09/06/2025
నాణానికి ఒకవైపు జర్నలిజం
మరోవైపు చంద్రబాబు
మరి నేడు?
జర్నలిజాన్ని ఎలా వాడుకోవాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తెలిసినంతగా ఎవరికీ తెలీదనే అందరూ అంటారు. అదే జర్నలిజం పునాదుల నుంచి పైకి లేచిన రాజకీయ నాయకుడు ఆయన. ఆయన వెనుక రాజగురు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే నాటి నుంచి నేటి వరకు చంద్రబాబునాయుడు...ఏనాడు జర్నలిస్టులను విమర్శించలేదు. వారెన్ని వార్తలు రాసినా మౌనంగానే ఉండిపోయేవారు.
ఒకవేళ పాలనలో లోపాలను ప్రశ్నిస్తే, సరిచేసుకునేవారు, ఆచరించి చూపించేవారు. లేదంటే అక్కడ సమస్యుంటే వెంటనే పరిష్కరించేవారు. ఆరోజుల్లో నాయకులతో పదేపదే జర్నలిస్టులతో జాగ్రత్త అని చెప్పేవారు. అంటే జర్నలిస్టులను అంతగా ఇష్టపడేవారు. అంతగా నమ్మేవారు. మొన్న జగన్ పాలనలో ఆయన్ని జైలులో పెట్టినప్పుడు మీడియానే నమ్ముకున్నారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మైత్రీ బంధాన్ని కాంక్షించినప్పుడు మీడియానే నమ్ముకున్నారు.
స్టిల్ ఈరోజుకి మీడియాపైనే విశ్వాసం చూపిస్తారు. అది ఆయన నమ్మిన సిద్ధాంతం. ఈరోజున సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేశారు. ఆయన అమరావతిపై చేసిన కామెంట్లను సమర్థించిన తీరు, డిబేటును నడిపించిన తీరు ఆక్షేపణీయమే. కానీ ఇదే కొమ్మినేని శ్రీనివాసరావు, ఏబీఎన్ రాధాక్రష్ణ ఇద్దరూ చంద్రబాబునాయుడికి చేసిన మేలును ఎవరూ మరువలేరు. ఇది నేను కొత్తగా చెప్పేది కాదు. జగమెరిగిన సత్యం. నాడు ఎన్టీఆర్-లక్ష్మీపార్వతి కాలంలో జరిగిన ఘటన ఎవరూ మరిచిపోలేరు.
అలాంటి కొమ్మినేని...చాలాకాలం క్రితం చంద్రబాబుతో విభేదించారు. ఆయన రాజ్యసభ అడిగారని, అది చంద్రబాబు ఇవ్వలేదనే కోపంతో జగన్ పంచన చేరారనే ప్రచారమైతే జోరుగా నడిచింది. నిజంగా కొమ్మినేని కరెక్టుగా చంద్రబాబు పక్కనే ఉండుంటే, తను కూడా ఒక టీవీ ఛానల్ లేదా పత్రికాధిపతి అయ్యేవారు. ఆ స్థాయి వ్యక్తి ఆయన. ఇప్పుడాయన జైలు పాలయ్యారు.
జర్నలిస్టుల మీద ఈగ కూడా వాలనివ్వని చంద్రబాబు ఆయన్ని జైలులో పెట్టడం ఏమిటి? అని జర్నలిస్టు వర్గాల్లో ఒక చర్చ నడుస్తోంది. అయితే ఇందులో చంద్రబాబు పాత్ర లేదు. అంతా చినబాబు పాత్రే అని కొందరంటున్నారు. బాబు...బాగా దూకుడుగా ఉండటం, అతన్ని కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడంతో తండ్రి నమ్మిన సిద్ధాంతాలను వదిలి పరిగెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
జర్నలిజం నుంచి ఎదిగిన నేత ఎవరంటే చంద్రబాబునాయుడు అనే అంటారు. అలాంటిది నేడు ఆ సిద్ధాంతాలకు పాతరేసి, కొత్త పోకడలకు తెర తీస్తున్న వైనం...ఎటువైపునకు దారి తీస్తుందని మేధావులు ఆలోచనలు చేస్తున్నారు. తప్పులు ఎవరు చేయరు. జర్నలిజంలో రోజూ కొన్ని వందల తప్పులు జరుగుతుంటాయి. నాడు అన్నగారు నటించిన నేరం నాది కాదు ఆకలిది...అనే సినిమాలో ఒక పాట ఉంటుంది.
