి ముందుకి ఆకలేస్తోంది ఇంత చద్దన్న పెట్టండి అయ్యా అన్నవారికి తిండి పెట్టాను , కాదు కాదు అలా పెట్టించావు
నువ్వు రైతువా, అన్నదాతవా లేక అన్నపూర్ణవా ...
ఒకడు నన్ను నమ్మి అప్పు ఇచ్చాడు కానీ నేను అది తీర్చలేక ఎగ్గొట్టాను అది చేయించింది నువ్వేనా
నువ్వు దుర్మార్గుడివా ..
కాదు కాదు నా అంతరాత్మ రూపంలో నువ్వు కట్టమని హెచ్చరించావు కానీ నేను కట్టలేకపోయాను
నేను దుర్మార్గుడిని నువ్వు నిజాయితీపరుడువి
నాకోసం ఇన్ని చేస్తున్న నీ రుణం ఎలా తీర్చుకోను
అసలు తీర్చుకోగలనా ❓
ఈ జన్మకి వదిలేయి మిత్రమా మరో జన్మంటూ ఉంటే నువ్వు ఎలా ఉండాలి అని అనుకుంటున్నావో అలాగే ఉంటా
కనీసం అప్పుడైనా నువ్వు ఎవరో నాకు కనబడు అదీ కుదరకపోతే కనీసం వినబడు. నీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ నువ్వు ఎవరో తెలియక సతమతమవుతున్న ధీనుడు
నీ ...
✍️ తన్నీరు రమేష్
⚫ మహాశూన్యం ⚫