
16/08/2025
అవినీతి పునాదులపై "అన్నమాచార్య"
(చెరువులోనే యూనివర్సిటీ పార్ట్ - 3)
----------------------------------------------------
తాళ్లపాక చెరువులో 25 ఏళ్లప్పుడు మొదలైన అన్నమాచార్య ఇంజినీరింగ్ కాలేజీ ప్రస్థానం మొత్తం అవినీతి పునాదులపైనే నడిచింది. ప్రస్తుతం ప్రైవేటు యూనివర్సిటీగా ప్రభుత్వ గుర్తింపు పొందడానికి కూడా అవినీతి మార్గాన్నే ఆశ్రయించి అసాధారణ రీతిలో విజయం సాధించింది. అవినీతి మార్గమని అంత కచ్చితంగా చెప్పడానికి ఆధారం ఏమిటంటే యూజీసీ గుర్తింపు కోసం పంపిన నివేదికలో భూమి యాజమాన్య పత్రాలు లేకుండా వారి యాజమాన్యాన్ని తహసీల్దారు ధృవీకరించినట్లు జతపరచిన సర్టిఫికెట్టు. తాళ్లపాక పాత విలేజ్ మ్యాప్ ప్రకారం 1085 సర్వే నెంబరు కనీసమంటే 5 ఎకరాలు పక్కాగా చెరువులో ఉంది. కానీ ప్రస్తుత రెవెన్యూ రికార్డులు మాత్రం ఆ సర్వే నెంబరు మొత్తం విస్తీర్ణం అన్నమాచార్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరిట ఉన్నాయి. అంటే చెరువు మాయమైంది.
తాళ్లపాకోళ్లు సిద్ధులపల్లోళ్లకు అమ్మేశారు
------------------------------------------------------
చెరువును ఎలా మాయం చేశారని చూస్తే 1085లోని ఆ మొత్తం విస్తీర్ణం 18.82 ఎకరాలతోపాటు 1084 సర్వే నెంబర్లోని మరో 1.84 ఎకరాలు తాళ్లపాకకు చెందిన గోపవరం జవ్వారెడ్డి కుమారులు కృష్ణారెడ్డి, రామిరెడ్డి సిద్ధులపల్లెకు చెందిన చొప్పా నారాయణరెడ్డి భార్య రాజమ్మ, కుమారులు యల్లారెడ్డి, లక్ష్మీకర్ రెడ్డి లకు విక్రయించినట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ (529/1992) ఉంది. దాని నకలు తీసుకుని చూస్తే తెలివైనవాడు సరిగా చదవకుండా పరీక్ష రాసినట్టుంది. గుర్తున్న సరైన పదం పదేపదే అర్థమయ్యేలా రాస్తారు, గుర్తు లేనిది అర్థం కాకుండా గీకేస్తారు. ఇది కూడా అచ్చు అలాగే ఉంది (అనుమానం ఉన్నోళ్లు చెక్ చేసుకోవడానికి వీలుగా పైన డాక్యుమెంట్ నెంబర్ కూడా ఇచ్చాము).
అమ్మినోళ్ల పేర్లు ఒకటికి పదిసార్లు అవసరమా?
------------------------------------------------------
పైగా విక్రయదారుల పేర్లు మొదటి పేజీలో ఐదుసార్లు, రెండో పేజీలో ఐదుసార్లు, మూడో పేజీలో మూడుసార్లు ఉన్నాయి. అంటే మొత్తం 13 సార్లు ఉన్నాయి. మొదటి పేజీలో పేర్లు ఎలా రాశారో కూడా చూద్దాం. మొదటిసారి కృష్ణారెడ్డి, రామిరెడ్డి పేర్లు తెలుగులో ఉన్నాయి. ఆ తర్వాత రామిరెడ్డి పేరు మాత్రం ఇంగ్లోషులో ఉంది. రెండో చోట రెడ్డి అనే ఇంగ్లీష్ అక్షరాల్లో ఆర్ స్మాల్ లెటర్ ఉంది. మూడోచోట ఆర్ క్యాపిటల్ లెటర్ ఉంది. నాలుగోచోట ఆర్ స్మాల్ లెటర్ ఉంది. పైగా పైనంతా రామి రెడ్డి అని విడదీసి రాసినోళ్లు ఇక్కడ మాత్రం రామిరెడ్డి అని కలిపి రాసేశారు. ఈ వ్యవహారం ఎలా ఉందంటే సినిమాకని చెప్పి పబ్బుకెళ్లి ఇంట్లో నమ్మించడానికి సినిమా టిక్కెట్లు తెచ్చి ఏ జేబు చూసినా దొరికేలా ప్రతి జేబులోనూ పెట్టుకున్నట్టు ఉంది. ఎందుకింత వెటకారంగా చెప్పాల్సి వస్తోందంటే డాక్యుమెంట్ అనేది ఎవరు పడితే వాళ్లు ఎలా పడితే అలా రాసేది కాదు. అందుకోసం ప్రత్యేకంగా డాక్యుమెంట్ రైటర్లు ఉంటారు. ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది.
సబ్ రిజిస్ట్రార్ సీల్ లేదు
--------------------------------
అది ఏ కార్యాలయమైనా ఒక అధికారిక పత్రం తయారు చేసేటప్పుడు సంబంధిత అధికారి సంతకంతోపాటు కార్యాలయ ముద్ర (సీల్) కూడా ఉండి తీరాలి. ఇది పత్రం యొక్క ప్రామాణికతను నిర్ధారిస్తుంది. అలా లేకపోతే దాని ప్రామాణికతపై పలు సందేహాలు తలెత్తుతాయి. పైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇంకా పకడ్బందీగా ఉండాలో. పైన చెప్పిన డాక్యుమెంట్ నకలులో సబ్ రిజిస్ట్రార్ సంతకం ఉందిగానీ, సీల్ లేదు. ఆ పేజీని కూడా ఇక్కడ ప్రచురిస్తున్నాం. ఈ రకంగా తప్పుడు పద్ధతుల్లో చెరువును దక్కించుకున్న వాళ్లు 1998లో దాన్ని తమ ట్రస్టుకు మళ్లించారు. ఆ డాక్యుమెంట్ కథాకమామీషు మరో కథనంలో తెలుసుకుందాం.