మీలో నేరం చేయని వాడు...ఆ రాయి విసరాలి...అని దానర్థం. కొమ్మినేని అరెస్టును నేను సమర్థించడం లేదు. ఒక జర్నలిస్టుని అరెస్టు చేస్తున్నారు. జర్నలిస్టులు దేవుళ్లా? వారిని అరెస్టు చేయకూడదా? అని అంటున్నారు. అదికాదు నేను చెప్పేది...జర్నలిజం పునాదులపై పుట్టిన చంద్రబాబు..అదే పునాదులను కూల్చేసుకుంటున్నారేమో ఆలోచించమంటున్నాను.
నువ్వు జర్నలిస్టుని అరెస్టు చేయు, వాడబ్బని అరెస్టు చేయు...ఇక్కడ సమస్య అది కాదు. జర్నలిజమనేది లేకపోతే, ఈనాడు లేకపోతే చంద్రబాబు ఎక్కడ? ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లేకపోతే, టీవీ5 లేకపోతే, 2024 ఎన్నికలు ఏమయ్యేవి? ఇది అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం.
నిజానికి ఒక జర్నలిస్టుని ఇలా తీసుకెళితే...అంతర్గతంగా జర్నలిస్టులు మండిపడుతూనే ఉంటారు. ఈనాడు, జ్యోతి, టీవీ5 ఎవరైనా ఇందులో మినహాయింపు లేదు. మా అవసరం తీరిపోయాక, రేపు మనమైనా అంతేకదా...అని వారు కూడా అనుకుంటారు. సమయం వచ్చినప్పుడు కరెక్టుగా స్పందిస్తారు. అదును చూసి దెబ్బ వేస్తారు.
అందుకే అడుగు వేసేటప్పుడు రాజకీయనాయకుడు ఆలోచించి వేయాలి. ఇదొక రాజకీయ చదరంగం. అధికారం చేతిలో ఉన్నంతకాలం ...మనం ఏ ఎత్తులు వేసినా చెల్లిపోతుంది. అధికారం లేనప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి ఢిల్లీ కథలు గుర్తు చేసుకోవాలి. ఢిల్లీ రోడ్ల మీద ఒంటరిగా తిరిగిన రోజులు మరిచిపోకూడదు.
ఆ రోజు ఎవరు రాశారు వార్తలు...? ప్రజల్లో సానుభూతి ఎవరు తీసుకొచ్చారు? రేపు ఇలాంటి సంఘటన ఎదురైతే...ఎవరు రాస్తారు?
ఈనాడు, జ్యోతి రాస్తారు..మాకెవడి తోడు అవసరం లేదని అనుకోవచ్చు. కానీ ఆ వార్తలో జీవం ఉండదు. ఏదో మొక్కుబడికి రాసి పారేస్తారు.
ఇప్పుడు కొత్త బాబు ఎవరిని పట్టుకోవాలి..ఎవరిని వదలాలి? అనేది చూసుకోవాలి. జర్నలిస్టులు తాచుపాముల్లెక్క. బూర ఊదుతూనే ఉండాలి.
ఇదొక్కటే కాదు... బాబు...మరోవైపు తమ సామాజికవర్గంపైనే కొరడా ఝులిపిస్తున్నారు. ఇది కూడా సామాజిక వర్గంలో అసంత్రప్తికి కారణమవుతుంది. కొత్త దుమారాన్ని రేపుతోంది. రేపు మనమైనా అంతేకదా.. ఎదురుతిరిగితే లోపలేసి కుళ్ల బొడేసేస్తారనే చర్చ ఒకటి బహిరంగంగానే నడుస్తోంది.
ఇది కరెక్టు కాదేమో ఒకసారి కొత్త బాబు ఆలోచించాలి. గతంలో చంద్రబాబుకి ఇలా సలహాలు చెబితే స్వీకరించేవారు. మార్చుకునేవారు, సరిదిద్దుకునేవారు. బహిరంగంగా చెప్పేవారు. వారిని మెచ్చుకునేవారు. కానీ ఇప్పుడలా లేదని అంతా అనుకుంటున్నారు. బాబు ఎవరిమాట వినడం లేదని, సై అంటే సై అంటున్నారని, అట్టు వేస్తే, తిరగేయాల్సిందే అంటున్నారని టాక్... మరిది ఏ టర్న్ తీసుకుంటుందో, రేపు బాబు తట్టుకోగలడో లేదో ఆలోచించాలి.