26/01/2025
శ్రీ దత్త ప్రసాదం - 36 - మీది మోయలేనంత భారం కాదేమో కదా....?!
2004 వ సంవత్సరం లో ఒక ఆదివారం ఉదయం ఒక పెద్దావిడ మందిరానికి వచ్చింది..
"ఇక్కడ మా ప్రభావతి కొడుకు ఉన్నాడని చెప్పారు..వాడిపేరు ప్రసాద్ అని కూడా చెప్పారు..ఎక్కడుంటాడు..?" అని నన్నే అడిగింది..నేను నవ్వి.."అమ్మా.. నేనే ఆ ప్రసాదు ను..మీరెక్కడినుంచి వచ్చారు..? " అని అడిగాను..
"నేనూ మీ అమ్మ ప్రభావతీ చిన్నప్పుడు కావలి లో చదువుకున్నాము..నా పేరు వర్ధనమ్మ..ఇప్పుడు నెల్లూరులో మా పెద్దవాడి దగ్గర ఉంటున్నాను..మావారు కాలం చేసి నాలుగేళ్ళయింది..ఇదిగో ఇప్పుడు ఈ స్వామివారి మందిరం చూద్దామని వచ్చాను..బాబూ..నేను ఇక్కడ ఒక వారం ఉంటాను..నాకు ఉండటానికి ఏర్పాటఏమన్నా చేస్తావా?..పెద్దదాన్ని..మీ ఇంట్లో ఉండాలంటే మీ అమ్మను ఇబ్బంది పెట్టాలి..పైగా మీ నాన్నగారు కూడా మంచం లో వున్నారు.."అని గబ గబా చెప్పారు..
పూజారి గారు వుండే ఇల్లు కాకుండా ఒక రేకుల షెడ్ ఉన్నది..ఆ ప్రక్కనే చిన్న గది ఉన్నది..ఆ గదిలో సర్దుకోగలరా..అని అడిగాను..అయిష్టంగానే ఒప్పుకుంది..ఆవిడకు భోజనం మా ఇంటి నుంచి వచ్చే ఏర్పాటు చేసాను..
వర్ధనమ్మ గారు ఆ వారం స్వామివారి మంటపం లోనే ఎక్కువ కాలం గడిపారు..అక్కడకు వస్తున్న భక్తులను దగ్గరగా చూస్తుండేవారు..మందిరం వద్ద మండలం పాటు ఉంటే తమకు పట్టిన గ్రహబాధలు తొలగిపోతాయని భావించి అక్కడే ఉన్నవాళ్ల తో మాట్లాడేవారు..వాళ్ళ ఇబ్బందులను వినేవారు..ఆవిడ స్వామివారి సమాధి ని ఉదయం సాయంత్రం దర్శించుకొనే వారు..ఆవిడ తనలో తాను ఏదో మథన పడుతున్నట్లుగా నాకు తోచింది..మళ్లీ ఆదివారం సాయంత్రం నేను, మా సిబ్బందీ మందిరం తాలూకు లెక్కలు చూసుకునే సమయం లో వచ్చి.."నాయనా ప్రసాదూ..మరో వారం ఇక్కడ వుంటానురా..నీకు శ్రమ ఇస్తున్నాను..ఏమీ అనుకోకు.." అన్నారు..సరే అన్నాను..ఆరోజు రాత్రికి నేనే ఆవిడ వద్దకు వెళ్లి.."అమ్మా..మీకొచ్చిన కష్టం ఏమిటో నాకు చెపుతారా?..మీరేదో లోలోపల బాధ పడుతున్నట్లుగా ఉంది..నేను మీ బిడ్డలాంటి వాడిని అనుకోండి.." అన్నాను..
అలా నేను ఆడిగానో లేదో..మరుక్షణమే వర్ధనమ్మ గారు కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు.."బాబూ..నాకిద్దరు కుమారులు..ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు..మావారు ఉన్నప్పుడే ఇద్దరికీ పెళ్లిళ్లు చేసాము..వాళ్ళూ లక్షణంగా వున్నారు..ఆయన కాలం చేసిన తరువాత నేను కొన్నాళ్ళు ఇంట్లో ఒక్కర్తినీ వున్నాను..అలా ఉండలేక..చిన్నవాడి ఇంటికి వెళ్ళాను..వాడు ఉద్యోగానికి పోతాడు..కోడలూ నేనూ వుండేవాళ్ళము..ఆ అమ్మాయి ఇంటిపని చేసుకుంటూ..నాతో సరిగా మాట్లాడేది కాదు..నాకు కావాల్సినవి అన్నీ క్షణాల్లో అమార్చేది..ముక్తసరిగా ఉండేది..నాకెందుకో ఆ పద్ధతి నచ్చలేదు..అక్కడనుండి పెద్దవాడి ఇంటికి వచ్చాను..వీడికిద్దరు చిన్న పిల్లలు..ఆ పిల్లలను చూసుకోవడమే పెద్దకోడలుకు పెద్ద పని..నా అవసరాలు నేనే చూసుకోవాలి..ఇక్కడా ఇమడలేకపోయాను..కొన్నాళ్లపాటు దూరంగా ఉండాలని ఇలా వచ్చాను.." అన్నారు..
