28/09/2025
బిపి మండల్ స్పూర్తితో తెలంగాణ లో సిఎం రేవంత్ రెడ్డి
బిసిల అభివృద్ధికి, సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నాడు -ఎమ్మెల్యే ఎన్నేం శ్రీనివాస్ రెడ్డి
బిందేశ్వరి ప్రసాద్ మండల్ స్పూర్తి ప్రదాత అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో ఏర్పాటు చేసిన బిపి మండల్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వెనకబడిన, దళిత వర్గాల కోసం షోషిత్ దళ్ అనే పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని ఆయన గుర్తు చేశారు.
సమాజంలో బిసిలు ఎదుర్కొంటున్న వివక్షను ప్రశ్నించి ముఖ్యమంత్రి పీఠాన్ని సైతం వదులుకున్న వెనుకబడిన వర్గాల పక్షపాతి బిపి మండల్ అని ఆయన చెప్పారు. లోక్ సభ సభ్యుడిగా జనతా ప్రభుత్వంలో 1978లో రెండవ జాతీయ బిసి కమిషన్ సభ్యుడిగా, బిసిల స్థితిగతులపైన విస్తృత అధ్యయనం చేసి, 1980 డిసెంబర్ లో నివేదిక సమర్పించారన్నారు. ఓబిసి రిజర్వేషన్లు 27 శాతం సాధించారని, ఈ రిజర్వేషన్ అమలు వలన బిసి బిడ్డలు విద్య, ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారు అని ఆయన చెప్పారు.
బిపి మండల్ స్పూర్తితో తెలంగాణ లో సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బిసిల అభివృద్ధికి సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నామని, బిసిలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కృతనిశ్చయంతో ఉన్నమని ఆయన స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యతో పాటు బిసిల ఆత్మగౌరవం ఇనుమడింపచేసేలా అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. భవిష్యత్తు లో బిసి వర్గాలు లాభపడాలని రాష్ట్రంలో ప్రకటించిన రిజర్వేషన్ లలో రాజకీయ జోక్యం ఎక్కడా లేదు అని ఆయన చెప్పారు.
ఆయన విగ్రహం పెట్టుకోవడమే కాకుండా వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, టి పిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్ పి వెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, జిల్లా గొర్రెల కాపరుల సంఘం చైర్మన్ శాంతన్న యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, డిసిసి కార్యదర్శి టంకర కృష్ణయ్య యాదవ్, గోపాల్ యాదవ్,, ఐఎన్టీయుసి రాములు యాదవ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు అజ్మత్ అలి, నాయకులు మైత్రి యాదయ్య, శ్రీనివాస్ యాదవ్ ,జేసిఆర్ , జాతీయ యాదవ సభ కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్, యాదవ సభ ప్రతినిధులు యాదవ్ , బాలు యాదవ్, వెంకట్ నర్సయ్య యాదవ్, రవిచంద్రనాథ్ యాదవ్, శ్యాంసుందర్ యాదవ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.