"కానీ..ఇక్కడికొచ్చిన తర్వాత అర్ధం అయింది..ఎంతోమంది ఎన్నో రకాల కష్టాల్లో వున్నారు..వాళ్ళతో పోల్చుకుంటే నావి పెద్ద కష్టాలు కాదు..నాకు గ్రహబాధల్లేవు..శారీరిక అవకరం లేదు..ఉద్యోగాలు చేసుకుంటున్న కొడుకులు..కోడళ్లు..మనుమరాలు, మనుమడు..అందరూ వున్నారు..నేను కొద్దిగా సర్దుకుంటే అన్నీ చక్కబడతాయి..ఈ పాఠం నేర్పడానికే స్వామివారి నన్ను ఇక్కడ ఉంచారేమో..కోడళ్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు గానీ..నన్నెప్పుడూ ఒక్కమాట అనలేదు..ముందుగా నా మనోస్తితి మారాలి అని స్వామివారు నాకు అనుభవపూర్వకంగా చూపారు..ఈ వారం ఇక్కడ వుండి..నేను వచ్చేవారం పెద్దవాడి దగ్గరకు వెళతాను.." అన్నారు..
వర్ధనమ్మ గారిలో వచ్చిన మార్పు మంచిదే అనిపించింది..మా అమ్మను అడిగి వాళ్ళబ్బాయి నెంబర్ తీసుకొని ఫోన్ చేసాను..రెండోరోజే అతను నేరుగా మందిరానికి వచ్చాడు..కుమారుడిని చూడగానే వర్ధనమ్మ గారు పెద్దగా ఏడ్చేశారు..కొద్దిసేపటికి తేరుకొని కళ్ళు తుడుచుకుని..గబ గబా తన సామాను సర్దేసుకున్నారు..కుమారుడితోపాటు వెళ్లిపోవడానికి సిద్ధపడ్డారు..ఆ అబ్బాయి నాదగ్గరకు వచ్చాడు.."మాదగ్గర ఎటువంటి ఇబ్బందీ లేదండీ..కాకుంటే నాన్నగారు ఉన్నరోజుల్లో తన పెత్తనం సాగినట్లుగా..ఇప్పుడు జరగడం లేదనే బాధ మా అమ్మగారు పడుతున్నారు..తరాల మార్పు వల్ల వచ్చిన ఇబ్బంది ఇది..ఇటువంటి ధోరణి ని స్వామివారే మార్చాలి.." అన్నాడు..
"స్వామివారు మీ అమ్మగారిలో మార్పు తెచ్చారు..ఆ మాటే స్వయంగా నాతో చెప్పారు..త్వరలో మీరే చూస్తారుగా.." అన్నాను..వర్ధనమ్మ గారు ఊరికి వెళ్లేముందు కుమారుడితో సహా స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని వెళ్లారు..
మరో మూడునెలల తరువాత వర్ధనమ్మ గారు తన ఇద్దరు కొడుకులతో కలిసి స్వామివారి మందిరానికి వచ్చారు.."అమ్మ చాలా మారింది ప్రసాద్ గారూ..మాతో బాగా కలిసిపోయింది..స్వామివారు తెచ్చిన మార్పు ఫలితం ఇది.." అని వాళ్ళ పెద్దబ్బాయి సంతోషంగా చెప్పాడు..
"నేను స్వామివారి దగ్గర ఉన్న పదిరోజుల్లో చాలా తెలుసుకున్నానురా..ఇప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంది..అంతా స్వామివారి మహిమ.." అన్నారు వర్ధనమ్మ గారు..నిజమే..స్వామివారు ఆవిడకు తన శేష జీవితాన్ని ఎలా గడపాలో నేర్పారు..
సర్వం..
శ్రీ దత్తకృప!
రచన : శ్రీ పవని నాగేంద్రప్రసాద్
(మందిర వివరముల కొరకు :
పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)
----
మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి దివ్య చరిత్ర క్రింది లింక్ ద్వారా యూట్యూబ్లో వినవచ్చును :
https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=nq8cskE8m3f3ZrNZ
-----
*మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పారాయణ పుస్తకము మరియు పూజా పటాలు కొరకు, ఈ క్రింది లింక్ ను నొక్కగలరు 🙏 :
Follow this link to view our catalog on WhatsApp: https://wa.me/c/919182882632
----